SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, UGC
రాజమహేంద్రవరంలో అనూరియాతో రెండురోజుల వ్యవధిలో నలుగురు చనిపోవడం కలకలం రేపింది.
అనూరియా(మూత్రం ఆగిపోవడం), అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ (అర్ధంతరంగా కిడ్నీల వైఫల్యం)తో ఆ నలుగురూ చనిపోయారు.
ఇవే లక్షణాలతో మరో పదిమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లాలాచెరువు, చౌడేశ్వరినగర్ ప్రాంతాలకు చెందిన ఎన్.శేషగిరిరావు, రాధా కృష్ణమూర్తి అనే ఇద్దరు సోమవారం ఉదయం చనిపోయారని తెలిపారు.
ఇదే ప్రాంతానికి చెందిన తాడి కృష్ణవేణి , తాడి రమణి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో మృతి చెందారని డీఎంహెచ్‌వో చెప్పారు.

పండుగ తర్వాతిరోజు నుంచి…
లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరినగర్, స్వరూప్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15వ తేదీ శివరాత్రి పండుగ తర్వాతిరోజు నుంచి పలువురు వాంతులు, మూత్రవిసర్జన ఆగిపోవడం, పొట్ట ఉబ్బడం వంటి సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు.
బాధితుల్లో ఐదు నెలల పసికందు, మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. అయితే ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం(ఫిబ్రవరి 22) అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
డయాలసిస్ అవసరమైన మూత్రపిండాల సమస్యలతో ఇప్పటివరకు 10మంది నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మీడియాకు తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
పాలల్లో కల్తీ వల్లేనా…
ఆస్పత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అందులో కల్తీ వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శివరాత్రి (15వ తేదీ) రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని బాధితులు మీడియాతో చెప్పారు.
వారందరికీ కోరుకొండ మండలానికి చెందిన పాలవ్యాపారి గణేశ్ పాలు పోస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అలాగే ఆ వ్యాపారి పాలు సరఫరా చేసిన 106 ఇళ్లలోని కుటుంబాలకు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించామని చెప్పారు.
వారందరికీ నిరంతర పర్యవేక్షణతో తగిన వైద్యసేవలు అందిస్తామన్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి శాంపిళ్లను వైజ్ఞానిక, పశుసంవర్థక శాఖ ప్రయోగశాలలకు పంపినట్టు తెలిపారు.
ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు తదితర పాల ఉత్పత్తులను హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్టు జిల్లా కలెక్టర్ మీడియాతో చెప్పారు.
నివేదికలు అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫొటో సోర్స్, UGC
డెయిరీ సీజ్ చేశాం: ఎస్పీ
గణేశ్ అనధికారికంగా నిర్వహిస్తున్న డెయిరీని సీజ్ చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ డి.నరసింహ కిశోర్ వెల్లడించారు.
ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాల ఆధారంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఎక్కువగా ప్రభావితమైనట్టు గుర్తించామని, ప్రజలు కొన్ని రోజులు బాగా మరిగించిన పాలను మాత్రమే ఉపయోగించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు.
ఫొటో సోర్స్, UGC
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే…
అనూరియా కలకలంపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ముఖ్యమంత్రి సమగ్ర నివేదికను కోరినట్టు కలెక్టర్ తెలిపారు.
బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడంతో పాటు, కారణాలను త్వరితగతిన గుర్తించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ప్రజల్లో అపోహలు వ్యాపించకుండా సమగ్ర అవగాహన కల్పించాలని, అవసరమైన అన్ని వనరులు ఉపయోగించాలని ఆదేశించారని తెలిపారు.
ప్రజలు భయాందోళన చెందవద్దని, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్ 9494060060 ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
చికిత్స పొందుతున్న ఏడుగురిలో ఐదుగురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇద్దరికి వెంటిలేటర్‌పై ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్టు కలెక్టర్‌కు వివరించారు వైద్యులు.
రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
మృతుల కుటుంబాలకు పదిలక్షల ఎక్స్‌గ్రేషియో
రాజమహేంద్రవరంలో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ వీర పాండియన్ మీడియాకి తెలిపారు.
సోమవారం సాయంత్రం బాధితులు చికిత్స పొందుతున్న కిమ్స్ , రెయిన్ బో ఆస్పత్రులను వీర పాండియన్ పరిశీలించి.. బాధితులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం బాధితులకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



