Home జాతీయ national telgu హోమ్‌లోన్ కావాలంటే శాలరీ స్లిప్ ఉండాల్సిందేనా, అది లేకుండా రుణం పొందటం ఎలా?

హోమ్‌లోన్ కావాలంటే శాలరీ స్లిప్ ఉండాల్సిందేనా, అది లేకుండా రుణం పొందటం ఎలా?

14
0

SOURCE :- BBC NEWS

గృహ రుణం

ఫొటో సోర్స్, Getty Images

గృహ రుణానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు తలెత్తే అసలైన సమస్య..అవసరమైన పత్రాలు సమర్పించడం.

సాధారణంగా గృహ రుణ మొత్తాలు లక్షల రూపాయల్లో ఉంటాయి. అందుకే, బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణం మంజూరు చేసేందుకు ఇంటికి సంబంధించిన పత్రాలు, గుర్తింపు కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుని ఆదాయ పత్రం వంటి అనేక పత్రాలను అడుగుతుంటాయి.

గృహరుణం మంజూరు చేసేటప్పుడు ఉద్యోగం చేసే వారి నుంచి, ప్రతి నెల క్రమం తప్పకుండా వేతాన్ని పొందే వారి నుంచి గత 3 లేదా 6 నెలల శాలరీ స్లిప్‌లను అడుగుతాయి బ్యాంకులు.

చిన్న, పెద్ద వ్యాపారాలను నిర్వహించే వారు, అనధికారిక రంగంలో చేతివృత్తులు చేపట్టే వారు, రైతులు, దుకాణాలను నడిపేవారు.. ఉద్యోగస్తుల మాదిరిగా ప్రతి నెలా శాలరీ స్లిప్‌లు పొందలేరు.

అయితే, వాళ్లేం చేయాలి? ఈ సర్టిఫికెట్ లేకుండా గృహరుణం పొందటం ఎలా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శాలరీ స్లిప్ లేకుండా గృహ రుణం

మీరు ఉద్యోగి కాకపోయినా, వేతనం తీసుకునే వ్యక్తి కాకపోయినా, ప్రతినెలా శాలరీ స్లిప్‌ పొందకపోయినా.. గృహ రుణం పొందవచ్చు.

ఇతర పత్రాల ఆధారంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాన్ని ఆమోదిస్తుండొచ్చు.

‘‘శాలరీ స్లిప్ లేకపోతే, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, బిజినెస్ ఫైనాన్సియల్ రికార్డులు వంటి ప్రత్యామ్నాయ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ఈ పత్రాల ఆధారంతో గృహ రుణాన్ని తిరిగి చెల్లించగలనని నిరూపించుకోవచ్చు” అని నిమేష్ రాథోడ్ తెలిపారు.

నిమేష్ రాథోడ్ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన లోన్ అధికారి.

వినియోగదారుల అత్యధిక ‘సిబిల్ స్కోర్ల’పైనే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు ఎక్కువగా దృష్టిపెడతాయి.

ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 750 పైనుంటే, గృహ రుణం పొందడం తేలికవుతుంది. ఒకవేళ మీరు స్వయం ఉపాధి వ్యక్తి అయినా లేదా అనధికారిక రంగంలో పనిచేసే వారైనా.. గృహ రుణానికి కో-అప్లికెంట్ పేరును కూడా జత చేసుకోవచ్చు.

గృహ రుణానికి కావాల్సిన డాక్యుమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆదాయ ధ్రువీకరణకు ఏ పత్రాలు అవసరం?

శాలరీ స్లిప్ కాకుండా..హోమ్‌లోన్ తీసుకునేటప్పుడు ఇతర పత్రాలు కూడా చాలా ముఖ్యం.

ఉదాహరణకు..

బ్యాంక్ స్టేట్‌మెంట్ – ఇది గత 6 నుంచి 12 నెలలకు సంబంధించిన మీ ఆదాయం, పొదుపుల వివరాలను తెలియజేస్తుంది. పొదుపు, కరెంట్ ఖాతాల వివరాలను ఇది అందిస్తుంది.

ఆదాయపు పన్ను రిటర్నుల, ఇతర వ్యాపార పత్రాలు – దీనిలో గత మూడేళ్లకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు, జీఎస్టీ రిజిస్ట్రేషన్, బిజినెస్ లైసెన్స్ డాక్యుమెంట్లు ఉంటాయి.

కో-అప్లికెంట్ – మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా లేదా జీవిత భాగస్వామిని కూడా అప్లికెంట్‌గా చేర్చవచ్చు. ఆ వ్యక్తి కూడా వారి ఆదాయానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇది మీ ఆదాయాన్ని మరింత ప్రతిబింబించేలా చేసి, గృహరుణం ఆమోదం పొందే అవకాశాలను పెంచుతుంది.

ఇతర ఆస్తులు – మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా ఉందో చూపించేందుకు, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను, ఎల్ఐసీ పాలసీలను, పూచీకత్తుగా లేదా సెక్యూరిటీగా ఇతర ఆస్తులను చూపించవచ్చు.

గృహ రుణం

ఫొటో సోర్స్, Getty Images

అదనంగా, కింద పేర్కొన్న పత్రాలు, సమాచారాన్ని కూడా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు అడుగుతాయి.. అవేంటంటే..

  • గృహ రుణం దరఖాస్తు చేసుకునే వ్యక్తి, కో-అప్లికెంట్‌ది పాన్ కార్డు, ఆధార్ కార్డు కాపీ సమర్పించాలి.
  • వ్యాపార ధ్రువీకరణ కోసం ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రైజ్ సర్టిఫికెట్
  • ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ వివరాలు
  • ఒకవేళ అప్పటికే ఏదైనా రుణం ఉంటే.. ఆ రుణానికి సంబంధించిన స్టేట్‌మెంట్ లేదా అకౌంట్ స్టేట్‌మెంట్

అనధికారిక రంగంలో పనిచేసే వ్యక్తుల కోసం లేదా నెలవారీ స్థిరమైన ఆదాయం పొందలేని వారి కోసం కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక రుణ సదుపాయాలను అందిస్తున్నాయి.

ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 725 లేదా 750 పైన ఉంటే.. మీకు తేలికగా రుణం లభిస్తుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే, మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

గృహ రుణాలు

ఫొటో సోర్స్, Getty Images

నెలవారీ ఆదాయానికి సంబంధించి ఆధారాలు లేకపోతే..

శాలరీ స్లిప్ లేనప్పుడు, ఆదాయపు పన్ను రిటర్నులనేవి చాలా ఉపయోగపరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవుతాయి.

”దరఖాస్తుదారులను గత మూడేళ్లకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను బ్యాంకులు కోరుతుండొచ్చు. ఒకవేళ ఆదాయపు పన్ను రిటర్నులు అందుబాటులో లేకపోతే, బ్యాంకు స్టేట్‌మెంట్ల ఆధారంగా రుణాన్ని జారీ చేయొచ్చు. అయితే, ఇలాంటి కేసుల్లో గృహరుణాలపై వడ్డీ రేట్లు అత్యధికంగా ఉంటాయి” అని ఒక బ్యాంకు గృహ రుణాల విభాగంలో అధికారిగా పనిచేసే ప్రదీప్ శర్మ చెప్పారు.

”అదనంగా అంతకుముందు మీరు రుణం తీసుకుని ఉండి, దాన్ని క్రమం తప్పకుండా చెల్లించి ఉంటే, సిబిల్ స్కోర్ ఆధారంగా మీకు రుణం లభిస్తుంది. అయితే, గతంలో ఎలాంటి రుణం తీసుకోకపోతే, మీ సిబిల్ స్కోర్‌ను మైనస్ వన్‌గా పరిగణిస్తారు” అని చెప్పారు.

కస్టమర్లకు గృహ రుణాలు అందజేసేందుకు బ్యాంకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు లేదా కంపెనీలు ఆదాయపు ధ్రువీకరణ పత్రం లేకుండానే రుణాలను జారీ చేయగలవు.

ఉదాహరణకు.. ఆదాయ ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేనప్పుడు కూడా కొన్ని పథకాల కింద గృహ రుణాన్ని పొందవచ్చని పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ చెబుతోంది.

ఈ పథకాన్ని ప్రత్యేకంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం తీసుకొచ్చింది. ఒకవేళ నిర్దిష్ట షరతులను మీరు చేరుకోగలిగితే.. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సిన అవసరం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో, కో-అప్లికెంట్ అవసరం. అలాగే, కో-అప్లికెంట్ ఆదాయపు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

అయితే, ఇటువంటి పరిస్థితిలో మంజూరు చేసే రుణ మొత్తం తక్కువగా లభిస్తుంది. సాధారణంగా, నెలకు రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఆదాయం సంపాదించే వారికి మాత్రమే రుణాలు లభిస్తాయి.

‘‘ఫ్రీలాన్సర్‌గా పనిచేసే వ్యక్తులకు, ప్రతినెలా ఆదాయంలో మార్పు ఉంటుంది. శాలరీ స్లిప్‌లు లేకుండా వీరు కూడా గృహ రుణం పొందవచ్చు” నిమేష్ రాథోడ్ తెలిపారు.

”బ్యాంకు స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను రిటర్నులకు అదనంగా, గత కొన్ని నెలల్లో వారు చేసిన పనికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లను కూడా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు అడుగుతుండొచ్చు. ఈ డాక్యుమెంట్లు ఆ వ్యక్తి ఎంత ఆదాయం సంపాదిస్తున్నారు లేదా వ్యాపారం నుంచి ఎంత ఆదాయాన్ని జనరేట్ చేయగలుగుతున్నారో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు. అంతేకాక, వారు గృహ రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారా లేదా అన్నది నిర్ధరించుకుంటారు” అని చెప్పారు.

రుణం

ఫొటో సోర్స్, Getty Images

రైతులకూ, ఎన్ఆర్ఐలకూ గృహ రుణాలు

”బ్యాంకుల కంటే కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అత్యధిక వడ్డీ రేట్లను విధిస్తాయి. కొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి వేతన స్లిప్ లేకుండా కూడా అవి గృహ రుణాన్ని మంజూరు చేస్తాయి” అని ప్రదీప్ శర్మ తెలిపారు.

”వ్యాపారానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులతో పాటు, గత ఏడాదికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీటును సమర్పించడం అవసరం. కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే వారిని రెంటల్ అగ్రిమెంట్లు లేదా వాటి రసీదులను కోరవచ్చు” అని చెప్పారు.

” పెన్షనర్లు కూడా వారి గత మూడు లేదా ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లు, పెన్షన్ స్లిప్‌లను ఆధారంగా చేసుకుని గృహ రుణాన్ని పొందవచ్చు. ఎన్‌ఆర్ఐలు కూడా..బ్యాంకు స్టేట్‌మెంట్ లేదా విదేశాల్లో ఉద్యోగానికి సంబంధించిన ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టును ఆధారంగా చేసుకుని గృహ రుణాన్ని పొందవచ్చు” అని ప్రదీప్ శర్మ తెలిపారు.

”రైతులు తమ భూమి, పంటల ఉత్పత్తి, వ్యవసాయోత్పత్తులను విక్రయించడం ద్వారా లభించే ఆదాయానికి సంబంధించిన పత్రాలను సమర్పించడం ద్వారా గృహ రుణం పొందుతారు. అయితే, గృహ రుణం మంజూరులో బ్యాంకు స్టేట్‌మెంట్లు అత్యంత ముఖ్యమైనవి” అని చెప్పారు.

పత్రాలకు సంబంధించిన విషయంలో కొన్ని బ్యాంకులు కాస్త చూసీచూడనట్లు కూడా వ్యవహరించవచ్చు. అంటే, దరఖాస్తును ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు లేకపోయినా, పాత రికార్డులను ఆధారంగా చేసుకుని రుణాన్ని జారీ చేస్తుండొచ్చు. అయితే, సంబంధిత బ్యాంకుతో ఆ కస్టమర్‌కు దీర్ఘకాలిక బ్యాంకింగ్ రిలేషన్‌షిప్ ఉండటం కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది.

అయితే, మీ పాత బాకీలు ఏమైనా ఉంటే, ముందు వాటిని చెల్లించమని అడుగుతుండొచ్చు.

(గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం ఆర్థిక పరిజ్ఞానం కోసమే. దీనిని ఆర్థిక సలహాగా భావించకూడదు. పాఠకులు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సొంతంగా పరిశోధన చేసి లేదా ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా చేసిన పెట్టుబడుల వల్ల కలిగే ఏదైనా ఆర్థిక నష్టానికి బీబీసీ తెలుగు బాధ్యత వహించదు.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)