Home జాతీయ national telgu హిమంత బిశ్వ శర్మ వీడియోను బీజేపీ ఎందుకు తొలగించింది? అందులో ఏముంది, అసదుద్దీన్ ఒవైసీ ఏమని...

హిమంత బిశ్వ శర్మ వీడియోను బీజేపీ ఎందుకు తొలగించింది? అందులో ఏముంది, అసదుద్దీన్ ఒవైసీ ఏమని ఫిర్యాదు చేశారు?

11
0

SOURCE :- BBC NEWS

ఒవైసీ, బిశ్వ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ అస్సాం శాఖ ఎక్స్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో దానిని తొలగించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకీ పట్టుకున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.

గడ్డాలు, టోపీతో ఉన్న వ్యక్తులను కాల్చుతున్నట్టు ఏఐతో రూపొందించిన భాగాన్ని ఆ వీడియోకు జత చేశారు.

ఫిబ్రవరి 7న అస్సాం బీజేపీ హ్యాండిల్‌పై ఇది పోస్టయింది. దీనిపై విమర్శలు ఎక్కువ కావడంతో ఫిబ్రవరి 8న ఆ వీడియోను తొలగించారు.

ఈ వీడియో బయటకు రాగానే, సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాలలో తీవ్ర స్పందనలు వెల్లువెత్తాయి.

వీడియో రెచ్చగొట్టేలా ఉందని, ప్రమాదకరమైనదని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు, అనేకమంది నెటిజన్లు విమర్శించారు. ఆ వీడియో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని, సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

ఆ వీడియోలో స్క్రీన్‌పై ”ఫారినర్ ఫ్రీ అస్సాం” ”నో మెర్సీ” అనే వాక్యాలు కనిపించాయి.

ఆ వీడియోలోని ఒక ఫోటోలో ఇద్దరు వ్యక్తులున్నారు. వారు తెల్లటోపీలు ధరించారు. వారిలో ఒకరిని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్‌గా చూపించారు.

ముఖ్యమంత్రి కౌబాయ్ దుస్తులతో తుపాకీ పట్టుకుని, కౌబాయ్ టోపీ ధరించడంతో ఆ 17 సెకన్ల ఆ వీడియో ముగుస్తుంది.

”మీరు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లరు?” ”బంగ్లాదేశీలను క్షమించేదిలేదు” అనే సందేశాలు కూడా ఆ వీడియోలో కనిపించాయి.

అస్సాంలో బెంగాలీ మూలాలున్న ముస్లింల అంశంపై రాజకీయ అలజడి తీవ్రమవుతున్న తరుణంలో ఈ వీడియో షేర్ అయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
హిమంత బిశ్వ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

హిమంత బిశ్వ శర్మ ఏమన్నారు?

ఈ వివాదం నడుమ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆ వీడియోను చూడలేదన్నారు.

వ్యక్తిగతంగా ప్రతి సోషల్ మీడియా పోస్టును చూడనని, కొన్నిసార్లు పార్టీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రత్యేక బృందం నిర్వహిస్తుందని చెప్పారు.

కానీ తాను ”మియా ముస్లిం”లకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానన్నారు.

మరోపక్క హిమంత బిశ్వ శర్మపై ‘చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఎక్స్‌లో తెలిపారు.

”నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే. నేనేం చేయగలను? ఏ వీడియో గురించి నాకేమీ తెలియదు. వారు నాపై ఫిర్యాదు చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను నా మాటలకు కట్టుబడి ఉంటాను. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు నేను వ్యతిరేకం. వారిపై నా వ్యతిరేకత కొనసాగుతూనే ఉంటుంది” అని ఏఎన్ఐ వార్తా సంస్థకు హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

అమన్ వాదుద్

ప్రతిపక్షాలు ఏమన్నాయి?

”మైనార్టీలను పాయింట్‌-బ్లాంక్‌లో కాల్చడాన్ని అస్సాం బీజేపీ శాఖ పోస్టు చేసిన వీడియో కీర్తిస్తోంది. అసహ్యకరమైన, కలవరపరిచే ఈ వీడియోను సాధారణ ట్రోలింగ్ విషయంగా తోసిపుచ్చలేం. ఇది పెద్దఎత్తున హింసకు, మారణహోమానికి ప్రేరేపించడమే” అని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ వీడియోకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది అమన్ వాదుద్, బీజేపీపై విమర్శలు చేశారు.

“ఈ వీడియో స్పష్టంగా పెద్ద ఎత్తున హింసను ప్రేరేపించే ప్రయత్నం. ఇది జాతి విధ్వంస ఆలోచనలను ప్రోత్సహిస్తుంది” అన్నారు.

“అస్సాంలో బీజేపీ పూర్తిగా దారితప్పింది. అభివృద్ధిపై వారి వాదనలు పనిచేయడం లేదు. ఈ సమస్యల గురించి ప్రజలు మాట్లాడటం బీజేపీకి ఇష్టం లేదు. తమ వైఫల్యాలను దాచుకోవడానికే ‘మియా’ కమ్యూనిటీపై నిరంతరం దాడి చేస్తోంది” అని అమన్ వాదుద్ అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ కూడా దీనిపై విమర్శలు చేసింది. ”ఒక ముఖ్యమంత్రి తన పార్టీ విడుదల చేసిన వీడియోలో ముస్లింలపై కాల్పులు జరుపుతున్నట్టుగా నటించడాన్ని ఊహించండి. అది ఎంతటి అభ్యంతరకరమైనదో. తీవ్ర విమర్శల తర్వాత ఆ వీడియోను తొలగించారు” అని టీఎంసీ విమర్శించింది.

అఫ్రిదా హుస్సేన్

అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ

ఈ వీడియో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని సీనియర్ జర్నలిస్ట్ అఫ్రిదా హుస్సేన్ అన్నారు.

‘‘హింస తప్పుకాదు అని సమాజానికి ఈ వీడియో సందేశం ఇస్తోంది. వారు ఇలా హింసాత్మక ధోరణిని ప్రోత్సహించడం సరికాదు” అని అఫ్రిదా అన్నారు.

‘‘తెల్లటి టోపీలో ఉన్న వ్యక్తిని గౌరవ్‌ గొగొయ్‌గా చూపించారు. చొరబాటుదారులను చూపించడమే ఉద్దేశం అని చెబుతున్నారు. కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వీడియోలను అలా పోస్ట్ చేయవచ్చా?” అని అఫ్రిదా ప్రశ్నించారు.

ఆ వీడియోను తొలగించడంతో సరిపోదని అఫ్రిదా హుస్సేన్ అంటున్నారు.

“ఈ వీడియో ఇప్పటికే లక్షలాది మందికి చేరింది. ద్వేషం ఇప్పటికే వ్యాపించింది. భవిష్యత్తులో ఏదైనా హింస జరిగితే, దానికి బాధ్యత నుండి తప్పించుకోవడం కష్టం” అని ఆమె అన్నారు.

అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

గుర్తింపు, పౌరసత్వం, వలసలకు సంబంధించిన అంశాలు చాలా కాలంగా రాష్ట్ర ఎన్నికల చర్చలో భాగంగా ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన అంశాల చుట్టూ సృష్టించిన కంటెంట్ విభజన రాజకీయాలను మరింత తీవ్రతరం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో విభజన రాజకీయాల వ్యూహం తీవ్రమైనదని గౌహతి విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అఖిల్ రంజన్ దత్తా అన్నారు.

అఱిల్ రంజన్ దత్తా

అస్సాంలో, ‘మియా’ అనే పదం బెంగాలీ మూలానికి చెందిన ముస్లింలను సూచిస్తుంది. ఈ కమ్యూనిటీ చాలా కాలంగా గుర్తింపు, పౌరసత్వంపై వివాదాలకు కేంద్రంగా ఉంది.

బీజేపీతోపాటు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చాలా కాలంగా ‘మియా’ ముస్లింలపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. వారి ప్రకటనలు తరచుగా చొరబాట్లు, బెంగాలీ సంతతికి చెందిన ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటాయి.

ఈ వివాదం ‘మియా’ కమ్యూనిటీ గురించి శర్మ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తెచ్చింది.

అంతకుముందు కూడా ఒక బహిరంగ కార్యక్రమంలో ‘‘వారిని ఇబ్బందిపెట్టాలనే భావన’’ గురించి హిమంత మాట్లాడారు. రిక్షా తొక్కే మియా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి చార్జీలు సరిగ్గా చెల్లించకపోయినా పర్లేదన్నారు.

”వారిని ఎవరెంత ఇబ్బంది పెట్టగలరో అంత పెట్టనివ్వండి. మీరు కూడా ఇబ్బంది పెట్టండి. రిక్షా చార్జీ 5 రూపాయలైతే, 4 రూపాయలే ఇవ్వండి. అప్పుడు వాళ్లు ఇబ్బంది పడి అస్సాం వదిలిపోతారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

అస్సాం బీజేపీలో ఆందోళన

ముస్లింలకు సంబంధించిన రాజకీయ సందేశాల్లో నిరంతరం మార్పు వస్తోందని ప్రొఫెసర్ అఖిల్ రంజన్ అన్నారు. ఎన్నికలకు ముందు హిమంత ఆందోళనకు ఇది సంకేతంగా చెబుతున్నారు.

“కొన్నిసార్లు ముస్లింలందరినీ లక్ష్యంగా చేసుకుంటారు. కొన్నిసార్లు బంగ్లాదేశ్ ముస్లింలు, స్థానిక ‘మియా’ ముస్లింలు అంటూ తేడా చూపిస్తారు. పౌరహక్కులకు సంబంధించి ఇది స్థానిక ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇదొక రాజకీయ వ్యూహం’’ అని రంజన్ అన్నారు.

వీడియోను తొలగించాలనే నిర్ణయం సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిచర్యకే పరిమితం కాదని, దాని చట్టపరమైన, రాజకీయ చిక్కుల గురించి కూడా ఆందోళనలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

‘‘ఒక కమ్యూనిటీపై తుపాకీ గురిపెట్టి కనిపించడం అనేది చాలా తీవ్రమైనది. దీనిని చట్టపరంగా కూడా సవాలు చేయవచ్చు” అని అఖిల్ రంజన్ అన్నారు.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా ఈ వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేమని నిపుణులు కూడా భావిస్తున్నారు.

“ఆయన రెండు కోణాల రాజకీయ ఇమేజ్‌ను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు తనను తాను దృఢమైన హిందుత్వ నాయకుడిని అనిపించుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు, స్థానిక, స్వదేశీ కమ్యూనిటీల ప్రయోజనాలకు రక్షకుడిగా చూపించుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన హిందుత్వాన్ని, లోకల్ ఐడెంటిటీని కలపడానికి ప్రయత్నిస్తున్నారు” అని అఖిల్ రంజన్ అన్నారు.

పార్టీలో తన రాజకీయ పాత్రను బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఈ వ్యూహం కూడా ఒక భాగమని అఫ్రిదా హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

‘‘పార్టీలో ఒక ముఖ్యమైన, బలమైన నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారు. ఆయన రాజకీయ వైఖరులు జాతీయ స్థాయిలో ఆయన్ను మరింత దూకుడుగా విభేదాలను కలిగించే నాయకుల వర్గంలోకి నెట్టేస్తున్నాయి’’ అని అఫ్రిదా అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుర్తింపు, చొరబాటుకు సంబంధించిన సమస్యలు మళ్లీ మళ్లీ తలెత్తే అవకాశం ఉంది.

అయితే ఇలాంటి వ్యూహాలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో స్పష్టంగా తెలియదని నిపుణులు చెబుతున్నారు.

‘‘ఎన్నికలవేళ జరిగే ఈ విభజన రాజకీయాలు లాభాన్ని కలిగిస్తాయని కచ్చితంగా చెప్పలేం కానీ అలాంటి ప్రకటనలు సమాజంలో విభజనలను తీవ్రం చేస్తాయి’’ అని అఫ్రిదా హుస్సేన్ అంటున్నారు.

అఖిల్‌ రంజన్ మాట్లాడుతూ, “ఇది ఎన్నికల్లో ఎంత ప్రయోజనం చేకూరుస్తుందో చెప్పడం కష్టం, కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, ప్రభుత్వంలో భయం, అభద్రత కనిపిస్తోంది” అని అన్నారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)