Home జాతీయ national telgu సోవియట్ యూనియన్ నిష్క్రమణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో ఏం జరిగింది?

సోవియట్ యూనియన్ నిష్క్రమణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో ఏం జరిగింది?

7
0

SOURCE :- BBC NEWS

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అది 1989 ఏప్రిల్ 7వ తేదీ ఉదయం. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన తోర్ఖమ్‌లోని పోస్టాఫీస్‌ను సోవియట్ స్కడ్ మిసైల్ ధ్వంసం చేసింది. అఫ్గానిస్తాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిస్సైల్ అది.

అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేసిందని, ఇది స్పష్టంగా రెచ్చగొట్టే చర్యేనని పాకిస్తాన్ ఆరోపించింది.

ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని అఫ్గానిస్తాన్ చెప్పింది. ఈ విషయంలో పాకిస్తాన్‌కు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించింది.

1979 నుంచి ‘ముజాహిదీన్లు’గా పిలిచే సాయుధులకు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి వచ్చిన సోవియట్ సైన్యంలోని చివరి దళం అప్పటికే తమ దేశానికి తిరిగి వెళ్లిపోయింది.

సోవియట్ యూనియన్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, అమెరికా మధ్య 1988 ఏప్రిల్‌లో జెనీవా ఒప్పందం (దీని ప్రకారమే సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది) కుదిరినా, ఉల్లంఘన మాత్రం కొనసాగుతూనే ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, ZUBAIR MIR / AFP) (Photo by ZUBAIR MIR/AFP via Getty Images

మొదటిసారి స్కడ్ మిసైల్ ప్రయోగించినప్పుడు…

మధ్యశ్రేణి క్షిపణుల సహా తమ అత్యంత అధునాతన ఆయుధాలను అఫ్గానిస్తాన్‌కు అందిస్తున్నట్లు సోవియట్ యూనియన్ ప్రకటించిందని యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ (యూపీఐ)కి చెందిన జెరాల్డ్ నాడ్లర్ 1988 నవంబర్ 2 నాటి నివేదికలో ఉంది.

అధ్యక్షుడు నజీబుల్లా నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ‘పాకిస్తాన్ మద్దతు’ ఉన్నట్టు ఆరోపించిన తిరుగుబాటుదారుల దాడులను ఎదుర్కోవడానికే ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది.

”అమెరికా ఈ ఆయుధాలను ద్రవ ఇంధనంతో పనిచేసే, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్కడ్ మిసైళ్లుగా గుర్తించింది. వాటికి పాకిస్తాన్‌లోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. అదే సమయంలో పాకిస్తాన్‌కు తమ సంపూర్ణ మద్దతు నిరంతరం ఉంటుందని అమెరికా స్పష్టంగా ప్రకటించింది” అని నాడ్లర్ తన నివేదికలో పేర్కొన్నారు.

అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన ఒప్పందాలను అమలు చేయడానికి, ఉల్లంఘనలపై దర్యాప్తు చేయడానికి 1988 మే నెలలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ కోసం ఒక ఐక్యరాజ్యసమితి మిషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ మిషన్ 1990 మార్చి వరకు కొనసాగుతూనే ఉంది.

‘ద ఆక్స్‌ఫర్డ్ హ్యాండ్‌బుక్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్’ ప్రకారం, మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ఒకదేశ అంతర్గత విషయాల్లో మరొకటి జోక్యం చేసుకుంటున్నాయని ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నాయి.

1989 ప్రారంభం నుంచి సరిహద్దుల్లో ముజాహిద్దీన్ల కదలికలు, వారి సైనిక చర్యలపై అఫ్గానిస్తాన్ ఫిర్యాదు చేసింది. మరోవైపు, తమ గగనతల ఉల్లంఘనలు, అఫ్గానిస్తాన్ గూఢచారి సంస్థ దాడులు, తమ భూభాగంపై జరిగిన మిసైల్ దాడుల గురించి పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది.

అయితే ఐక్యరాజ్యసమితి మిషన్‌కి అటు రాజకీయ మద్దతు కానీ, ఇటు తగిన వనరులు కానీ లేవు. అందువల్ల, అది కేవలం సంఘర్షణలో ఉన్న దేశాల ఫిర్యాదులను ఎలాంటి దర్యాప్తు లేకుండా నమోదు చేయడం మాత్రమే చేయగలిగింది. ఒప్పందాలను పాటించేలా వాటిని ఒత్తిడి చేయలేకపోయింది.

యుద్ధం తర్వాత లక్షలాది మంది అఫ్గానిస్తాన్ పౌరులు పాకిస్తాన్, ఇరాన్‌ దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. సోవియట్ యూనియన్ నిష్క్రమణ తర్వాత, నాటి అధ్యక్షుడు నజీబుల్లా ప్రభుత్వం కుప్పకూలుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

సోవియట్ యూనియన్ వెళ్ళిపోయిన వెంటనే నజీబుల్లా ప్రభుత్వం పడిపోతుందని అంచనా వేసినట్లు మైఖేల్ క్లౌడ్‌ఫెల్టర్ తన పుస్తకం ‘వార్‌ఫేర్ అండ్ ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్స్’లో పేర్కొన్నారు.

”1986లో సోవియట్ గూఢచారి విభాగం (కేజీబీ) నజీబ్ ప్రభుత్వం కేవలం 6 నుంచి 18 నెలలు మాత్రమే నిలుస్తుందని అంచనా వేసింది. కానీ అది తప్పని నిరూపితమైంది” అని రాశారు.

“1989 మార్చిలో జలాలాబాద్‌లో అతిపెద్ద, అత్యంత భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కానీ ఆరు వారాల పోరాటం తర్వాత, ముజాహిదీన్లు అఫ్గానిస్తాన్ సైన్యం చేతిలో ఓడిపోయారు” అని మైఖేల్ క్లౌడ్‌ఫెల్టర్ పేర్కొన్నారు.

యూపీఐ ప్రతినిధి మహమ్మద్ జియావుద్దీన్ నివేదిక ప్రకారం, అఫ్గాన్ ‘ముజాహిదీన్’ నాయకుడు గుల్బుద్దీన్ హెక్మత్యార్ అప్పట్లో ఢాకాలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి తన తాత్కాలిక ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశించారు.

సరిగ్గా అప్పుడే ఏప్రిల్ ప్రారంభంలో పాకిస్తాన్‌పై స్కడ్ మిసైల్‌ దాడి జరిగింది.

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

పొరపాటున సరిహద్దు దాటిన మిస్సైల్

అంతకుముందు, అఫ్గానిస్తాన్ నుంచి ప్రయోగించిన ఒక మిసైల్ పాకిస్తాన్ సరిహద్దు గ్రామంలో పడిందని, ఈ ఘటనలో కనీసం 10 మంది మరణించారని, 15 మంది గాయపడ్డారని 1988, నవంబర్ 16 నాటి యూపీఐ నివేదికలో అధికారులు పేర్కొన్నారు.

ఇది సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్ సైన్యానికి ఇచ్చిన మిస్సైలా, కాదా అనేది స్పష్టంగా తెలియలేదు.

ఆ సమయంలో అమెరికన్ వార్తాపత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రత్యేక ప్రతినిధి జాన్ ఎఫ్.బర్న్స్ ”1989 ఏప్రిల్ 7న జలాలాబాద్, పెషావర్ మధ్య ఉన్న రహదారి సమీపంలో, ఒక మధ్య శ్రేణి స్కడ్ మిసైల్ తమ భూభాగంలో పడిందని పాకిస్తాన్ ధ్రువీకరించింది. అయితే ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని సమాచారం అందింది” అని పేర్కొన్నారు.

దీనిపై అఫ్గానిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తూ, ‘మిసైల్ పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ వైపు దూసుకెళ్లింది” అని వెల్లడించింది.

జలాలాబాద్ రక్షణలో ప్రభుత్వ దళాలు సాధించిన విజయానికి స్కడ్ మిసైళ్లే ప్రధాన కారణమని సోవియట్ అధికారులు క్రెడిట్ ఇచ్చారు.

జలాలాబాద్ విమానాశ్రయం బయటి వలయం వరకు చొచ్చుకువచ్చిన గెరిల్లా పోరాటకారులను అడ్డుకోవడంలో ఈ మిసైళ్లు ఎంతో సహాయపడ్డాయని వారు తెలిపారు.

అలాగే, ఆ నగరం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంలో ఉన్న ‘సమర్ ఖేల్’ ప్రభుత్వ సైనిక స్థావరంలో చేరిన గెరిల్లాలను తరిమికొట్టడానికి కూడా ఈ మిసైళ్లను ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు.

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images

పాకిస్తాన్‌పై స్కడ్ మిసైల్ దాడులు…

1989, మే 4 : ఉదయం 8:20 గంటలకు, బన్నూ జిల్లాలోని ఒక అఫ్గాన్ శరణార్థి శిబిరం సమీపంలో స్కడ్ మిసైల్ పడింది. ఈ ఘటనలో ముగ్గురు అఫ్గాన్ పౌరులు మరణించగా, 17 మంది గాయపడ్డారు.

1989 మే 22 : పాకిస్తాన్ పంజాబ్‌లోని భాకర్ జిల్లా సమీపంలో ఒక స్కడ్ మిసైల్ పడింది. బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది ఇండిపెండెంట్’ ప్రకారం, ఇది మూడవ దాడి. దీనివల్ల పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తర్వాత తమ శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని రెండు దేశాలు పరస్పరం ఆరోపించుకున్నాయి.

1989 జూన్ 23, 24, 26 : అఫ్గానిస్తాన్ నుంచి ప్రయోగించిన బాంబులు పాకిస్తాన్‌లో పడ్డాయి. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు రాలేదు.

1989 ఆగస్టు 15: ఉదయం 8:45 గంటలకు కుర్రం ఏజెన్సీలో ఒక స్కడ్ మిసైల్ పడింది.

1989 అక్టోబర్ 1: రాత్రి 8:15 గంటలకు ఉత్తర వజీరిస్థాన్ ఏజెన్సీలోని ఆదమ్‌ఖేల్ సమీపంలో ఒక మిసైల్ పడింది.

1989 అక్టోబర్ 27 : కుర్రం ఏజెన్సీలోని ‘టెడీ మంగళ్’ ప్రాంతంలో మరొక మిసైల్ పడింది.

1989 డిసెంబరులో కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముజాహిదీన్ల చివరి ప్రయత్నం ప్రారంభమైంది. అయితే, ప్రభుత్వ దళాలు ఆ దాడిని సమర్థంగా తిప్పికొట్టాయని క్లౌడ్‌ఫెల్టర్ తెలిపారు.

దీని తర్వాత ముజాహిదీన్లు చెల్లాచెదురయ్యారు. వేర్వేరు వర్గాలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయాయి.

కాబూల్‌లో రేషన్ కొరత, పేదరికం పెరిగిపోయింది.

1990 నాటికి అఫ్గానిస్తాన్ పూర్తిగా ఒక ధ్వంసమైన దేశంగా మారిపోయింది.

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సోవియట్ యూనియన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

1990లో జరిగిన దాడులు…

1990 జనవరి 10 : మధ్యాహ్నం 1:40 గంటలకు, అఫ్గానిస్తాన్ నుంచి ప్రయోగించిన స్కడ్ మిసైల్ అటక్ జిల్లాలోని ‘హిసార్’ గ్రామంలో పడింది.

1990 జూన్ 14 : అర్ధరాత్రి 2:00 గంటలకు కుర్రం ఏజెన్సీలోని ‘టెడీ మంగళ్’ ప్రాంతంలో ఒక స్కడ్ మిసైల్ పడటంతో అఫ్గానిస్తాన్ శరణార్థి ఒకరు గాయపడ్డాడు.

1990 జూన్ 26: సాయంత్రం 4:15 గంటలకు కుర్రం ఏజెన్సీలోని పేవార్ కోటల్‌లో ఒక స్కడ్ మిసైల్ పడింది. ఈ ఘటనలో నలుగురు అఫ్గానిస్తాన్ పౌరులు గాయపడ్డారు. సెప్టెంబర్ 13న కుర్రం ఏజెన్సీలోని షాదల్ సమీపంలో, నవంబర్ 20 ఉదయం 10:35 గంటలకు ఖైబర్ ఏజెన్సీలోని అవల్ ఖాన్ సమీపంలో స్కడ్ మిసైళ్లు పడ్డాయి. ఈ దాడుల్లో కూడా ఎవరూ మరణించినట్టు సమాచారం అందలేదు.

1990 నవంబర్ 28 :మధ్యాహ్నం 3:40 గంటలకు, అఫ్గానిస్తాన్ నుంచి ప్రయోగించిన రెండు స్కడ్ మిసైళ్లు కుర్రం ఏజెన్సీలోని ‘టెడీ మంగళ్’లో పడ్డాయి. పాకిస్తాన్ గడ్డపై అఫ్గానిస్తాన్ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద, అత్యంత భయంకరమైన దాడి ఇదే. ఇందులో ముగ్గురు అఫ్గాన్ పౌరులతో సహా మొత్తం 28 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.

మొత్తం మీద పాకిస్తాన్‌లో 17 మిసైళ్లు పడగా, వాటి ప్రభావం వల్ల 35 మందికి పైగా మరణించారు. చాలామంది గాయపడ్డారు.

ముజాహిదీన్ల సమాచారం ప్రకారం, 1991 ఏప్రిల్ 21న ఈశాన్య అఫ్గానిస్తాన్‌లో వారి నియంత్రణలో ఉన్న కునార్ ప్రాంత్ రాజధాని అసదాబాద్‌పై జరిగిన మూడు స్కడ్ మిసైల్ దాడుల్లో 300 మందికి పైగా మరణించారు. దాదాపు 500 మంది వరకు గాయపడ్డారు.

వసంత కాలంలో విత్తనాలు నాటే సమయం కావడంతో పెద్ద సంఖ్యలో శరణార్థులు అఫ్గానిస్తాన్‌లో ఉండటంతో మరణాల సంఖ్య ఇంత ఎక్కువగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం పంటలు వేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు సరిహద్దులు దాటి వెళ్తారు. వేసవిలోపాకిస్తాన్ శిబిరాలకు వచ్చి, మళ్లీ శరదృతువులో కోతల కోసం స్వదేశానికి వెళ్తుంటారు.

సోవియట్ యూనియన్ వెనుతిరిగిన తర్వాత కూడా నజీబుల్లా ప్రభుత్వం మూడేళ్ల పాటు కొనసాగింది. అయితే ఈ కాలంలో జరిగిన యుద్ధం దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసింది.

చివరికి 1992 ఏప్రిల్ 16న నజీబుల్లా తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అఫ్గాన్ ప్రతిఘటన దళాలు అంతర్యుద్ధంలో చిక్కుకున్నాయి. ముజాహిదీన్లలోని వివిధ వర్గాలు తమలో తామే కుమ్ములాడుకోవడం మొదలుపెట్టాయి.

1994 జనవరి నుంచి 1995 ఫిబ్రవరి వరకు సుమారు 13 నెలల పాటు కాబూల్ నగరంపై ఫిరంగులు, రాకెట్లతో నిరంతరాయంగా బాంబుల వర్షం కురిసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)