Home జాతీయ national telgu సునీల్ గావస్కర్, కపిల్‌ దేవ్ సహా 14మంది క్రికెట్ మాజీ కెప్టెన్లు పాకిస్తాన్‌కు రాసిన లేఖలో...

సునీల్ గావస్కర్, కపిల్‌ దేవ్ సహా 14మంది క్రికెట్ మాజీ కెప్టెన్లు పాకిస్తాన్‌కు రాసిన లేఖలో ఏముంది?

20
0

SOURCE :- BBC NEWS

ఇమ్రాన్ ఖాన్‌తో కపిల్ దేవ్

ఫొటో సోర్స్, Getty Images

3 గంటలు క్రితం

చదివే సమయం: 5 నిమిషాలు

పాకిస్తాన్‌లోని అడియాలా జైలులో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఐదు దేశాలకు చెందిన 14 మంది క్రికెట్ మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు వారు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఇమ్రాన్ ఖాన్‌తో గౌరవప్రదంగా వ్యవహరించాలని, ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వారు డిమాండు చేశారని భారత వార్తా సంస్థలు పీటీఐ, ఏఎన్ఐ వెల్లడించాయి.

అంతర్జాతీయ వార్తాసంస్థ ‘రాయిటర్స్’ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

ఈ లేఖ రాసిన 14 మంది మాజీ కెప్టెన్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్లు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు అలెన్ బోర్డర్, స్టీవ్ వా, ఇయాన్ చాపెల్, కిమ్ హ్యూస్, ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ కూడా ఉన్నారు.

వారితో పాటు ఇంగ్లండ్ జట్టుకు చెందిన మైక్ అథర్టన్, నాసిర్ హుస్సేన్, మైక్ బ్రేయర్లీ, డేవిడ్ గోవర్, వెస్టిండీస్ జట్టుకు చెందిన క్లైవ్ లాయిడ్, న్యూజీలాండ్‌ జట్టుకు చెందిన జాన్ రైట్ ఈ లేఖపై సంతకం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
సునీల్ గవాస్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఆ లేఖలో ప్రధానంగా ఏం రాశారు?

”మేమంతా మా దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా పనిచేసినవారమే. ఇమ్రాన్ ఖాన్‌ పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్‌లోనే ఒక దిగ్గజ ఆటగాడు కూడా. ఆయన విషయంలో అధికార వర్గాల ప్రవర్తన, జైలులో పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

”క్రికెట్ రంగానికి విశేష సేవలందించిన ఇమ్రాన్ ఖాన్ ప్రపంపవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. కెప్టెన్‌గా 1992 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. నైపుణ్యం, పట్టుదల, నాయకత్వం, క్రీడాస్ఫూర్తికి నిదర్శంగా నిలిచిన ఆ విజయం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది” అని ఆ లేఖలో ప్రస్తావించారు.

”మాలో చాలామందిమి క్రికెట్ గ్రౌండ్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌తో ప్రత్యర్థి జట్టుగా తలపడినవారమే. అయినప్పటికీ, ఆయన ఆల్‌రౌండ్ ప్రతిభ, పోటీతత్వం, వ్యక్తిత్వానికి ముగ్ధులయ్యేవాళ్లం. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నవారూ ఉన్నారు. నేటికీ ఆయన్ను ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా, విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన్ను ఆటగాళ్లే కాదు, అభిమానులు, నిర్వాహకులు అందరూ గౌరవిస్తారు” అని పేర్కొన్నారు.

”ఒక్క క్రికెటర్‌గా మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కూడా ఇమ్రాన్ ఖాన్ విశేష సేవలందించారు. తన దేశానికి కష్టకాలంలో నాయకత్వం వహించారు. రాజకీయాలను కాసేపు పక్కనపెడితే, ఆయన తన దేశంలో అత్యున్నత పదవికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యారనే గౌరవం పొందారు” అని వారు ఆ లేఖలో గుర్తుచేశారు.

”ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిర్బంధంలో ఉన్న సమయంలో ఆయన కంటిచూపు వేగంగా మందగిస్తోందని తెలుస్తోంది. గత రెండున్నరేళ్లుగా జైలులో నెలకొన్న పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి” అని తెలిపారు.

”క్రికెటర్లుగా మేము ఇమ్రాన్ ఖాన్ నిష్పక్షపాతం, గౌరవం, క్రీడాస్ఫూర్తి వంటి విలువల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. ఇవి కేవలం మైదానానికే పరిమితం కావు. ఆ వ్యక్తి పట్ల గౌరవప్రదమైన, కనీస మానవీయ విలువలతో కూడిన ప్రవర్తన ఉండాలని భావిస్తున్నాం” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే…

క్రికెట్ జట్ల మాజీ కెప్టెన్లు తాము సంతకాలు చేసిన ఈ లేఖలో ప్రధానంగా మూడు డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ఉంచారు.

మొదటి డిమాండ్: ఇమ్రాన్ కోరిక మేరకు, అనుభవజ్ఞులైన వైద్యుల ద్వారా తక్షణమే, నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉంచాలి.

రెండో డిమాండ్: అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జైలులో మానవీయమైన, గౌరవప్రదమైన పరిస్థితులను కల్పించాలి. కుటుంబసభ్యులతో క్రమం తప్పకుండా ములాఖత్ అవకాశం కల్పించాలి.

మూడో డిమాండ్: ఎటువంటి ఆలస్యం, ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన న్యాయ ప్రక్రియ ఇమ్రాన్‌ఖాన్‌కు అందేలా చూడాలి.

క్రికెట్ ఎప్పుడూ దేశాల మధ్య వారధిగా పనిచేస్తుందని ఆ లేఖలో మాజీ కెప్టెన్లు పేర్కొన్నారు.

”గ్రౌండ్‌లో పోటీ అనేది ఆట అయిపోగానే ముగిసిపోతుంది. కానీ గౌరవం మాత్రం అలాగే ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ తన కెరీర్ పొడవునా ఇదే స్ఫూర్తితో జీవించారు” అని వారు అన్నారు.

”ఇప్పుడు కూడా ఆ గౌరవం, న్యాయం అనే సూత్రాలను పాటించాలని, వాటిని నిలబెట్టాలని అధికారులను కోరుతున్నాం” అని పేర్కొన్నారు.

చట్టపరమైన ప్రక్రియలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోకుండా, కేవలం క్రీడాస్ఫూర్తి, మానవతా దృక్పథంతో మాత్రమే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి ఏమైంది?

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కుడికంటి చూపు కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉందని పేర్కొంటూ ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాప్ (పీటీఐ) చేసిన ప్రకటన సంచలనమైంది.

ఇమ్రాన్ ఖాన్‌ను కంటి చికిత్స కోసం ఒక ‘స్పెషల్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్’కు తరలించాలని పాకిస్తాన్ ప్రభుత్వం గత ఆదివారం నిర్ణయించిందని బీబీసీ న్యూస్ ఉర్దూ వెల్లడించింది.

పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతా తారార్ మాట్లాడుతూ, ”ఇమ్రాన్ ఖాన్ కంటికి సంబంధించిన తదుపరి వైద్య పరీక్షలు, చికిత్సను ఇప్పటికే జరుగుతున్న వైద్య చికిత్సతో పాటు ఒక ‘స్పెషల్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్’లో కంటి వైద్య నిపుణులు అందిస్తారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తాం” అని చెప్పారు.

ఇమ్రాన్‌ఖాన్‌కు నిపుణులైన వైద్యుల సమక్షంలో కంటి పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అలాగే, కోర్టు ఆదేశాల మేరకు, ఇమ్రాన్‌ఖాన్ తన పిల్లలతో మాట్లాడుకునే అవకాశం అధికారులు కల్పించారు.

మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాప్ (పీటీఐ) ఆయనకు ప్రత్యేక వైద్యం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఆయన్ను విడుదల చేయాలని కూడా కోరుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)