Home జాతీయ national telgu సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత: పాకిస్తాన్‌ నిపుణులు ఏం చెబుతున్నారు?

సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత: పాకిస్తాన్‌ నిపుణులు ఏం చెబుతున్నారు?

5
0

SOURCE :- BBC NEWS

భారత్, పాకిస్తాన్, సింధు నది, పహల్గాం

ఫొటో సోర్స్, ANI

2 గంటలు క్రితం

పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్నితాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం(ఏప్రిల్ 23)జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

”1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుంది” అని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్, పాకిస్తాన్, సింధు నది, పహల్గాం

ఫొటో సోర్స్, Getty Images

భారత్ సైనిక చర్యకు దిగుతుందా?

పాకిస్తాన్ విషయంలో భారత్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కానీ అవన్నీ అంత తీవ్రమైనవేమీ కాదు.

”పాకిస్తాన్ హైకమిషన్‌ సిబ్బందిని తగ్గించింది కానీ మూసివేయలేదు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది కానీ రద్దు చేయలేదు. పాకిస్తాన్ ప్రజలకు ఉన్న సార్క్ (SAARC ) వీసా సౌకర్యాన్ని ఆపివేసింది కానీ అన్ని రకాల వీసాలు కాదు” అని ది హిందూ దినపత్రిక దౌత్య వ్యవహారాల ఎడిటర్ సుహాసిని హైదర్ రాశారు.

ఈ నిర్ణయాల తర్వాత భారత్ సైనిక చర్యకు దిగుతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

”పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని భారత్ నిర్ణయించుకుంటే కొన్ని అవకాశాలున్నాయి. భారత్ వైమానిక దాడి చేయగలదు. 2016లో మాదిరి ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేయగలదు. అయితే క్షిపణులను ప్రయోగించకపోవచ్చు. ఎల్ఓసీలో కాల్పుల విరమణ ముగిసిపోతుంది. కొందరిని లక్ష్యంగా చేసుకుని చంపే అవకాశమూ ఉంది” అని బ్రిటిష్ మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ డిఫెన్స్ ఎడిటర్ శశాంక్ జోషి రాశారు.

భారత్, పాకిస్తాన్, సింధు నది, పహల్గాం

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ నిపుణులు ఏమంటున్నారు?

భారత్ తీసుకున్న నిర్ణయాలన్నింటిలోకి సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్‌లో ఎక్కువ చర్చ జరుగుతోంది.

భారత్ ఇలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇస్‌హాక్ దార్ పాకిస్తాన్ మీడియాతో అన్నారు.

”గతంలోని అనుభవం దృష్ట్యా భారత్ ఇలా చేస్తుందనే ఆలోచన మాకుంది. నేను తుర్కియేలో ఉన్నా. పహల్గాం దాడిని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది. సింధు జలాల ఒప్పందమే కాకుండా భారత్ తీసుకున్న మిగిలిన నాలుగు నిర్ణయాలకు సమాధానం చాలా తేలిగ్గా కనుగొనచ్చు.’’ అని పాకిస్తాన్ న్యూస్ చానల్ సమ టీవీకి చెప్పారు.

సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ ఇప్పటికే మొండిగా ఉంది. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వారు ఇప్పటికే కొన్ని రిజర్వాయర్లు కట్టారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకుకు భాగస్వామ్యం ఉంది. ఈ విషయంలో భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు. అలాంటప్పుడు ప్రపంచంలో నిరంకుశత్వం మొదలవుతుంది. ‘బలవంతుడు సరైనవాడు’ అనేది ఉపయోగపడదు. భారత్ దగ్గర న్యాయపరమైన సమాధానం లేదు. పాకిస్తాన్ న్యాయ మంత్రిత్వ శాఖ దీనికి సమాధానమిస్తుంది” అని ఇస్‌హాక్ దార్ చెప్పారు.

”ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది, తర్వాత ఏ చర్య తీసుకుంటుంది? ఉదాహరణకు, ఎలాంటి చర్య తీసుకోకపోతే దానికి అర్థం లేదు” అని సమ టీవీలో ప్రసారమైన అదే కార్యక్రమంలో ఒక పాకిస్తానీ నిపుణుడు అభిప్రాయపడ్డారు.

భారత్, పాకిస్తాన్, సింధు నది, పహల్గాం

ఫొటో సోర్స్, Getty Images

‘అఫ్గానిస్తాన్‌‌కు సరుకులు ఆపుతుందా?’

“సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే సింధు, జీలం, చీనాబ్ నీటిని ఆపడానికి భారత్ దగ్గర మౌలిక సదుపాయాలు లేవన్నది నిజం. కానీ మనం వెంటనే కొన్ని నిర్దుష్ట నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ప్రపంచ బ్యాంకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ ఒప్పందానికి హామీ ఉన్నవారిలో ప్రపంచబ్యాంకు ఒకటి. దౌత్య సంబంధాలకు సంబంధించిన నిర్ణయంలో ఎత్తుకు పై ఎత్తు తరహాలో ప్రతిస్పందించవచ్చు” అని భారత్‌లో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ డాన్ న్యూస్‌తో అన్నారు.

“పఠాన్‌కోట్ దాడి జరిగినప్పుడు నేను భారత హైకమిషనర్‌గా ఉన్నాను. ఆ సమయంలో ఉరీ దాడులు కూడా జరిగాయి. నా అనుభవం ప్రకారం మనం భయపడకూడదు. వాఘా సరిహద్దు అప్గనిస్తాన్‌కు తెరిచి ఉంది. భారత్ దీని గుండా వస్తువులు అఫ్గానిస్తాన్‌‌కు ఎగుమతి చేస్తుంది మరి ఇప్పుడు భారత్ అఫ్గానిస్తాన్‌కు కూడా వస్తువుల సరఫరా ఆపివేస్తుందేమో చూడాలి” అని అబ్దుల్ బాసిత్ అన్నారు.

భారత్, పాకిస్తాన్, సింధు నది, పహల్గాం

ఫొటో సోర్స్, Getty Images

భారత్ నీటిని ఆపగలదా..?

”ప్రపంచంలోని ప్రస్తుత వాతావరణంలో నియమాలను ఎవరూ పాటించడం లేదుకదా…. అంతర్జాతీయ సంస్థలన్నీ నిష్క్రియాపరత్వంతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింధు జలాల ఒప్పందంపై భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ ఏం చేయగలదు” అన్న ప్రశ్న అబ్దుల్ బాసిత్‌కు ఎదురయింది.

“ఇది పెద్దగా ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదు. పశ్చిమ నదుల నుంచి పాకిస్తాన్‌కు ఏటా దాదాపు 133 మిలియన్ల ఎకరాలకు నీరు అందుతుంది. ప్రస్తుతం భారత్ ఈ నీటిని ఆపగలిగే స్థితిలో ఉందని అనుకోవడం లేదు. పాకిస్తాన్ దౌత్యపరంగా కొంచెం క్రియాశీలకంగా ఉండాలి” అని అబ్దుల్ బాసిత్ బదులిచ్చారు.

“నీటిని ఆపడానికి మౌలిక సదుపాయాలను భారత్ నిర్మించలేకపోయింది. కాబట్టి ప్రస్తుతం పెద్ద సమస్యేమీ లేదు, అయితే దీన్ని నివారించడానికి పాకిస్తాన్ క్రియాశీలకంగా ఉండాలి. ఉదాహరణకు, ఈ విషయంలో చైనా కూడా పాకిస్తాన్‌కు సహాయం చేయగలదు. చైనా నుంచి చాలా నదులు భారత్‌కు ప్రవహిస్తాయి. కాబట్టి చైనా కూడా నీటిని ఆపడానికి చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు చాలా అవకాశాలున్నాయనుకుంటున్నా. నియమాల ప్రకారం పనిచేసే వ్యవస్థ లేదు గానీ ఇంకా చాలా అవకాశాలున్నాయి. అది మనుగడకు సంబంధించిన విషయంగా మారి, నీటిని విడుదల చేయకపోతే, రక్తం చిందించాల్సి వస్తుంది” అని అబ్దుల్ బాసిత్ చెప్పారు.

“ఇది అసాధారణమైన చర్య. అందరూ కట్టుబడి ఉండాల్సిన ఒప్పందం. ఎవరూ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేరు. ఇది ప్రమాదకరమైన నిర్ణయం. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తీసుకెళ్లవచ్చు. నీటిని మళ్లించడం భారత్‌కు అంత తేలిక కాదు. దీనికి సంవత్సరాలు పట్టవచ్చు” అని పాకిస్తాన్ మాజీ న్యాయ మంత్రి అహ్మర్ బిలాల్ సూఫీ దునియా టీవీతో చెప్పారు.

భారత్, పాకిస్తాన్, సింధు నది, పహల్గాం

ఫొటో సోర్స్, ANI

‘భారత్ ఇంతటితో ఆగదు’

‘పాకిస్తాన్ వ్యవసాయ ఉత్పత్తులలో 90% సింధు ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఆధారపడి ఉన్న పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొంటుంది’ అని ప్రఖ్యాత విశ్లేషకులు షాజాద్ చౌధరిని ఇదే టీవీ కార్యక్రమంలో ప్రశ్నించారు.

“ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందానికి ఎలాంటి అడ్డంకీ రాలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఊహించనిది. అయితే భారత్ నిర్ణయం వల్ల తక్షణ ప్రభావం ఏమీ ఉండదు” అని షాజాద్ చౌధరి బదులిచ్చారు.

“పాకిస్తాన్ నదులలో నీళ్లు లేకపోవడం జరగదు. జీలం, చీనాబ్‌పై ఆనకట్టలు నిర్మించడం ద్వారా ఏమన్నా చేయగలరు గానీ ఇప్పటికే భారత్ ఆ పని చేస్తోంది. దాని వల్ల పాకిస్థాన్‌కు పెద్దగా కలిగే హాని ఏమీ లేదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

“మనం కూడా చాలా విషయాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఉదాహరణకు, సిమ్లా ఒప్పందం ఏమవుతుంది? కరాచీ ఒప్పందం సంగతేంటి? నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఎలా ఉండబోతోంది? అణ్వాయుధాలకు సంబంధించిన సమాచారం ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు తలెత్తుతాయి” అని షాజాద్ చౌధరి అన్నారు.

“భారత్ రాజకీయ నిర్ణయం తీసుకుంది. దాని ప్రభావం పెద్దగా ఉండబోదు. భారత్ ఇప్పటికే సింధు జల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం అమలుకు సిద్ధమవుతోంది. ల్యాండ్ లాక్‌డ్ దేశాలకు ట్రాన్స్‌షిప్‌మెంట్‌ను రద్దు చేస్తోంది. కానీ భారత్ ఇక్కడితో ఆగదని మనం గుర్తుంచుకోవాలి” అని చౌధరి వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)