Home జాతీయ national telgu సలీం: 45 ఏళ్ల కిందటి దొంగతనం కేసులో 65 ఏళ్ల వృద్ధుడి అరెస్టు

సలీం: 45 ఏళ్ల కిందటి దొంగతనం కేసులో 65 ఏళ్ల వృద్ధుడి అరెస్టు

9
0

SOURCE :- BBC NEWS

సలీం, మధ్యప్రదేశ్, దొంగతనం, అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, Saleem’s family

“సార్, నేను చిన్నప్పుడు అల్లరితనంగా ఏం చేశానో నాకు గుర్తు లేదు. 45 ఏళ్ల క్రితం నాపై 100 రూపాయల విలువైన గోధుమలను దొంగిలించిన కేసు నమోదైందని నాకు తెలిసుంటే, నేనే పోలీసులను సంప్రదించేవాడిని”

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా నుంచి పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చారని ఫిబ్రవరి 7న సలీం మేవాతి ఫోన్‌ ద్వారా బీబీసీకి చెప్పారు. ఈ కేసు 45 ఏళ్ల కిందట బల్క్వారా పోలీస్‌ స్టేషన్ పరిధిలోని బలసముంద్ కాకడ్ గ్రామానికి సంబంధించినదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న సలీంపై మోపిన ఆరోపణ ఏంటంటే, ఆయన తన ఆరుగురు స్నేహితులతో కలిసి 1980 డిసెంబర్‌లో రెండు పొలాల నుంచి గోధుమలు దొంగిలించారని. దీని గురించి 1980లో మాణిక్‌చంద్ పటేల్, లాల్‌చంద్ పటేల్‌లు ఫిర్యాదు చేశారు.

సలీంపై రూ.100 విలువైన గోధుమలను దొంగిలించినందుకు కేసు ఉన్నట్లు ఖర్గోన్ జిల్లా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్వేతా శుక్లా ధృవీకరించారు.

“మా దగ్గరున్న సమాచారం ప్రకారం, 1980లో సలీంతో పాటు సుమారు 19-20 ఏళ్ల వయసున్న ఆరుగురు యువకులు ఈ చోరీలో పాల్గొన్నారు. ఈ కేసులో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇది రెండు చేల నుంచి దొంగతనం చేసిన కేసు” అని శ్వేతా శుక్లా ఫోన్‌లో బీబీసీకి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సలీం, మధ్యప్రదేశ్, దొంగతనం, అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, Ashif Khan

సలీం ఎక్కడున్నారో ఎలా తెలిసింది?

మధ్యప్రదేశ్‌లో కొన్ని సంవత్సరాల కిందట పాత కేసులను డిజిటలైజ్ చేశారు. ఈ కేసు కూడా వాటిలో ఒకటి.

కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టగా కుటుంబ సభ్యుల ద్వారా యాదృచ్ఛికంగా సలీం గురించి సమాచారం లభించిందని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారని, వారిలో ఇద్దరు మరణించగా, నలుగురు బెయిల్‌పై బయట ఉన్నారని, సలీం చివరి నిందితుడని పోలీసులు తెలిపారు.

‘‘ఈ కేసులో స్టాండింగ్ వారెంట్ జారీ అయిన వారి కోసం మేం వెతుకుతున్నాం. వారిలో ఒకరు దేవాస్ జిల్లాలో ఉన్నట్లు తెలిసింది. అక్కడికెళ్లి విచారించగా, అతను చనిపోయాడని తెలిసింది. అప్పుడు మాటల సందర్భంలో సలీం మేవాతి గురించి మాకు సమాచారం దొరికింది. ఆ వివరాలు తీసుకుని మేం సలీం ఇంటికి వెళ్లాం. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకున్నాం” అని మిథున్ చౌహాన్ అన్నారు.

సలీం కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి తమకు తెలియదని చెబుతున్నారు.

“మేం షాక్‌లో ఉన్నాం. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీసులు వచ్చి మా మామగారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. 45 ఏళ్ల కిందట మా మామయ్య రూ. 100 విలువైన గోధుమలను దొంగిలించారని మాకు చెప్పారు” అని సలీం మేవాతి కోడలు ఆయేషా తెలిపారు.

“అకస్మాత్తుగా పోలీసులు వచ్చి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకుకి తండ్రి, కొంతమంది మనవళ్ల తాతను దొంగ అని చెప్పి కారులో తీసుకెళ్లారు. మాకు ఏం అర్థం కాలేదు. మేం పోలీస్ స్టేషన్ వరకు వెనకాలే వెళ్లాం” అని సలీం భార్య తస్లీమ్ చెప్పారు.

“ఇది మా పెళ్లికి ముందు జరిగిందని పోలీసు స్టేషన్‌లో తెలిసింది. ఇందులోని నిందితులంతా అప్పటికి చిన్నవాళ్లు’’ అని తస్లీమ్ అన్నారు.

పోలీసు రికార్డుల ప్రకారం, సంఘటన జరిగినప్పుడు సలీం వయస్సు 19–20 సంవత్సరాలు. అయితే సలీం 1967లో జన్మించారని, ఘటన జరిగినప్పుడు టీనేజ్‌లో ఉన్నారని ఆయన కుటుంబం అంటోంది.

సలీం, మధ్యప్రదేశ్, దొంగతనం, అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, Khargone police

‘పరువు పోయింది’

ఖర్గోన్ జిల్లాలోని బలసముంద్ కంకడ్ గ్రామంలో సలీం ఉండేవారు. పెళ్లి తర్వాత అత్తమామల ఇంటి నుంచి దాదాపు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ జిల్లాలోని బాగ్ గ్రామానికి మారారు. అయితే, ఆయన బంధువులు ఇప్పటికీ బలసముంద్ కంకడ్‌లోనే నివసిస్తున్నారు.

తన భర్త సలీంతో కలిసి బలసముంద్ కంకడ్ గ్రామానికి చేరుకున్న తస్లీమ్, ఇన్నేళ్లుగా పోలీసు వ్యవస్థా, ప్రభుత్వం ఏం చేస్తున్నాయో అర్థం కాలేదని అన్నారు.

‘‘వీళ్లంతా బలసముంద్ కంకడ్‌లో చిన్నప్పుడు తెలీక అల్లరిగా ఏదో చేశారని అనుకుందాం. మా పెళ్లి జరిగినప్పుటి నుంచి మేం ఆ గ్రామానికి కేవలం 70-80 కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నాం. మా వారి కుటుంబం మొత్తం ఇప్పటికీ బలసముంద్‌లో నివసిస్తుంది. పోలీసులు సరిగ్గా పనిచేసుంటే, మా కుటుంబానికి సమన్లు అందేవి లేదా బలసముంద్‌లో నివసిస్తున్న మా కుటుంబ సభ్యులు మాకు సమాచారం ఇచ్చి ఉండేవారు” అని తస్లీమ్ అన్నారు.

ఈ కేసులో సలీం చట్టం నుంచి తప్పించుకుని దాక్కున్నట్లు స్థానిక మీడియా చిత్రీకరించిన విధానం తప్పని, దీనివల్ల కుటుంబం పరువు పోయిందని సలీం కుటుంబ సభ్యులు అంటున్నారు.

“మేం ఎక్కడా దాక్కోలేదు. నా భర్త చిన్నప్పుడు ఏం చేశాడో నాకు గుర్తు లేదు. ఆ సమయంలో ఆయనది చిన్న వయసు. కానీ పోలీసుల చర్య, ఈ కేసును మీడియాలో చిత్రీకరించిన విధానం చూస్తుంటే నా భర్త సలీం ఒక పేరుమోసిన నేరస్థుడు అన్నట్లుగా ఉంది. కానీ, ఆయన తన కుటుంబంతో కలిసి బతుకుతున్న ఓ మామూలు వ్యక్తి’’ అని తస్లీమ్ అన్నారు.

సలీం, మధ్యప్రదేశ్, దొంగతనం, అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, Ashif Khan

రాజీపడ్డ ఇరుపక్షాలు

ఫిబ్రవరి 7న సలీంను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గతంలో ఆయనపై భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ 379 కింద కేసు నమోదైంది.

ఈ విషయంలో తనకు, ఫిర్యాదుదారుకి మధ్య రాజీ కుదిరిందని బీబీసీకి చెప్పారు సలీం.

‘‘నేను ముసలివాడినయ్యా. డయాబెటిస్, హై బ్లడ్‌ప్రెజర్ ఉన్నాయి. నా మనవళ్లు కూడా పెద్దవాళ్లయ్యారు. కేసు వేసిన వాళ్లు కూడా ముసలివాళ్లయ్యారు. ఇది చాలా పాత కేసు. దీని కోసం పోరాడే ఓపిక ఇరుపక్షాలకు లేదు. అందుకే మేం రాజీ పడ్డాం” అని సలీం తెలిపారు.

దొంగతనం వంటి కేసులలో, కోర్టు అనుమతితో పార్టీల మధ్య ఒప్పందం ఆధారంగా విచారణను ముగించవచ్చని న్యాయ నిపుణులంటున్నారు.

ఈ కేసులో ఫిర్యాదుదారుడైన మాణిక్‌చంద్ పటేల్ కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడినప్పుడు, వారు కూడా రాజీ కుదిరిందని ధృవీకరించారు.

మాణిక్‌చంద్ పటేల్ కుమారుడు రాజేంద్ర పటేల్ ఫోన్‌లో మాట్లాడుతూ, “నా తండ్రికి దాదాపు 80 ఏళ్లు. ఈ కేసు కూడా 45 ఏళ్ల నాటిది. అప్పట్లో ఈ మొత్తం పెద్దదే కావచ్చు, కానీ ఇప్పుడది చిన్న విషయం. ఇరుపక్షాలవారు ముసలివాళ్లైపోయారు కాబట్టి, ఒకరితో ఒకరు మాట్లాడుకుని రాజీకి వచ్చి కేసును ముగించారు” అని అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)