SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఓ ప్రసిద్ధ ఓడ శిథిలాల నుంచి వెలికితీసిన బంగారు నాణేల ఆచూకీ చెప్పకుండా సుమారు పదేళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న టామీ థాంప్సన్ విడుదలయ్యారు. అమెరికాకు చెందిన ఈయన లోతైన సముద్ర జలాల్లో నిధుల వేట సాగిస్తుంటారు.
అయితే ఓడ నుంచి ఆయన వెలికితీసిన నిధిలో 500 నాణేల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
ప్రస్తుతం 73 ఏళ్ల వయసున్న టామీ థాంప్సన్, 1988లో సౌత్ కరోలినా తీరంలో 1857 నాటి ‘ఎస్‌ఎస్ సెంట్రల్ అమెరికా’ అనే ఓడ శిథిలాలను కనుగొన్నారు. దీనిని ‘షిప్ ఆఫ్ గోల్డ్’ అని పిలుస్తారు. ఈ ఓడలో లక్షలాది డాలర్ల విలువైన నిధిని ఆయన గుర్తించారు.
అయితే, ఈ సాహసయాత్రలో పెట్టుబడి పెట్టిన వారికి వాగ్దానం చేసిన వాటాను ఇవ్వకుండా థాంప్సన్ మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
కొన్నేళ్లపాటు పరారీలో ఉన్న ఆయనను 2015లో కోర్టు ధిక్కార నేరంపై జైలుకు పంపారు.
ఈ ఓడ 1857లో మునిగిపోయింది, ఆ సమయంలో శాన్ ఫ్రాన్సిస్కో టంకశాల (మింట్)లో తయారైన సుమారు 30వేల పౌండ్ల బంగారాన్ని ఇది రవాణా చేస్తోంది.
బ్యాంకు నిల్వల కోసం అమెరికా తూర్పు తీరానికి బంగారాన్ని తరలిస్తుండగా, ఈ ఓడ 7వేల అడుగుల లోతున సముద్రంలో మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో 425 మంది మరణించారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద ఆర్థిక సంక్షోభానికే దారితీసింది.

అసలేం జరిగింది?
థాంప్సన్ ప్రారంభించిన ఈ అన్వేషణలో లాభాలు వస్తాయన్న నమ్మకంతో 161 మంది పెట్టుబడిదారులు ఆయనకు సుమారు రూ.117 కోట్లు (12.7 మిలియన్ డాలర్లు) ఆర్థిక సాయం అందించారు.
థాంప్సన్ అప్పట్లో ఒహియోలోని బాటెల్లె మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక సముద్ర ఇంజనీర్.
ఈ మిషన్‌లో భాగంగా ఆయన తన బృందంతో కలిసి 1988లో సముద్ర గర్భం నుంచి వేల సంఖ్యలో గోల్డ్ బార్స్, నాణేలు వెలికితీశారు.
వీటిలో చాలావరకు 2000 సంవత్సరంలో ఒక మార్కెటింగ్ గ్రూపునకు సుమారు రూ.467 కోట్లు (దాదాపు 50 మిలియన్ డాలర్ల)కు విక్రయించారు.
ఫొటో సోర్స్, Getty Images
కోర్టులో ఏం జరిగింది?
ఆ నిధి విక్రయం ద్వారా తమకు ఎటువంటి లాభాలు రాలేదని ఆరోపిస్తూ 2005లో పెట్టుబడిదారులు థాంప్సన్‌పై కోర్టులో దావా వేశారు. ఆయన వెలికితీసిన మొత్తం నిధి విలువ సుమారు 400 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని క్రిమినల్ ఫిర్యాదులో ఆరోపించారు.
కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో 2012లో థాంప్సన్ పరారయ్యారు. మూడేళ్ల పాటు తప్పించుకు తిరిగిన ఆయనను, ఆయన సహచరుడిని 2015లో ఫ్లోరిడాలోని ఒక హోటల్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులకు చిక్కకుండా ఉండటానికి థాంప్సన్ నకిలీ పేర్లతో హోటళ్లలో మకాం వేస్తూ, ట్యాక్సీలు, బస్సులలోనే తిరుగుతూ, చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేసేవారు.
బీబీసీ అంతర్జాతీయ భాగస్వామి అయిన సీబీఎస్ న్యూస్ సమాచారం మేరకు, ఆ నాణేలను బెలిజ్‌లోని ఒక ట్రస్ట్‌కు అప్పగించినట్లు, మొదటి విడత నిధి విక్రయం ద్వారా వచ్చిన లాభాలు కోర్టు ఖర్చులకు, బ్యాంకు అప్పులకే సరిపోయాయని థాంప్సన్ వాదించారు.
కనిపించకుండా పోయిన 500 బంగారు నాణేల గురించి చెప్పడానికి నిరాకరించినందుకు గాను, 2015 డిసెంబర్‌లో కోర్టు ఆయనను రెండేళ్ల పాలు జైలుకు పంపింది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో కోర్టు ఆదేశాలు పాటించే వరకు శిక్ష కొనసాగుతుంది.
అయితే, థాంప్సన్ ఎంతకాలం జైలులో ఉన్నా ఆ రహస్యాన్ని వెల్లడించేలా లేరని భావించిన న్యాయమూర్తి, గత ఏడాది ఆయన శిక్షను ముగించడానికి అంగీకరించినట్లు సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



