Home జాతీయ national telgu శ్రీ రామనవమి: భద్రాచల రాముడి పేరు, గోత్రం మార్చేశారా? దేవుడికీ గోత్రం ఉంటుందా?

శ్రీ రామనవమి: భద్రాచల రాముడి పేరు, గోత్రం మార్చేశారా? దేవుడికీ గోత్రం ఉంటుందా?

12
0

SOURCE :- BBC NEWS

శ్రీరామ నవమి

ఫొటో సోర్స్, @IPRTelangana

శ్రీరామనవమి వేళ భద్రాచల క్షేత్రంపై ఉన్న వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

శ్రీరాముని పేరు, గోత్రం మార్చేశారని ఆలయ పూజారులపై కొన్నేళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి.

భద్రాచలం దేవస్థానానికి ప్రభుత్వపరంగా ఉన్న పేరు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. అయితే ఇప్పుడు అక్కడి రాముడి పేరు రామచంద్ర స్వామి కాకుండా రామనారాయణ స్వామి అని మార్చారన్నది ప్రధాన ఆరోపణ.

అంటే ప్రభుత్వ రికార్డులు, బోర్డుల్లో కాదు.. ప్రతిష్ఠాత్మక శ్రీరామ నవమి కల్యాణంలో మార్చేశారని సీనియర్ పాత్రికేయులు వనం జ్వాలా నరసింహా రావు ఆరోపణ. ఇదే అంశంపై మరో ముగ్గురు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు.

అసలు భద్రాచలానికి చెందిన స్థానికులు, కొందరు పండితులు చేస్తున్న ఆరోపణలు ఏంటి? రాముడి పేరు, గోత్రం నిజంగానే మార్చారా? ఏంటీ వివాదం?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రాముడి కల్యాణంలో గోత్రం చెప్పేటప్పుడు వశిష్ఠ గోత్రం కాకుండా అచ్యుత గోత్రం చెబుతున్నారనీ, అలాగే సీతాదేవి పేరు, గౌతమస గోత్రాలను కూడా సీతామహాలక్ష్మి, సౌభాగ్య గోత్రంగా చెబుతున్నారని ఆరోపణ.

ఈ ఆరోపణలను ఆలయ అర్చకులు ఖండిస్తున్నారు. అయితే ఈ వివాదం కోర్టుకు చేరింది.

ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది.

గోత్రం, ప్రవర అంటే

ఫొటో సోర్స్, Getty Images

అసలేంటీ గోత్రం, ప్రవర?

హిందూ మతంలో పూజలు చేసే సమయంలో గోత్రం, ప్రవరలను చెబుతారు.

గోత్రం అంటే సాధారణంగా వంశ మూల పురుషుడి పేరు. కొన్ని సందర్భాల్లో వంశ మూల గురువు పేరు కూడా కావచ్చు. తమ వంశం ఫలానా వారితో ప్రారంభమైందని చెప్పడానికి ఫలానా గోత్రం వాళ్లం అని చెబుతారు.

ప్రవర అంటే ఆ వంశ మూల పురుషుడి తరువాత, తన తండ్రి, తాత వరకూ మధ్యలోని ముఖ్యమైన వ్యక్తుల పేర్లు వరుసగా చెబుతారు. అంటే ఫలానా వంశంలో పుట్టిన లేదా ఫలానా గురువు శిష్యులైన… అంటూ మధ్యలో ముఖ్యుల పేర్లు చెబుతూ పరంపరగా, వారి ముని మనవడు, మనవడు, కొడుకు లేదా కూతురు అయిన నేను (తన పేరు) అని ప్రవర చెప్పుకుంటారు.

ఈ సంప్రదాయం బ్రాహ్మణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తమను ఎదుటివారికి పరిచయం చేసుకోవడానికి తాతముత్తాతల పేర్లతో ప్రవర చెబుతారు. క్షత్రియులు వంటి వైదిక సంప్రదాయాలు ఆచరించే కులాల్లో కూడా ప్రవర కనిపిస్తుంది కానీ, అంత ముఖ్యమైనది కాదు.

అలాగే రాముడు క్షత్రియుడు అని హిందువుల విశ్వాసం. అయితే రాముడు దేవుడి కాబట్టి, దేవుళ్లకి కూడా కళ్యాణాల్లో, ప్రవర చెప్పే సంప్రదాయం ఉంది కాబట్టి రాముని ప్రవర ఇప్పుడు చర్చ అయింది.

అయితే బ్రాహ్మణులకు తప్ప మిగిలిన కులాల వారి గోత్రాలు రకరకాలుగా మారాయి. బ్రాహ్మణులకు వంశ మూల పురుషులగా మహర్షుల పేర్లు ఉంటుంటాయి. వశిష్ఠ, గౌతమస, ఆత్రేయస.. ఇలా రుషుల పేర్లే గోత్రాలుగా మారతాయి. మొత్తంగా ఈ గోత్రాలు ప్రస్తుతం బ్రాహ్మణులకు, కొన్ని సందర్భాల్లో క్షత్రియులకు స్పష్టంగా ఉండగా, మిగతా కులాల విషయంలో అస్పష్టత, వివిధ రకాల వాదనలు, సిద్ధాంతాలు ఉన్నాయి.

సాధారణంగా హిందువుల పెళ్లిళ్లు వైదిక సంప్రదాయంలో జరిగేటప్పుడు గోత్రం చెబుతారు. ఒకవేళ గోత్రం కానీ, ప్రవర కానీ తెలియకపోతే, పురోహితులు అబ్బాయి, అమ్మాయి వైపు అటుమూడు తరాలు, ఇటు మూడు తరాలు.. అంటే తండ్రి, తాత, కొన్నిసార్లు ముత్తాత పేర్లు చెబుతుంటారు. హిందువులు ఆలయాల్లో పూజలు చేసే సమయంలో ఈ గోత్రం చెప్పుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో గోత్రం బదులు నక్షత్రం వాడే అలవాటు కూడా ఉంది.

భద్రాచలం గుడి

మనుషుల్లాగా దేవుడికి కూడా గోత్రం, ప్రవర ఉంటాయా?

దేవుడికి పెళ్లి చేస్తే లోకానికి మంచిదని హిందువుల విశ్వాసం. అందుకే ఉత్సవ విగ్రహాలకు కల్యాణం చేస్తారు. ఆ సందర్భంలో దేవుడికి కూడా గోత్రం, ప్రవర చెప్పే సంప్రదాయం ఉంది.

అయితే గోత్రం అందరు దేవుళ్లకూ ఒకలా ఉండదు. విష్ణువు, శివుడు, లలితా పరాభట్టారిక వంటి ముఖ్యదేవతలు హిందూమత విశ్వాసం ప్రకారం తల్లిదండ్రులు ఉండరు. వారు సృష్టికర్తలు కాబట్టి ఆ దేవతల పేరిట గోత్రం, ప్రవర చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ దేవుడు లేదా దేవత పేరే చెబుతారు.

అంటే విష్ణువు ప్రవరలో అచ్యుత గోత్రం, ఆదినారాయణ, వాసుదేవ వంశీకుడు అనే చెబుతారు. ఆదినారాయణుడు, వాసుదేవుడు కూడా విష్ణువే. అదే సమయంలో దేవుడు లేదా దేవత స్వరూపం మారినప్పుడు వారి గోత్రం, ప్రవర కూడా మారుతుంది.

ఉదాహరణకు విష్ణువు స్వయంగా భూమిపై మానవ రూపంలో రామావతారం ఎత్తాడని హిందువుల విశ్వాసం. కాబట్టి రాముడి కల్యాణం సమయంలో విష్ణువు గోత్రం కాకుండా రాముడి గోత్రం, రాముడి ప్రవర చెబుతారు. అంటే రాముడి వంశ గురువైన వశిష్ఠుని పేరుతో వశిష్ఠ గోత్రం చెప్పి, రాముడి తాత అజ మహారాజు, తండ్రి దశరథ మహారాజు ప్రవర చెబుతారు.

అలాగే సీతాదేవికి హ్రస్వరోమ మహారాజు మనవరాలు, జనక మహారాజు కూతురు అని చెబుతారు. ఆయా గుళ్లలోని దేవతల స్వరూపం, అవతారాన్ని బట్టి ఈ గోత్రం, ప్రవర చెప్పే సంప్రదాయం హిందువుల్లో ఉంది.

భద్రాచలం గుడి

భద్రాచలంలో వివాదం ఇదే!

భద్రాచలంలో రాముడి పేరును రామచంద్రుడు, గోత్రం వశిష్ఠ, ప్రవర అజ-దశరథగా ఉండాలని చెబుతున్నారు వనం జ్వాలా నరసింహారావు. కానీ పేరును రామనారాయణ అని, గోత్రం అచ్యుత అని, ప్రవరను ఆదినారాయణ-వాసుదేవ అని మార్చేశారన్నది ఆయన ఆరోపణ.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత పాత్రికేయుడు జ్వాలా నరసింహారావు, మరికొందరు కొంత కాలంగా దీనిపై ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది.

ఈ అంశాన్ని బీబీసీ స్వయంగా పరిశీలించినప్పుడు 2012 తరువాత దొరికిన వీడియోల్లో గోత్రం అచ్యుత అని వాడారు. 2012కి ముందు కల్యాణాల్లో వేరే గోత్రం చెప్పారా లేదా అన్నది బీబీసీ స్వతంత్రంగా పరిశీలించలేదు. అలాగే చాలా కల్యాణాల్లో పేరు రామానారాయణ అని చెప్పి, 2020లో మాత్రం రామచంద్ర అని చెప్పారు.

2017 ఏప్రిల్ 5న జరిగిన కల్యాణంలో అచ్యుత గోత్రం, శ్రీనారాయణ స్వామినే వరాయ అన్నారు. అంటే రామ అనే పేరు కూడా లేకుండా నేరుగా నారాయణ అన్నారు. సీతాదేవి పేరు సీతామహాలక్ష్మీ అన్నారు.

2018 మార్చి 26న జరిగిన కల్యాణంలో అచ్యుత గోత్రం, భద్రాచల శ్రీరామనారాయణ స్వామి వరుడు, సౌభాగ్య గోత్రం, సీతా మహాలక్ష్మీ అన్నారు.

2020 ఏప్రిల్ 2న జరిగిన కల్యాణంలో మాత్రం అచ్యుత గోత్రం శ్రీమన్నారాయణ స్వరూపం, శ్రీరామచంద్ర స్వామి వరాయ అనీ, సౌభాగ్య గోత్రం, లక్ష్మీ స్వరూపం, సీతాదేవి కన్యా అన్నారు.

2023 మార్చి 30న జరిగిన కల్యాణంలో అచ్యుత గోత్రం, భద్రాచల శ్రీరామనారాయణ స్వామి వరాయ అనీ, సౌభాగ్య గోత్రం సీతా మహాలక్ష్మీ కన్యా అని చదివారు.

భద్రాచంలో శ్రీరామనవమి ఉత్సవాలు

ఫొటో సోర్స్, @IPRTelangana

‘క్షత్రియుడైన రాముణ్ని బ్రాహ్మణుడిగా మార్చారు’

”నాకు ఇప్పుడు 78 సంవత్సరాలు. నాది ఉమ్మడి ఖమ్మం జిల్లానే. రామదాసు సొంతూరైన నేలకొండపల్లే మా మేనమామ గారి ఊరు. మేం తరతరాలుగా చూసినట్టుగా కాకుండా, ఇప్పుడు, రామచంద్ర స్వామి పేరును రామనారాయణ అని, సీతను దేవి బదులు సీతా మహాలక్ష్మి అని, వారి ప్రవర, గోత్రాలు చెబుతూ వివాహం చేయడం సమంజసమా కాదా అని మహా పండితులైన అర్చకులు ఆలోచించుకోవాలి.

రామనారాయణ పేరుతో దైవం ఉన్నట్టు ఎక్కడా ఎవరికీ తెలియదు. ‘అచ్యుత గోత్రోద్భవాయా’ అని రామనారాయణ స్వామిని శ్రీరామచంద్రుడి స్థానంలోకి తెచ్చారు. క్షత్రియుడైన శ్రీరాముడిని ‘అచ్యుత గోత్రం’తో క్షణంలో బ్రాహ్మణుడిగా మార్చివేశారు. సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని తెచ్చి, ప్రవర మార్చారు. సౌభాగ్య గోత్రం ఇచ్చేశారు. శ్రీరాముడి వశిష్ఠ, సీతాదేవి గౌతమస గోత్రాలు ఎలా, ఎందుకు, ఎక్కడికి మాయమైపోయాయో తెలియదు” అని బీబీసీతో అన్నారు జ్వాలా నరసింహా రావు.

”బహుశా 2012 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరూ పట్టించుకోని రోజుల్లో ఇది మార్చి ఉండవచ్చు. మాలాంటి వాళ్ల దృష్టికి రావడానికి మూడు, నాలుగేళ్లు పట్టింది. 2016 నుంచి నేను ఈ అంశంపై ఆర్టికల్స్ రాశాను. తెలిసిన పెద్ద వారికి చెబుతున్నాను.

ఈ శుక్రవారం (మార్చి 29) నాడు జరిగే కల్యాణంలోనైనా అర్చక మహాశయులు రాముడు, సీత గోత్రాలు వాడాలి. ఒకవేళ వారికి రామనారాయణ, మహాలక్ష్మి పేర్లతో వివాహం చేయాలనుకుంటే చక్కగా వేరే మూర్తులతో, వేరే కల్యాణం చేసుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. రామనారాయణుడు దేవుడు కావచ్చు. మేం కాదనడం లేదు. వారికి వేరే దేవాలయం కట్టండి. అంగరంగ వైభవంగా, ఇంతకన్నా ఎక్కువగా చేయమనండి. ఇది మాత్రం సీతారాముల పెళ్లి. సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉన్న ఆలయంలో ఉండేది సీతారాముడు” అని స్పష్టం చేశారు నరసింహా రావు.

శ్రీరామ చంద్రుల కల్యాణం

ఫొటో సోర్స్, Youtube/Bhaktione screengrab

‘రాముడికి వశిష్ఠ గోత్రం చెప్పినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా’

అర్చకులకు తాము తప్పు చేస్తున్నామని తెలిసినా వెనక్కి వెళ్లడానికి సంకోచిస్తున్నారంటున్నారు జ్వాలా నరసింహా రావు.

”ఒక్కోసారి మనం తెలిసో తెలియకో ఒక నిర్ణయం తీసుకున్నా… తర్వాత ఆ నిర్ణయం తప్పని తెలిసినా కూడా ముందుకు సాగుతున్నాం. అంటే వెనక్కుపోయే ధైర్యం లేక కావచ్చు, పట్టుదలకావచ్చు. ఇప్పుడు వెనక్కి పోతే ఇన్నాళ్లూ చేసిన దాన్ని విమర్శిస్తారన్న ఆందోళన, భయం కూడా కావచ్చు” అన్నారు నరసింహా రావు.

అయితే ఈ వాదనను తిరస్కరిస్తున్నారు భద్రాచలం దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు అమరవాది మురళీకృష్ణమాచార్యులు.

”నిత్య కల్యాణ వ్యవస్థ భద్రాచల దేవస్థానంలో ఏర్పడిన నాటి నుంచి అచ్యుత, సౌభాగ్య గోత్రాలు కాకుండా ఎక్కడైనా వశిష్ఠ గోత్రం చెప్పినట్టు చూపిస్తే నేను రాజీనామా చేసి వెళ్లిపోతా. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. అసలు ఇక్కడ వశిష్ఠ గోత్రం చెప్పకూడదు. ఇక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు.

త్రేతాయుగంలో రామావతారం ఎత్తిన శ్రీమన్నారాయణుడు, రామావతార సమయంలో ఒకసారి భద్రాచలం వచ్చాడు. అవతారం పూర్తయ్యాక వైకుంఠానికి వెళ్లిపోయాడు. భద్రుడుకి దర్శనం ఇవ్వడానికి మళ్లీ వైకుంఠం నుంచి వచ్చాడు. అప్పుడు చతుర్భుజాలతో వచ్చాడు. రాముడు ఎక్కడైనా రెండు భుజాలతో ఉంటాడు. భద్రాచలంలోనే చతుర్భుజాలతో ఉంటాడు. విష్ణువు శంఖుచక్రాలు, రాముని ధనుర్బాణాలు కలిపి ఉంటాయి” అని వివరించారు మురళీకృష్ణమాచార్యులు.

భద్రాచలం

ఫొటో సోర్స్, Getty Images

‘శ్రీ వైష్ణవ ఆలయాన్ని స్మార్త ఆలయంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ గొడవ’

ఇక్కడ రామునికి నాలుగు పేర్లు ఉన్నాయని చెప్పారాయన.

“ఇక్కడ ఉండే రాముడికి నాలుగు పేర్లు ఉన్నాయి. భద్రుడి వల్ల వచ్చాడు కాబట్టి భద్రాద్రి రాముడు, వైకుంఠం నుంచి వచ్చాడు కాబట్టి వైకుంఠ రాముడు, ఇక్కడి మూర్తుల వరుస-ఏర్పాటును బట్టి ఓంకార రాముడు, శంఖ చక్ర ధనుర్బాణాలు ఉండటం వల్ల రామనారాయణుడు అంటారు. లక్ష్మీ దేవికి ఉన్నట్టు రెండు చేతుల్లో కమలాలు ఉన్న సీతను సీతామహాలక్ష్మీ అంటారు. అలా చూసినా రామనారాయణుడు చాలా గొప్ప నామం.

నారాయణుడిగా అంటే అర్చామూర్తిగా వెలిశాడు. అర్చామూర్తిగా వెలిసిన వ్యక్తికి ఆగమ శాస్త్ర ప్రకారం అచ్యుత గోత్రమే చెప్పాలి. వశిష్ఠుడిగా ఆయన కుల గురువును తీసుకుంటే వశిష్ఠ గోత్రం చెప్తారు. ఒకవేళ ఆయన్ని సూర్యవంశ పురుషుడిగా తీసుకుంటే కాశ్యపస గోత్రం చెప్పొచ్చు.

కానీ ఇక్కడ భద్రాచలంలో మాత్రం 2012 ముందు, తర్వాత అని కాదు.. 1950లలో అయినా.. ఎప్పుడైనా సరే… 1919, 1935 నాటి పుస్తకాలలో, జీర్ణోద్ధరణ సమయంలో, పాత రేడియో ప్రసంగాల్లో అన్నిచోట్లా అచ్యుత, సౌభాగ్య గోత్రాలే ఉన్నాయి” అన్నారాయన.

“ఈ దేవుడు రాముడు కాదు అనడానికి ఎవరికీ అర్హత లేదు. నారాయణుడే రాముడు, రాముడే నారాయణుడు. నారాయణుడిని రాముడిని వేరుగా చూస్తే మనం ఏం చేయలేం. ఇక్కడ పూజారి కుటుంబాల్లో నేను పదో తరం వాడిని. ఇంత ప్రతిష్టాత్మకమైన క్షేత్రంలో అంత అడ్డుగోలుగా తప్పు చేస్తామా? ఇప్పుడు గొడవ చేసే వాళ్లందరి ఉద్దేశం ఈ శ్రీ వైష్ణవ ఆలయాన్ని స్మార్త ఆలయం చేయాలని. ఆగమంతో పాటు క్షేత్ర సంప్రదాయం ఒకటి ఉంటుంది. అర్చకులకే దానిపై పట్టు ఉంటుంది. చరిత్రకి, ఆగమానికి, సంప్రదాయాలకి, అన్నిటికి ఒక కట్టుబాటు ఉంటుంది. ఆగమశాస్త్రాల విషయంలో కోర్టు కంటే కూడా అక్కడ స్థానికంగా ఉండే అనువంశక అర్చకులది ఎక్కువపాత్ర” అన్నారు మురళీకృష్ణమాచార్యులు.

అచ్యుత గోత్రం వాడకంపై అర్చకుల వివరణ

అచ్యుత గోత్రం ఎందుకు వాడుతున్నారో 2012, 2019 కల్యాణాల సమయంలో వివరణ ఇచ్చారు అర్చకులు.

“ఈ ప్రవరల్లో గొప్ప విశేషం ఉన్నది. భద్రాచల క్షేత్రంలో ఉండే శ్రీ రామచంద్రమూర్తి… రామనారాయణుడు, వైకుంఠ రాముడు. అమ్మవారు సీతామహాలక్ష్మి. సహజంగా రామచంద్రమూర్తిది వశిష్ఠ గోత్రం, సీతమ్మది గౌతమ గోత్రం. కానీ భద్రాచలంలో ఉండే శ్రీ సీతారామచంద్ర ప్రభువు గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారిది సౌభాగ్య గోత్రం” అని 2012లో కల్యాణ వేదికపై నుంచి చెప్పారు అర్చకులు.

“బయట ఉండే గోత్రనామాలకి, భద్రాచలంలో ఉండే గోత్రనామాలకి వ్యత్యాసం ఉంది. భద్రాచలంలో రాముడు ఒక అర్చామూర్తి. ఆయన దశరథ మహారాజు కుమారుడుగా చెబుతారు కానీ, ఆయన అర్చామూర్తి. వైకుంఠం నుంచి నేరుగా వచ్చారు. ఒక అర్చామూర్తికి తండ్రి ఉండే అవకాశం లేదు” అని 2019లో కల్యాణ వేదికపై వివరించారు భద్రాచలం అర్చకులు. పరబ్రహ్మమైన భగవంతుడే సృష్టికర్త కాబట్టి వారికి వారే తండ్రి అవుతారు తప్ప, ఋషి గోత్రాలు రావని అర్చకులు వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది.

శ్రీరామ నవమి

ఫొటో సోర్స్, @IPRTelangana

‘రామదాసు ఎప్పుడూ రామనారాయణ అనే పదం వాడలేదే..’

ఈ వివాదంపై జమలాపురం శ్రీనివాస్, కంచర్ల వెంకటరమణ, తేజస్విని శర్మ అనే ముగ్గురు పిటిషనర్లు వేర్వేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా దేవాదాయ శాఖతో పాటు, అర్చకులు కూడా ఇంప్లీడ్ అయ్యారు.

మార్చి 26న దీనిపై విచారణ జరగాల్సి ఉండగా, అర్చకుల తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ కేసును మార్చి 30కి వాయిదా వేసినట్టు జమలాపురం శ్రీనివాస్ బీబీసీకి చెప్పారు. దీంతో ఈ కేసు విచారణకు ముందే ఈ ఏడాది కల్యాణం పూర్తి కానుంది.

“రామదాసు అంత పెద్ద శతకం, కీర్తనలు రాసినా ఎక్కడా రామనారాయణ అనే పదం ఎందుకు వాడలేదు? పైగా రామదాసు ‘దాశరథీ’ అనే సంబోధించారు. ‘వామాంకస్థిత’ శ్లోకాన్ని అర్చకుల తరపు న్యాయవాది కోర్టులో చెప్పారు. ఆ శ్లోకంలో కూడా కోదండం… అంటే రాముని విల్లు గురించి ఉంది కానీ, శార్గం.. అంటే విష్ణువు విల్లు గురించి లేదు. దీనిపై 3 నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ కమిటీ వేసి 21 నెలలైంది. కానీ ఇప్పటి వరకూ ఆ నివేదిక రాలేదు. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశాం.

2006-09 మధ్య వశిష్ఠ గోత్రం వాడారని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన రికార్డులు నా దగ్గర ఉన్నాయి. రామ రమేశ అనే పదం ఉంది కాబట్టి రామనారాయణ అంటున్నారు. అది సరైన వాదన కాదు. అసలు సీతాదేవి లక్ష్మి అయితే, మళ్లీ ఉపాలయంగా లక్ష్మీ దేవి గుడి ఎందుకు కట్టారు? అచ్యుత గోత్రం రామనారాయణ అయితే శ్రీదేవి, భూదేవిలతో కదా వివాహం చేయాలి?” అని తన పిటిషన్ వేయటానికి గల కారణాలు బీబీసీకి చెప్పారు జమలాపురం శ్రీనివాస్.

శ్రీవైష్ణవ దేవాలయమైన భద్రాచలాన్ని స్మార్త దేవాలయంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణపై ఆయన స్పందించారు.

“రామనారాయణుడు అంటే వైష్ణవమా? రామచంద్రుడు వైష్ణవం కాదా? అక్కడ పాంచరాత్ర పూజలు ఆపమనడం లేదు. స్మార్త పూజలు చేస్తాం అనడం లేదు. ఇందులో మా వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదు” అన్నారు శ్రీనివాస్.

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి కొండా సురేఖ

ఫొటో సోర్స్, Youtube/Bhaktione screengrab

ఏంటీ స్మార్తం, శ్రీవైష్ణవం?

హిందూ మతంలోని అనేక శాఖల్లో స్మార్త, శ్రీవైష్ణవ శాఖలు కూడా ఉన్నాయి. ప్రధానంగా అద్వైతాన్ని విశ్వసించే వారు స్మార్తులుగా ఉన్నారు. విశిష్టాద్వైతాన్ని విశ్వసించే వారు శ్రీవైష్ణవులుగా ఉన్నారు.

శ్రీ వైష్ణవులు కేవలం విష్ణువును మాత్రమే ఆరాధిస్తారు. స్మార్తులు ఒకరి కంటే ఎక్కువ మంది దేవతలను ఆరాధిస్తారు.

ప్రధానంగా షణ్మతాలుగా పిలిచే శివుడు, విష్ణువు, శక్తి, వినాయకుడు, సూర్యుడు, కుమారస్వామిని స్మార్తులు ఆరాధిస్తారు.

స్మార్తులు శివుడు-విష్ణువు సమానం లేదా ఒకరే అని నమ్ముతారు. శ్రీవైష్ణవులు దాన్ని ఒప్పుకోరు.

అలాగే హిందూ దేవాలయాల నిర్వహణ నియమాలను ఆగమ శాస్త్రాలు అంటారు. వేర్వేరు శాఖలకు వేర్వేరు ఆగమాలు ఉంటాయి.

తాజా వివాదంలో రామనారాయణ పేరు మార్పును సమర్థించే వారు ఎక్కువగా శ్రీవైష్ణవులు కాగా, రామచంద్ర పేరు ఉండాలని కోరే వారు ఎక్కువగా స్మార్తులు ఉన్నారు.

దీనిపై స్పందన కోసం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది. అయితే వ్యవహారం కోర్టులో ఉన్నందున, కోర్టు తీర్పు ప్రకారం నడచుకుంటామని మంత్రి కార్యాలయం స్పందించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)