Home జాతీయ national telgu శ్రీకూర్మం ఆలయం: ‘విష్ణుమూర్తి’ ప్రతిరూపంగా భక్తులు భావించే నక్షత్ర తాబేళ్లు ఎలా చనిపోయాయి?

శ్రీకూర్మం ఆలయం: ‘విష్ణుమూర్తి’ ప్రతిరూపంగా భక్తులు భావించే నక్షత్ర తాబేళ్లు ఎలా చనిపోయాయి?

4
0

SOURCE :- BBC NEWS

శ్రీకూర్మం ఆలయంలో తాబేలు

‘కూర్మావతారంలో విష్ణుమూర్తి’ దర్శనమిచ్చే ఏకైక ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. ఈ ఆలయ ప్రాంగణంలో కనిపించే నక్షత్ర తాబేళ్లను ‘విష్ణుమూర్తి’ ప్రతిరూపంగా భక్తులు భావిస్తుంటారు.

అయితే ఇటీవల కొన్ని నక్షత్ర తాబేళ్లు చనిపోతే ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆలయ కోనేరు సమీపంలో ఎవరో తగులబెట్టేశారు. తరువాత ఈ విషయాన్ని కొందరు భక్తులు గుర్తించారు. దీంతో ఆలయాధికారులు ఈ తాబేళ్లు ఎలా చనిపోయాయనే కారణాలు వెతికే పనిలోపడ్డారు.

ఈ నేపథ్యంలో శ్రీకూర్మం ఆలయ పరిసరాల్లో ఇప్పుడు భక్తులతో పాటు అధికారులు, వైద్యులు, మీడియా, అటవీశాఖ సిబ్బంది కూడా కనిపిస్తున్నారు.

ఇప్పటివరకైతే తాబేళ్ల మరణాలకు కారణాలు తెలియలేదు.

ఏప్రిల్ 22వ తేదీన బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు కొందరు భక్తులు, స్థానికులు నక్షత్ర తాబేళ్లను కాల్చిన చోటును చూసేందుకు వచ్చారు. వాటిని కాల్చిన చోట.. తాబేళ్ల డిప్పలు, చర్మం ఆనవాళ్లు కనిపించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
శ్రీకూర్మం ఆలయం

అసలేం జరిగిందంటే?

శ్రీకూర్మం ఆలయం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే దారి పొడవునా తాబేళ్లు, ‘క్షీరసాగరమధన ఘట్టాన్ని’ గుర్తుచేసే విగ్రహాలు, కనిపిస్తూ ఉంటాయి.

ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే భక్తులు విష్ణుమూర్తి ప్రతిరూపంగా భావించే నక్షత్ర తాబేళ్లే ముందుగా తారసపడతాయి.

శ్రీకూర్మం ఆలయంలో ఈ తాబేళ్ల కోసం ప్రత్యేకంగా పార్కు ఉంది. ఇందులో రెండు వందలకుపైగా తాబేళ్లు ఉన్నాయని అటవీశాఖ చెబుతోంది. వీటిని సంరక్షించే బాధ్యత శ్రీకాకుళానికి చెందిన గ్రీన్ మెర్సీ అనే సంస్థకు అప్పగించారు.

ఏప్రిల్ 21న కొన్ని నక్షత్ర తాబేళ్లను కాల్చి పడేసిన ఆనవాళ్లు ఆలయ ప్రహరిగోడ, కోనేరుకు మధ్య గల ప్రదేశంలో కనిపించాయి. దీంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది.

నక్షత్ర తాబేళ్లు

గ్రీన్ మెర్సీ సంస్థ నక్షత్ర తాబేళ్ల పార్కు నిర్వహణ, తాబేళ్ల సంరక్షణను పట్టించుకోకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు.

అయితే తాబేళ్ల మరణాలకు తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని గ్రీన్ మెర్సీ సంస్థ అధ్యక్షుడు రమణమూర్తి అన్నారు.

మరోవైపు నక్షత్ర తాబేళ్ల మరణాలకు కారణాలను తేల్చాలంటూ విశ్వహిందు పరిషత్ అందోళన‌కు దిగింది.

తాబేలు

ఆలయంలో ఎన్ని తాబేళ్లున్నాయి?

శ్రీకూర్మం ఆలయంలోకి ప్రవేశించి వంద మీటర్లు లోపలకు రాగానే ఎడమవైపు తాబేళ్ల పార్కు కనిపిస్తుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ చాలా సమయం గడుపుతుంటారు.

తాబేళ్లను పిల్లలకు చూపిస్తూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటారు.

ఒకే చోట గుంపులు, గుంపులుగా తాబేళ్లు కనిపిస్తుంటాయి.

ఈ పార్కులో ఎన్ని తాబేళ్లున్నాయనే విషయంపై గ్రీన్ మెర్సీ అధ్యక్షుడు రమణమూర్తితో పాటు శ్రీకాకుళం జిల్లా అటవీశాఖాధికారి ఎస్. వెంకటేష్‌తో బీబీసీ మాట్లాడింది.

తాబేళ్ల పార్కు

“నేను ఈ నక్షత్ర తాబేళ్ల సంరక్షణ బాధ్యతలను 12 ఏళ్లుగా చూస్తున్నాను. లెక్క ప్రకారం 200 ఉండాలి. కానీ, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. చుట్టు పక్కల పొల్లాల్లో కూడా తాబేళ్లు దొరుతుంటాయి. వాటిని భక్తులు ఇక్కడికి తెచ్చిస్తుంటారు” అని వెంకటేష్ అన్నారు.

”తాబేళ్లు మరణించాయనే సమాచారం రాగానే ఘటనా ప్రదేశానికి వెళ్లాం, అక్కడ కాలిపోయిన తాబేళ్లు కనిపించాయి. వాటిని సేకరించి 24 తాబేళ్లను పోస్టుమార్టంకి పంపించాం. అలాగే తాబేళ్ల పార్కులో ఉన్న వాటిని లెక్క కడితే 212 వరకు వచ్చాయి” అని వెంకటేష్ చెప్పారు.

వెటర్నరీ వైద్యులు

శాంపిల్స్‌ను సేకరించిన వైద్యబృందం

విజయవాడ నుంచి వచ్చిన వెటర్నరీ వైద్య బృందం నక్షత్ర తాబేళ్ల శాంపిల్స్ సేకరించారు.

వైద్య బృందాన్ని పర్యవేక్షిస్తున్న విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. ఉషారాణితో బీబీసీ మాట్లాడింది.

“వీటి మరణాలకు కారణాలు తెలియలేదు. సంరక్షణ కేంద్రం నిర్వహకులు కూడా ఒక కారణం కావొచ్చు. ఎందుకంటే ఇక్కడ నిర్వహణా పరిస్థితులు అంత బాగాలేవు. చెత్తా చెదారం ఉంది, ఎక్కడపడితే అక్కడ ఆహారంవేశారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చి ఉండొచ్చు. ఇది ఇతర తాబేళ్లకు సోకే ప్రమాదం ఉంది” అని ఉషారాణి చెప్పారు.

ఈ విషయంపై గ్రీన్ మెర్సీ నిర్వహకులు రమణమూర్తి మాట్లాడుతూ…”వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని నిబంధనలన్నీ పాటిస్తున్నాం. వాటికి ఇచ్చే డైట్, మందులు వన్యప్రాణి విభాగం సలహా, సూచనల మేరకే ఇస్తున్నాం” అని బీబీసీతో చెప్పారు.

తాబేళ్లు తినేవన్ని ఆకుకూరలు, కాయగూరలేనని, కాకపోతే తాజావి కాకుండా కుళ్లినవి పెట్టడం, విపరీతమైన ఎండల కారణంగానూ చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నామని స్థానికుడు గోపీ బీబీసీతో చెప్పారు.

విశ్వహిందూ పరిషత్

భక్తుల్లో ఆందోళన: విశ్వ హిందు పరిషత్

భక్తులు ఎంతో పవిత్రంగా భావించే నక్షత్ర తాబేళ్లను కాల్చివేయడం అందోళనకు గురి చేసిందని విశ్వహిందు పరిషత్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు లోకనాధం ఆనందరావు అన్నారు.

“నక్షత్ర తాబేళ్లు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. భక్తులు వాటిని ‘ప్రత్యక్ష దైవం’గా భావిస్తారు. తాబేళ్లు చనిపోతే వాటికి కారణాలు చెప్పలేకపోతున్నారు. పైగా పవిత్రంగా భావించే నక్షత్ర తాబేళ్లను చెత్తలో కలిపి కాల్చివేయడం దారుణం” అని ఆనందరావు బీబీసీతో అన్నారు.

వారం రోజుల్లో రిపోర్టు వస్తుందని విజయవాడ వెటర్నరీ వైద్య బృందం చెప్పినట్టు లోకనాధం తెలిపారు. రిపోర్టులో సరైన కారణం తెలుస్తుందనుకుంటున్నాం, అప్పుడైనా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు.

“తాబేళ్లను చెత్తలో వేసి కాల్చేయడం, అటవీశాఖకు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మేం ఎంతో పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రంలోని తాబేళ్లను అలా కాల్చి పడేయడమేంటి?” అని శ్రీకూర్మానికి చెందిన స్థానికుడు గోదావరి బీబీసీతో అన్నారు.

తాబేలు పార్కు

‘నిర్వహణ అటవీశాఖకు అప్పగించమన్నాం’

“వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం నక్షత్ర తాబేళ్లు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. అందుకే వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. దాంతో వాటిని అప్పగించాలని అడిగాం. కానీ, మతపరమైన విశ్వాసం మేరకు వాటిని అక్కడే ఉంచాలంటూ కోర్టుని ఆశ్రయించారు. అప్పటి నుంచి వీటి సంరక్షణను గ్రీన్ మెర్సీ సంస్థే చూస్తోంది” అని జిల్లా అటవీశాఖాధికారి వెంకటేష్ బీబీసీతో చెప్పారు.

“24 తాబేళ్లను కాల్చేశారు. ఇవ్వన్నీ ఒకేసారి చనిపోలేదు. 9 నుంచి 12 నెలల మధ్య కాలంలో చనిపోయినట్లు రిపోర్టు వచ్చింది” అని వెంకటేష్ చెప్పారు.

తాబేళ్లను కాల్చివేయడం వల్ల వాటి డిప్ప తప్ప పోస్టుమార్టానికి అవసరమైన అవయవాలు దొరక్కపోవడంతో వైద్యులు అవి ఎందుకు చనిపోయాయో సరైన కారణాలు చెప్పలేకపోతున్నారని ఆయన అన్నారు.

కూర్మనాధ స్వామి ఆలయం

ఎన్ని చనిపోయాయి?

ఆలయంలోని నక్షత్ర తాబేళ్ల మరణంపై శ్రీకాకుళం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్. సుజాతని బీబీసీ ప్రశ్నించింది. రెండు తాబేళ్లు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, కారణాలు తెలుసుకొనే పనిలో ఉన్నామని ఆమె చెప్పారు.

ఇదిలాఉండగా నక్షత్ర తాబేళ్లు ఏడాదిలో 24 చనిపోయాయని అటవీశాఖ చెబుతుంటే, తాబేళ్ల పార్కు నిర్వహకులు రమణమూర్తి మాత్రం ఆరు నుంచి ఏడు చనిపోయి ఉంటాయని బీబీసీతో చెప్పారు.

తాబేళ్ల మరణాల సంఖ్య, సమయం విషయాల్లో తేడాలున్నా.. మరణాలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ అటు అటవీ, దేవాదాయశాఖలు, ఇటు తాబేళ్ల పార్కు నిర్వాహకులు కానీ అవి ఎందుకు చనిపోయాయో కారణాలు చెప్పలేకపోతున్నారు.

విజయవాడ వెటర్నరీ వైద్య బృందం రిపోర్టు కోసమే అంతా ఎదురు చూస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)