Home జాతీయ national telgu వైభవ్ సూర్యవంశీ: చిన్నోడేగానీ, చిచ్చర పిడుగయ్యాడు…ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు..

వైభవ్ సూర్యవంశీ: చిన్నోడేగానీ, చిచ్చర పిడుగయ్యాడు…ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు..

4
0

SOURCE :- BBC NEWS

ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్, వైభవ్ సూర్యవంశీ

ఫొటో సోర్స్, Getty Images

ఆకాశమే హద్దుగా చెలరేగి ఆటడమంటే అదే. చేసిన సెంచరీలో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయంటే ఆ ఇన్నింగ్స్ ఎలా సాగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదంతా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆట గురించి.

సోమవారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌లో వైభవ్, జైస్వాల్‌లు పోటీ పడి సిక్సర్లు, ఫోర్లు కొడుతుంటే, సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్‌కు పండగే అయ్యింది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

పురుషుల టీ20ల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

తాను ఎదుర్కొన్న 35వ బంతిని సిక్స్‌గా మలిచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు వైభవ్.

2013లో పుణె వారియర్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున 30 బంతుల్లో సెంచరీ చేశాడు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్. ఇదే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ.

35 బంతుల్లో ఫాస్టెస్ట్ (అత్యంత వేగవంతమైన) సెంచరీని సాధించిన భారతీయ ఆటగాడిగా కూడా రికార్డ్ సృష్టించాడు సూర్యవంశీ.

ఈ టీనేజ్ ఎడమచేతి వాటం బ్యాటర్ ఏడు ఫోర్లు, 11 సిక్సర్లతో 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఔటయ్యాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వైభవ్ సూర్యవంశీ,ఐపీఎల్

ఫొటో సోర్స్, BCCI/IPL

ఈ ఏడాది మార్చికి వైభవ్‌కు 14 ఏళ్లు నిండాయి. గతేడాది వేలంలో 1.1 కోట్ల రూపాయలకు సంతకం చేసిన సూర్యవంశీ, ఏప్రిల్ ప్రారంభంలో ఐపీఎల్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తన మొదటి బంతికే సిక్స్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు.

సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం కోసం 210 పరుగుల లక్ష్యాన్ని తేలికగా సాధించండంలో అదే దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు వైభవ్.

మరో బ్యాటర్ యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు, సూర్యవంశీ, యశస్వి కలిసి 166 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా ఐదు ఓటములకు తెరపడింది. నాకౌట్ దశకు చేరుకోవాలనే ఆశలు సజీవంగా నిలుపుకుంది.

గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ 50 బంతుల్లో 84 పరుగులు, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ జట్టు ఓటమి పాలైంది. రన్ రేట్ పరంగా ఐపీఎల్ పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

వైభవ్ సూర్యవంశీ ఎవరు?

గత సంవత్సరం బిడ్డింగ్‌లో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

గత అక్టోబర్‌లో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 జట్లతో జరిగిన యూత్ టెస్ట్‌లో భారత అండర్-19 జట్ల తరపున ఆడి, 13 ఏళ్ల వయసులో 58 బంతుల్లో సెంచరీ సాధించి వార్తల్లో నిలిచాడు.

గత సంవత్సరం భారత అండర్-19 ఆసియా కప్ జట్టులో కూడా సూర్యవంశీ ఉన్నాడు. 44 సగటుతో 176 పరుగులు చేశాడు.

బిహార్ రాష్ట్రం తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. గతేడాది జనవరిలో 12 సంవత్సరాల వయసులో అరంగేట్రం చేశాడు వైభవ్.

బిహార్ తరపున ఐదు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 100 పరుగులు సాధించగా..అత్యధిక స్కోర్ 41.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)