SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Professor Dhanunjaya Rao
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 2025 నవంబర్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ (ఆర్‌ఈఎంపీ) పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ కారిడార్లను నెలకొల్పనున్నట్టు సీతారామన్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ రేర్ ఎర్త్ కారిడార్‌లు.. ఏం చేస్తారు.. వాటితో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనాలు ఏంటి.. పర్యావరణవేత్తలు.. మత్స్యకారుల వాదనలు ఏంటి?
కేంద్రం ప్రకటన ప్రకారం… రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ (ఆర్‌ఈఎంపీ) మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ కోసం నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఐదేళ్లలో రూ.6,450 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఈ మేరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( జీఎస్‌ఐ) 48.26 కోట్ల టన్నుల అరుదైన–భూమి ఖనిజ వనరులను ఇప్పటికే గుర్తించింది.
ఈక్రమంలో ఆర్‌ఈఎంపీకి అనుబంధంగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సముద్ర తీరప్రాంతంలో రేర్ ఎర్త్ కారిడార్‌లు ఏర్పాటు కానున్నాయి.
ఇందులో భాగంగా సముద్ర తీరప్రాంతంలో అరుదైన మూలకాలను(ఎలిమెంట్స్) గుర్తించి వెలికి తీయడం(తవ్వకాలు), ప్రాసెసింగ్ చేయడంతో పాటు పరిశోధనలు, తయారీని ప్రోత్సహిస్తారు.

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే..
”సముద్రతీరంలోని బీచ్‌లలోని ఇసుకలో ఎక్కువగా ఈ ఎలిమెంట్స్(మూలకాలు) లభ్యమవుతాయి. కొన్ని మూలకాలన్నీ కలిపితే ఖనిజం(మినరల్) ఏర్పడుతుంది. కొన్ని ఖనిజాలన్నీ కలిపితే రాయి ఏర్పడుతుంది. వీటి లభ్యత అరుదు కాబట్టే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఎక్కువ మట్టి మోతాదులో తక్కువగా లభ్యమవుతాయి” అని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జియాలజీ ప్రొఫెసర్ ఎ.యుగంధర్‌రావు బీబీసీతో చెప్పారు.
లాంథనమ్, సెరియమ్, ప్రాసియోడైమియమ్, నియోడైమియమ్, ప్రొమీథియమ్, సమరియమ్, యురోపియమ్, గడోలినియమ్, టెర్బియమ్, డైస్‌ప్రోసిమ్, హోల్మియమ్, ఎర్బియమ్, థులియమ్, యట్టర్‌బియమ్, లుటేటియమ్, స్కాన్‌డియమ్, ఎట్రియమ్.. ఇలా ఇండియాలోని బీచ్‌లలో 17 మూలకాలు లభ్యమవుతాయని ఆయన తెలిపారు.
ఇవి సముద్రం వద్దకు ఎలా చేరుకుంటాయంటే..
”మొదట ఇవి కొండల్లోని రాక్స్‌లో ఏర్పడతాయి. తుపానులు, వరదల సమయంలో శిథిలమై పర్వతాల నుంచి కొట్టుకొస్తూ.. నదుల మీదుగా.. చివరికి సముద్రం వద్దకు చేరుకుంటాయి. అలా వచ్చిన రేణువులు సముద్రపు తీరాల వద్ద నిలిచిపోతాయి. ఆ ఇసుకలో వివిధ మూలకాలన్నీ కలిసి మినరల్స్‌గా ఏర్పడతాయి. ఆ మినరల్స్ అన్నీ ఒకే చోట స్ట్రక్చర్‌లా ఉండవు. అందుకే ఒకే రాయిలో దొరకవు, వివిధరకాల మిశ్రమ రాళ్లలో ఉంటాయి. ఆ మినరల్స్‌కి ప్రత్యేకమైన భౌతిక, రసాయన లక్షణాలు ఉంటాయి” అని హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సుందర్‌రాజు బీబీసీకి తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహన మోటార్లు, విండ్ టర్బైన్ జనరేటర్లు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వ్యవస్థలు, రక్షణ పరికరాలు, ప్రెసిషన్ సెన్సార్లు వంటి అధునాతన ఇంజనీరింగ్ అనువర్తనాలకు ఈ ఎలిమెంట్స్, మినరల్స్ ఎంతో అవసరం.
అలాగే స్మార్ట్ ఫోన్ల చిప్‌ల తయారీలోనూ, బ్యాటరీలు, మాగ్నెట్స్. ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలోనూ వీటిని వినియోగిస్తారు. మిశ్రమలోహాల తయారీలోనూ ఇవి కీలకంగా ఉంటాయని చెప్పారు.
ఫొటో సోర్స్, Professor Dhanunjaya Rao
ఆ మూలకాలు వేరు చేయడం చాలా కష్టం
”వాస్తవానికి ఆ మూలకాలను, ఖనిజాలను వేరు చేయడం అంత సులువైన పని కాదు…చాలా సంక్లిష్టమైన ప్రాసెస్ ఉంటుంది. అందులోనూ వీటిలో అటామిక్ మినరల్స్ కూడా ఉంటాయి. ప్రత్యేకించి మోనోజైట్‌లో యురేనియం, థోరియం వంటివి ఉంటాయి. వాటిని ఎక్స్‌ట్రాక్ట్ చేస్తే చాలా ప్రమాదకరం. ప్రభుత్వ సంస్థలైతే అన్ని జాగ్రత్తలు తీసుకుని, వాటిని వేరు చేసి సేఫ్ గార్డ్ చేస్తారు, అందుకే ఈ తవ్వకాలకు కేంద్రప్రభుత్వ సంస్థలకే అనుమతులు ఉంటాయి. 2018 వరకు ప్రైవేటు సంస్థలకు కొన్ని చోట్ల పర్మిషన్లు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలకు ఈ తవ్వకాల అనుమతులపై కేంద్రం నిషేధం విధించింది” అని సుందర్‌రాజు తెలిపారు.
ఇప్పటి వరకు చైనాదే గుత్తాధిపత్యం
‘ప్రపంచంలో ఇప్పటివరకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకాల్లో 92% చైనాలోనే జరుగుతోంది. ప్రాసెసింగ్ టెక్నాలజీలోనూ చైనా ముందుంది.
75% రేర్ ఎర్త్ మూలకాల నిల్వలు కూడా చైనాలోనే ఉన్నాయి, అందుకే ప్రపంచంలో ఎవరైనా వీటి రా మెటీరియల్ చైనా వద్దనే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.
చైనా తర్వాత అమెరికా ఈ రేర్ ఎర్త్ మూలకాల వినియోగంలో ముందు వరుసలో ఉంది’ అని సుందర్ రాజు చెప్పారు.
ఫొటో సోర్స్, PIB
భారత్ స్వయం సమృద్ధి సాధించాలనే..
‘భారత్‌లో ఇప్పటివరకు ప్రాసెసింగ్ లేకపోవడం ఆ రంగంలో వెనుకంజకు కారణం, కేంద్రం ఇప్పుడు పూర్తిస్థాయిలో ఈ సెక్టార్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
దేశంలోని సువిశాల సముద్రతీరంలో మూలకాల నిల్వలు ఉన్నాయి.
వాటిని సపరేట్ చేసి మనమే ప్రాసెస్ చేసుకుంటే స్వయం సమృద్ధి సాధించి.. వేరే దేశం మీద ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడొచ్చని కేంద్రం నిర్ణయించింది.
మొత్తంగా దేశీయ అవసరాలను తీర్చడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకే ఈ కారిడార్ ప్రకటన అని భావించాలి.
ఈ క్రమంలోనే తూర్పు తీరంలో ఏపీ, ఒడిశా తమిళనాడు, పశ్చిమ తీరంలో కేరళను కేంద్రం ఎంపిక చేసింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే 8.9% రిసోర్సెస్ మనదేశంలోని ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్‌లో ఉన్నాయి’ అని సుందర్‌రాజు వివరించారు.
ఇక మోనజైట్ నిక్షేపాలైతే దేశంలో 1.315 కోట్ల టన్నులు ఉన్నాయని అంచనా. ఇందులో 72.3 లక్షల టన్నుల రేర్ ఎర్త్ ఆక్సైడ్లు (ఆర్‌ఈవో) ఉన్నట్లు అంచనా అని ఆయన తెలిపారు.
ఏపీలో ఎక్కువగా లభ్యమయ్యే మూలకాలు ఇవే
దేశంలోని మొత్తం మూలకాల నిల్వల్లో 30–35% ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్టు అంచనా, ఏపీ తీరంలో ఎక్కువగా లాంథనమ్, సెరియమ్, నియోడైమియమ్ వంటి మూలకాలు లభిస్తాయి. అలాగొ మోనజైట్ అనే ఖనిజం ఎక్కువగా లభ్యమవుతుంది.. అని రాష్ట్ర భూగర్భ గనులశాఖ శ్రీకాకుళం డిప్యూటీ డైరెక్టర్ మోహన్‌రావు, చిత్తూరు డీడీ సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.
ప్రధానంగా తీరప్రాంత బీచ్ ఇసుక, లోతట్టు ఒండ్రుమట్టిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అవి కూడా ఎక్కువగా గోదావరి బేసిన్ లోనే ఉంటాయి. శ్రీకాకుళం నుంచి నర్సాపురం వరకు ఎక్కువగా లభ్యమవుతాయి, అలాగే మచిలీపట్నం, చీరాల, వోడరేవు, రామాయపట్నం, దుగరాజపట్నం, నెల్లూరు తీరప్రాంతాల్లోనూ బాగానే దొరుకుతాయి.. గతంలో ఖనిజాల తవ్వకాలకు ప్రైవేటు సంస్థలకు పర్మిషన్లు ఇచ్చారు. కానీ 2018లో నిలిపివేశారు.
ఇప్పుడు కేవలం ఎన్‌ఎండీసీ, ఏపీఎండీసీ, ఐఆర్‌ఈఎల్ వంటి సంస్థలకే అనుమతులు ఇస్తున్నారు అని మోహన్‌రావు తెలిపారు.
ఫొటో సోర్స్, Professor Dhanunjaya Rao
శ్రీకూర్మం వద్ద ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు
రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్టల్ కారిడార్ లో ఇప్పటికే ఖనిజాల అన్వేషణపై ప్రధానంగా దృష్టి పెట్టి ఆ మేరకు చర్యలు మొదలుపెట్టామని ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) వైస్ ప్రెసిడెంట్ రామన్ నారాయణ్ బీబీసీతో అన్నారు.
బీచ్ సాండ్ మినరల్స్ అన్వేషణకు సంబంధించి ఇప్పటికే ఏపీఎండీసీ శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో 909 హెక్టర్ల భూమిని సేకరించిందని తెలిపారు. దీనికి సంబంధించి మైనింగ్ లీజులు తీసుకునేందుకు యత్నిస్తున్నామనీ, అలాగే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఓ పాలసీ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.
శ్రీకాకుళం తర్వాత విజయనగరంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆ తర్వాత కోస్తా తీర ప్రాంతంలో ఇలాంటి ప్లాంట్లు పెట్టే దిశగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఖనిజాల అన్వేషణతో పాటు ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తూ కేంద్రం కారిడార్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంతో సువిశాల తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి, రాష్ట్ర పారిశ్రామిక రంగం శరవేగంగా వృద్ధి చెందుతుందని నారాయణ్ వెల్లడించారు.
జీఎస్‌ఐ ఏం చేస్తుందంటే..
ఎక్కడెక్కడ ఏయే సముద్రతీరాల్లో ఏయే మూలకాలు లభ్యమవుతాయో అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుగా పరీక్షిస్తుంది.. ఆయా ప్రాంతాల్లో భూపరీక్షలు నిర్వహించి ఇక్కడ ఖనిజ సంపద ఉండే అవకాశం ఉందని జిఎస్‌ఐ రిపోర్ట్ చేస్తుంది.
2013 నుంచి జీఎస్‌ఐ ఈ పనిలో ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు ప్రాసెసింగ్ లేదు..
ఇప్పుడు ప్రాసెసింగ్‌కి కేంద్రం అనుమతినిచ్చి ప్రోత్సహిస్తోంది.. అని ఆంధ్రప్రదేశ్‌లోని జీఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన అధికారి బీబీసీకి తెలిపారు.
ఫొటో సోర్స్, PV SundarRaju
పర్యావరణవేత్తల అభ్యంతరం ఏమిటంటే
అరుదైన మూలకాల తవ్వకాలతో పర్యావరణ వ్యవస్థకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని విశాఖకు చెందిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు,
”ఈ మైనింగ్ కార్యకలాపాల కోసం అడవులు లేదా చెట్లను భారీగా తొలగించాల్సి వస్తుంది. ఫలితంగా వన్యప్రాణుల ఆవాసాలు దెబ్బతిని నేల నిర్మాణం కూడా దెబ్బతింటుంది. జీవవైవిధ్యం తగ్గిపోతుంది.. ఓపెన్ కాస్ట్, ఉపరితల మైనింగ్ వల్ల భారీ స్థాయిలో నేల తొలగింపునకు గురవుతుంది. ఇలాంటి భూములను పునరుద్ధరించడం చాలా కష్టం
ఇక మైనింగ్ ప్రక్రియలో విడుదలయ్యే భారీ లోహాలు, మట్టి కణాలు ఉపరితల జలాలతో పాటు భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి.. అలాగే వాయు కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
అందుకే ప్రాజెక్టులు ప్రారంభించే ముందు సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు తప్పనిసరిగా చేయాలనీ, పర్యావరణ చట్టాలు నియమాలను కఠినంగా అమలు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ మైనింగ్ ప్రకృతి విధ్వంసానికి మాత్రమే కాకుండా దీర్ఘకాలికల్లో ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి కూడా తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన బీబీసీతో అన్నారు.
మరోవైపు ఈ కారిడార్‌ల వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్ర ఆటంకం కలిగే ప్రమాదముందని విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలగడంతో పాటు సముద్రజీవ వైవిధ్యం దెబ్బతిని ఆ సముద్రంపై ఆధారపడ్డ మత్య్యకారుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ఆలస్యమైంది..
”రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో మనం ఇప్పటికే ఆలస్యంగా ఉన్నాం. కేంద్రం కనీసం ఇప్పుడైనా సరే ఈ రంగంపై దృష్టి సారించడం ఆహ్వానించదగ్గ పరిణామం.. పర్యావరణ వేత్తలు ఆ విధంగా ఆలోచించడంలో తప్పులేదు కానీ వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టులు కాబట్టి అన్ని పర్యావరణ అనుమతులకు లోబడే చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం ఏజెన్సీలకు అప్పజెప్పినా ప్రభుత్వ నియంత్రణ కచ్చితంగా ఉంటుంది.” అని ఏయూ ప్రొఫెసర్ ధనుంజయరావు అభిప్రాయపడ్డారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



