Home జాతీయ national telgu రాస్ లాఫాన్: ఖతార్ గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇరాన్ దాడి తరువాత భారత్‌లో ఇంధన సంక్షోభం మరింత...

రాస్ లాఫాన్: ఖతార్ గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇరాన్ దాడి తరువాత భారత్‌లో ఇంధన సంక్షోభం మరింత తీవ్రం కానుందా?

13
0

SOURCE :- BBC NEWS

ఖతార్, గ్యాస్, ఇరాన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

గల్ఫ్ దేశాలలోని భారీ గ్యాస్ నిల్వలపై పడుతున్న క్షిపణులు, ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రపంచ ఇంధన భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టాయి.

దీంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆసియా ప్రారంభ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 4% పెరిగి బ్యారెల్‌112 డాలర్ల(సుమారు రూ. 10,371)కు చేరగా, యూఎస్ క్రూడ్ ఆయిల్ 3% పెరిగి బ్యారెల్‌ 99.27డాలర్ల(సుమారు రూ. 9,170)కు చేరుకుంది.

ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు క్షేత్రాలలో ఒకటైన ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి, దానికి ప్రతీకారంగా ఖతార్‌లోని రాస్ లాఫాన్ ఎల్‌ఎన్‌జీ గ్యాస్ ఫీల్డ్‌పై జరిగిన దాడితో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

బుధవారం ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఖతార్ ప్రధాన ఎల్‌ఎన్‌జీ ప్రాసెసింగ్ సైట్, ఆ దేశ ఇంధన నెట్‌వర్క్‌కు కీలక కేంద్రమైన రాస్ లాఫాన్‌లో గణనీయమైన నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ తెలిపింది.

రియాద్ వైపు ప్రయోగించిన నాలుగు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేశామని, అలాగే గ్యాస్ కేంద్రంపై డ్రోన్ దాడి ప్రయత్నాన్ని కూడా భగ్నం చేశామని సౌదీ అరేబియా తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ ఇకపై దాడి చేయదని రాస్ లాఫాన్‌పై దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ లాఫాన్‌పై దాడి చేస్తే, అమెరికా దాని ఇంధన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తుందని కూడా ఆయన హెచ్చరించారు.

అయితే, రాస్ లాఫాన్‌లోని ఖతార్ ఇంధన సముదాయంపై మళ్లీ క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. ఈ దాడులు డోనల్డ్ ట్రంప్ హెచ్చరికకు ముందే జరిగాయి.

సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా సౌదీ అరేబియా, యూఏఈ , ఖతార్‌లోని పలు చమురు క్షేత్రాలపై దాడి చేయడానికి ముందు ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది.

అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌తో జరుపుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం ఇప్పటికే అడ్డంకులు ఎదుర్కొంటోంది.

భారతదేశ ఇంధన భద్రత, అనేక ఆసియా దేశాల మాదిరిగానే, హార్ముజ్ జలసంధి, గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. రాస్ లాఫాన్‌పై జరిగిన దాడి వల్ల భారతదేశ సహజ వాయు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ దాడులు భారతదేశ ఇంధన రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ప్రపంచ ఇంధన సరఫరాకు ఈ గ్యాస్ క్షేత్రాలు ఎంత ముఖ్యమైనవో చూద్దాం.

ఖతార్, గ్యాస్, ఇరాన్, దాడి,  భారత్, ఇంధన సంక్షోభం, ఇజ్రాయెల్, అమెరికా, డోనల్డ్ ట్రంప్, గల్ఫ దేశాలు, చమురు, ఎల్ఎన్‌జీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం: ఖతార్ ‘కిరీటపు ఆభరణం’

లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) వనరుగా సౌత్ పార్స్ ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఖతార్ బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది.

యుద్ధానికి ముందు ఖతార్ తన రాస్ లాఫాన్ ప్లాంట్ నుంచి ఎల్ఎన్‌జీని ఎగుమతి చేసేది. అక్కడ గ్యాస్‌ను చల్లబరిచి, ద్రవీకరించి, ఆపై ట్యాంకర్లలోకి లోడ్ చేస్తారు. దీన్ని ప్రధానంగా ఆసియా దేశాలకు పంపించేవారు.

ప్రపంచ ఎల్ఎన్‌జీలో సుమారు ఐదో వంతును ఖతార్ సరఫరా చేస్తుంది. ఇందులో రాస్ లాఫాన్‌ది కీలక పాత్ర.

ఇరాన్ దాడి తర్వాత రాస్ లాఫాన్ ప్లాంట్‌ను మూసివేయడంతో యూరప్‌లో లిక్విడ్ గ్యాస్ ధరలు పెరిగాయి, అయినప్పటికీ ఖతార్ ఎల్ఎన్‌జీలో అధిక భాగం ఆసియాకే వెళ్తుంది.

ఖతార్ 120 బిలియన్ క్యూబిక్ మీటర్ల (సుమారు 90 మిలియన్ టన్నుల) ఎల్ఎన్‌జీ ఎగుమతి చేస్తుంది.

ఖతార్, గ్యాస్, ఇరాన్, దాడి,  భారత్, ఇంధన సంక్షోభం, ఇజ్రాయెల్, అమెరికా, డోనల్డ్ ట్రంప్, గల్ఫ దేశాలు, చమురు, ఎల్ఎన్‌జీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇరాన్ సౌత్ పార్స్.. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రాలలో ఒకటి

ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు క్షేత్రంలో 51 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయు నిల్వ ఉంది. దీన్ని ఇరాన్, ఖతార్ రెండూ పంచుకుంటాయని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.

ఇరాన్ వైపు ఉన్న ప్రాంతాన్ని సౌత్ పార్స్ ఫీల్డ్ అని, ఖతార్ వైపు ఉన్న ప్రాంతాన్ని నార్త్ ఫీల్డ్ అని పిలుస్తారు.

‘‘విద్యుదుత్పత్తికి, ఇళ్లను వేడిగా ఉంచుకోవడానికి ఇరాన్ సహజ వాయువుపై ఎక్కువగా ఆధారపడుతుంది. కొలంబియా విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ ఎనర్జీ పాలసీ సెంటర్ అందించిన వివరాల ప్రకారం.. అమెరికా, చైనా, రష్యాల తర్వాత ప్రపంచంలో గ్యాస్ వినియోగంలో నాలుగో స్థానంలో ఉన్న దేశం ఇరాన్. ఆ దేశం తన గ్యాస్ అవసరాలలో సుమారు 80 శాతం పార్స్ గ్యాస్ క్షేత్రం నుంచే పొందుతోంది’’ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

ఇరాన్ ఎల్ఎన్‌జీ ఎగుమతి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది, కానీ దాని అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షల కారణంగా పెద్దగా విజయం సాధించలేకపోయింది.

ఇరాన్ 20 ఏళ్లుగా అభివృద్ధి చేస్తూ, పూర్తి కావస్తున్న అసాలూయే ప్రాంతంలోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై తాజా దాడి జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

ఇరాన్ సుమారు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల (దాదాపు 6.6 మిలియన్ టన్నుల) సహజ వాయువును ఎగుమతి చేస్తుంది.

భారత్ తన ఎల్ఎన్‌జీ అవసరాలలో అధిక భాగాన్ని ఖతార్ నుంచి కొనుగోలు చేస్తుంది. ఖతార్, యూఏఈ నుంచి వచ్చే ఎల్ఎన్‌జీ కార్గోలు హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తాయి. భారత్ ఎల్ఎన్‌జీ దిగుమతులలో సుమారు 50 నుంచి 55 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతాయి.

“ఖతార్‌లోని రాస్ లాఫాన్ ఒక భారీ సహజ వాయు కేంద్రం, ప్రపంచ ఎల్ఎన్జీ వాణిజ్యంలో 19 నుంచి 20 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది” అని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట్ బీబీసీతో అన్నారు.

“ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాతైనా గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించడానికి రెండు వారాలు పడుతుంది. ఇది ప్రామాణిక ప్రక్రియ. ఇప్పటివరకు రాస్ లాఫాన్‌లో ఎంత నష్టం జరిగిందో తెలియదు, కానీ నష్టం జరిగితే యుద్ధం ముగిసిన తర్వాతైనా తిరిగి ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతుంది. బహుశా కొన్ని నెలలు కూడా పట్టవచ్చు” అని ఆయన అన్నారు.

ఈ సదుపాయం కొంతకాలం పాక్షికంగా పనిచేయవచ్చని, అయితే పూర్తి సామర్థ్యానికి చేరుకోవడానికి సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

“ఎందుకంటే ఇక్కడ ఎల్ఎన్‌జీ రవాణా కోసం 14 రైళ్లు ఉన్నాయి. అవి దెబ్బతింటే, వాటిలో కొన్ని తిరిగి పనిచేయడానికి సమయం పడుతుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతుంది. మనం పీపీఎస్ఈ, సీఎమ్ఈ, ఇతర వాణిజ్య సంస్థల డేటాను పరిశీలిస్తే, 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి మధ్య భారత్ 22.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకుంది. ఇందులో 10 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీని ఒక్క ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంది. 2.4 మిలియన్ టన్నులను యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంది” అని ఆయన చెప్పారు.

దీని అర్థం భారత్‌కి అవసరమైన ఎల్ఎన్‌జీలో 55 శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తుంది. కాబట్టి, ఎల్ఎన్‌జీ విషయంలో భారత్ కూడా ప్రభావితం అవుతుంది.

ఖతార్, గ్యాస్, ఇరాన్, దాడి,  భారత్, ఇంధన సంక్షోభం, ఇజ్రాయెల్, అమెరికా, డోనల్డ్ ట్రంప్, గల్ఫ దేశాలు, చమురు, ఎల్ఎన్‌జీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

భారత్ వద్ద ఉన్న ఎల్ఎన్‌జీ నిల్వలు ఎన్ని?

ఈ వారం మొదట్లో ప్రచురితమైన బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిస్వాస్ కథనం ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ కొనుగోలుదారులలో భారత్ కూడా ఒకటి.

భారతదేశపు పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) సరఫరాలో సుమారు సగం దేశంలోనే వెలికితీసిన గ్యాస్ నుంచి వస్తుంది. మిగిలిన అవసరాన్ని ఎల్‌ఎన్‌జీ దిగుమతుల ద్వారా తీరుస్తారు.

“ఖతార్‌లో ఘర్షణ తీవ్రతరం కాకముందు లోడ్ చేసిన సరకులు ఇప్పటికీ ఆసియాకు చేరుకుంటున్నాయి. సరఫరాకు ఇంకా పూర్తిగా అంతరాయం కలగలేదు” అని కెప్లర్ ఇన్‌సైట్‌కు చెందిన ఎల్‌ఎన్‌జీ, లిక్విడ్ గ్యాస్ విశ్లేషకులు గో కటాయామా పేర్కొన్నారు.

“ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య లోడ్ చేసిన 13 ఎల్ఎన్‌జీ కార్గోలు ప్రస్తుతం భారత్‌కు వస్తున్నాయి. డెలివరీలు మార్చి వరకు కొనసాగుతాయి. అయితే, ఖతార్‌లోని భారీ రాస్ లాఫాన్ గ్యాస్ కాంప్లెక్స్ నుంచి ఎగుమతులు మార్చి 2 నుంచి నిలిపివేశారు” అని కెప్లర్ షిప్పింగ్ డేటా పేర్కొంది.

సురక్షిత మార్గం పునరుద్ధరించే వరకు ఈ నౌకలే చివరి సరఫరా కావచ్చని కటాయామా అన్నారు.

ముడి చమురులా కాకుండా.. భారత్ వద్ద ఎల్ఎన్‌జీ వ్యూహాత్మక నిల్వలు లేవు.

యూరప్, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు, చైనా, జపాన్‌ల మాదిరిగా భారత్‌కు ఎల్‌ఎన్‌జీ వ్యూహాత్మక నిల్వలు లేవని ప్రశాంత్ వశిష్ట్ అంటున్నారు.

“మా వద్ద ఉన్న నిల్వలు పాత ఎల్ఎన్‌జీ టెర్మినల్‌లో ఉన్నాయి. ఇవి కేవలం కార్యాచరణ నిల్వలు మాత్రమే. 50-60 రోజుల నిల్వను కలిగి ఉండటానికి వాటిలో తగినంత గ్యాస్ లేదు” అని ఆయన అన్నారు.

ఎల్ఎన్‌జీ మార్కెట్ చమురు కంటే కూడా ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది, కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, రష్యా, ఖతార్, అమెరికా వాటాను చూస్తే, 72% ఎల్ఎన్‌జీ ఈ దేశాల నుంచే వస్తుంది” అని ఆయన వివరించారు.

“ఖతార్ మాత్రమే కాకుండా, ఈ దేశాలు కూడా ఎల్ఎన్‌జీ ప్రత్యామ్నాయాలుగా ఉండగలవు, కానీ భారత మార్కెట్ .. ధరల విషయంలో సున్నితంగా ఉంటుంది. చాలా ఖరీదైన ఎల్‌ఎన్‌జీని మనం కొనలేం. అందువల్ల ఖతార్ నుంచి దిగుమతులు ఆగిపోతే భారత్‌పై ప్రభావం పడుతుంది” అని ప్రశాంత్ వశిష్ట్ అంటున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)