Home జాతీయ national telgu రాయలసీమ అరటి రైతులను దెబ్బకొట్టిన ఇరాన్ యుద్ధం.. నడిసంద్రంలో కంటైనర్లు

రాయలసీమ అరటి రైతులను దెబ్బకొట్టిన ఇరాన్ యుద్ధం.. నడిసంద్రంలో కంటైనర్లు

18
0

SOURCE :- BBC NEWS

భారత్, ఆంధ్రప్రదేశ్, అరటి, రైతులు, అమెరికా, ఇరాన్, మిడిల్ ఈస్ట్

ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై పడింది. ఇది కేవలం చమురు దిగుమతులపైనే కాకుండా, భారత్ నుంచి ఆయా దేశాలకు జరిగే ఎగుమతులపైనా పడింది.

అలా ప్రభావితమైన వారిలో రాయలసీమ అరటి రైతులు కూడా ఉన్నారు.

ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు సముద్రమార్గంలో ఎగుమతయ్యే జీ9 రకం అరటి సాగుచేస్తున్న వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అసలు ఈ అరటి రకమే ఎందుకు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది, యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోయి రైతులు ఏవిధంగా ఇబ్బంది పడుతున్నదీ తెలుసుకోడానికి బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
భారత్, ఆంధ్రప్రదేశ్, అరటి, రైతులు, అమెరికా, ఇరాన్, మిడిల్ ఈస్ట్

గ్రాండ్ 9 అరటి ఎందుకంత ప్రత్యేకం..

ఆంధ్రప్రదేశ్‌లో‌ని చాలా ప్రాంతాల్లో అరటి సాగు చేస్తున్నా అనంతపురం, కడప, నంద్యాల జిల్లాలలో పండే అరటి మాత్రమే ఎగుమతికి అనుకూలంగా ఉంటుందని ఎగుమతి కంపెనీలు చెబుతున్నాయి.

ఇక్కడ పండే అరటికి షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది కాబట్టే వాటిని గల్ఫ్‌కు ఎగుమతి చేస్తున్నామని నోవా ఫ్రెష్ బనానా కంపెనీ సీనియర్ మేనేజర్ జయకృష్ణ చెప్పారు.

”ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా అరటి ఎక్కువగా పండించేది అనంతపురం, కడప, నంద్యాల, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలు. ఎగుమతుల విషయానికి వస్తే ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, కడప, నంద్యాల జిల్లాల నుంచే ఎక్కువ. ఎందుకంటే, జీ9 (గ్రాండ్9) రకం అరటి ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. దీంతో అరటి నాణ్యత మెరుగుపడి, వాటికి షెల్ఫ్ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అందుకే వాటిని ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.

ఈ జీ9 అరటి రకాన్ని ఎక్కువగా సాగుచేసే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, పెద్ద పప్పూరు మండలాలు, కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతంలో రైతులతో బీబీసీ మాట్లాడింది. వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అడిగి తెలుసుకుంది.

భారత్, ఆంధ్రప్రదేశ్, అరటి, రైతులు, అమెరికా, ఇరాన్, మిడిల్ ఈస్ట్

ఎగుమతులపై యుద్ధం ప్రభావం..

ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారిన రాయలసీమలో పండే అరటికి గల్ప్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అలా డిమాండ్ ఉన్నవాటిలో జీ9 రకం అరటి ఒకటి. దీన్ని ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 15 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు.

అలాగే కడప, నంద్యాల జిల్లాల్లో కూడా ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ జీ9 అరటి రకంవైపే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తంగా రాయలసీమలో అరటి సుమారు 40 వేల హెక్టార్లలో సాగు అవుతోందని అధికారులు చెబుతున్నారు.

అయితే, ప్రస్తుత యుద్ధ వాతావరణం, గల్ఫ్ దేశాలపైనా బాంబుదాడులు జరుగుతుండడంతో అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మెన్నటివరకూ టన్ను రూ.25 వేల వరకూ పలికిన అరటి ధర ఇప్పుడు ఏడెనిమిది వేల రూపాయలకు పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

భారత్, ఆంధ్రప్రదేశ్, అరటి, రైతులు, అమెరికా, ఇరాన్

అమ్ముడైతే చాలనుకుంటున్నాం..

యుద్దం కారణంగా అరటి ధరలు పడిపోయాయని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామానికి చెందిన అరటి రైతు ఈశ్వర్‌రెడ్డి బీబీసీకి చెప్పారు.

”యుద్ధం మొదలయ్యాక ఎప్పుడైతే ఎగుమతులు ఆగిపోయాయో, ఇక్కడ ధర సగానికి సగం తగ్గిపోయింది. స్థానిక వ్యాపారులు మాత్రమే కొంటున్నారు. ఎగుమతి కంపెనీలేవీ తీసుకోవట్లేదు. ఇంతకుముందు టన్ను రూ.25 వేల వరకు వెళ్లింది. ప్రస్తుతం ధర రూ.8 వేలు, రూ.7 వేలకు పడిపోయింది. రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి రైతూ ఏదోలా అమ్ముడైతే చాలు అనుకుంటున్నారు. అంతోఇంతో రేటు ఆశించే పరిస్థితిలో లేం” అని ఆయన అన్నారు.

ఇప్పుడున్న ధరలకు అరటి విక్రయిస్తే రైతులు పూర్తిగా నష్టపోతారని ఈశ్వర్ రెడ్డి చెప్పారు. కనీసం కిలో రూ.15 చొప్పున ధర పలికినా కాస్త ఫర్వాలేదని, కానీ ఏడెనిమిది రూపాయలకు పడిపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పులపాలు అవుతున్నారని అన్నారు.

భారత్, ఆంధ్రప్రదేశ్, అరటి, రైతులు, అమెరికా, ఇరాన్, మిడిల్ ఈస్ట్

గొర్రెలకు, బర్రెలకు వేసుకోవాల్సిందే…

లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అరటి సాగు చేస్తే, ఇప్పుడు కాయలు తోటలోనే మాగిపోతున్నాయని బాధపడ్డారు పెద్దపప్పూరు మండలానికే చెందిన రైతు రాజశేఖరరెడ్డి. రాయలసీమలో చాలామంది అరటి రైతుల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు.

”మేం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అరటి పంట పెట్టుకున్నాం. ఇప్పుడు కాయలు కొడదామనుకుని ఏ వ్యాపారస్తుల దగ్గరపోయినా కనీసం పలికే పరిస్థితిలో లేరు. నా తోట ఒక్కటే కాదు రాయలసీమలో చాలామంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇంకొక 20 రోజులు చూసి ఇవన్నీ మేం గొర్రెలకి, బర్రెలకు వేసుకోవాల్సిందే. కాయలు తోటలోనే మాగిపోతాయి. గత 15 రోజుల నుంచి వ్యాపారులకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. కాటాల దగ్గరికి పోతున్నాను. అడగని రోజు లేదు. ఈరోజు, రేపు అని చెబుతూనే ఉన్నారు. చాలామంది రైతులు ఆశలు వదిలేసుకున్నారు. యుద్ధం ఆగితే తర్వాత ఏమవుతుందో చూడాలి” అని రాజశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా వరదాయపల్లి తదితర ప్రాంతాల్లో పొలాలు కౌలుకు తీసుకుని అరటిని సాగు చేస్తున్నకౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

భారత్, ఆంధ్రప్రదేశ్, అరటి, రైతులు, అమెరికా, ఇరాన్, మిడిల్ ఈస్ట్

అమ్మినా డబ్బులు చేతికొచ్చేదీ సందేహమే..

అరటి కాయలు ఏదొలా అమ్మినా తీరా డబ్బులు చేతికందుతాయా లేదా అనే సందేహంలో ఉన్నామని రైతు లక్ష్మీనారాయణ రెడ్డి చెప్పారు.

”గతంలో 25 నుంచి 30 రోజులకల్లా డబ్బులు ఇచ్చేసేవాళ్లు. ఇప్పుడు మరో 10 నుంచి 15 రోజులు ఆలస్యమవుతుందని చెబుతున్నారు. మేం అరటికాయలు కొట్టిచ్చాం. కానీ కంటైనర్లు నిలిచిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. డబ్బులు చేతికి వచ్చేవరకు భయంగానే ఉంది. మేం కౌలుకు తీసుకుని అరటి సాగు చేస్తున్నాం. ఎకరాకి రూ.50 వేల దాకా కౌలు ఇస్తున్నాం. ఇప్పుడున్న ఈ రేట్లకు అమ్మితే మాకు ఏమీ మిగలదు. నిన్నమొన్నటి దాకా టన్ను రూ.20 వేల వరకూ వస్తుంటే బాగానే గిట్టుబాటు అవుతుందనుకున్నాం. ఇప్పుడు రూ.5 వేల చొప్పున అడుగుతున్నారు. ఇప్పుడు మాకు పెట్టుబడి కూడా నష్టం వచ్చేట్టుగా ఉంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎగుమతులు ఆగిపోవడం వల్ల రైతులు అర్థికంగా చాలా సమస్యల్లో పడ్డారని పులివెందులకు చెందిన అరటి రైతు ప్రభాకర్ నాయుడు బీబీసీతో చెప్పారు.

”ముందు రేట్లకు ఇప్పుడున్న రేట్లకు చాలా వ్యత్యాసం ఉంది. టన్ను రూ.25 వేలు, రూ.26 వేల వరకు కూడా కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. అదే రేటుకు ఇతర రాష్ట్రాలకు పంపించేవాళ్లం. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో రేటు పడిపోయింది. రైతులకు చాలా ఇబ్బంది అవుతోంది” అని అన్నారు.

భారత్, ఆంధ్రప్రదేశ్, అరటి, రైతులు, అమెరికా, ఇరాన్, మిడిల్ ఈస్ట్

నడిసంద్రంలో అరటి కంటైనర్లు..

రాయలసీమలో సాగయ్యే గ్రాండ్ 9 రకం అరటి ప్రధానంగా ఇరాన్, ఇరాక్, అఫ్గానిస్తాన్, సిరియా, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి అవుతుందని ఎగుమతి కంపెనీలు చెబుతున్నాయి.

గల్ఫ్ దేశాలకు ఇప్పటికే ఎగుమతి చేసిన అరటి ఇప్పుడు సముద్రంలోనే ఉండిపోవడంతో, రైతుల నుంచి అరటి కొని ఎగుమతి చేయడం ఆపేశామని జయకృష్ణ చెప్పారు.

రాయలసీమ నుంచే రోజుకి 500 నుంచి 600 టన్నుల అరటి ఎగుమతి అవుతుందని, ఇక్కడి నుంచి ముంబయి పోర్టుకు పంపించి, అక్కడ నుంచి కంటైనర్లలో సముద్ర మార్గంలో విదేశాలకు ఎగుమతి అవుతోందని ఆయన వివరించారు.

ఈ ఏడాది ప్రారంభంలో అరటి ధరల పరిస్థితి బాగున్నా, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలయ్యాక, మార్చి1వ తేదీ నుంచే ఎగుమతులు ఆగిపోవడం వల్లే రాయలసీమలో రైతులకు సమస్య ఏర్పడిందని అనంతపురం జిల్లా ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)