SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, BBC Sport
మానవ ఆవాసాల్లోకి పాములు రావడం పెరిగిందనే రిపోర్టులు వస్తున్నాయి. కొంతమంది తమ ఇంట్లో పాము కనిపిస్తే, దాన్ని చంపేస్తున్నారు. మనుషులు, పాములకు ఇబ్బంది లేని మార్గం ఏదైనా ఉందా?
రాటిల్ స్నేక్కు సంబంధించిన కాల్‌సెంటర్ నిర్వాహకుడు తనకు ఫోన్‌చేసిన క్రిస్టా రీనాచ్ను ఓ ప్రశ్న అడిగారు. మీ పెరడులోకి వచ్చిన మూడడుగుల పాము గుర్తులు ఏంటి, దాని తోకపై నలుపు, తెలుపు పట్టీలు ఏమైనా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.
తన ఇంటి కిటిలోంచి ఆ ప్రాణినే చూస్తున్న క్రిస్టారీనాచ్ ‘అవును’ అని సమాధానమిచ్చారు.
అయితే ఆ గుర్తులను పట్టి క్రీస్టారీనాచ్ పెరడులోకి వచ్చిన పాము కచ్చితంగా విషపూరితమైన వెస్ట్రన్ డైమండ్బాక్ రాటిల్ స్నేక్ అని కాల్‌సెంటర్ నిర్వాహకుడు చెప్పలేకపోయినప్పటికీ, దానిని వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది.
రీనాక్ పాములను పట్టేవారి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. దాని కాటు చాలా ప్రమాదకరమైనప్పటికీ, రాటిల్ స్నేక్‌ను చూసి ఆమె భయపడటం లేదు. ఆమె దగ్గరున్న రెండు చైనీస్ షార్-పీస్ జాతికి చెందిన కుక్కలను భద్రంగా ఇంట్లో ఉంచి గడియ పెట్టారు.
రీనాక్ అరిజోనాలో స్కాట్‌డేల్ సమీపంలోని రియోవెర్డే ఫుట్‌హిల్స్‌లో ఉంటున్నారు. ఈ ప్రాంతం ఎడారి పక్కన ఉండటంతో అప్పుడప్పుడు తన ఇంటి వద్ద పాములు కనిపిస్తాయని ఆమెకుతెలుసు.
అయితే ఆ పాము అక్కడ ఎక్కువ సేపు ఉండాలని ఆమె కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆమె ఇంట్లో గుర్రాలు ఉన్నాయి. పామును చూసేందుకు అవి తల కిందకు పెడతాయి. అలాంటప్పుడు “వాటి ముక్కు మీద పాము కాటు వేస్తే, ముక్కు వాచి, ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది” అని ఆమె చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో పాములన్నింటిలోనూ రాటిల్ స్నేక్స్ చాలా ప్రమాదకరమైనవి.
పెంపుడు జంతువులకు పాము కాటు ముప్పు ఎక్కువ. చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువ.
పాము కాటుకు గురైన 11,138 మందిపై 2019లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం ఎవరిని ఏ పాము కాటేసిందో సగానికి పైగా కేసుల్లో కనుక్కోగలిగారు. అందులో ఎక్కువ మందిని రాటిల్ స్నేక్ కాటేసిందని గుర్తించారు.
రాటిల్ స్నేక్ కాటేసిన వారిలో 10 నుంచి 44 శాతం మందికి వేలు కోల్పోవడం లాంటి శాశ్వత గాయాలైనట్లు ది యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది.
దీనిపై వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు.
కొత్త ఇళ్ల నిర్మాణం పాముల ఆవాసాలను ధ్వంసం చేస్తోంది. దీంతో అవి వేసవిలో చల్లదనం కోసం తోటల్లోకి వస్తున్నాయని ఆయన చెప్పారు.
పర్యావరణ సమతుల్యతలో పాములు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇళ్లలో కనిపించే ప్రతి పామును చంపేయడం నైతికత కాదని, అంతిమంగా అది మనుషులకే సమస్యలు తెచ్చి పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని కేసుల్లో, పాములను కారుణ్య పద్దతిలో చంపేయడం అవసరం కావచ్చు. స్థానికంగా ఉన్న జంతువులను బలమైన విషపూరిత పాములు చంపేస్తున్నప్పుడు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వాటిని కారుణ్య పద్దతిలో చంపేయడం సమర్థనీయమే.

ఫొటో సోర్స్, Rattlesnake Solutions
అరిజోనాతో పాటు అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో కొన్ని సంస్థలు పాములను సజీవంగా పట్టుకుని వాటిని వేరే చోటకు తరలిస్తున్నాయి.
అరిజోనా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు ఎడారి ప్రాంతంలోకి విస్తరించాయి. అక్కడున్న పొదల స్థానంలో నివాస భవనాలు వెలుస్తున్నాయి. దీనర్థం రాటిల్ స్నేక్స్ ఆవాసాల్లోకి మనుషులు చొచ్చుకుపోతున్నారని. దీంతో ఈ ప్రాంతంలో పాము కాట్లు పెరుగుతున్నాయని స్థానిక గణాంకాలు చెబుతున్నాయి.
సమస్య తీవ్రం కావడంతో పరిష్కారాలు కూడా వచ్చాయి. స్థానిక సంస్థ ఒకటి మనుషులు, వారి పెంపుడు జంతువులకు హాని కలిగించే పాములను గుర్తించినప్పుడు వాటిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంది.
కొన్ని పర్వత ప్రాంతాల్లోని ఆవాసాల్లో రాటిల్ స్నేక్స్‌ను పట్టుకోవాలంటూ తమకు వచ్చే విజ్ఞప్తులు పెరుగుతున్నాయని సంస్థ చెబుతోంది.
క్రిస్టా రీనాక్ ఏప్రిల్‌లో తన పెరడులో ఈస్టర్న్ డైమండ్ బ్యాక్‌ను చూసినప్పుడు ఆమె రాటిల్ స్నేక్ సొల్యూషన్స్ నెంబర్‌కు ఫోన్ చేశారు. ఆమె ఫోన్ చేసిన తర్వాత, సంస్థ ప్రతినిధి ఒకరు ఆమె వ్యవసాయ క్షేత్రానికి వెంటనే వచ్చారు.
పామును పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి పొడవాటి పటకారుతో చాలా సున్నితంగా రాటిల్ స్నేక్‌ను పట్టి తన వద్ద ఉన్న డబ్బాలో పెట్టి దానికి మూత పెట్టడాన్ని రీనాక్ చూశారు.
ఆ డబ్బాకున్న రంధ్రాలు, పాము శ్వాస తీసుకోవడానికి అవసరమైన గాలిని అందిస్తున్నాయి.
పాముల సంరక్షకుడు ఆ రాటిల్ స్నేక్‌ను ఎడారిలోకి తీసుకెళ్లారు. అక్కడ అది తల దాచుకోవడానికి అనేక ప్రాంతాలు, వేటాడేందుకు ఎన్నో ఎలుకలు ఉన్నాయి. అక్కడ ఆకాశంలో వేల కొద్దీ నక్షత్రాలు తప్ప మేడ మీద లైట్లు లాంటివేమీ లేవు.
జరిగిందంతా రీనాక్‌కు చాలా సంతోషంగా అనిపించింది.
“అది ఉండే ప్రాంతాన్ని మారిస్తే చాలనుకున్నప్పుడు వాటిని చంపడంపై నాకు నమ్మకం లేదు” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాటిల్స్నేక్స్ను జనావాసాల నుంచి తీసుకెళ్లి ఎడారిలో వదిలి పెడితే అవి మంచి చేస్తాయని వాటిని కాపాడుతున్నవారు నమ్ముతున్నారు.
అవి ఎలుకలను తింటాయి. ఎలుకల జనాభా నియంత్రణలో ఉండేందుకు సాయపడతాయి. ఇది రైతులకు చాలా మేలు చేస్తుంది.
ఎలుకలు ఎక్కువ సంఖ్యలో ఉంటే పంటలను పాడు చేస్తాయి.
గోధుమ రంగు పాములు ఏటా చదరపు కిలోమీటరు వ్యవసాయభూమికి వేలాది ఎలుకలను నిర్మూలిస్తున్నాయని ఓ ఆస్ట్రేలియన్ అధ్యయనం తెలిపింది.
ఉత్తర అమెరికాలోని రాటిల్ స్నేక్స్ కూడా ఇలాంటి పాత్రనే పోషిస్తున్నాయి.
రాటిల్స్ స్నేక్స్ వల్ల ప్రయోజనాలున్నా, అందులో కొన్ని రకాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈస్టర్న్ డైమండ్‌బ్యాక్ రకానికి చెందిన రాటిల్ స్నేక్స్ సంఖ్య తగ్గుతోంది. ఉదాహరణకు అరిజోనా బ్లాక్ రాటిల్ స్నేక్స్ అంతరించే దశకు చేరుకున్నాయి.
వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ఇప్పటి నుంచి 2040 లోపు రాటిల్ స్నేక్స్ ఆవాసాల్లో 71శాతం తగ్గిపోతాయని 2022లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పాములతో కలిసి జీవించడం
బ్రయాన్ హ్యూజెస్ ఐదేళ్ల వయసులో తొలిసారి తన చేతులతో పామును పట్టుకున్నారు. ఆయన చిన్నతనంలో ఓరేగావ్లో నివసించేటప్పుడు, పాములను,ఉభయచర జీవులను అధ్యయనం చేసి, సంరక్షించే స్థానిక హెర్పిటొలాజికల్ సొసైటీ అక్కడి ప్రకృతి కేంద్రానికి ఎర్రటి స్లార్లెట్ కింగ్స్నేక్ను తీసుకొచ్చింది. అది చాలా చిన్నగా, అందంగా ఉంది.ఆ సమయంలో బ్రయాన్ హ్యూజెస్ ఆ ప్రకృతి కేంద్రంలోనే ఉన్నారు.
“అప్పుడు ఆ ప్రాణిని పట్టుకోవడం ఏదో ప్రత్యేకంగా అనిపించింది” అని హ్యూజెస్ అన్నారు. ఆ తర్వాత ఆయన పాముల గురించి అధ్యయనం చేయడం ప్రారంభించారు. 2008 ఆర్థిక సంక్షోభంలో ఆయన మార్కెటింగ్ ఉద్యోగం పోయిన తర్వాత పాములకు సంబంధించిన ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలేసే సేవలను వ్యాపారంగా మార్చారు. ఒక లోగో, వెబ్‌సైట్‌తో రాత్రికి రాత్రి రాటిల్ స్నేక్ సొల్యూషన్స్ ఏర్పడింది.
అప్పటి నుంచి హ్యూజెస్‌తో పాటు ఆయన సహచరులు కలిసి ఏడాదికి 1500 చొప్పున దాదాపు 20వేల రాటిల్ స్నేక్స్‌ను రక్షించారు. ఒక్కో పామును పట్టుకుని దాన్ని ఎడారిలో వదిలేసేందుకు 150 డాలర్లు వసూలు చేసేవారు.
ఒక పామును పట్టుకోవడం, దాన్ని ఎడారిలో వదిలేయడానికి వీళ్ల టీమ్‌కు రెండు గంటల సమయం పడుతుంది.
మానవ నాగరికత విస్తరిస్తున్నందున రాటిల్ స్నేక్స్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని హ్యూజెస్ చెబుతున్నారు. వీటి గురించి సమాజం సరిగ్గా అర్థం చేసుకోలేదనేది ఆయన అభిప్రాయం.
“మీరు వాటిని ద్వేషిస్తారేమో, వాటిని చంపేస్తారేమో. నేను మాత్రం అలా చేయను, నేను వాటిని రక్షిస్తాను” అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)