Home LATEST NEWS telugu తాజా వార్తలు రష్యా భారత్‌కు వార్నింగ్ ఇస్తోందా, తనే భయపడుతోందా?

రష్యా భారత్‌కు వార్నింగ్ ఇస్తోందా, తనే భయపడుతోందా?

2
0

SOURCE :- BBC NEWS

భారత్, పాకిస్తాన్, రష్యా  చైనా, భారత్ రష్యా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, రజనీష్ కుమార్
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 21 మే 2025

భారత్, చైనాలను పోటాపోటీగా నిలపడం ద్వారా ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గతవారం అన్నారు.

“పశ్చిమ దేశాలు ఆసియా పసిఫిక్‌ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ అని పిలవడం మొదలుపెట్టాయి. వాళ్లు చైనా వ్యతిరేక విధానాన్ని ప్రోత్సహిస్తున్నారనేది సుస్పష్టం. మాకు మంచి స్నేహితుడైన భారత్‌కు, పొరుగు దేశం చైనా మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం ఇది.

పశ్చిమ దేశాలు ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యం కోసం చూస్తున్నాయి. పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ఈ విధానాన్ని పుతిన్ ‘విభజించి పాలించు’ గా అభివర్ణించారు” అని లావ్రోవ్ చెప్పారు.

భారత్ – చైనా సంబంధాల్లో పశ్చిమ దేశాల పాత్రపై రష్యా విదేశాంగ మంత్రి విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు.

2020 డిసెంబర్ తొలినాళ్లలో “పశ్చిమ దేశాలు ఏకధృవ ప్రపంచాన్ని మళ్లీ స్థాపించాలని భావిస్తున్నాయి. కానీ, రష్యా, చైనా అందుకు తలొగ్గవు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పశ్చిమ దేశాలు ఏర్పాటు చేసిన క్వాడ్‌ వంటి సంస్థల వల్ల చైనా వ్యతిరేక విధానంలో భారత్ పావుగా మారింది. భారత్ – రష్యా మధ్య సంబంధాలను పశ్చిమ దేశాలు బలహీనపరచాలని అనుకుంటున్నాయి ” అని లాావ్రోవ్ అన్నారు.

క్వాడ్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సభ్య దేశాలు. ఈ గ్రూపు చైనాకు వ్యతిరేకమని రష్యా భావిస్తోంది. చైనా కూడా అదే అభిప్రాయంతో ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఈ నెలలో, భారత్ – పాకిస్తాన్ పరస్సరం దాడులకు దిగినప్పుడు క్వాడ్‌ దేశాలు భారత్‌కు అండగా నిలుస్తాయని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. దీనికి కారణంగా, క్వాడ్ భద్రత కోసం ఏర్పడిన కూటమి కాదనే వాదన వినిపించింది.

లావ్రోవ్ ప్రకటన భారత్‌ను హెచ్చరిస్తున్నట్లుగా అర్ధం చేసుకోవచ్చు, అయితే ఆసియా పసిఫిక్‌ను ఇండో పసిఫిక్ అని పిలవడం అంత పెద్ద విషయమేమీ కాదని భారత మాజీ రాయబారి రాజీవ్ డోగ్రా అన్నారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రాంతాల పేర్లను చైనా ప్రతీరోజూ మారుస్తూనే ఉందన్నారు.

భారత్, పాకిస్తాన్, రష్యా  చైనా, భారత్ రష్యా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా పసిఫిక్ Vs ఇండో పసిఫిక్

“2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై యుద్దం ప్రారంభమైన తర్వాత రష్యా పశ్చిమ దేశాలపై దూకుడుగా స్పందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో, పశ్చిమ దేశాలతో ఇతర దేశాల సంబంధాలను కూడా రష్యా అదే కోణంలో చూస్తుంది” అని రాజీవ్ డోగ్రా అన్నారు.

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్ కుమార్ మాట్లాడుతూ, “లావ్రోవ్ భారత్‌ను హెచ్చరిస్తూనే, భారత్ తమపై ఆధారపడడం ఆగిపోతుందేమోనని భయపడుతోంది. భారత్ రక్షణ పరికరాల కోసం రష్యాపై ఆధారపడటం తగ్గింది. ఆయుధాల కోసం భారత్ పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది” అని అన్నారు.

2009 – 2013 మధ్య రష్యా నుంచి భారత్ ఆయుధాల దిగుమతులు 76 శాతంగా ఉన్నాయి. అయితే, 2019 నుంచి 2023 మధ్య అవి 36 శాతానికి పడిపోయాయి.

యుక్రెయిన్‌తో యుద్ధం సమయంలో చమురు దిగుమతుల వల్ల రష్యాతో భారత్ వాణిజ్యం పెరిగింది. గతేడాది రెండు దేశాల మధ్య 66 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 40 శాతం చమురు దిగుమతులు ఉంటే, 36 శాతం ఆయుధాల కొనుగోళ్లు ఉన్నాయి.

“చైనాను నియంత్రించాలంటే భారత్ కీలకం అని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు, సరిహద్దుల్లో చైనాను ఎదుర్కోవాలంటే పశ్చిమ దేశాల సాయం అవసరమని భారత్ భావిస్తోంది. ఈ అంశాల దృష్ట్యా భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు సృష్టించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి భావిస్తున్నారు” అని రాజన్ కుమార్ చెప్పారు.

“భారత్ రష్యాపై ఆధారపడకూడదు. చైనాను భారత్ ఎదుర్కోవాల్సి వస్తే రష్యా సాయం చేస్తుందని నమ్మలేం.1962 యుద్ధంలో భారత్‌కు రష్యా సాయం చేయలేదు. ఇప్పుడు రష్యా చైనాకు జూనియర్ భాగస్వామిగా మారింది. మాస్కో నాయకత్వం బీజింగ్ మీద ఎక్కువగా ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా కోరుకున్నట్లు పశ్చిమ దేశాలతో తన సంబంధాలను పరిమితం చేసుకోవడం సాధ్యం కాదు” అని డాక్టర్ కుమార్ విశ్లేషించారు.

“రష్యా సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పుడు కూడా ఇండో పసిఫిక్‌ను ఆసియా పసిఫిక్‌ అని పిలుస్తూ ఉండేది. అమెరికా మాత్రం ఇండో పసిఫిక్ అని పిలుస్తోంది” అని రాజన్ కుమార్ చెప్పారు.

చైనా 1962లో భారత్ మీద దాడి చేసినప్పుడు సోవియట్ యూనియన్ భారత్‌తో సన్నిహితంగా ఉంది. ఆ సమయంలో వర్థమాన దేశాలను నియంత్రించే విషయంలో చైనా రష్యా మధ్య పోటీ ఉండేది.

భారత్, పాకిస్తాన్, రష్యా  చైనా, భారత్ రష్యా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ విషయంలో రష్యా వైఖరిని ఎలా చూడాలి?

యుక్రెయిన్ విషయానికొస్తే, భారత్ తనతో ఉండాలని రష్యా కోరుకుంటుంటే, పశ్చిమ దేశాలు మాత్రం రష్యాకు వ్యతిరేకంగా ఉండాలని భావిస్తున్నాయి. అయితే, భారత్ మాత్రం సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడానికి తాము వ్యతిరేకం అనే వైఖరిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం, పాకిస్తాన్ విషయంలో రష్యా వైఖరిని కూడా ఇదే కోణంలో చూడవచ్చు.

రష్యా నీడ నుంచి భారత్ బయటపడలేకపోతోందని అమెరికా తరచుగా ఫిర్యాదు చేస్తోంది. పశ్చిమ దేశాల చైనా వ్యతిరేక వైఖరిలో భారత్ పావుగా మారిందని రష్యా ఆరోపిస్తోంది.

ఇది అంతర్జాతీయ వ్యవహారాల్లో పెరుగుతున్న భారత్ ప్రాబల్యానికి నిదర్శనంగా, అదే సమయంలో మరింత అయోమయంగా కనిపిస్తోంది.

2022 ఏప్రిల్‌లో అప్పటి అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్ భారత్‌ను సందర్శించారు. భారత్ మీద చైనా దాడి చేస్తే భారత్‌కు అండగా సాయం చేసేందుకు రష్యా ముందుకు రాదని ఆయన హెచ్చరించారు.

మే నెలలో భారత్ పాకిస్తాన్ మీద వైమానిక దాడులు చేసినప్పుడు, దీనికి ప్రతిగా పాక్ ప్రతిదాడులు చేసినప్పుడు పశ్చిమ దేశాలు కానీ, రష్యా కానీ భారత్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. అయితే, పాకిస్తాన్‌కు చైనా అన్ని రకాలుగా, పూర్తిగా అండగా నిలిచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS