Home LATEST NEWS telugu తాజా వార్తలు మెనోపాజ్: మహిళల లైంగిక జీవితం కూడా ఇక్కడితో ముగిసిపోతుందా

మెనోపాజ్: మహిళల లైంగిక జీవితం కూడా ఇక్కడితో ముగిసిపోతుందా

9
0

SOURCE :- BBC NEWS

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

20 ఏప్రిల్ 2025

సెక్స్ పట్ల కోరిక తగ్గడం, యోని పొడిబారడం, మానసిక స్థితిలో మార్పులు… చాలా మంది మహిళలు మెనోపాజ్ తర్వాత ఈ లక్షణాలను ఎదర్కొంటారు.

కొంతమందికి, ఈ లక్షణాలు మెనోపాజ్‌కి పది సంవత్సరాల ముందు నుంచే ప్రారంభమవుతాయి. దీనిని పెరిమెనోపాజ్ కాలం అంటారు.

40 ఏళ్ల సుసాన్ కెనడాలోని వాంకోవర్‌లో నివసిస్తున్నారు. ఆమె పెరిమెనోపాజ్ దశలో ఉన్నారు. ” సెక్స్ బాధాకరంగా ఉంటోంది. నాకు ఇప్పటికీ సెక్స్ చేయాలని అనిపిస్తోంది కానీ నొప్పి కారణంగా చెయ్యలేకపోతున్నా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే, ఈ దశ గురించి అవగాహనలేక.. డాక్టర్‌ని సంప్రదించడానికి కూడా చాలా సమయం పట్టింది” అని ఆమె అన్నారు.

మానవుల సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. అయితే మహిళలు మెనోపాజ్ ప్రారంభమైన తర్వాత వారి జీవితంలో మూడింట ఒక వంతు గడుపుతారు.

హార్మోన్ల మార్పుల కారణంగా, స్త్రీలలో ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత రుతుస్రావం ఆగిపోతుంది. దీనిని మెనోపాజ్ అంటారు. ఆ తరువాత, శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు సంభవిస్తాయి.

డాక్టర్ అజీజా సెసే ఇంగ్లండ్‌లో ఆరోగ్య విద్యను ప్రోత్సహిస్తున్నారు. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుదల వల్ల యోని పొడిబారడం తద్వారా బాధాకరమైన లైంగిక సంపర్కానికి దారితీస్తుందని ఆమె చెప్పారు.

అయితే, సమాజంలో మహిళలు సెక్స్ గురించి మాట్లాడటం నిషిద్ధంగా భావిస్తుంటారు. ‘‘చాలామంది మహిళలు లైంగిక సంపర్కం సమయంలో నొప్పిని అనుభవించడం సాధారణమని, ఆ బాధను భరించడం స్త్రీ బాధ్యత అని భావిస్తారు.” అని అజీజా అన్నారు.

ఇటువంటి నమ్మకాల కారణంగా, డాక్టర్‌ని సంప్రదించకుండా తమలోతాము బాధపడుతూ ఉంటారని డాక్టర్ అజీజా అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మానసిక ఒత్తిడి

ఫొటో సోర్స్, Getty Images

హార్మోన్లు, పైకి కనిపించని లక్షణాలు

ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ రెండూ లైంగిక కోరికకు కారణమయ్యే హార్మోన్లు అని డాక్టర్ సెసే చెప్పారు.

ఈ హార్మోన్లు స్త్రీల అండాశయాల నుంచి స్రవిస్తాయి. వాటి పరిమాణం క్రమంగా తగ్గుతున్న కొద్దీ, లైంగిక కోరికల పరంగా మార్పులు జరుగుతాయి.

జర్మనీలో నివసించే రోజీ వయస్సు 45 సంవత్సరాలు. 30 ఏళ్ల వయసులో ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయిన తర్వాత, గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స హిస్టెరెక్టమీ చేయించుకోవలసి వచ్చింది.

ఈ శస్త్రచికిత్స చాలా చిన్న వయస్సులోనే మెనోపాజ్‌కి దారితీసింది. ఆ తర్వాత తన శరీరం ఒక్కసారిగా మారిపోయిందని ఆమె బీబీసీకి తెలిపారు.

“నేను లైంగికంగా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ అకస్మాత్తుగా అంతా మారిపోయింది. నాకు ఎలాంటి శారీరక ఉద్రేకం కలగడంలేదు” అని రోజీ అన్నారు.

డాక్టర్ నజానిన్ మాలి కాలిఫోర్నియాలో సైకోథెరపిస్ట్, సెక్స్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. మెనోపాజ్ దశలో ఉన్న చాలా మంది మహిళలు లైంగిక సంబంధంలో బాధ కలుగుతోందనే సమస్య గురించి తనతో చెబుతారని ఆమె అన్నారు.

ఇందులో చిక్కుకుపోయినట్టు వాళ్లు బాధపడుతుంటారనీ, వాళ్లకు సెక్స్ కావాలని ఉన్నా అది బాధ కలిగించేలా ఉండకూడదనుకుంటారని ఆమె చెప్పారు.

అయితే యోని పొడిబారడం లేదా లైంగిక కోరికలు తగ్గడం వల్ల జీవితంలోని ఈ దశలో స్త్రీలు సెక్స్ పట్ల తక్కువ మొగ్గు చూపుతారు.

ఇంగ్లండ్‌లో నివసిస్తున్న 49 ఏళ్ల యాస్ అనే మహిళ, తనకు పదేపదే వచ్చే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల కారణంగా సెక్స్ చేయడానికి ఇష్టపడటం లేదు.

“నేను సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. సెక్స్ పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది” అని ఆమె బీబీసీకి తెలిపారు.

చాలా రోజుల వరకు, అది మెనోపాజ్‌కు సంబంధించినదని వైద్యులు కూడా గ్రహించలేదు.

ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తాయని డాక్టర్ సెసే అంటున్నారు.

“సాధారణంగా రుతుస్రావం లేదా పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన హార్మోనే ఈస్ట్రోజెన్ అని అనుకుంటారు. కానీ ఈస్ట్రోజెన్ చాలా ముఖ్యమైన హార్మోన్, మన జుట్టు నుంచి చర్మం వరకు శరీరం మొత్తం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.” అని సెసె అన్నారు.

“యోని, మూత్రనాళాన్ని తేమగా ఉంచడంలో ఈస్ట్రోజెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ హార్మోన్ స్థాయిలు తగ్గడం మొదలైనప్పుడు, ఆ ప్రాంతాల్లో చర్మం పల్చగా, పొడిగా, సున్నితంగా మారుతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.” అని సెసె అన్నారు.

అనేక సమాజాలలో, స్త్రీల లైంగికత పునరుత్పత్తి సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, వారి లైంగిక జీవితం మెనోపాజ్ తర్వాత ముగిసిపోతుందని భావిస్తారు.

“సమాజం మహిళలకు వారి యవ్వనం కారణంగా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, చాలా మంది మహిళలు మెనోపాజ్ దశలో నిరాశ చెందుతారు” అని డాక్టర్ మాలి అంటున్నారు.

అయితే దీనికి విరుద్ధంగా, మెనోపాజ్ తర్వాత మెరుగైన లైంగిక ఆనందాన్ని అనుభవిస్తున్నామని మరికొంతమంది మహిళలు చెబుతారని డాక్టర్ మాలి అన్నారు.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి?

ఈ మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఉన్నాయని డాక్టర్ మాలి అంటున్నారు. అనేక వైద్య, వైద్యేతర చికిత్సలు మహిళలు మెరుగైన లైంగిక జీవితాన్ని, ఆనందాన్ని సాధించడంలో సహాయపడతాయి.

65 ఏళ్ల హల్దిటా లండన్‌లో నివసిస్తున్నారు. ఇతర స్త్రీల మాదిరిగా ఆమెకు మెనోపాజ్ సమయం బాధాకరం కాదు.

“నేను 43 ఏళ్ల వయసులో నా భర్త నుంచి విడిపోయాను. 45-46 ఏళ్ల వయసులో నాకు పెరిమెనోపాజల్ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. నేను సంతోషంగా ఉన్నాను. రుతుక్రమం నుంచి విముక్తి పొందినట్టు అనిపించింది. ఆ తర్వాత, నా లైంగిక జీవితం చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా మారింది” అని ఆమె బీబీసీతో చెప్పారు.

పెరిమెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

కానీ మన శరీరం మార్పు చెందినప్పుడు, కొత్త విషయాలను గ్రహించి, మన ఆలోచనను కూడా మార్చుకోవాలి. “ఈ దశలో నాకు మంచి సెక్స్ అంటే ఏది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి” అని ఆమె చెప్పారు.

ఆమె ఫోర్ ప్లేపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు.

“యోనిలోని కండరాలలో మార్పుల వల్ల సున్నితత్వం తగ్గి ఉండవచ్చు. కాబట్టి మీరు వైబ్రేటర్ల వంటి సెక్స్ బొమ్మలను ఉపయోగించవచ్చు” అని ఆమె చెప్పారు.

అయినప్పటికీ మెనోపాజ్ లక్షణాలు మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే, వైద్యుల సలహా తీసుకోవాలని అని డాక్టర్ అజీజా అన్నారు.

‘‘అవసరమైతే ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లండి అంతేకానీ మీ సమస్య గురించి మాట్లాడడానికి సిగ్గుపడకండి’’ అని ఆమె అన్నారు.

డాక్టర్ సెసే చెప్పినదని ప్రకారం, హార్మోన్ పునరుద్ధరణ చికిత్స ముఖ్యమైన చికిత్స. దీన్ని పాచెస్, జెల్ లేదా టాబ్లెట్లు ద్వారా పొందవచ్చు.

మాత్రల నుంచి హార్మోన్లు నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశించడం కొంతమందికి హాని కలిగించవచ్చు. కానీ వాటిని నేరుగా యోనికి పూయడానికి కొన్ని ఆప్పన్స్ ఉన్నాయి.

రుతుక్రమం

ఫొటో సోర్స్, Getty Images

న్యూజీలాండ్‌లో నివసించే నేడాకు క్యాన్సర్ ఉన్నందున హెచ్ఆర్‌టీ(HRT) మాత్రలు వేసుకోవడానికి అనుమతి లేదు.

“నా లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి నేను హెచ్ఆర్‌టీ కోసం పట్టుబట్టినప్పుడు, యోని లోపల పూసే మందు నాకు ఇచ్చారు. నాకు క్యాన్సర్ ఉన్నందున, నా లైంగిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని వైద్యులు భావించారు” అని ఆమె చెప్పారు .

“లూబ్రికెంట్లు, వెజైనా మసాజ్ ఫ్లూయిడ్స్ వంటి వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని నేరుగా షాపు నుంచి తెచ్చుకోవచ్చు” అని డాక్టర్ అజీజా చెప్పారు. అయితే వాటి నాణ్యత చెక్ చేయాలని అజీజా అన్నారు.

మీ పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడితే, దాని కోసం ఫిజియోథెరపీ వ్యాయామాలు ఉన్నాయని డాక్టర్ మాలి చెప్పారు.

అయితే మెనోపాజ్ దశకు చేరుకున్నా, చేరుకోకపోయినా… మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, పండ్లు, కూరగాయలు తినాలని, సిగరెట్లు, మద్యం పూర్తిగా మానేయాలని మాలి సలహా ఇచ్చారు.

అలాగే బరువును అదుపులో ఉంచుకోవాలని కూడా ఆమె అన్నారు.

“మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థం కాదు. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, తొలగించడానికి ప్రయత్నించండి” అని డాక్టర్ సెసే నొక్కి చెప్పారు.

మహిళలు ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నిస్తారని, తాము సూపర్ ఉమెన్ అన్నట్లు భావిస్తారని సెసే అన్నారు.

‘‘అలా చేయకుండా సహాయం అడగండి, మీకు సహాయం అడగడం కష్టంగా అనిపిస్తే, కనీసం ఎవరైనా స్వయంగా చేస్తుంటే అంగీకరించండి” అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS