Home జాతీయ national telgu మెట్లు ఎక్కితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో తెలుసా?

మెట్లు ఎక్కితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో తెలుసా?

4
0

SOURCE :- BBC NEWS

మెట్లు ఎక్కితే ప్రయోజనాలు

ఫొటో సోర్స్, Getty Images

మెట్లను ఎక్కడం కంటే లిఫ్ట్ లేదా ఎస్కలేటర్‌లో వెళ్లడానికి చాలాంది ఇష్టపడుతుంటారు. అయితే, రోజులో కొన్ని మెట్లు ఎక్కినా అది మీ శరీరానికి, మనసుకు సహాయపడుతుంది.

2021 సెప్టెంబర్ 3న సీన్ గ్రీస్లీ అనే వ్యక్తి 23 గంటల కంటే తక్కువ సమయంలో ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు సరిపోయేంత మెట్లు (8,849 మీటర్లు) ఎక్కి దిగాడు. చివరికి అతనికి చాలా చెమటలు పట్టాయి, ఎక్కువగా నడవలేకపోయాడు కూడా. కానీ ఆయన లాస్ వెగాస్‌లోని తన ఇంటి లోపలే ఇదంతా చేశారు.

గ్రీస్లీ ఇప్పుడు ఎవరెస్ట్ అంత ఎత్తును వేగంగా(22 గంటల 57 నిమిషాల 2 సెకన్లు) ఎక్కి దిగిన రికార్డును నెలకొల్పారు.

కొంతమంది మెట్లు ఎక్కడాన్ని మరొక స్థాయికి తీసుకువెళతారు. ఉదాహరణకు, “టవర్ రన్నింగ్” అనేది ఎత్తైన భవనాల మెట్లపై పరుగెత్తే ఒక రేస్. దీనికి టవర్ రన్నింగ్ అసోసియేషన్, ఎక్కువగా మెట్లు ఎక్కిన వారికి ప్రపంచ ర్యాంకింగ్ కూడా ఉంది.

మనలో చాలామంది ఆ రికార్డులను బద్దలు కొట్టలేం కానీ, రోజూ మెట్లు ఎక్కి, దిగితే అది గుండె ఆరోగ్యాన్ని, మెదడు శక్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ విధానంలో పరిగెత్తాల్సిన అవసరం లేదు, వేగంగా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మెట్లు ఎక్కడం

ఫొటో సోర్స్, Getty Images

జ్ఞాపకశక్తికి..

సీనియర్ సిటిజన్స్ మెట్లు ఎక్కితే అది వారి బ్యాలెన్స్, దిగువ శరీరం బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వారు పడిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

కొన్ని మెట్లు ఎక్కినా అది జ్ఞాపకశక్తి, సృజనాత్మక ఆలోచనలకు సహాయపడుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.

మెట్లు ఎక్కడం అనేది ఒక వ్యాయామం. చిన్న చిన్న కదలికలు కూడా గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇంట్లో మెట్లు ఎక్కడం జిమ్‌లో స్టెయిర్ మెషీన్లను ఉపయోగించినంత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇంట్లో, కార్యాలయంలో బహిరంగ ప్రదేశాలలో ఇలా మెట్లు ప్రతిచోటా ఉంటాయి. లిఫ్ట్ లేదా ఎస్కలేటర్‌కు బదులుగా మెట్లు ఎంచుకోవడం మనకు సులభమైన రోజువారీ వ్యాయామాన్ని అందిస్తుంది.

“ఇది దాదాపు ప్రతి ఒక్కరూ చేయగలిగే వ్యాయామం. ఎందుకంటే అవి అందుబాటులో ఉంటాయి, రోజూ ఉపయోగించొచ్చు” అని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఆరోగ్య పరిశోధకుడు అలెక్సిస్ మార్కోట్-చెనార్డ్ చెప్పారు.

వ్యాయామం, ఆహారం గుండె జబ్బులను తగ్గించడంలో ఎలా సహాయపడతాయో అలెక్సిస్ అధ్యయనం చేస్తున్నారు. మెట్లు ఎక్కడం వంటి చిన్న వ్యాయామాలు, పగటిపూట ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయం చేయడం సహాయకరంగా ఉంటుందని ఆయన సూచించారు.

“మీరు వ్యాయామం చేసేటప్పుడు, మీకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు” అని అలెక్సిస్ చెప్పారు.

“మీరు మీ శరీరాన్ని, మెట్లను మాత్రమే ఉపయోగిస్తారు. మీరు రోజులో ఇలా చేస్తుంటే, మీ సమయాన్ని ఓ గంట వర్కవుట్ కోసం కేటాయించాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.

ఇంతకీ, మెట్లు ఎక్కడమనేది ఎందుకు అంత మంచి వ్యాయామం?

మెట్లు ఎక్కడం

ఫొటో సోర్స్, Getty Images

ఇతర వ్యాయామాల కంటే మెట్లు ఎక్కడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.

“మీరు వేగంగా నడవడంతో పోలిస్తే మెట్లు ఎక్కడం వల్ల మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆక్సిజన్ ఎక్కువ వినియోగించేలా చేస్తుంది. ఎందుకంటే మెట్లు ఎక్కడం అంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయడం” అని అలెక్సిస్ చెప్పారు.

“ఇక కండరాల గురించి మాట్లాడితే.. ఇది ప్రధానంగా దిగువ శరీరానికి పని చేస్తుంది. దిగువ శరీరం బలంగా ఉంటే మంచి ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు సంకేతం” అని అన్నారు.

మెట్లు దిగితే ఎక్కువ ప్రయోజనం..

జిమ్‌లో ఉండే స్టెయిర్ మెషీన్ కంటే నిజమైన మెట్లను వాడితే కలిగే ప్రయోజనంలో మరొకటి కిందకి వెళ్లగలగడం.

మానవుని తొడ కండరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి: మీరు పైకి వెళితే, కండరాలు కుంచించుకుపోతాయి(కాన్సెంట్రిక్ కాంట్రాక్షన్), కిందికి వెళితే కండరాలు సాగుతాయి(ఎస్సెంట్రిక్ కాంట్రాక్షన్).

పైకి వెళ్లేటపుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం, వ్యాయామం సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి, కష్టంగా అనిపిస్తుంది. కానీ, కిందికి వచ్చేటపుడు కండరాలు బలంగా కావడానికి సహాయపడతాయి.

స్వీడన్‌లోని ఉమియా వర్సిటీ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ఆండ్రియాస్ స్టెన్లింగ్, వ్యాయామం కాలక్రమేణా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తున్నారు.

యువకులు మెట్లు ఎక్కిన తర్వాత అది వారి ఆలోచనా నైపుణ్యాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఆండ్రియాస్ బృందం పరిశీలించింది.

మెట్లు ఎక్కడం వల్ల మార్పు(మనం ఒక పని నుంచి మరొక పనికి ఎంత సులభంగా వెళ్తాం) సామర్థ్యం మెరుగుపడుతుందని వారు కనుగొన్నారు.

జపాన్‌లో జరిపిన ఒక అధ్యయనంలో లిఫ్ట్ ఉపయోగించిన వారి కంటే రెండు ఫోర్ల మెట్లు ఎక్కిన వ్యక్తులు సమస్యలను బాగా పరిష్కరించుకుంటారని తేలింది. కానీ ఐదు లేదా ఎనిమిది ఫ్లోర్ల మెట్లు ఎక్కడం వల్ల వారిలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం కనిపించలేదు.

మరొక అధ్యయనంలో మెట్ల మీద నడవడం వల్ల ప్రజలు మరింత సృజనాత్మకంగా ఆలోచించడానికి సహాయపడిందని, లిఫ్ట్ ఉపయోగించిన వారి కంటే మెట్లు ఎక్కినవారిలో 61 శాతం ఎక్కువ కొత్త ఆలోచనలు వస్తున్నాయని తేలింది.

‘మంచి నిద్ర అవసరం’

మెట్లు ఎక్కిన తర్వాత మంచి నిద్ర ఉంటే మరుసటి రోజు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఇటీవలి ఒక అధ్యయనంలో తేలింది.

ఫిట్‌నెస్ లక్ష్యంగా రోజుకు 10,000 అడుగులు వేయడం గురించి మనం తరచుగా వింటుంటాం. కానీ ఆ సంఖ్య సైన్స్ నుంచి రాలేదు, ఇది 1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా ప్రారంభమైంది.

వాస్తవానికి, కొన్ని పరిశోధనలు దాదాపు 7,500 అడుగులు వేసిన తర్వాత ప్రయోజనాలు తగ్గుతాయని చెబుతున్నాయి.

మెట్లు ఎక్కడానికి ఇంకా స్పష్టమైన లక్ష్యం లేదు, కానీ కొన్ని అధ్యయనాలు రోజుకు ఐదు కంటే ఎక్కువ ఫ్లోర్లు ఎక్కడం (సుమారు 50 అడుగులు) వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నాయి.

మోకాలి సమస్యలు ఉన్నవారికి మెట్లు ఎక్కడం బాధాకరంగా అనిపించవచ్చు. మహిళలు, అధిక బరువు ఉన్నవారు వంటి కొంతమంది మరొక ఎంపిక ఉంటే మెట్లను ఉపయోగించే అవకాశం తక్కువ.

అయినప్పటికీ, చాలామందికి లిఫ్ట్ కంటే మెట్లు ఎంచుకోవడం ఒక సాధారణ, ఆరోగ్యకరమైన ఎంపిక.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)