Home జాతీయ national telgu మృత్యుంజ‌య్ రివ్యూ: శ్రీవిష్ణు క్రైం థ్రిల్లర్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుందా?

మృత్యుంజ‌య్ రివ్యూ: శ్రీవిష్ణు క్రైం థ్రిల్లర్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుందా?

14
0

SOURCE :- BBC NEWS

మృత్యుంజ‌య్' సినిమా రివ్యూ, శ్రీ‌విష్ణు

ఫొటో సోర్స్, YT/Think Music Telugu and Lightbox Media

ద‌శాబ్దాల కిందట సీనియర్ హీరోల సినిమాలు ఒకే రోజు రెండు విడుద‌లైన సంద‌ర్భాలున్నాయి. కొన్నేళ్ల కిందట నాని కూడా ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ చేశాడు.

అయితే, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ రావడంతో పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి ఒక‌టి కూడా రావడం గగనమైపోయింది.

కానీ, శ్రీ‌విష్ణు గ‌తవారం ‘విష్ణు విన్యాసం’ విడుదల చేసి, ఈ వారం ‘మృత్యుంజ‌య్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

అయితే, ఈ రెండూ డిఫ‌రెంట్ జోన‌ర్ కావ‌డం మరో విశేషం. ఇంతకీ సినిమా ఎలా ఉంది? శ్రీ‌విష్ణుకి హిట్ దక్కిందా?

మృత్యుంజ‌య్' సినిమా రివ్యూ, శ్రీ‌విష్ణు

ఫొటో సోర్స్, YT/Think Music Telugu and Lightbox Media

క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌

మృత్యుంజ‌య్ సినిమా క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌. క‌థ విషయానికొస్తే, జ‌య్ (శ్రీ‌విష్ణు) ఒక న్యూస్ పేప‌ర్ ఆఫీస్‌లో ప్రకటనలు సేక‌రించే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయనకు క్రైం రిపోర్ట‌ర్ కావాల‌నేది కోరిక‌. అయితే, అనుభ‌వం లేకపోవడంతో ఆ జాబ్ రాదు.

హీరో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. శ్ర‌ద్ధాంజ‌లి యాడ్స్ సేక‌రించ‌డం, దీనికిగాను చ‌నిపోయిన వాళ్ల హాబీలు, కులం, మ‌తం అన్నీ ముందే తెలుసుకుని, ఆ వేషాల్లో వెళ్లి వాళ్ల‌ని ఒప్పించి యాడ్స్ సంపాదిస్తాడు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఓ ఇద్ద‌రి వివరాలు సేకరిస్తాడు.

వాళ్ల‌లో అచ్యుత్ శ‌ర్మ అనే వ్యక్తి కూతురి(బేబీ ఊహ)తో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్‌ అవుతాడు హీరో. ఆ ప‌సిపాప మా నాన్న ఎలా చ‌నిపోయాడ‌ని అడుగుతుంది.

హీరోది కూడా చిన్న‌ప్పుడే అమ్మానాన్న‌ల‌ని కోల్పోయిన నేప‌థ్యం. దాంతో ఈ మ‌ర‌ణాలు ఎలా జ‌రిగాయ‌నే ప‌రిశోధ‌న‌కి దిగుతాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మృత్యుంజ‌య్' సినిమా రివ్యూ, శ్రీ‌విష్ణు

ఫొటో సోర్స్, YT/Think Music Telugu and Lightbox Media

పాప కోసం ఏం చేస్తాడు?

ఈ కేసుని చూస్తున్న ఏసీపీ సీత (రెబ్బ మోనికా)కి త‌న‌కి తెలిసిన విష‌యాలు చెబుతాడు హీరో. అయితే, ఆమె న‌మ్మ‌దు. దీంతో, చివ‌రికి హంత‌కుడిని హీరో ఎలా ప‌ట్టుకున్నాడనేది మిగ‌తా క‌థ‌.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ కథలను అనేక భాష‌ల్లో మ‌నం చాలా చూశాం. బేసిక్‌గా హంత‌కుడెవ‌రో ప్రేక్ష‌కుల‌కి చివ‌రి వ‌ర‌కూ తెలియ‌కుండా ఉండ‌టం ఒక జాన‌రైతే, కిల్ల‌ర్ ఎవ‌రో ప్రేక్ష‌కుల‌కి తెలుస్తుంది, హీరోకి మాత్రం తెలియ‌దు. ఇదో జోన‌ర్‌.

మృత్యుంజ‌య్‌లో కిల్ల‌ర్‌కి త‌న‌ని వెతుకుతున్న హీరో గురించి తెలుసు. అత‌న్ని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటాడు. ప్ర‌మాదం ఉందని హీరోకి తెలిసినా కిల్ల‌ర్‌ను వెతుకుతూ ఉండ‌టమే థ్రిల్‌కు గురిచేస్తుంది.

మృత్యుంజ‌య్' సినిమా రివ్యూ, శ్రీ‌విష్ణు

ఫొటో సోర్స్, YT/Think Music Telugu and Lightbox Media

కొత్తగా ప్రయత్నించిన శ్రీ‌విష్ణు

శ్రీ‌విష్ణు త‌న‌కి అల‌వాటైన కామెడీ నుంచి బ‌య‌టికొచ్చి ఈ సినిమాలో డిఫ‌రెంట్‌గా న‌టించాడు. ఒక సామాన్యుడిలా, తెలివిని ఉప‌యోగించి హంత‌కుడిని ఎలా ప‌ట్టుకున్నాడ‌నేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం. అయితే, ఈ పిల్లి, ఎలుక ఆట‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లలేపోయాడు దర్శకుడు.

క‌థ కొత్త‌గా ఉంది. రొటీన్ పాట‌లు, ఫైట్స్‌, హీరోయిన్ ట్రాక్, కామెడీ ఎపిసోడ్స్ ఏమీ లేకుండా జాగ్ర‌త్త తీసుకున్నారు. ర‌న్‌టైం కూడా రెండు గంట‌లే ఉంది. ఎడిట‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ర‌న్‌టైం విష‌యంలో పనితనం చూపించారు. అయితే, క‌థ‌ని ప్రేక్షకుడికి రిజిస్ట‌ర్ చేయ‌డంలో, క‌థ‌నం థ్రిల్లింగ్‌గా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు హుస్సేన్‌షా కిర‌ణ్ తడబడ్డారు.

మృత్యుంజ‌య్' సినిమా రివ్యూ, శ్రీ‌విష్ణు

ఫొటో సోర్స్, YT/Think Music Telugu and Lightbox Media

క‌న్విన్సింగ్‌గా లేని కథనం

విలన్ పాత్ర సైకో కాన‌ప్పుడు అమాయ‌కుల్ని ఎందుకు చంపాడ‌నే సందేహం ప్రేక్షకుడి మదిలో ఉండిపోతుంది. హీరో కేవ‌లం పాత‌ ఎమోష‌న్‌కి క‌నెక్ట్ కావడం, మనస్సుకు హ‌త్తుకునే స‌న్నివేశాలు లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుడు లీనం కాకుండా, త‌న‌కి సంబంధం లేని క‌థ‌ని చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది.

అయితే, ఈ త‌ర‌హా క‌థ‌ల్ని ఇష్ట‌ప‌డే వాళ్ల‌కి సినిమా నచ్చే అవ‌కాశం ఉంది. విల‌న్‌గా వీర్ ఆర్య‌న్ బాగా న‌టించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనం జస్ట్ ఓకే.

శ్రీ‌విష్ణు భుజాల మీదే సినిమా న‌డిచింది కాబ‌ట్టి, విల‌న్ మిన‌హా మిగ‌తా వాళ్ల గురించి చెప్ప‌డానికేం లేదు. విష్ణుకి యూత్‌లో క్రేజ్‌, బ‌జ్ ఉంది. అయితే, సినిమా మొత్తం తానే క‌న‌బ‌డ‌టం, క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్ప‌ట‌డుగులు ముందుముందు ఆయనకు మైన‌స్‌ కావొచ్చు.

ప్ల‌స్ పాయింట్స్:

1.శ్రీ‌విష్ణు న‌ట‌న‌

2.నిడివి

మైన‌స్ పాయింట్స్:

1. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

2. క‌థ‌నంలో ఎమోష‌న్‌, వేగం లోపించ‌డం

ఫైన‌ల్‌గా హంత‌కుడు తెలుస్తాడు కానీ, హ‌త్య‌ల‌కి మోటివ్ ఏంటో తెలియ‌దు.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)