SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ISRO
భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను లాంచ్ చేసి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 50వ యేడు ప్రారంభం నుంచే ఆర్యభట్ట ఉపగ్రహానికి చెందిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
1975 ఏప్రిల్ 19న సోవియట్ కాస్మోస్-3ఎం రాకెట్ ద్వారా భారత్‌లోనే పూర్తిగా డిజైన్ చేసి, తయారు చేసిన దేశీయ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను రష్యాలోని కపుస్తిన్ యర్ అనే పట్టణం నుంచి లాంచ్ చేశారు.
కేవలం 36 నెలల్లోనే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఉడుపి రామచంద్ర రావు (యూఆర్ రావు) బృందం తయారు చేసింది.
భారత్‌లో శాటిలైట్ ప్రోగ్రామ్‌కు ఆర్యభట్ట ప్రయోగం పునాది వేసింది. ఈ ప్రయోగాత్మక శాటిలైట్‌ను డిజైన్, డెవలప్, టెస్ట్‌ల నుంచి లాంచ్ చేసేంత వరకు అవసరమైన మౌలిక సదుపాయాలను, మానవ వనరులను సేకరించడం 1970 నాటికి ఇస్రోకు తలకు మించిన భారమే.
బెంగళూరులో గృహ పరిశ్రమ ( కాటేజ్ ఇండస్ట్రీ)లకు నిలయమైన పీణ్యలో ఒక చిన్న ఇంట్లో ఆయన పనిని ప్రారంభించారు.
దేశంలోని పలు ప్రముఖ సంస్థల ఇంజనీర్లు, శాస్త్రవేత్తల బృందాన్ని యూఆర్ రావు పిలిపించారు.
యూఆర్ రావు నేతృత్వంలో వారంతా ఆర్యభట్టను రూపొందించి, ఏప్రిల్ 1975లో లాంచ్ చేసేందుకు అప్పటి సోవియట్ రష్యాకు అప్పజెప్పారు.
చాలా పరిమిత వనరులతోనే భారత్ తన శాటిలైట్ కార్యక్రమాలను ప్రారంభించింది. తొలి ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు, ఏదో ఒకరోజు భారతీయ స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడిపైకి కూడా వెళ్తుందని బహుశా ఎవరూ ఊహించి కూడా ఉండరు.

తొలుత ఈ ఉపగ్రహాన్ని అమెరికా సాయంతో స్కౌట్ లాంచ్ వెహికిల్ ద్వారా లాంచ్ చేయాలనుకున్నట్లు గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ రిపోర్టులో పేర్కొంది. ఈ మల్టి స్టేజ్ రాకెట్ అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుందని భారత్ భావించినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
అయితే, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి భారత రాయబారి ద్వారా సోవియట్ రష్యా ఒక సందేశాన్ని పంపినట్లు ఈ రిపోర్టులో ఉంది.
దీనిలో, భారత్ స్వదేశంగా డిజైన్ చేసి, రూపొందించిన తన తొలి ఉపగ్రహాన్ని లాంచ్ చేసేందుకు సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
భారత్, అమెరికాల మధ్య భాగస్వామ్యంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసినట్లు గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ రిపోర్టు పేర్కొంది. అలా చివరికి భారత్ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ సాయంతో లాంచ్ చేయాలని నిర్ణయించినట్లు ఈ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, isro, Twitter
ఈ ఒప్పందంలో భాగంగా.. ఇస్రో శాటిలైట్ సిస్టమ్స్ ప్రాజెక్టును బెంగళూరు శివారులో పీణ్య వద్ద ఏర్పాటు చేశారు. అందుకే, యూఆర్ రావు ఎంపిక చేసిన 200 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అక్కడ పనిచేశారు.
ఆర్యభట్ట లాంచ్‌తో అంతరిక్ష పరిశోధనలో భారత్ తన దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేందుకు తొలి కీలక అడుగు పడింది.
ఆర్యభట్టను తయారు చేసింది పెద్దగా అనుభవం లేని ఒక యువ శాస్త్రవేత్తల బృందం.
5వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరును ఈ శాటిలైట్‌కు పెట్టారు. ఈ శాటిలైట్‌ను ప్రయోగించిన ఏప్రిల్ 19వ తేదీని ప్రతి ఏడాది శాటిలైట్ టెక్నాలజీ డేగా జరుపుతుంటారు.
358 కేజీల బరువున్న ఈ ఉపగ్రహాన్ని, షట్కోణం ఆకారంలో, 26 సైడ్స్‌తో రూపొందించారు. ఈ ఉపగ్రహానికి ప్రధాన పవర్ సోర్సులుగా దాని బాడీ అంతా (పైన, కింద వదిలేసి) సోలార్ సెల్స్, నికెల్ కాడ్మియం (ఎన్ఐ-సీడీ ) బ్యాటరీలను పెట్టారు.
ఈ ఉపగ్రహానికి ఉన్న పై భాగం, అడుగు భాగం తప్ప 24 సైడ్స్‌కు సోలార్ ప్యానల్స్‌ను 46 వాట్స్ పవర్ కోసం వాడారు. అలా ఉత్పత్తి చేసిన పవర్‌ను బ్యాకప్ కోసం 10 ఆంపియర్- అవర్ కెపాసిటీతో నికెల్ కాడ్మియం బ్యాటరీలను వాడారు.
అయితే, పవర్ ఫెయిల్యూర్‌తో కక్ష్యలోకి వెళ్లిన 4 రోజుల తర్వాత పరిశోధనలు ఆగిపోయాయి. ఆపరేషన్‌లోకి వెళ్లిన 5 రోజుల తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్ తన సిగ్నల్స్ అన్నింటినీ కోల్పోయింది. అయితే, మార్చి 1981 వరకు ఈ స్పేస్‌క్రాఫ్ట్ మెయిన్‌ఫ్రేమ్‌లో ఎలాంటి సమస్య రాలేదు.

ఫొటో సోర్స్, www.isro.gov.in
ఈ ఉపగ్రహం అభివృద్ధి దశలో ఉన్నప్పుడే తుది వెర్షన్‌కు చెందిన సుమారు సగం పరిమాణాన్ని ఒక పెద్ద బెలూన్‌లో కట్టి 1973 మే నెలలో హైదరాబాద్‌లో 25 కి.మీల ఎత్తుకు ఎగరవేసి పరీక్షించారు. అలాగే, ఈ ఉపగ్రహ ఇంజనీరింగ్ మోడల్‌ను కూడా 1975 జనవరిలో శ్రీహరికోట నుంచి హెలికాప్టర్‌లో తీసుకెళ్లి పరీక్షించారు.
ఈ ఉపగ్రహానికి చెందిన నాలుగు మోడల్స్‌ను మూడేళ్ల కాలంలో, శాటిలైట్ హార్డ్‌వేర్‌కు సంబంధించి ఎలాంటి అనుభవం లేని యువ శాస్త్రవేత్తల బృందం ప్రొఫెసర్ యూఆర్ రావు నేతృత్వంలో రూపొందించింది. అప్పటి ఇస్రో చైర్మన్, ప్రొఫెసర్ సతీశ్ ధవన్ ఈ ప్రాజెక్టుకు అవసరమైన సలహాలు ఇచ్చారు.
ఆర్యభట్ట ఉపగ్రహం లాంచ్ తర్వాత, కొన్నేళ్ల తర్వాత యూఆర్ రావు ఇస్రో చైర్మన్ అయ్యారు. 1984 నుంచి 1994 వరకు ఆ పదవిలో ఉన్నారు. అప్పటి నుంచి యూఆర్ రావు దేశంలో రూపొందించిన ప్రతి ఉపగ్రహ తయారీ ప్రక్రియలో ఏదో ఒక రూపంలో పాలుపంచుకునేవారు. విక్రమ్ సారాభాయి స్టూడెంటే యూఆర్ రావు.
దేశంలో శాటిలైట్ ప్రోగ్రామ్‌ను నడిపించేందుకు ఒక బాధ్యాతయుతమైన వ్యక్తి కావాలని సారాభాయి కోరుకున్నారని, అందుకే మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఆయన్ను పిలిపించి, శాటిలైట్ ప్రోగ్రామ్ పనిని అప్పజెప్పారని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. కస్తూరి రంగన్ అంతకుముందు ఒక సందర్భంలో చెప్పారు.
అయితే, స్వదేశీయంగా తయారు చేసిన ఆర్యభట్ట శాటిలైట్‌ను లాంచ్ చేయడానికి కొన్ని రోజుల ముందే ఇస్రో ఫౌండర్ విక్రమ్ సారాభాయి మరణించారు. దీంతో, ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ తీవ్ర సంక్షోభంలో పడినట్లు కనిపించింది.
ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ యూఆర్ రావు, ఆయన బృందం ఉపగ్రహం పనిని పూర్తి చేసి, లాంచ్ తేదీని నిర్ణయించింది.

ఫొటో సోర్స్, ISRO
ఉపగ్రహం ఎన్ని రకాల పరిశోధనలు చేసింది?
ఆర్యభట్టను తొలుత అప్పటి సోవియట్ రష్యాలోని బేర్‌లేక్ లోని గ్రౌండ్ స్టేషన్ నుంచి కంట్రోల్ చేసేవారు. ఆ తర్వాత శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఆపరేట్ చేశారు.
ఈ ఉపగ్రహం పంపించే డేటాను పొందేందుకు, శాటిలైట్‌కు కమాండింగ్ కోసం శ్రీహరికోటలో ప్రధాన గ్రౌండ్ స్టేషన్ ఉంది. శాటిలైట్ డేటాను స్వీకరించి, ఉపగ్రహ స్థితి ఎలా ఉందో వెంటనే తెలుసుకునేందుకు ప్రాథమిక పరిశీలన చేపట్టేవారు.
ఆర్యభట్ట ఉపగ్రహం లాంచ్‌తో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, భవిష్యత్‌లో శాటిలైట్ మిషన్లు ఎలా ఉండాలనే దానిపై ఒక అవగాహన వచ్చింది.
తర్వాత తరానికి చెందిన భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఆర్యభట్ట ఒక స్ఫూర్తిగా నిలిచింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)