Home జాతీయ national telgu భారత జెండాతో ఉన్న నౌకలపై ఇరాన్ కాల్పులు, అసలేం జరిగిందని ట్రంప్‌కు ప్రశ్న.. ఆయన ఏమన్నారు?

భారత జెండాతో ఉన్న నౌకలపై ఇరాన్ కాల్పులు, అసలేం జరిగిందని ట్రంప్‌కు ప్రశ్న.. ఆయన ఏమన్నారు?

16
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP via Getty Images

4 గంటలు క్రితం

చదివే సమయం: 6 నిమిషాలు

హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ కాల్పులు జరపడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల ఘటనతో నౌకలు తమ మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

దీనిపై, భారత విదేశీ వ్యవహారాల శాఖ శనివారం సాయంత్రం న్యూదిల్లీలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీని పిలిపించి, నిరసన తెలిపింది.

మరోవైపు, శనివారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఈ కాల్పుల గురించి సీబీఎస్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నించారు.

అయితే, ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

రెండు నౌకలపై కాల్పులు జరిగాయని అడిగిన ప్రశ్నకు ట్రంప్ కేవలం ‘థాంక్యూ’ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించారు. సమావేశం చివర్లో ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

కాగా, కాల్పుల ఘటనపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక ప్రకటన విడుదల చేశారు.

“భారత నౌకల మీద జరిగిన కాల్పుల ఘటనపై, శనివారం సాయంత్రం ఇరాన్ రాయబారితో జరిగిన భేటీలో విదేశాంగ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు భారత్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు వచ్చే పలు నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా గతంలో ఇరాన్ సహాయం చేసిన విషయాన్ని కూడా విదేశాంగ కార్యదర్శి గుర్తు చేశారు. భారత్ వైపు వచ్చే నౌకల సురక్షిత ప్రయాణాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

భారత్ పేర్కొన్న అంశాలను ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆ దేశ రాయబారి హామీ ఇచ్చారు.

భారత్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. “ఇరాన్, భారత్ మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ ఘటన గురించి సమాచారం లేదు. అంతా సవ్యంగా జరుగుతుందని, సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా” అని తెలిపారు.

సన్మార్ హెరాల్డ్ చమురు ట్యాంకర్

ఫొటో సోర్స్, Marinetraffic

అసలేం జరిగింది?

బీబీసీ పర్షియన్‌, ట్యాంకర్ల రాకపోకలను పర్యవేక్షించే ‘ట్యాంకర్‌ట్రాకర్స్’ వెబ్‌సైట్ ప్రకారం, భారత నౌకలపై ‘కాల్పులు’ జరిగాయి. హార్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో ప్రయాణిస్తున్న రెండు భారత నౌకలను వెనక్కి వెళ్లాల్సిందిగా ఐఆర్‌జీసీ నావికాదళం ఆదేశించిందని ‘ఛానల్ 16 ఆడియో రికార్డింగ్’ను ఉటంకిస్తూ ట్యాంకర్‌ట్రాకర్స్ తెలిపింది.

బీబీసీ వెరిఫై తెలిపిన వివరాల ప్రకారం, జలసంధిని మళ్లీ తెరుస్తున్న సమయంలో భారత జెండా ఉన్న రెండు నౌకలు – కార్గో షిప్ జగ్ అర్నవ్, చమురు ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్‌లను తమ నిర్ణీత మార్గం నుంచి తప్పుకోవాలని ఐఆర్‌జీసీ ఆదేశించింది.

దీనికిముందు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) తెలిపిన వివరాల ప్రకారం, హార్ముజ్ జలసంధిలో ఒక ట్యాంకర్‌పై ఐఆర్‌జీసీ కాల్పులు జరిపింది. ఈ ఘటన ఒమన్‌కు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగింది. అయితే ట్యాంకర్, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

మారిటైమ్ ట్రాఫిక్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటల సమయానికి ‘జగ్ అర్నవ్’ కార్గో షిప్ హార్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లి, పర్షియన్ గల్ఫ్‌లో యూఏఈ వైపునకు వెళ్లింది. ఈ జగ్ అర్నవ్ భారతీయ నౌక, ఇందులో భారత సిబ్బంది ఉన్నారు. ఇక, ముడి చమురు ట్యాంకర్ ‘సన్మార్ హెరాల్డ్’ కూడా పర్షియన్ గల్ఫ్‌లో అదే వైపున ఉంది. ఈ నౌక గమ్యస్థానం భారత్.

అంతకుముందు, ట్యాంకర్ ట్రాఫిక్ ‘ఎక్స్’ లో ఒక ఆడియోను పోస్ట్ చేసింది. అది సన్మార్ హెరాల్డ్‌కు సంబంధించినదిగా పేర్కొంది. ఆ ఆడియోలో.. నౌక ప్రయాణానికి ముందే అనుమతి లభించిందని సిబ్బంది ఒకరు స్పష్టంగా చెబుతుండటం వినిపిస్తోంది.

ఆ ఆడియోలో “సెపా నేవీ, సెపా నేవీ, ఇది సన్మార్ హెరాల్డ్. మీరు మాకు వెళ్లడానికి క్లియరెన్స్ ఇచ్చారు. సెపా నేవీ, ఇది సన్మార్ హెరాల్డ్. మీరు మాకు అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో మా పేరు రెండో నంబర్‌లో ఉంది. ఇప్పుడు మీరు కాల్పులు జరుపుతున్నారు. వెనక్కి వెళ్లేందుకు దయచేసి మాకు అవకాశం ఇవ్వండి” అనే మాటలు వినిపించాయి.

ఐఆర్‌జీసీ నావికా విభాగాన్ని ‘సెపా నేవీ’ అని కూడా పిలుస్తారు.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

యుద్ధం మొదలైనప్పటి నుంచి సముద్రంలోనే..

ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం మొదలవడంతో కెప్టెన్ రమన్ కపూర్ తన 23 మంది సిబ్బందితో కలిసి హార్ముజ్ జలసంధి వద్ద ఒక ముడి చమురు ట్యాంకర్‌లో చిక్కుకుపోయారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తమ సిబ్బంది అయోమయంలో ఉన్నారని కెప్టెన్ కపూర్ బీబీసీ వరల్డ్ సర్వీస్ వీకెండ్ కార్యక్రమంలో తెలిపారు. గత కొన్ని వారాలుగా తమ నౌక సమీపంలో అనేక మిసైళ్లను, ఒక పేలుడును చూసినట్లు ఆయన చెప్పారు.

అయినప్పటికీ, తాము ఎంతో ఓపికతో, ప్రొఫెషనల్‌గా వేచి చూస్తున్నామని.. “మా ఇళ్లకు తిరిగి వెళతామని ఆశిస్తున్నాం” అని కపూర్ పేర్కొన్నారు.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP via Getty Images

జలసంధిలో తగ్గిన రాకపోకలు

హార్ముజ్ జలసంధి తెరిచే ఉందని ఘటనకు ఒక రోజు ముందే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దీన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్వాగతించారు. కానీ, ఆ తర్వాత ఐఆర్‌జీసీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మళ్లీ ఆ జలసంధిపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించాయి.

అమెరికా దిగ్బంధం ముగిసే వరకు హార్ముజ్ జలసంధి మూసి ఉంటుందని, దగ్గరకు వచ్చే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ నావికాదళం హెచ్చరించింది.

ఇరాన్ రేవులపై అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు, హార్ముజ్ జలసంధిని శనివారం సాయంత్రం నుంచి మూసివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది.

“పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలో ప్రస్తుతం ఉన్న ఏ నౌక కూడా ముందుకు కదలకూడదు” అని ఆ ప్రకటన పేర్కొంది.

గత రాత్రి నుంచి కొన్ని నౌకలు తమ నిఘాలో ఈ జలసంధి ద్వారా ప్రయాణించాయని, అయితే అమెరికా దిగ్బంధం తొలగించే వరకు ఈ జలమార్గం మళ్లీ మూసి ఉంటుందని తెలిపింది.

“హార్ముజ్ జలసంధి సమీపానికి రావడం అంటే శత్రువుకు సహకరించడమే అని భావిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై దాడులు చేస్తాం. ట్రంప్ ప్రకటనకు ఎలాంటి విలువ లేదు. అమెరికా విధిస్తున్న దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించడమే” అని ఐఆర్‌జీసీ తన ప్రకటనలో పేర్కొంది.

ఈ నెల మొదట్లో ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల షరతులతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ సమయంలో హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అనుమతి ఇచ్చారు.

అంతకుముందు ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ.. ఇరాన్ నాయకులు ఈ జలసంధిని మూసివేయాలని చూస్తున్నారని, అమెరికా వారి ‘బ్లాక్‌మెయిల్’కు లొంగబోదని అన్నారు.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇరాన్ నియంత్రణలోనే హార్ముజ్: గాలిబాఫ్

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చల్లో ‘పురోగతి’ లభించిందని, అయితే ఇంకా తుది ఒప్పందం కుదరలేదని తెలిపారు.

కొద్దిరోజుల కిందట ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో పాల్గొన్న గాలిబాఫ్.. “మేం ఇంకా తుది ఒప్పందానికి చాలా దూరంలో ఉన్నాం” అని పేర్కొన్నారు.

ఇరాన్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “చర్చల్లో పురోగతి ఉంది కానీ, ఇంకా కొన్ని లోపాలు, పరిష్కరించాల్సిన ప్రాథమిక సమస్యలు ఉన్నాయి” అని చెప్పారు.

“అమెరికా తన షరతులను మాపై రుద్దడం మానేసి, ఇరాన్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి” అని గాలిబాఫ్ అన్నారు.

“మేం కాల్పుల విరమణకు అంగీకరించామంటే దానికి కారణం వారు మా డిమాండ్లను ఒప్పుకోవడమే. ఎందుకంటే, యుద్ధ భూమిలో మేమే గెలిచాం” అన్నారాయన.

ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధాన్ని ‘తప్పుడు, అవివేక నిర్ణయం’గా గాలిబాఫ్ అభివర్ణించారు.

“ఒకవేళ దిగ్బంధం తొలగించకపోతే, హార్ముజ్ జలసంధిలో రాకపోకలను కచ్చితంగా పరిమితం చేస్తాం. ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉంది” అన్నారాయన.

జలసంధిలో అమర్చిన మైన్లను తొలగించడానికి అమెరికా ప్రయత్నించడాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఆ చర్యను కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా పరిగణిస్తామని, ఒకవేళ అలా చేస్తే దాడి చేస్తామని హెచ్చరించినట్లేనని గాలిబాఫ్ అన్నారు.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

‘అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు’

అమెరికాతో కొత్తగా ప్రత్యక్ష చర్చలు జరపడానికి తెహ్రాన్ ఇంకా సిద్ధంగా లేదని ఇరాన్ విదేశీ వ్యవహారాల ఉప మంత్రి సయీద్ ఖతీబ్‌జాదే తెలిపారు. అమెరికా తన కఠినమైన షరతులను వదులుకోవడానికి సిద్ధంగా లేదని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియంను అమెరికాకు ఇవ్వబోదని సయీద్ అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థతో చెప్పారు.

ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు జరిగినప్పటికీ, ముఖాముఖి చర్చలకు ముందే ఒక ‘ఫ్రేమ్ వర్క్ ఒప్పందం’ కుదరాలని ఇరాన్ కోరుకుంటోంది.

“ఇరాన్‌పై ఉన్న ఆంక్షలతో సహా మా ప్రధాన ఆందోళనలను అమెరికా అర్థం చేసుకుని పరిష్కరించాలి” అని సయీద్ అన్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)