Home జాతీయ national telgu భారత్‌తో మ్యాచ్‌లు ఆడాలన్న పాక్ నిర్ణయంలో తెర వెనక ఏం జరిగింది, పాక్ మాజీ క్రికెటర్లు...

భారత్‌తో మ్యాచ్‌లు ఆడాలన్న పాక్ నిర్ణయంలో తెర వెనక ఏం జరిగింది, పాక్ మాజీ క్రికెటర్లు ఏం చెబుతున్నారు?

9
0

SOURCE :- BBC NEWS

భారత్ , పాకిస్తాన్, టీ ట్వంటీ వరల్డ్ కప్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక, బీసీసీఐ, ఐసీసీ

ఫొటో సోర్స్, Getty Images

4 గంటలు క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడకూడదన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పాకిస్తాన్ చర్యపై ఆ దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది.

ఆ దేశపు క్రికెటర్లు అనేకమంది దీనిని ‘పాక్ విజయం’గా చెప్పుకుంటున్నారు.

“ఈ నిర్ణయం తీసుకున్నందుకు శ్రీలంక అధ్యక్షుడు పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వాల జోక్యం వల్ల ఈ విషయం ఆట పరిధిని దాటి పోయింది. బంగ్లాదేశ్, ఇతర సభ్య దేశాల ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడం అవసరం. ఎందుకంటే భారత్- పాక్ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్లు కూడా ప్రయోజనం పొందుతారు” అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ జియోన్యూస్‌తో అన్నారు.

“మేము పరిణతితో కూడిన నిర్ణయం తీసుకున్నాం. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌కు ఎదురైన నష్టాలకు పరిహారం దక్కాలి. మా మిత్ర దేశాల కోసం మేము భారత్‌తో మ్యాచ్ ఆడుతున్నాం. మేము కావాలనుకుంటే ఆదాయంలో మా వాటా పెంచాలని డిమాండ్ చేయవచ్చు. కానీ మేమలా చేయలేదు. హుందాగా వ్యవహరించాం” అని మరో క్రికెటర్ అహ్మద్ షాజాద్ అన్నారు.

ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌తోపాటు మిత్రదేశాల క్రికెట్‌కు మేలు జరుగుతుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

భారత్ , పాకిస్తాన్, టీ ట్వంటీ వరల్డ్ కప్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక, బీసీసీఐ, ఐసీసీ
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

“ఇప్పుడిక దీనిపై రాజకీయాలు అనవసరం. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలి. మేమే గెలిచామని వాళ్లుగానీ, వీళ్లుగానీ చెప్పకూడదు” అని అహ్మద్ షాజాద్ చెప్పారు.

“భారత్‌కు మాతో సమస్య ఉంటే, మాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించేది. కానీ వాళ్లలా చేయలేదు. పాకిస్తాన్ మ్యాచ్ ఆడేలా ఐసీసీ ఒప్పించింది. అంటే పాక్ లేకుండా క్రికెట్ టోర్నీ నడవదని వారికి తెలుసు. క్రికెట్‌కు మా అవసరం ఉంది. మా మిత్ర దేశాల కోసమే మేమీ నిర్ణయం తీసుకున్నాం. ఇది మంచి నిర్ణయం. ఇందులో మేం గెలిచాం” అని పాక్ మాజీ క్రికెటర్ సికిందర్ బఖ్త్ అన్నారు.

భారత్ , పాకిస్తాన్, టీ ట్వంటీ వరల్డ్ కప్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక, బీసీసీఐ, ఐసీసీ

‘ఐసీసీ వల్లే సాధ్యమైంది’

దీనిపై స్పందించిన బీసీసీఐ, సమస్యను పరిష్కరించడంలో ఐసీసీ పాత్రను కొనియాడింది.

“ఈ చర్చల ద్వారా బంగ్లాదేశ్ సెంటిమెంట్లను కూడా గౌరవించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కొంత ఉపశమనం లభించింది. వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. ఐసీసీ ప్రయత్నాలను వాళ్లు కూడా అభినందిచారు” అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.

“బీసీసీఐ శక్తివంతమైన సంస్థ. అయినప్పటికీ అది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద ఆధారపడుతోంది. భారత్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా అనేది పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయిస్తుంది. మ్యాచ్ ఆడకపోతే విధించే జరిమానా చెల్లించడానికి పాక్ క్రికెట్ బోర్డు దగ్గర డబ్బుల్లేవు. అందుకే పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. బీసీసీఐకి డబ్బులే ముఖ్యం” అని శివ సేన(యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు.

“ఒక రకమైన డ్రామా నడుస్తోంది. కొన్నిసార్లు వాళ్లు భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదంటారు. తర్వాత ఆడతామంటారు. అన్నీవాళ్ల సంతృప్తి కోసమే చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్, శ్రీలంక బతిమాలడంతో వాళ్లు ఒప్పుకున్నారు. భారత్ ఏ స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తుందో ఇప్పుడు మనం ఐసీసీకి చూపించాం. అందుకే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. దీనికి చికిత్స లేదు” అని భారత సీనియర్ క్రికెటర్ అతుల్ వాసన్ అన్నారు.

భారత్ , పాకిస్తాన్, టీ ట్వంటీ వరల్డ్ కప్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక, బీసీసీఐ, ఐసీసీ

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Image

పాక్ ఎందుకు నిర్ణయం మార్చుకుంది?

టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి15న భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ ఆడేందుకు పాక్‌ జట్టుకు అనుమతి ఇస్తూ ప్రధాని షాబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ ప్రతినిధులు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వి వివరించారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనలు, శ్రీలంక క్రికెట్ బోర్డు రాసిన లేఖలు, యూఏఈ, ఇతర సభ్య దేశాల సందేశాల ఆధారంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీబీసీ ఉర్దూ తెలిపింది.

భారత్‌తో మ్యాచ్ విషయంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస నాయకే కృతజ్ఞతలు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)