SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
5 గంటలు క్రితం
భారత్, రష్యా సంబంధాల గురించి చర్చ వచ్చినప్పుడల్లా సోవియట్ యూనియన్ కనబర్చిన స్నేహాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటారు.
1955లో సోవియట్ యూనియన్ నాయకుడు నికితా కృశ్చేవ్ భారత్‌లో పర్యటించారు. ”మేం మీకు చాలా దగ్గరగా ఉన్నాం. పర్వతం అంచున నిల్చుని పిలిచినా, మేం మీ పక్కన ఉంటాం” అని ఆ పర్యటనలో ఆయన అన్నారు.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై, రష్యా మిగిలిపోయినప్పుడు కూడా భారత్‌తో సంబంధాల విషయంలో ఆ నమ్మకం అలాగే ఉంది. కశ్మీర్ విషయంలో పాశ్చాత్య దేశాలు సందిగ్ధంలో ఉన్నా, సోవియట్ యూనియన్ మాత్రం కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెప్పింది.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను సోవియట్ యూనియన్ అనేకసార్లు వీటో చేసింది. కశ్మీర్ భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక అంశమని భారత్ ఎప్పుడూ చెబుతుంటుంది. ఈ వాదనకు మొదటినుంచీ రష్యా మద్దతుగా ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ అంశంలో జోక్యానికి సంబంధించి 1957, 1962, 1971లో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాలను.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల్లో సోవియట్ యూనియన్ మాత్రమే వాటిని అడ్డుకుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలను ఇప్పటివరకూ ఆరుసార్లు రష్యా వీటో చేసింది. వీటిలో ఎక్కువ భాగం కశ్మీర్ గురించి చేసినవే. గోవాలో పోర్చుగీస్ పాలనను అంతం చేసేందుకు భారత్ చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా ఉన్న తీర్మానాన్ని కూడా భద్రతామండలిలో సోవియట్ యూనియన్ వీటో చేసింది.
2019 ఆగస్టులో కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పుడు కూడా భారత్‌కు రష్యా మద్దతిచ్చింది. కానీ, పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లో భారత్ చేపట్టిన సైనిక చర్యపై రష్యా ప్రతిస్పందన భారత్‌కు అంత అనుకూలంగా లేదు. రష్యా తటస్థంగా, చాలా సమతుల్యంగా ప్రతిస్పందించింది.
ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాకిస్తాన్‌కు రష్యా విజ్ఞప్తి చేసింది. మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా ముందుకొచ్చింది. ”భారత్ మా వ్యూహాత్మక భాగస్వామి. పాకిస్తాన్ కూడా మా భాగస్వామి. దిల్లీ, ఇస్లామాబాద్ రెండింటితోనూ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తాం” అని రష్యా అధ్యక్షుడి ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ‘బ్యాలెన్స్డ్’ స్పందన
మే 3న భారత విదేశాంగ మంత్రి జై శంకర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్య చర్చలు జరిగాయి.
ఈ సమావేశం గురించి వివరాలు తెలుపుతూ, ”ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని దిల్లీ, ఇస్లామాబాద్‌కు రష్యా విదేశాంగ మంత్రి విజ్ఞప్తి చేశారు” అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పింది.
”గత 12 ఏళ్లలో యుక్రెయిన్‌పై రష్యా రెండుసార్లు దాడి చేసింది. కానీ, పాకిస్తాన్‌తో వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌కు చెబుతోంది” అని రష్యా విదేశాంగమంత్రిత్వ శాఖ చేసిన పోస్టును రీపోస్టు చేస్తూ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ సీనియర్ ఫెలో తన్వీ మదాన్ రాశారు.
”రష్యాకు ఏమైంది? మన ప్రధాని యుక్రెయిన్ వెళ్లి రష్యా, యుక్రెయిన్ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. రష్యా వంటి నమ్మదగిన మిత్రుని వైపు స్థిరంగా నిలబడాల్సినచోట ప్రధాని ఇలా చెప్పారు. దీన్ని న్యూటన్ మూడో సిద్ధాంతం అంటారు. చర్యకు ప్రతి చర్య ఉంటుంది” అని తన్వీ మదాన్ పోస్టును ఉద్దేశించి ‘ఎక్స్’ యూజర్ ఒకరు రాశారు.
”2022లో యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ మద్దతివ్వలేదు కాబట్టి, రష్యా కూడా మద్దతివ్వలేదని అనడం ఎంతమాత్రం సరైనది కాదు. 2019లో కూడా పుల్వామా దాడి తర్వాత శాంతియుతంగా ఉండాలని భారత్‌ను రష్యా కోరింది. మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించింది” అని ఆ యూజర్ పోస్టుకు తన్వీ మదాన్ సమాధానమిచ్చారు.
తన్వీ మదాన్ కామెంట్‌కు థింక్ ట్యాంక్ ఓఆర్ఎఫ్లో భారత్ – రష్యా సంబంధాల నిపుణులు అలెక్సీ జఖరోవ్ స్పందిస్తూ, ”భారత్ విషయంలో రష్యా వ్యవహారశైలి 90ల నుంచి మిశ్రమంగా ఉంటోంది. 2002లో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు పుతిన్ ప్రయత్నించారు. కానీ, భారత్ తిరస్కరించింది. మారుతున్న భౌగోళిక రాజకీయాలతో సంబంధం లేకుండా, ఉద్రిక్తతలను తగ్గించడంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలు తమ వంతు పాత్ర తాము పోషించాలనే ఏకాభిప్రాయం ఉంది” అభిప్రాయపడ్డారు.
మాస్కోకు చెందిన హెచ్ఎస్ఈ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ నివేదిత కపూర్ స్పందిస్తూ, ”అణ్వస్త్రాల విషయంలో అలెక్సీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. అణ్వస్త్ర దేశంగా ఇతర శక్తివంతమైన దేశాలతో కలిసి ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నించడం రష్యా బాధ్యత. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధం దిశగా వెళ్తున్నప్పుడు శాంతి కోసం విజ్ఞప్తి చేయడం సహజం” అని ఆమె రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాపై అంచనాలు
”సంక్షోభం సమయంలో పాకిస్తాన్‌కు చైనా బహిరంగంగా మద్దతు ఇస్తున్నప్పుడు, రష్యా కూడా తమకు బహిరంగంగా మద్దతివ్వాలన్న ఆకాంక్ష భారత్‌కు పెరుగుతుంది. భారత్, చైనాతో సంబంధాల్లో సమతుల్యతను కొనసాగించడంలో ఇబ్బందులను, అలాగే తమ భాగస్వామ్యం గురించి ఇరువర్గాలకూ మళ్లీ భరోసా కల్పించాల్సి రావడం వంటి తలనొప్పులను మరోసారి రష్యా కోరుకోవడం లేదు. తన రెండు ప్రధాన భాగస్వాములు వైరిపక్షాలుగా ఉన్నప్పుడు, ఎవరో ఒకరి వైపు మొగ్గడాన్ని నివారించేందుకు కూడా రష్యా ప్రయత్నిస్తుంది” అని నివేదిత కపూర్ విశ్లేషించారు.
పాకిస్తాన్‌తో భారత్ సంక్షోభంలో, రష్యా వ్యవహారశైలిని మీరెలా చూస్తారని న్యూదిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్ కుమార్‌ని మేం అడిగాం.
”పాకిస్తాన్, కశ్మీర్ విషయంలో ఇప్పటిదాకా భారత్‌కు ఏకపక్ష మద్దతు గురించి రష్యా మాట్లాడేది. కానీ, ఈసారి రష్యా మొత్తం వ్యవహారంలో ద్వైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతోంది. మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుతోంది. భారత్‌కు అనుకూలంగా ఏకపక్షవైఖరి కనిపించలేదు” అని రాజన్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Yan Dobronosov/Global Images Ukraine via Getty Images
”ఈ సారి కూడా రష్యా భారత్ వైపు మొగ్గు చూపించినట్టు కనిపించినమాట నిజమే కానీ, ఆ దేశం ప్రకటన చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అది పూర్తిగా భారత్‌కు అనుకూలంగా లేదు. మొత్తం వ్యవహారంలో రష్యా ఈసారి తనకు తాను పరిమితి విధించుకున్నట్టు కనిపించింది” అని రాజన్ కుమార్ చెప్పారు.
దీనికి మూడు కారణాలున్నాయని రాజన్ కుమార్ అభిప్రాయపడ్డారు.
”రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యా వైపు మొగ్గుచూపింది కానీ, రష్యా కోరుకున్నస్థాయిలో భారత్ పూర్తిగా మద్దతివ్వలేదు. భారత ప్రధాని యుక్రెయిన్‌లో పర్యటించారు. దౌత్వం ద్వారా యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. ఏ దేశం సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించకూడదని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు.
రెండో కారణం, భారత్ అమెరికాకు చాలా దగ్గరైంది. రక్షణ రంగంలో సహకారం చాలా పెరిగింది. రష్యాతో భారత రక్షణ భాగస్వామ్యం తగ్గింది, పాశ్చాత్య దేశాలతో పెరిగింది. మూడో కారణం రష్యా సొంత పరిస్థితులు. తాలిబన్లపై నిషేధాన్ని రష్యా ఎత్తివేసింది. పాకిస్తాన్ ద్వారా అఫ్గానిస్తాన్‌లో పట్టు సాధించాలని రష్యా కోరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో, పాకిస్తాన్‌ను పూర్తిగా పక్కన పెట్టాలని పుతిన్ అనుకోవడం లేదు” అని రాజన్ కుమార్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, పాకిస్తాన్
పుతిన్ చివరిసారిగా 2021 డిసెంబర్లో భారత్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌కు రాలేదు. అదే సమయంలో, చైనాలో మాత్రం రెండుసార్లు పర్యటించారు. ఈ సమయంలో ఆయన వేరే దేశాల్లో కూడా పర్యటించారు. 2023 సెప్టెంబరులో న్యూదిల్లీలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సుకు సైతం పుతిన్ హాజరుకాలేదు. రష్యాకు భారత్‌తో వార్షిక సదస్సులుంటాయి. అవి కూడా సరిగ్గా జరగడం లేదు.
రష్యా కీలక పాత్ర పోషించే కొన్ని సంస్థల్లో ఇటీవలి సంవత్సరాల్లో భారత్ ఒంటరవడం పెరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో)వంటివాటిలో.
2024 జూలైలో జరిగిన ఎస్సీవో సదస్సుకు నరేంద్రమోదీ హాజరుకాలేదు. 2023లో ఎస్సీవో అధ్యక్షపదవిని భారత్ నిర్వహించింది. కానీ, అధ్యక్ష బాధ్యతలను అంత ప్రాధాన్యంగా పరిగణించరు.
ఈ సదస్సును భారత్ వర్చువల్‌గా నిర్వహించింది. మరోవైపు, అదే సంవత్సరంలో ప్రతిష్టాత్మక జీ 20 శిఖరాగ్ర సదస్సు భారత్ అధ్యక్షతన జరిగింది. గత ఏడాది రెండు దేశాల మధ్య 68 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. 60 బిలియన్ డాలర్ల విలువైన చమురును రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది.
2009 నుంచి 2013 మధ్య భారత ఆయుధ దిగుమతుల్లో 76 శాతం రష్యా నుంచి జరిగాయి. కానీ, 2019 నుంచి 2020 మధ్య ఇవి 36 శాతం తగ్గాయి.
”యుక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో కూడా భారత్ రష్యాను వ్యతిరేకించలేదు. కాకపోతే ఏకపక్షంగా మద్దతివ్వలేదు” అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే గుర్తుచేశారు.
”పాకిస్తాన్ రష్యాకు అంటరానిదేశం కాదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. 1965లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు రష్యా తటస్థంగా ఉంది. మధ్యవర్తిత్వం జరిపింది. సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. కానీ, అది భారత్‌కు అనుకూలంగా లేదు. ఈ ఒప్పందం తర్వాత భారత సైన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 1971 యుద్ధంలో రష్యా కచ్చితంగా భారత్ వైపే ఉంది. కానీ, ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. అయినప్పటికీ, రష్యా ఇప్పటికీ భారత్‌తోనే ఉందని నేను విశ్వసిస్తున్నా. అమెరికా వ్యతిరేకించినప్పటికీ భారత్ రష్యా నుంచి ఎస్ 400 కొనుగోలు చేసింది. పాకిస్తాన్ దాడులను ఆపడంలో ఈసారి అది కీలకపాత్ర పోషించింది” అని పాండే విశ్లేషించారు.
పాశ్చాత్య దేశాలతో పాకిస్తాన్ సంబంధాలు బలహీనమవడంతో, రష్యాకు దగ్గరవుతోందనే చర్చ జరుగుతోంది. 2023లో రష్యా, పాకిస్తాన్ మధ్య ఒక బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. ఆ రెండు దేశాల మధ్య ఇదే అత్యధికం. పాకిస్తాన్‌ను బ్రిక్స్‌లో చేర్చుకోవడానికి రష్యా ఉప ప్రధాని అలెక్సీ ఓవర్చుక్ గత ఏడాది మద్దతు ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)