Home జాతీయ national telgu బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన

4
0

SOURCE :- BBC NEWS

ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్

ఫొటో సోర్స్, Getty Images

16 ఫిబ్రవరి 2026, 11:27 IST

చదివే సమయం: 7 నిమిషాలు

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల విజేతలను ప్రకటించారు. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన 2025 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు.

ఈ సంవత్సరం ఈ అవార్డు కోసం క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, షూటర్ సురుచి సింగ్, అథ్లెట్ జ్యోతి యర్రాజీ పోటీ పడ్డారు.

చెస్ గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ 2025 సంవత్సరానికి బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

బీబీసీ పారా-స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును పారా అథ్లెట్ ప్రీతి పాల్ అందుకున్నారు.

పారిస్ పారాలింపిక్స్ 2024లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రీతి పాల్ రెండు పతకాలు గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి పారా అథ్లెట్‌గా నిలిచారు.

షూటర్ అంజలి భగవత్ బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 2025కు ఎంపికయ్యారు.

ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్

అంజలి భగవత్, ప్రీతిపాల్ ఏం చెప్పారంటే..

ఖేల్ రత్న విజేత అంజలి భగవత్, బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడారు.

“షూటింగ్ నా జీవితం. నేను షూటింగ్ రేంజ్‌లో లేకపోతే, ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. అంకితభావం, నిబద్ధత నాకు చాలా సహాయపడ్డాయి. అనేక మంది మహిళలు తమ అడ్డంకుల్ని అధిగమించడానికి నేను స్ఫూర్తిగా మారాను. భారతీయ షూటింగ్ దాని శిఖరాగ్రానికి చేరుకుంది. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు” అని అంజలి భగవత్ చెప్పారు.

“సవాళ్లు ప్రతీ రంగంలో ఎదురవుతాయి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఓటమి కూడా మనకు చాలా నేర్పుతుంది. బీబీసీకి ధన్యవాదాలు. ఈ అవార్డు నాది మాత్రమే కాదు. నా జట్టు మొత్తానికి చెందుతుంది” అవార్డు గెలుచుకున్న తర్వాత పారా అథ్లెట్ ప్రీతిపాల్ స్పందన ఇది.

ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్

మహిళల క్రికెట్‌కు మద్దతివ్వాలని రాజీవ్ శుక్లా విజ్ఞప్తి

మహిళల క్రికెట్‌ను ప్రజలు ప్రోత్సహించాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కోరారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళల క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు.

“మన మహిళల క్రికెట్ జట్టు చాలా బాగా ఆడుతోంది. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. వారి జీతాలు పెరిగాయి. వారు ఆడే మ్యాచ్‌లు పెరిగాయి. మీరందరూ మహిళల క్రికెట్ చూడాలని నా విజ్ఞప్తి. అప్పుడే అది పురుషుల క్రికెట్ స్థాయికి చేరుకోగలదు” అని ఆయన అన్నారు.

ఇటీవలి వుమన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల సమయంలో ప్రేక్షకులు మైదానానికి చేరుకోలేదని, మైదానాలు దాదాపు ఖాళీగా కనిపించాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కూడా పాల్గొన్నారు.

“ఈ రోజు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. మన అథ్లెట్లను మనం ముందుకు తీసుకెళ్లాలి. క్రీడల ద్వారానే మనం జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోగలం. మహిళలకు అన్ని సమాఖ్యలలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నిస్తోంది. క్రీడలను ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత” అని ఆమె అన్నారు.

బీబీసీ స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025

బీబీసీ స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 ఎవరంటే..

  • భారత మహిళా క్రికెట్ జట్టు
  • భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
  • భారత మహిళల కబడ్డీ జట్టు
  • సిమ్రాన్ శర్మ
  • ఏక్తా భయాన్
  • దీప్తి జీవంజీ
  • ప్రీతి పాల్
ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్

బీబీసీ చేంజ్ మేకర్స్ ఆఫ్ ది ఇయర్

  • ఇండియన్ వుమెన్ ఐస్ హాకీ టీమ్: అసాధారణ క్రీడలో అసమానతలను ఎదిరించింది
  • రాజ్‌బీర్ కౌర్: భారత ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి, భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్
  • సవితా పునియా: ఇండియన్ ఫీల్డ్ హాకీ టీమ్ ప్లేయర్, ప్రస్తుత జాతీయ జట్టు సభ్యురాలు
  • పానీ దేవి: 94 ఏళ్ల పానీ దేవి అనేక అవార్డులు గెలుచుకున్నారు.
ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్

స్వేచ్ఛగా ఎగరనివ్వండి: రూపా ఝా

“నేడు ప్రపంచం కలవరపెట్టే నిజాలను ఎదుర్కొంటున్న వేళ, శక్తివంతుల పేర్లు బయటకు వస్తున్నాయి. బాధితులు మౌనంగా ఉండేందుకు నిరాకరిస్తున్నారు. వ్యవస్థలను నిలదీస్తున్నారు” అని కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఎడిటర్-ఇన్-చీఫ్, సహ వ్యవస్థాపకురాలు రూపాఝా అన్నారు.

“ఇలాంటి వేదికల అవసరాన్ని ఇవన్నీ గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి అణచివేత కథతో పాటు, విజయ గాథలు కూడా ఉండాలి. మహిళలను అణచివేయకుండా వారి విజయాలను జరుపుకునే ప్రదేశం ఉండటం చాలా ముఖ్యం. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. బీబీసీ మున్ముందు కూడా ఇలాంటి కథలను మీకు అందిస్తూనే ఉంటుంది”

“బాలికలు పక్షుల్లా మారుతున్నారు. స్వేచ్ఛగా ఎగరడంలోనే వారికి ఆనందం. వాటి రెక్కలు కత్తిరించడం వాళ్లకు ఇష్టం ఉండదు” అని రూపా ఝా అన్నారు.

ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్

బీబీసీ సీఈఓ జోనాథన్ మున్రో ఏం చెప్పారు?

“2025 భారత మహిళా క్రీడాకారిణులకు చాలా ప్రత్యేకమైన సంవత్సరం. భారత మహిళా క్రికెట్ జట్టు స్వదేశంలో రికార్డు సంఖ్యలో ప్రేక్షకుల సమక్షంలో ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది” అని బీబీసీ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ సీఈఓ జోనాథన్ మున్రో అన్నారు.

“భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది”

ఈ ఏడాది అవార్డుల థీమ్ ‘ప్రతి శరీరం ఆడగలదు” అని ఆయన అన్నారు.

“క్రీడా రంగంలో తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి వాళ్లు శారీరక, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించారు” అని మున్రో చెప్పారు.

“2020లో ప్రారంభమైనప్పటి నుండి, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన, లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ ఉనికిని సుస్థిరం చేసిన మహిళలను గౌరవించడానికి ప్రయత్నించింది” అని జోనాథన్ అన్నారు.

ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్

విజేతల ఎంపిక కోసం జ్యూరీ

దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులు, గౌరవనీయులైన క్రీడా జర్నలిస్టులు, నిపుణులు రచయితలతో కూడిన బీబీసీ ప్యానెల్ ఈ ఐదుగురు భారతీయ మహిళా అథ్లెట్లను షార్ట్‌లిస్ట్ చేసింది.

తొలిసారిగా, విజేతలను నిర్ణయించడానికి బీబీసీ ఒక గ్రాండ్ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఈ గ్రాండ్ జ్యూరీలో టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ పారా-అథ్లెట్ దీపా మాలిక్ ఉన్నారు.

బీబీసీ పారా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – పారా స్పోర్ట్స్‌లో అత్యుత్తమ ప్రతిభకు అందిస్తారు .

బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – యువ క్రీడాకారిణుల విజయాలను గుర్తిస్తుంది.

బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – క్రీడలలో గణనీయమైన కృషి చేసిన విశిష్ట క్రీడాకారాణికి అందిస్తారు.

ఏమిటీ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

భారతీయ మహిళా క్రీడాకారిణుల విజయాలను గౌరవించడానికి బీబీసీ భారతీయ భాషలు చేపడుతున్న ప్రచార కార్యక్రమమే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం.

మీడియా కవరేజీ ద్వారా భారతీయ మహిళా క్రీడాకారిణుల విజయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే ఈ వేదిక లక్ష్యం. .

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు క్రీడల్లో జెండర్ రిప్రజెంటేషన్, సమానత్వం గురించి అర్థవంతమైన చర్చలను ప్రోత్సహిస్తుంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీల వివరాలు

దివ్య దేశ్‌ముఖ్

20 ఏళ్ల చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, జులైలో జరిగిన ఫిడే (FIDE) మహిళల ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.

ఈ గెలుపుతో గ్రాండ్‌ మాస్టర్ హోదాను ఆమె సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో.. గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపీని దేశ్‌ముఖ్ ఓడించడంతో, ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ బాధ్యతలను అందజేసిన క్షణంగా ఇది నిలిచింది.

2005లో నాగ్‌పూర్‌లో జన్మించిన దేశ్‌ముఖ్, ఐదేళ్ల వయసున్నప్పటి నుంచే చెస్ ఆడటం మొదలుపెట్టారు. రెండేళ్లలోనే అండర్-7 నేషనల్ చాంపియన్‌గా అవతరించారు.

2017లో బాలికల అండర్ -12 కేటగిరీలో వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

2022లో చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

రెండేళ్ల తర్వాత, వ్యక్తిగత కేటగిరీలో బంగారు పతకం కైవసం చేసుకుని మరింత కీర్తిని సాధించారు. అగ్రస్థానంలో నిలిచిన జట్టులో కూడా సభ్యురాలిగా ఉన్నారు.

హర్మన్ ప్రీత్ కౌర్

2025లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారిగా భారత జట్టు గెలుచుకుంది. ఆ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించారు.

సొంత గడ్డపై జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆమె 88 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించారు.

అలాగే, 2017 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాపై హర్మన్ ప్రీత్‌ కౌర్ 171 (నాట్ అవుట్) పరుగుల ఇన్నింగ్స్, మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది.

పంజాబ్‌లోని క్రీడాభిమానులైన దంపతులకు హర్మన్ ప్రీత్‌కౌర్ 1989లో జన్మించారు. తండ్రి ఆమె కోసం “గుడ్ బ్యాటింగ్” అని రాసి ఉన్న టీ-షర్టును కొన్నారు.

2009లో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత జట్టులో కీలక బ్యాటర్‌గా నిలుస్తూ, ఆ టీ-షర్టుపై ఉన్న మాటను హర్మన్‌ ప్రీత్‌ కౌర్ నిజం చేశారు.

2023లో టైమ్ మేగజీన్ ‘టాప్ 100 ఎమర్జింగ్ లీడర్స్’, బీబీసీ ‘100 అత్యంత స్ఫూర్తివంతమైన మహిళల’ జాబితాల్లో చోటు దక్కించుకున్నారు.

2017లో భారత రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను కూడా అందుకున్నారు.

2026లో క్రీడల విభాగంలో మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.

స్మృతి మంధాన, క్రికెటర్

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఇప్పటికే ఈ క్రీడలో ఆల్-టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌ సరసన స్థానం సంపాదించుకునే దిశగా దూసుకుపోతున్నారు.

29 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం కలిగిన బ్యాటర్‌, మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో క్రీడాకారిణిగా, ప్రస్తుత ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.

మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో జన్మించిన మంధాన, జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడిన తన తండ్రి, సోదరుడిని చూసి స్ఫూర్తిని పొందారు.

2013లో జోనల్ అండర్-19 టోర్నమెంట్‌లో దేశీవాళీ వన్డే మ్యాచులో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 50 బంతుల్లోనే శతకం పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడుతూ.. పురుషుల లేదా మహిళల క్రికెట్ అనే తేడా లేకుండా వన్డేల్లో టీం ఇండియా తరఫున అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశారు.

ఆమె 2018, 2021లో రెండుసార్లు ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. అలాగే 2019లో ప్రతిష్ఠాత్మకమైన ‘అర్జున అవార్డు’ను అందుకున్నారు.

సురుచి సింగ్, షూటర్

షూటర్లను అందించడంలో మంచి రికార్డు ఉన్న ప్రాంతం హరియాణా. ఈ ప్రాంతానికి చెందిన సురుచి సింగ్ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడు బంగారు పతకాలు సాధించి 2024లో వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు.

19 ఏళ్ల సురుచి సింగ్, ఏడాది తిరగకముందే అంతర్జాతీయ సీనియర్ విభాగంలోకి ప్రవేశించి, ప్రపంచవేదికపై తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

2025లో బ్యూనస్ ఎయిర్స్(Buenos Aires), లిమా, మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ సిరీస్‌లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాలు సాధించి, అరుదైన గోల్డెన్ ట్రెబుల్‌ను (ఒకే సిరీస్‌లో మూడు బంగారు పతకాలు గెలుపొందడం) పూర్తి చేసుకున్నారు. లిమాలో జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకాన్ని దక్కించుకున్నారు.

కజకిస్తాన్‌లో జరిగిన 2025 ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మను భాకర్, పలక్ గులియాలతో కలిసి మహిళల టీమ్ విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

సెప్టెంబర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్‌కు చెందిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో టాప్ ర్యాంకు సాధించిన మహిళా షూటర్‌గా నిలిచారు.

జ్యోతి యర్రాజీ, అథ్లెట్

అత్యున్నత స్థాయి అథ్లెటిక్ పోటీల్లో అరుదుగా విజయాలు సాధించిన దేశంలో, 2024 పారిస్ గేమ్స్‌లో ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా యర్రాజీ నిలిచారు.

నిజానికి అడ్డంకులను అధిగమించడం 26 ఏళ్ల యర్రాజీకి కొత్త కాదు. ఆమె పేద కుటుంబం నుంచి వచ్చారు. తన తండ్రి సెక్యూరిటీ గార్డుగా, తల్లి పని మనిషిగా పనిచేశారు.

2022లో 100 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 13.23 సెకన్లలో పూర్తి చేసి, జాతీయ రికార్డును సాధించారు. చాలాసార్లు తన సొంత రికార్డులనే ఆమె బద్దలు కొట్టారు.

2022లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో కూడా ఆమె అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు. స్ప్రింట్, హర్డిల్స్ విభాగాల్లో పలు బంగారు పతకాలు సాధించారు. 2022 ఏషియన్ గేమ్స్‌లో వెండి పతకాన్ని, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

2023లో ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 60 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాన్ని, ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో వెండి పతకాన్ని గెలుచుకోవడంతో.. ఆసియా టాప్ హర్డిలర్‌గా జ్యోతి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

గుమిలో జరిగిన 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.

2024లో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును ఆమె పొందారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)