Home జాతీయ national telgu బంగ్లాదేశ్ యువతలో భారత వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయా?

బంగ్లాదేశ్ యువతలో భారత వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయా?

10
0

SOURCE :- BBC NEWS

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, Reuters

ఢాకా యూనివర్సిటీ గోడలు మళ్లీ నినదిస్తున్నాయి.

యూనివర్సిటీ కారిడార్లు, గోడల మీద నినాదాలు, ఆగ్రహం, వ్యంగ్యం, కొన్నిసార్లు కవితాత్మక వర్ణనలు చివరకు 2024 జులై నాటికి విద్యార్థుల ఉద్యమంగా మారి 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న షేక్ హసీనాను పదవి నుంచి దించేశాయి.

ఒకప్పుడు ప్రజాస్వామ్య చిహ్నంగా కనిపించిన ఈ నాయకురాలు తర్వాతి కాలంలో నియంతగా ఎదిగారని విమర్శకులు చెప్పేవారు.

ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె భారత్‌కు పారిపోయి వచ్చారు.

ఇప్పుడు ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు గుంపులుగుంపులుగా చేరి రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

యూనివర్సిటీ క్యాంపస్‌లో పచ్చిక మీద చైనీస్ నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎర్రటి లాంతర్లు గాలికి ఊగుతున్నాయి.

చూడటానికి ఇది విషయంలాగే కనిపించినా, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపించడానికి బీజింగ్, దిల్లీ ఎలా పోటీ పడుతున్నాయో చెప్పే ఉదాహరణ ఇది.

యూనివర్సిటీలో ఉన్నవారిలో అనేకమంది ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్నారు.

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

హసీనా కేంద్రంగా భారత వ్యతిరేకత

షేక్ హసీనా పలాయనం తర్వాత నోబెల్ శాంతి బహుమతి విజేత మొహమ్మద్ యూనస్ ‌బాధ్యతలు చేపట్టారు. హసీనా ప్రస్తుతం దిల్లీలో అజ్ఞాతంలో ఉన్నారు.

2024 విద్యార్థుల ఉద్యమంలో ఆందోళనకారుల పట్ల క్రూరంగా వ్యవహరించారని ఆరోపిస్తూ అక్కడి ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.

మరణ శిక్ష అమలు చేసేందుకు ఆమెను అప్పగించాలన్న బంగ్లాదేశ్ విజ్ఞప్తిని భారత ప్రభుత్వం తిరస్కరించింది.

2024 ఉద్యమంలో 1400 మంది చనిపోయారని, ఎక్కువమంది భద్రతా బలగాల కాల్పుల్లో మరణించినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఆమె పార్టీ అవామీ లీగ్‌కు దేశంలో 30 శాతం ఓటు బ్యాంక్ ఉంది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ చేయడం లేదు.

గతంలో తనకు సొంతమైన ఉదారవాద- మధ్యేవాద స్థానాన్ని తిరిగి ఆక్రమించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

విద్యార్థుల ఉద్యమం నుంచి పుట్టిన పార్టీతో ముస్లింల పార్టీ జమాత్ ఇ ఇస్లామీ చేతులు కలిపింది.

అయితే యూనివర్సిటీలు, ఇంకా బయట వినిపిస్తున్న నినాదాలు దేశంలోని ప్రజాస్వామ్యం గురించే కాదు. అవి క్రమంగా సరిహద్దు అవతలివైపుకు కూడా సిగ్నల్స్ పంపుతున్నాయి.

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, Anahita Sachdev/BBC

దిల్లీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత

“ఇది ఢాకా, దిల్లీ కాదు” అనే నినాదం గోడలపై మెరుస్తోంది. ఈ నినాదం చీరలపై కూడా కనిపిస్తోంది.

చాలా కాలంగా బంగ్లాదేశ్ మీద భారత దేశపు ఆధిపత్యానికి నిదర్శనం అంటూ వినిపించే “మరో దేశపు పెత్తనం” అనే మాట యువత రోజువారీ ప్రసంగాల్లో వినిపిస్తోంది.

“భారత్‌ చాలాకాలంగా మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని యువత భావిస్తోంది. ప్రత్యేకించి 2014 ఎన్నికల తర్వాత, ఎందుకంటే ఇది ఏకపక్ష ఎన్నిక” అని 24 ఏళ్ల సోషియాలజీ స్టూడెంట్ ముషరఫ్ హుస్సేన్ చెప్పారు.

ఆరోపణ: బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం ధ్వంసం కావడంలో దిల్లీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఫలితం: ఒకప్పుడు పొరుగు దేశాల దౌత్య సంబంధాలలో ఆదర్శంగా నిలిచిన ఈ రెండు దేశాల సంబంధాలు ప్రస్తుతం దశాబ్ధాలుగా ఎన్నడూ లేని దిగువకు జారిపోయాయి.

“బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న భారత వ్యతిరేక భావజాలం వల్ల ఢాకాలో దిల్లీ ఇబ్బందులు పడుతోంది” అని ఎస్ఓఏఎస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ బోధించే అవినాష్ పలివాల్ చెప్పారు.

హసీనా అధికారంలో ఉన్నప్పుడు నిరంకుశంగా వ్యవహరించిందనీ, అయినా, దిల్లీ ఆమెకు మద్దతిచ్చిందని యువత నిందిస్తోంది. భారత్ తమపై పెత్తనం చేస్తోందని అక్కడి యువతరం భావిస్తోంది. 2014, 2018, 2024లో జరిగిన వివాదాస్పద ఎన్నికల్లో దిల్లీ ఆమెకు అండగా నిలిచిందని వాళ్లు గుర్తు చేస్తున్నారు.

“భారత ప్రభుత్వం హసీనాపై ఎలాంటి ఒత్తిడి తేకుండా, ఎలాంటి ప్రశ్నలు అడక్కుండా మద్దతిచ్చింది. దేశంలో ప్రజాస్వామ్య విధ్వంసానికి భారత్ కారణమని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు” అని హుస్సేన్ చెప్పారు.

చాలాకాలంగా ఉన్న అభిప్రాయాయానికి సరిహద్దుల్లో హత్యలు, నీటి పంపిణీ వివాదాలు, వాణిజ్యంపై ఆంక్షలు, భారత్‌లో రాజకీయ నాయకులు, టీవీ చర్చల్లో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ఉద్రేకపూరిత వ్యాఖ్యలులాంటివి భారత్ తమకు ద్రోహం చేసిందనే భావనను పెంచినట్లు కనిపిస్తున్నాయి.

ఫలితంగా బంగ్లాదేశ్‌ను ఒక సార్వభౌమ దేశంగా కాకుండా, విధేయంగా ఉండే తోకలాగా భారత్ చూస్తోందన్న అభిప్రాయం అక్కడ వినిపిస్తోంది.

బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేస్తున్న ఒక సంస్థ బంగ్లాదేశ్ ప్రజలను మోసం చేస్తోందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సంస్థ ఈ వార్తలను ఖండించింది.

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఏకీకరణకు వేదిగా మారిన ఫేస్‌బుక్‌లో “ఇండియన్ ఏజెంట్” అని ముద్ర పడిన వార్తా పత్రికను బహిష్కరించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు దేశాలు వీసా సేవల్ని ఇప్పటికే నిలిపివేశాయి.

ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్‌ను బహిష్కరించాలన్న దిల్లీ నిర్ణయం, టీ ట్వంటీ ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న ప్రతిపాదనను భారత్ తిరస్కరించడం బంగ్లాదేశ్‌లో ఆగ్రహాన్ని పెంచింది.

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, Reuters

సంబంధాల పునరుద్ధరణకు భారత్ ప్రయత్నాలు

“కచ్చితంగా చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో అనేక మందితో భారత ప్రభుత్వంలో పెద్దలకు సంబంధాలున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అ సంబంధాలను సానుకూలంగా మార్చడం సవాలుగా ఉంది” అని పలివాల్ చెప్పారు.

నిజానికి బంగ్లాదేశ్‌తో తన సంబంధాలను విస్తరించేందుకు దిల్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం ఖలీదా జియా అంత్య క్రియల్లో పాల్గొనేందుకు గత నెలలో భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఢాకా వెళ్లారు.

ఈ సందర్భంగా పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్‌తో భేటీ అయ్యారు.

జియా కుటుంబ వారసుడైన రెహమాన్ 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన అందరికంటే ముందంజలో ఉన్నట్లు భావిస్తున్నారు.

మరోవైపు ఇస్లామిక్ గ్రూపులతోనూ భారత్ సంప్రదింపులు ప్రారంభించింది. గతేడాది భారత అధికారులు తమ పార్టీ నాయకులను నాలుగుసార్లు కలిశారని జమాత్ ఇ ఇస్లామీ నాయకుడొకరు బీబీసీతో చెప్పారు.

ఢాకాలోని భారత హై కమిషనర్ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనేందుకు జమాత్ ఇ ఇస్లామీ నాయకుల్ని ఆహ్వనించారు.

అయినప్పటికీ ఈ ప్రయత్నాలు, వేగంగా క్షీణిస్తున్న సంబంధాలను నిలువరించడంలో ఏ మాత్రం సాయపడినట్లు కనిపించడం లేద. గతంలో సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని డైలీ స్టార్ న్యూస్ పేపర్ కన్సల్టింగ్ ఎడిటర్ కమాల్ అహ్మద్ చెప్పారు.

“ద్వైపాక్షిక సంబంధాలు ఇంతకంటే క్షీణించలేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు” అని ఆయన బీబీసీతో అన్నారు.

షేక్ హసీనా పాలనాకాలంతో పోలిస్తే ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

17 ఏళ్ల పాటు ఢాకా భారత్‌లోని అన్ని రంగాలకు తలుపులు తెరిచింది. రక్షణలో సహకారం, రవాణా, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి, ప్రజా సంబంధాలు ఇలా అన్ని రంగాల్లో. అయితే ప్రస్తుతం అవేమీ లేవు” అని అహ్మద్ అన్నారు.

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, Anahita Sachdev/BBC

రెచ్చ గొట్టే వ్యాఖ్యలతో పరిస్థితి దిగజారిందా?

హసీనా తొలగింపు తర్వాత ఆమె దిల్లీకి రావడంతో ప్రజల్లో అప్పటి వరకు ఉన్న అనుమానం కాస్తా ఆగ్రహంగా మారింది.

‘ఒక పార్టీకి మద్దతివ్వడం’ అనే విధానాన్ని దిల్లీ మార్చుకుంటుందని అనేకమంది బంగ్లాదేశీయులు ఎదురుచూశారు. అయితే భారత్ అందు భిన్నంగా వ్యవహరించింది. హసీనాకు ఆశ్రయం ఇచ్చింది.

“హసీనాకు ఆశ్రయం ఇవ్వడం, వాణిజ్యపరమైన ఆంక్షలు లాంటివి పొరుగు దేశానికి భారత్ ఎలాంటి విలువ ఇవ్వడం లేదని భావించేలా చేశాయ”ని అహ్మద్ అన్నారు.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులను భారత నాయకులు ‘చెద పురుగులు’గా అభివర్ణించినప్పుడు లేదా గాజాలో ఇజ్రాయెల్ చేసినట్లు బంగ్లాదేశ్‌కు గుణపాఠం నేర్పాలంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఎలా స్పందించాలని మీరు ఆశిస్తున్నారు?” అని అహ్మద్ అడిగారు.

ఈ వ్యాఖ్యలతో చెలరేగిన ఆగ్రహం బంగ్లాదేశ్‌లో భారతీయ వస్తువుల బహిష్కరణకు, ఐపీఎల్ ప్రసారాలపై నిషేధానికి పిలుపు వరకు వెళ్లాయి.

“సంస్కృతి, వాణిజ్యం, గౌరవం, ఏవైనా కావచ్చు అవన్నీ ఏకపక్షంగా ఉండవు. దురదృష్టత్తువశాత్తూ భారత నాయకత్వం ఈ కోణంలోనే పని చేస్తోంది” అని అహ్మద్ అన్నారు.

అయినప్పటికీ ఢాకాలోని అధికారులు రెండు దేశాల సంబంధాల్ని సంక్షోభ కోణంలో మాత్రమే చూడవద్దని చెబుతున్నారు.

భారత్‌తో సంబంధాలు “బహుముఖమైనవి”. అవి రాజకీయ, భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉన్నాయని యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం అభివర్ణించారు.

“మేము 54 నదులను పంచుకుంటాం. భాష, చరిత్ర, వాణిజ్యం లాంటివన్నీ పంచుకుంటాం. రెండు దేశాలమధ్య ఉన్న 4,096 కిలోమీటర్ల సరిహద్దుల్లో రోజు వారీ రాకపోకలు జరుగుతాయి” అని ఆయన చెప్పారు.

అయినప్పటికీ, భారత్‌కు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలు బలపడ్డాయని ఆయన భావిస్తున్నారు.

“15ఏళ్ల పాటు మీరు ఎందుకు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోయారని బంగ్లాదేశీయుల్ని అడిగితే, అనేకమంది ప్రజలు ఒకే సమాధానం చెబుతారు. అదేంటంటే షేక్ హసీనా నియంతృత్వం, ఆమెకు భారత ప్రభుత్వ మద్దతివ్వడం” అని ఆలం అన్నారు.

2024 హింస తర్వాత హసీనా భారత్‌కు పారిపోవడం రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక కీలకమైన అంశంగా మిగిలింది.

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, Reuters

భారత్ గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది?

“వందల మంది యువకుల్ని చంపేశారు. ఆ తర్వాత ఆమె భారత్ పారిపోయారు” అని ఆలం అన్నారు.

భారత ప్రభుత్వం ఆమెను దేశం నుంచి పారిపోయిన నేతగా కాకుండా “ప్రభుత్వాధిపతిగా” చూసిందనే భావన ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచింది.

భారత మీడియా కవరేజ్‌ పైనా ఆలం ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల మీద హింసను ‘వ్యతిరేక ప్రచారం’ అని ఆయన పేర్కొన్నారు. అక్కడక్కడా ఏవో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయనీ, వాటిని మతపరమైన హింసగా చూపించడం అలవాటుగా మారిందని ఆయన అన్నారు.

“ఇక్కడకు వచ్చి చూడండి. ప్రజలను కలవండి. ఏం జరుగుతుందో తెలుసుకోండి” అని ఆయన భారత మీడియాకు విజ్ఞప్తి చేశారు.

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీల మీద 2,900 హింసాత్మక సంఘటనలు జరిగినట్లు అందులో హత్యలు, గృహ దహనాలు, భూ కబ్జాలు ఉన్నాయని స్వతంత్ర సంస్థలు నమోదు చేసినట్లు భారత్ చెబుతోంది.

ఈ సంఘటనలను మీడియా అతిశయోక్తి లేదా రాజకీయ హింసగా తోసిపుచ్చలేమని భారత్ చెబుతోంది.

ప్రస్తుత పరిస్థితి అపార్థంకంటే మించినదని యూనస్ ప్రత్యేక సహాయకుడిగా పని చేస్తున్న విద్యావేత్త అలీ రియాజ్ నమ్ముతున్నారు.

“భారత్- బంగ్లాదేశ్ సంబంధాలు కాలక్రమంలో రెండు దేశాల దౌత్య సంబంధాల స్థాయి నుంచి ఒక వ్యక్తి- పెత్తనం చేయాలని భావించే ప్రభుత్వ సంబంధాలుగా మారిపోయాయి” అని ఆయన భావిస్తున్నారు.

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, ANAHITA SACHDEV/BBC

పాత వివాదాలు

రెండు దేశాల సంబంధాల్లో పాత వివాదాలు వల్ల నష్టం మరింత పెరిగిందనీ, నీటి పంపిణీ ఒప్పందాల్లో ఆధిపత్యం వివక్షను సృష్టిస్తుందంటారు రియాజ్

“మీరు నీటిని ఆపేస్తే, సంబంధంలో సమానత్వం ఎక్కడుంటుంది?” అని రియాజ్ ప్రశ్నించారు.

సరిహద్దుల్లో హత్యలు లోతైన గాయాలు చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.

“భారత ప్రభుత్వం బంగ్లాదేశీయుల జీవితాల్ని ఎలా చూస్తుందో దీన్ని బట్టి తెలుస్తుంది” అని ఆయన చెప్పారు.

సరిహద్దుల్లో హత్యలకు సంబంధించి తమ బలగాలు అక్రమంగా ఎవరినీ చంపలేదని భారత ప్రభుత్వం తెలిపింది.

ఇవి అప్పుడప్పుడు వచ్చే సమస్యలు కాదని, రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులకు సూచికలని విశ్లేషకులు చెబుతున్నారు.

హసీనా పతనం తర్వాత ఇది మరింత బలపడిందని విమర్శకుల అభిప్రాయం.

“భారత్ తన వైఖరిని మార్చుకోవడంలో విఫలమైంది. తాత్కాలిక ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకునే అవకాశాన్ని నష్టపోయింది” అని యూనస్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు మొహమ్మద్ తౌహహిద్ హుస్సేన్ చెప్పారు.

“మేము అనేక సందర్భాల్లో ముందుకు వచ్చాం. అయితే భారత ప్రతిస్పందన ఎప్పుడూ స్పష్టంగా లేదు” అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్‌లో “క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితిపై” భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్ని స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిమాండ్ చేసింది.

రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ఆర్థిక సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి.

భారత్- బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 13.5 బిలియన్ డాలర్లుగా ఉంది. టారిఫ్, నాన్ టారిప్ అడ్డంకులను తగ్గించి, దౌత్య సంబంధాలు మెరుగుపడితే రెండు దేశాల వాణిజ్యం మరింత పెరుగుతుందని థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ డైలాగ్‌కు చెందిన ఫహ్‌మిదా ఖతూన్ చెప్పారు.

దేశాల మధ్య ఉండే ఇలాంటి ఉద్రిక్తతలు ప్రతీసారి వీధుల్లో కనిపించవు.

“భారత్ అనే పేరు విన్నప్పుడల్లా, అది మా శత్రువు అనిపిస్తుంది. అయితే ఆ దేశ ప్రజల విషయానికొస్తే అలా అనిపించదు” అని ఇంక్విలాబ్ మంచ్‌కు చెందిన ఫాతిమా తస్నీమా జుమా చెప్పారు.

తాను హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెరిగినట్లు జుమా చెప్పారు. తమ బంధువులు సరిహద్దుల మధ్య స్వేచ్ఛగా ప్రయాణిస్తారని అన్నారు.

“మేము భారత ప్రభుత్వానికి వ్యతిరేకం. భారతీయులకు కాదు” అని ఆమె అన్నారు.

బంగ్లాదేశ్ యువత, భారత వ్యతిరేకత, షేక్ హసీనా, ఢాకా, దిల్లీ

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

భారత్ బాధ్యత తీసుకోవాలా?

ఎన్నికల ప్రచారంలో భారత వ్యతిరేక భావాలు సద్దుమణిగాయి. అంటే దానర్థం అవి లేకుండా పోయాయని కాదు. భారత్‌తో సంబంధాలను కొనసాగించడం అనివార్యమని బంగ్లాదేశ్‌లో ప్రతి రాజకీయ నాయకుడికీ తెలుసు.

అలాగని భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు అంత త్వరగా బాగు చేయడం కూడా సాధ్యం కాదు. పైపైన మరమ్మతులు చేసి వదిలేయడం కుదరదు.

”ఎన్నికలు వచ్చినంత మాత్రానో, కొత్త ప్రభుత్వం ఏర్పడటం వల్లో సంబంధాల పునరుద్ధరణ సాధ్యం కాదు. పాత సమస్యలు అలాగే ఉంటాయి” అని ఆలం అన్నారు. అయితే, దేశాల మధ్య విభేదాలు శాశ్వతంగా ఉండవని అంటున్నారు రియాజ్.

కాకపోతే వీటిని మెరుగుపరిచే బాధ్యత ఎక్కువగా భారత్‌కే ఉందని, తనతో సంబంధాలు కొనసాగించడంలో తనకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడాలన్న ధోరణిని దాటి భారత్ ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉందని ఆయన అన్నారు.

సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని, ఢాకాలో ఏ ప్రభుత్వం ఉన్నా, వారితో సంబంధాలు పెట్టుకునే చొరవ భారత్ తీసుకోవాలని అహ్మద్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి చొరవ వ్యూహాత్మకం అనేకన్నా నైతికం అనడానికే అక్కడి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.

“దేశం ఎంత పెద్దదైతే, బాధ్యత అంత పెద్దగా ఉంటుంది” అని బీఎన్‌పీ నేత రెహమాన్‌కు కీలక సలహాదారుడు మహదీ అమీన్ అభిప్రాయపడ్డారు.

ఆయన అభిప్రాయం ప్రకారం, భారతదేశం తన విధానాలను ఇక్కడి ప్రభుత్వాల అభిరుచులకు అనుగుణంగా కాకుండా బంగ్లాదేశీయుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకున్నప్పుడే బంగ్లా ప్రజల మనసును చూరగొంటుంది.

జమాత్ ఇ ఇస్లామి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అహ్సానుల్ మహబూబ్ జుబైర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“రెండు దేశాలలోని పాలకులు నిజాయితీగా ఉండి, ప్రస్తుత వాస్తవాలను అంగీకరించి ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి” అని అన్నారాయన.

సంబంధాలు మెరుగుపరచడానికి ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయనీ, బంగ్లాదేశ్‌లో రాబోయే కొత్త ప్రభుత్వం ఆ మేరకు చొరవ తీసుకోగలదని జుబైర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

”రెండు దేశాల మధ్య దౌత్యపరమై సంఘర్షణే తప్ప, నిర్మాణాత్మకంగా ఒకరినొకరు విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి లేదు” అని పలివాల్ అభిప్రాయపడ్డారు.

“భౌగోళిక, చారిత్రక, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పుడు, భారత్, బంగ్లాదేశ్‌లు ఒకదానినొకటి విస్మరించలేవు” అంటున్నారు పలివాల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)