Home జాతీయ national telgu ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నానికి పాల్పడింది ఎవరు?

ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నానికి పాల్పడింది ఎవరు?

19
0

SOURCE :- BBC NEWS

ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, Parveen Negi/The India Today Group via Getty Images

ఒక గంట క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లాపై బుధవారం సాయంత్రం(మార్చి 11) ఒక వివాహ వేడుకలో హత్యాయత్నం జరిగింది.

జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌధురి కూడా ఆయన వెంట ఉన్నారు. దాడి నుంచి వారిద్దరూ త్రుటిలో తప్పించుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫారూక్ అబ్దుల్లా కొడుకు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ వీడియో షేర్ చేశారు.

ఒక వ్యక్తి పిస్టల్ పట్టుకుని ఫారూక్ అబ్దుల్లా వైపు వస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఫారూక్ అబ్దుల్లా భద్రతా సిబ్బంది, అక్కడ ఉన్నవారు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న సాయుధుడిని అడ్డుకుంటున్నట్టు కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

పోలీసులేమంటున్నారు?

‘ఫారూఖ్ అబ్దుల్లాను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు’ అని జమ్మూకశ్మీర్ పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

దాడిని ఒమర్ అబ్దుల్లా ధ్రువీకరించారు. “దేవునికి ధన్యవాదాలు. నా తండ్రి త్రుటిలో తప్పించుకున్నారు” అని చెప్పారు.

“దేవుడు దయగలవాడు. మా నాన్న తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియదు. లోడ్ చేసిన పిస్టల్‌తో ఉన్న ఒక వ్యక్తి చాలా దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడని తెలిసింది” అని ఒమర్ అబ్దుల్లా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

“దగ్గరలోని భద్రతా బృందం అప్రమత్తంగా ఉండటం వల్లే బుల్లెట్ పక్కకు వెళ్లి హత్యాయత్నం విఫలమైంది. ప్రస్తుతం సమాధానాల కంటే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. జడ్ ప్లస్ ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఓ వ్యక్తి ఆయుధంతో అంత దగ్గరగా ఎలా వచ్చాడనేది అతిపెద్ద ప్రశ్న” అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

జమ్మూలోని గ్రేటర్ కైలాశ్‌లో ఉన్న రాయల్ పార్క్‌లో ఓ పెళ్లికి ఫారూక్ అబ్దుల్లా హాజరైనప్పుడు ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు .

పెళ్లి వేడుకలో పాల్గొన్న సమయంలో ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగిందని పోలీసులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

ఆయన భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి, దాడిని భగ్నం చేసి, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నారని చెప్పారు.

నిందితుడిది జమ్ము అని తెలిపారు.

జమ్మూకశ్మీర్, నేషనల్ కాన్ఫరెన్స్

ఫొటో సోర్స్, Firdous Nazir/NurPhoto via Getty Images

ప్రత్యక్ష సాక్షులేం చెప్పారు?

జమ్మూలోని గ్రేటర్ కైలాశ్‌లో ఈ ఘటన జరిగినప్పుడు తాను ఫారూక్ అబ్దుల్లా వెంట ఉన్నానని, దాడిలో ఎవరూ గాయపడలేదని సురీందర్ చౌధురి చెప్పారు.

“ఇంత తీవ్ర నిర్లక్ష్యం ఎలా జరిగిందో పోలీసులను అడగండి . స్థానిక పోలీసులు లేదా సిబ్బంది ఎవరూ అక్కడ లేరు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర సలహాదారు హాజరైన కార్యక్రమంలోకి ఒక వ్యక్తి తుపాకీతో ప్రవేశించాడంటే అక్కడ భద్రత ఎలా ఉందో మీరు ఊహించవచ్చు” అని ఆయన విలేకరులతో చెప్పారు.

ఫారూక్ అబ్దుల్లా ఒక కార్యక్రమానికి హాజరవుతున్నప్పుడు ఆయనపై దాడి జరిగిందని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ జాన్ చెప్పారు.

“ఆయన (ఫారూక్ అబ్దుల్లా) ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్లారు. మేమందరం ఆయనతో ఉన్నాం. మేం ఆ కార్యక్రమం నుంచి బయటకు వెళ్తుండగా, వెనుక నుంచి ఒక వ్యక్తి చాలా వేగంగా వచ్చి డాక్టర్ సాహిబ్ (ఫారూక్ అబ్దుల్లా) వీపుపై రివాల్వర్ పెట్టి కాల్చాడు. కానీ అతని షాట్ మిస్ అయింది” అని ఎమ్మెల్యే చెప్పారు.

“ఫారూక్ అబ్దుల్లా వెంట ఉన్న సెక్యూరిటీ గార్డులు వెంటనే దాడికి యత్నించిన సాయుధుడిని పట్టుకుని కింద పడేశారు. చాలా పెనుగులాట తర్వాత వారు అతని చేతిలో నుంచి పిస్టల్ లాక్కోగలిగారు. ఆ తర్వాత మేం అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చాం” అని తెలిపారు.

“వివాహ వేడుకలోకి తుపాకీతో రాగలగడం చాలా దురదృష్టకరం. కానీ అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా ఉన్నారు. ఫారూక్ అబ్దుల్లా పూర్తిగా క్షేమంగా ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది. అతని గురించిన సమాచారం పోలీసులు మాత్రమే చెప్పగలరు. అతని జుట్టు కొద్దిగా తెల్లగా ఉంది. అతని గురించి ఇంకేమీ తెలియదు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు” అని అహ్మద్ జాన్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)