Home LATEST NEWS telugu తాజా వార్తలు పులిని పట్టుకున్నారు.. రాజమండ్రి చుట్టుపక్కల తిరుగుతూ ఎలా దొరికిపోయిందంటే..

పులిని పట్టుకున్నారు.. రాజమండ్రి చుట్టుపక్కల తిరుగుతూ ఎలా దొరికిపోయిందంటే..

5
0

SOURCE :- BBC NEWS

రాజమండ్రి సమీపంలో దొరికిన పులి

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం సమీప గ్రామాలను కొద్ది రోజులుగా హడలెత్తించిన పెద్దపులిని ఎట్టకేలకు అటవీ సిబ్బంది పట్టుకున్నారు.

రాజమండ్రి సమీపంలోని కూర్మాపురం గ్రామంలోని ఓ చెరువు వద్ద అటవీ సిబ్బంది పులిని బంధించారు.

గత మూడు రోజులుగా ప్రతి రోజూ ఇదిగో పులి, అదిగో పులి.. రోడ్డు దాటుతున్న పులి… అంటూ అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

దీంతో, అధికారులు ఆ పులిని పట్టుకుని అడవిలోకి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

చివరకు వారి ప్రయత్నాలు శుక్రవారం సాయంత్రం ఫలించాయి.

అంతకుముందు గురువారం.. రాజమహేంద్రవరం ఫారెస్ట్ సర్కిల్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ (సీసీఎఫ్ఓ) బీఎన్ఎన్ మూర్తి బీబీసీతో మాట్లాడినప్పుడు “రెండు రోజుల్లో పులిని పట్టుకుంటాం” అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటివరకు ఏం జరిగింది?

రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో మూడు రోజుల క్రితం ఆవుపై పెద్ద పులి దాడి చేసింది.

“అడవి జంతువు (వైల్డ్ యానిమల్) కాబట్టి పశువుల మీద దాడి చేయడం సర్వసాధారణం” అని సీసీఎఫ్ఓ బీఎన్ఎన్ మూర్తి బీబీసీకి చెప్పారు.

అలాగే, బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి నామవరం రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న వారి ముందు దూకి, సమీపంలోని పామాయిల్ తోటల్లోకి వెళ్లింది.

దీంతో, పులి జాడ కనిపించిన సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

“రాత్రి సమయాల్లో పశువుల మీద పులి దాడి చేస్తుంది. మనుషులపై ఎలాంటి దాడి చేయలేదు. రాజమండ్రి పరిసరాల్లో కనిపిస్తున్న పులికి మూడు సంవత్సరాల వయస్సు ఉంటుంది” అని బీఎన్ఎన్ మూర్తి చెప్పారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, UGC

ఎలా పట్టుకుంటారంటే..

రాజమహేంద్రవరం ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ…”పులిని గుర్తించేందుకు వెలుతురు తగ్గే సమయంలో.. అంటే చీకటిపడే సమయంలో థర్మల్ కెమెరాలు ఆన్ చేస్తాం. దీంతో, పులి ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. రెండు రోజుల్లో దానిని పట్టుకుంటాం, సురక్షితంగా అడవిలోకి పంపుతాం” అని చెప్పారు.

‘‘ ఈ పులి మహారాష్ట్రలోని తాడోబా ప్రాంతం నుంచి వచ్చింది. పశువుల రూపంలో సులభంగా ఆహారం దొరుకుతుండటంతో పులులు ఇటు తాడోబా, అటు ఒడిశా ప్రాంతం నుంచి ఈ ప్రాంతాలకి వస్తున్నాయని భావిస్తున్నాం’’ అని శ్రీనివాస్ అన్నారు.

‘‘ఆడపులిని వెతుక్కుంటూ రావడం, పులి జీవించే ప్రాంతంలో పర్యావరణపరంగా తీవ్రమైన మార్పులు ఏర్పడటం, ఆవాసానికి తగిన ప్రాంతాన్ని వెతుక్కుంటూ రావడం వంటివి పులి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రావడానికి కారణాలు” అని వివరించారు.

“పులి మనుషులకు కనిపించకుండా దాక్కునే జంతువు. అయితే, దాన్ని కంగారు పెట్టే పనులు ఎవరూ చేయకూడదు” అని శ్రీనివాస్ సూచించారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, UGC

టెక్నాలజీతో టైగర్ ట్రేసింగ్

రాజమహేంద్రవరంలోని సమీప గ్రామాల్లో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు టెక్నాలజీని వినియోగించారు. ఈ విషయం బీఎన్ఎన్ మూర్తి బీబీసీకి వెల్లడించారు.

“పుణె నుంచి నిపుణుల బృందం రాజమహేంద్రవరం వచ్చింది. పులి కనిపిస్తే లోడ్ చేసిన మత్తు ఇంజెక్షన్ తుపాకీ ప్రయోగించి దాన్ని సురక్షితంగా పట్టుకుంటాం. పులిని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్స్, 4జీ మోడల్ అడ్వాన్స్‌డ్ థర్మల్ కెమెరాలు వినియోగిస్తున్నాం. అలాగే, 120 మందితో కూడిన రాపిడ్ రెస్పాన్స్ టీం ఉంది” అని బీఎన్ఎన్ మూర్తి గురువారం బీబీసీతో చెప్పారు.

వీరితో పాటు, పులిని సురక్షితంగా బంధించేందుకు 150 మంది అటవీ శాఖ సిబ్బంది, వంద మంది పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.

సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో మనుషులు లేని ప్రాంతంలో పులి సంచారం ఉంటుందన్నారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని కార్యాలయం అనుమతి అవసరమా?

రాజమహేంద్రవరం సమీప అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కూడా అనుమతులు లభించాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై బీబీసీ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడింది.

“పులిని పట్టుకోవడం, ఫీల్డ్ ఆపరేషన్ కాబట్టి పులిని పట్టుకునేందుకు ప్రధాని కార్యాలయం అనుమతులు అవసరం లేదు” అని బీఎన్ఎన్ మూర్తి బీబీసీకి స్పష్టం చేశారు.

అయితే, పులిని పట్టుకునేందుకు ఎవరి అనుమతులు అవసరమో ఆయన బీబీసీకి వివరించారు.

రాష్ట్ర అటవీ శాఖ, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్థాయి అధికారిక అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, UGC

అనుమతి ఎప్పుడిస్తారు?

పులులను బంధించేందుకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు ఇస్తారు.

  • మనుషులకు పులి వల్ల ప్రమాదమని భావిస్తే..
  • ఎవరైనా గాయపడి ఉంటే..
  • ట్రాంక్విలైజ్(మత్తు మందు) చేయాలా? బంధించాలా? లేదా ఇతర చర్యలు తీసుకోవాలా? అనే పరిస్థితి తలెత్తినప్పుడు.
  • కొన్ని కేసుల్లో పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) అనుమతి ఇస్తారు.
  • ఎన్సీటీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ప్రకారం, కమిటీ రిపోర్ట్ తర్వాత ఆర్డర్ ఇస్తారు (ముఖ్యంగా పెద్ద ఆపరేషన్స్ లేదా సెన్సిటివ్ కేసుల్లో)

“పులి షెడ్యూల్ -1 జంతువు. అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువుల జాబితాలో ఉంది. పులి ఎకో సిస్టమ్‌కి ఎంతో కీలకం. పులి విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పులిని హింసించినా, పట్టుకున్నా శిక్షలు పడతాయి. పులి కనిపిస్తే ముందుగా దానిని అడవిలోకి పంపడం, అలా సాధ్యంకాని పక్షంలో అవసరమైతేనే ట్రాంక్విలైజ్ ఇచ్చి దానిని పట్టుకోవడం చేయాలి. ఇవన్నీ కూడా అటవీ చట్టాల పరిధిలోనే జరగాలి” అని బీఎన్ఎన్ మూర్తి బీబీసీకి వివరించారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, Getty Images

పశువులపై దాడి

జి. యర్రంపాలెంలో ఆవు దూడలపై పెద్దపులి దాడి చేయడంతో ఒక ఆవుతో పాటు మూడు ఆవు దూడలు మృతి చెందాయి.

ఆవు దూడలు మృతి చెందిన ప్రాంతం వద్ద పులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.

పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ సిబ్బంది మత్తుమందు ఇచ్చేందుకు గన్‌లు సిద్ధం చేసుకున్నారు.

దీనికి జాతీయ పులుల సంరక్షణ సంస్థ అనుమతులు కూడా లభించాయని శ్రీనివాస్ బీబీసీకి చెప్పారు.

‘‘పులిని పట్టుకునే ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందవద్దు. పులి భయపడే, కంగారుపడే పనులు చేయొద్దు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఆపరేషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచారాన్ని పంచుకుంటున్నాయి’’ అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం చెప్పారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, UGC

‘మనిషి వాసన పులి పసిగడుతుంది’

పులి సంచారం ఉన్న గ్రామాలతో పాటు సమీప గ్రామాల్లోని ప్రజలు రాత్రి బయటకు రాకూడదని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు.

“పులులు సాధారణంగా పగలు బయటకు రావు. కాస్త చీకటి పడిన తర్వాతే బయటకి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద పులిని బంధించే ఆపరేషన్ వద్దకు ప్రజలు ఎవరూ రావద్దు. హడావుడి ఎక్కువగా ఉంటే పులి కంగారు పడి మనుషులపైకి వచ్చే అవకాశం ఉంటుంది” అని బీఎన్ఎన్ మూర్తి చెప్పారు.

పులిని పట్టుకునే ఆపరేషన్ జరుగుతున్న సమీపంలోకి ఎక్కువ మంది మనుషులు వస్తే… పులి ఆ వాసనని పసిగట్టి అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

పులిని పట్టుకునేందుకు నలుగురు డీఎఫ్ఓ‌లు, పదుల సంఖ్యలో పోలీసు బృందం, ఫారెస్ట్ బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు.

‘పులి దాడి చేయదు’

పులి సంచారంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో… పులులు అసలు ఎందుకు అడవిని వదిలి జనవాసాల్లోకి వస్తున్నాయనే అంశంపై విశాఖ సర్కిల్ రిటైర్డ్ సీసీఎఫ్ఓ పి.రామ్మెహన రావుని బీబీసీ సంప్రదించింది.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం… “ఏ జంతువుకైనా దానికి అనుకూలమైన, అలవాటైన నివాస ప్రాంతం ఉంటుంది. అక్కడ దానికి కావాల్సిన ఆహారం, నీరు, జత కట్టే మరో జంతువు అన్నీ ఉంటాయి. అలాంటి ప్రాంతాన్ని వదిలి జంతువులు మరో చోటుకు వెళ్తున్నాయంటే అక్కడేదో సమతుల్యత దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఆహారాన్ని కూడా తినదు, ఆ ప్రాంతంలో ఉండదు. మనిషికి తారస పడకుండా ఉండేందుకు పులి ప్రయత్నిస్తుంది. దాడి చేయాలని ఎప్పుడు అనుకోదు.”

‘‘పులి తెలివైన జంతువు. ఇప్పుడు ట్రాప్‌లను కూడా పసిగడుతున్నట్లు ఉంది. ఆహారం, దానికి అనుకూలంగా ఉండే స్థావరం కోసం వెతుకుతూ పులి ప్రతిరోజూ కొత్త ప్రాంతానికి పయనిస్తుంది. అందుకే పులిని పట్టుకోవడంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి’’ అని చెప్పారు.

“పులిని చంపడం లేదా ఏదైనా హాని చేస్తే… వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం కఠినమైన శిక్షలు పడతాయి. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గుర్తించాలి” అని సూచించారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, UGC

‘జనవాసాల్లోకి పులి వచ్చినప్పుడు…’

మనుషులు ఉండే ప్రాంతాల్లోకి పులి వచ్చినప్పుడు దాని ప్రవర్తన ఎలా మారుతుందనే అంశంపై రాజమహేంద్రవరం సీసీఎఫ్ఓ బీఎన్ఎన్ మూర్తి వివరించారు.

“మనుషుల ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు పులి ప్రవర్తన కొంత మారుతుంది. అడవిలో ఉన్నప్పుడు అది ధైర్యంగా, తన భూభాగంలో నిశ్చింతగా తిరిగితే, గ్రామాలు లేదా పట్టణాల దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా టెన్షన్‌లో, అప్రమత్తంగా ఉంటుంది. మనుషుల శబ్దం, వాహనాల లైట్లు, కొత్త వాసనలు ఇవన్నీ దానికి ఒత్తిడిని కలిగిస్తాయి’’ అని చెప్పారు.

‘‘ కొన్నిసార్లు దారి తప్పి ఇళ్ల దగ్గరకు, పశువుల దగ్గరకు రావచ్చు. ఆకలి ఎక్కువగా ఉంటే పశువులపై దాడి చేసే అవకాశం పెరుగుతుంది. చాలా అరుదుగా, అది కూడా ప్రమాదంగా భావిస్తేనే మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ, సాధారణంగా పులి మనుషులను చూసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తుంది’’ అని తెలిపారు.

“పులి లేదంటే అడవి ఉండదనే విషయం అంతా తెలుసుకోవాలి. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ” అని బీఎన్ఎన్ మూర్తి అన్నారు.

వన్యప్రాణులు, జంతు సంరక్షణ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రంలో పులుల సంచారం

గత ఐదేళ్లలో ఏపీలో పలు చోట్ల పులుల సంచారం కనిపించింది. గత 5 సంవత్సరాల్లో (సుమారు 2021–2026 మధ్య) ఏపీలో పులి సంచారం కనిపించిన ఘటనలను బీబీసీకి అటవీశాఖ అధికారులు వివరించారు. అవేంటంటే..

తూర్పు గోదావరి (2026 – తాజా ఘటన)

  • రాజమండ్రి రూరల్, తొర్రేడు, రాజానగరం ప్రాంతాల్లో పులి సంచారం గుర్తింపు
  • మహారాష్ట్ర నుంచి వలస వచ్చిందని భావిస్తున్నాం.
  • పశువులపై దాడులు, గ్రామాల్లో భయం నెలకొంది.
  • గోదావరి దాటి గ్రామాల వరకు వచ్చినట్లు అంచనా వేస్తున్నాం.

నల్లమల అడవులు (2023, 2025, 2026):

కర్నూలు, నంద్యాల, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల్లో పులి సంచారం కనిపించింది. పశువులను చంపిన ఘటనలు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లా (2025):

3 నెలల పాటు పులి సంచారం, పశువులపై దాడుల ఘటనలు నమోదు.

నెల్లూరు (2024):

గిద్దలూరు – నల్లమల నుంచి వెలిగొండకు పులి వలస వచ్చినట్లు అధికారులు అంచనాకి వచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS