SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
మహిళలకు పీరియడ్ లీవ్ తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి చట్టం వల్ల మహిళలకు నష్టం జరుగుతుందని, వారికి ఉద్యోగవకాశాలు దొరకడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది.
మహిళలకు పీరియడ్ లీవ్ అంటే నెలసరి సమయంలో సెలవు తప్పనిసరి చేయాలనే అంశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
మహిళలు పీరియడ్ టైంలో పనిచేయడం కష్టం కాబట్టి, సెలవు తప్పనిసరి చేయాలనేవాళ్లు కొందరైతే , ఇది మహిళలకు ఉద్యోగావకాశాలపై చాలా ప్రభావం చూపిస్తుందనేవాళ్లు ఇంకొందరు.
అయితే సమాజంలో ఉన్న పోటీ, దీని గురించి సమాజం నుంచి వినిపించే అవహేళన, మహిళల్లో సిగ్గులాంటి వాటికారణంగా పీరియడ్ లీవ్ చట్టం ఉన్నదేశాల్లోని మహిళలు కూడా వాటిని వినియోగించడానికి వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయమూ ఉందని ది గార్డియన్ పత్రిక దశాబ్దం కిందటే ఓ ఆర్టికల్‌లో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మరి మహిళా శ్రామిక శక్తి పై డేటా ఏం చెబుతోంది?
భారత్‌లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2017-18లో 23 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, 2023-24 నాటికి సుమారు 42 శాతానికి పెరిగిందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో బ్రిక్స్ దేశాలన్నింటిలోనూ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యంలో అత్యంత గణనీయమైన పెరుగుదలను నమోదు చేసిన దేశం భారత్.
దీనికి ప్రత్యేకించి మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలే కారణమని ప్రభుత్వం తెలిపింది.
కొన్ని పోటీ పరీక్షల ఫీజు నుంచి మహిళలకు మినహాయింపు ఇవ్వడం, 730 రోజుల చైల్డ్ కేర్ లీవ్, ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు ఒకే కేంద్రంలోనే నియామకాలు, అలాగే 180 రోజుల మెటర్నిటీ లీవ్ వంటి చర్యలు కూడా మహిళల శ్రామిక శక్తి రేటు పెరుగుదలకు తోడ్పడ్డాయని ప్రభుత్వం అన్నది.
అయితే పీరియడ్ లీవ్ విషయానికొస్తే భారత్‌లో జాతీయ స్థాయిలో పీరియడ్ లీవ్ పాలసీలు లేనప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు పీరియడ్ లీవ్ తీసుకునే అవకాశం ఇప్పటికే అమలవుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోని ఏయే రాష్ట్రాల్లో…
బిహార్ :
బిహార్‌లో 1992 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్కర్లకు రెండు రోజుల పీరియడ్ లీవ్ ఇస్తున్నారు. బిహార్ వికాస్ మిషన్‌లో, మానవ వనరుల మాన్యువల్‌లో మహిళలకు రెండు రోజుల ప్రత్యేక సెలవు గురించి ప్రస్తావించారు.
ఇందులో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు రెండు రోజుల సెలవు తీసుకునే వీలు కల్పించారు. ఒకవేళ వారు నెలలో ఈ రెండు సెలవులను వినియోగించకపోతే అవి వృథా అయినట్టే.
కేరళ :
2023లో కేరళలో ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు, అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని మహిళా ట్రైనీలకు వాళ్ల శారీరక, మానసిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పీరియడ్ టైంలో రెండు రోజుల సెలవు మంజూరు చేస్తున్నామని ప్రకటించింది
ఒడిశా:
ఒడిశాలో 2024 నుంచి నెలసరి సెలవుల విధానం అమల్లో ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న మహిళలు పీరియడ్స్ సమయంలో ఒకరోజు సెలవు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. పీరియడ్స్ సమయంలో మహిళలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఒడిశా ప్రభుత్వం చెప్పింది.
కర్ణాటక :
2025వ సంవత్సరంలో ప్రైవేటు, ప్రభుత్వ సెక్టార్లలో పనిచేసే మహిళలకు ప్రతి నెల పీరియడ్ లీవ్‌ను మంజూరు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 52 ఏళ్ల వయసు వారు ఈ లీవ్ వినియోగించడానికి అర్హులని ప్రకటించింది.
సిక్కిం:
సిక్కిం హైకోర్టులో పనిచేసే మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ సమయంలో రెండు లేదా మూడు రోజులు సెలవులు తీసుకోవచ్చిని చెబుతూ సిక్కిం హైకోర్టు 2004లో నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి.
ఫొటో సోర్స్, Getty Images
పీరియడ్ లీవ్ తప్పనిసరి చేసిన దేశాలు
అలాగే కొన్ని దేశాలు మహిళలకు పీరియడ్ లీవ్‌ను తప్పనిసరి చేశాయి.
జపాన్:
మహిళలకు నెలసరి సెలవు ప్రకటించిన మొదటి దేశం జపాన్. చట్టప్రకారం మహిళలు ఈ లీవ్‌ను వినియెగించుకోవచ్చు కానీ ఆ సెలవుకి వేతనం ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించే హక్కు కంపెనీలకు ఉంటుంది.
ఇండోనేషియా:
ఇండోనేషియాలో కూడా మహిళలకు నెలకు వేతనంతో కూడిన 2 రోజుల పీరియడ్ లీవ్ అమలవుతోంది.
దక్షిణ కొరియా:
దక్షిణ కొరియాలో 2001 నుంచి పీరియడ్ లీవ్ అమలులో ఉంది. అయితే ఈ సెలవు సమయంలో ఉద్యోగులకు వేతనం లభించదు.
జాంబియా:
ఆఫ్రికన్ దేశం జాంబియాలో కూడా 2015 నుంచి ప్రభుత్వం అక్కడి మహిళలకు నెలలో ఒకరోజు పీరియడ్ లీవ్ తీసుకునే అవకాశం కల్పించింది.
తైవాన్:
జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్ ప్రకారం తైవాన్‌లో మహిళా ఉద్యోగులు ప్రతి నెలా ఒక రోజు పీరియడ్ లీవ్ తీసుకోవచ్చు. అయితే ఏడాదిలో తీసుకునే మొత్తం పీరియడ్ లీవులు మూడు దాటితే వాటిని సిక్ లీవులుగా పరిగణిస్తారు.
స్పెయిన్:
2023లో స్పెయిన్ పీరియడ్ లీవ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీని తీసుకొచ్చిన మొట్టమొదటి యురోపియన్ దేశంగా నిలిచింది స్పెయిన్. నెలకు మూడు రోజుల నుంచి నొప్పి, ఇబ్బంది తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఐదు రోజుల వరకు మహిళలు సెలవు తీసుకొవచ్చు. ఇది పెయిడ్ లీవ్ అయినప్పటికీ మహిళలు ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా, ఈ రోజుల్లో ఉద్యోగులకు ఇచ్చే జీతాన్ని కంపెనీ యాజమాన్యం కాకుండా స్టేట్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ చెల్లిస్తుంది. కానీ ఈ సెలవుల వినియోగానికి డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పీరియడ్ లీవ్ అమలుచేస్తున్న కొన్ని సంస్థలు
స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థలు, మాతృభూమి మలయాళీ మీడియా ఆర్గనైజేషన్, దిల్లీలోని విమెన్ హైజీన్ ప్రొడక్ట్ మేకింగ్ కంపెనీ వెట్ అండ్ డ్రై, ముంబయి కేంద్రంగా పనిచేసే స్టార్టప్ కల్చర్ మెషీన్ వంటి సంస్థలు కూడా పీరియడ్ లీవ్ పాలసీని అమలు చేస్తున్నాయని ఇండియా టైమ్స్ తెలిపింది.
అలాగే హైదరాబాద్‌లోని ఓ మీడియా సంస్థలో సీనియర్ హెచ్‌ఆర్ హెడ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తితో మేం మాట్లాడాం. ఆయన పేరు, వివరాలు వెల్లడించడానికి సుముఖంగా లేనప్పటికీ తన అభిప్రాయాన్ని మాతో పంచుకున్నారు.
‘‘మహిళలకు పీరియడ్ లీవ్ అనేది ఓ గొప్ప హెల్ప్ లాంటిది. కానీ అదే సమయంలో ఇది వాళ్ల అవకాశాలను తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తుంది. ప్రతినెలా సెలవు తప్పనిసరి అయితే ప్రొడక్టివిటీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆలోచించడం సహజం. మరో వైపు మనం ఉన్న పోటీ ప్రపంచంలో, కెరీర్ ప్రాధాన్యతల మధ్య మహిళలు కూడా ఈ కారణంతో వెనకబడాలని కోరుకోవడం లేదు. కానీ పీరియడ్ లీవ్ తప్పనిసరి చేయడం వల్ల కంపెనీ మహిళల ఇబ్బందులను అర్థం చేసుకోవడమే కాక, వారిపై శ్రద్ధ చూపించినట్టు ఉంటుందని అది కంపెనీపై ఉద్యోగుల్లో నమ్మకం పెంచుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, https://www.facebook.com/
‘పీరియడ్ లీవ్‌ని ఆప్షనల్‌గా ఉంచాలి’
మహిళలకు పీరియడ్ లీవ్ అవసరమేనంటున్నారు బెంగళూరు ఎఫ్‌ఐఎస్ గ్లోబల్ సర్వీసెస్‌లో క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్ లీడ్‌గా పనిచేస్తున్నపఠాన్ ఇంతియాజ్.
కొందరు మహిళలకు పీరియడ్ సమయంలో భరించలేని నొప్పి, ఇబ్బంది ఉంటుందని ఆ సమయంలో లీవ్ దొరకడం పెద్ద ఉపశమనం కలిగిస్తుందని ఇంతియాజ్ అభిప్రాయపడ్డారు.
‘‘సెలవు అందరికీ అవసరం పడకపోవచ్చు. నిజమే. అందుకే పీరియడ్ లీవ్‌ని ఆప్షనల్‌గా అయినా ఆలోచించడం అవసరం’’ అని ఇంతియాజ్ అంటున్నారు.
కొందరు మహిళలు మేల్ బాస్‌ని సెలవు అడగడానికి కూడా ఇబ్బంది పడతారని, చట్టపరంగా సెలవు తప్పనిసరి చేస్తే ఈ భావన కూడా కొంతవరకు తగ్గుతుందని ఆమె అంటున్నారు.
ఇదే అంశంపై ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ విమెన్ అధ్యక్షురాలు, ఉద్యమకారణి సంధ్యతో బీబీసీ మాట్లాడింది.
‘‘చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, నీరసం ఉంటాయి. పనిచేసేంత ఓపిక ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి వెళ్లేవారు చాలామంది ఉన్నారు. అలా అని అందరికీ ఈ పరిస్థితి ఉండదు కాబట్టి పీరియడ్ లీవ్‌ను ఆప్షనల్‌గా ఉంచాలి. అవసరమైన వారు దాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలి. మరోవైపు పీరియడ్ లీవ్ వల్ల మహిళలకు అవకాశాలు తగ్గిపోతాయనే భయం కూడా ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం’’ అన్నారు సంధ్య.
పురుషులకు కూడా దీని అవసరం గురించి అర్ధమయ్యేలా చెప్పాలని సంధ్య అంటారు.
‘‘మాతృత్వం ఒక వరం అని చెబుతూనే, తల్లయ్యాక మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి తీరులో మార్పు రావాలంటే వీటిపై అవగాహన కల్పించడం చాలా అవసరం. కంపెనీలు వీటిపై దృష్టి పెట్టాలి’’ అని సంధ్య అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, roja vadlamudi
‘సెలవు కన్నా కంఫర్ట్‌పై కంపెనీలు దృష్టిపెట్టడం మంచిది’
మహిళే ఒక కంపెనీని నడిపిస్తున్న సందర్భంలో పీరియడ్ లీవ్ గురించి వారు ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.
హైదరాబాద్‌కు చెందిన మహిళాపారిశ్రామికవేత్త, ఆప్రా ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ ఫౌండర్ రోజ వడ్లమూడితో బీబీసీ మాట్లాడింది.
‘‘మహిళలకు పీరియడ్ టైంలో కొంత సపోర్ట్ అండ్ కంఫర్ట్ అవసరం. కానీ ఒక పారిశ్రామికవేత్తగా చూసినప్పుడు ప్రతి నెలా కచ్చితంగా మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వడం అంటే ఉత్పత్తిలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. మహిళా ఉద్యోగులు సెలవు అవసరం ఉన్నా లేకపోయినా కొంత ఉపశమనం కోసం కూడా సెలవు వినియోగించుకోవచ్చు. దాని వల్ల భవిష్యత్తులో వారి ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చు. కానీ సెలవు కన్నా కూడా వాళ్లకు సౌకర్యంగా ఉండే పరిస్థితులు కల్పించడంపై కంపెనీలు దృష్టి పెట్టడం అవసరం’’ అన్నారు రోజ వడ్లమూడి.
వర్క్ ఫ్రం హోం ఇవ్వడం, పనిగంటల్లో కొంత వెసులుబాటు, షిఫ్ట్ ఫ్లెక్సిబిలిటీ, లేదా ట్రావెల్ సపోర్ట్ వంటివి వారికి ఎంతో కొంత హెల్ప్ అవుతాయని రోజ అన్నారు.
మొత్తమ్మీద పీరియడ్ లీవ్ పై భిన్నాభిప్రాయాలున్నాయి. పీరియడ్స్ సమయంలో మహిళల మానసిక, శారీరక పరిస్థితులు అర్థం చేసుకోవాలనేవారు కొందరైతే, ఇది మహిళల కెరీర్ ఎదుగుదలకు ఒక అడ్డుగోడగా మారుతుందనే భావించేవారు మరికొందరు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



