Home జాతీయ national telgu పాకిస్తాన్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే.. ‘పాక్‌కు ఆయుధాలకు డబ్బులిచ్చినట్లే’ అని సునీల్ గావస్కర్ ఎందుకన్నారు?

పాకిస్తాన్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే.. ‘పాక్‌కు ఆయుధాలకు డబ్బులిచ్చినట్లే’ అని సునీల్ గావస్కర్ ఎందుకన్నారు?

16
0

SOURCE :- BBC NEWS

సునీల్ గావస్కర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్టీఫన్ షెమిల్ట్
    • హోదా, క్రికెట్ కరస్పాండెంట్
  • 17 మార్చి 2026, 10:35 IST

  • చదివే సమయం: 3 నిమిషాలు

పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ‘సన్‌రైజర్స్ లీడ్స్’ జట్టు కొనుగోలు చేయడాన్ని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విమర్శించారు. ఈ ఒప్పందం ‘పరోక్షంగా భారత సైనికులు, పౌరుల మరణాలకు కారణమవుతుంది’ అని అన్నారు.

గతవారం జరిగిన ‘ద హండ్రెడ్’ వేలంలో సన్‌రైజర్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై వచ్చిన విమర్శల్లో, గావస్కర్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

‘సన్‌రైజర్స్ లీడ్స్’ యాజమాని ‘సన్ గ్రూప్’. ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వీరిదే.

2008 ముంబయి దాడుల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, 2009 నుంచి ఐపీఎల్ జట్లు పాకిస్తాన్ ఆటగాళ్లను తీసుకోవడం లేదు.

అయితే, ‘ద హండ్రెడ్’ వేలంలో అబ్రార్‌ను దక్కించుకోవడం ద్వారా, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో అనుబంధం ఉన్న జట్లు పాకిస్తాన్ ఆటగాళ్లను దూరం పెడతాయనే అంచనాలను సన్‌రైజర్స్ తలకిందులు చేసింది.

ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి, అబ్రార్ ఎంపికపై ‘మిడ్ డే’ పత్రికలో రాసిన కాలమ్‌లో గావస్కర్ స్పందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అబ్రార్ అహ్మద్‌, సన్‌రైజర్స్‌

ఫొటో సోర్స్, ADEL SENNA/AFP via Getty Images

‘ఆయుధాలకు డబ్బులిచ్చినట్లే’

‘‘పాకిస్తాన్ ఆటగాళ్లకు ఫీజు చెల్లిస్తే, దాంతో వారు తమ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తారు. ఆ డబ్బుతో పాకిస్తాన్ కొనుగోలు చేసే ఆయుధాలు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల మరణాలకు కారణమవుతున్నాయనే వాస్తవాన్ని ఆలస్యంగానైనా గ్రహించడం వల్ల భారత కంపెనీలు పాక్ కళాకారులు, క్రీడాకారులను దూరం పెడుతున్నాయి’’ అని గావస్కర్ అన్నారు.

ఈ విషయంపై సన్‌రైజర్స్ లీడ్స్‌ను, గావస్కర్‌ను బీబీసీ స్పోర్ట్ సంప్రదించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు స్పందించడానికి నిరాకరించింది.

2025 ఏప్రిల్‌లో కశ్మీర్‌లో పర్యటకులపై దాడి తర్వాత భారత్, పాక్ మధ్య సైనిక ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో క్రీడా సంబంధాలు మరింత క్షీణించాయి. 2007 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు, ఇపుడు మైదానంలో కరచాలనం చేసుకోవడానికి కూడా జట్లు నిరాకరిస్తున్నాయి.

పాకిస్తాన్, భారత్

ఫొటో సోర్స్, John Phillips – ECB/ECB via Getty Images

వేలంలో ఎవరు పాల్గొన్నారు?

సన్ గ్రూప్ అనేది కళానిధి మారన్ స్థాపించిన ఒక మీడియా సంస్థ. ఆయన కుమార్తె కావ్యా మారన్ ‘ద హండ్రెడ్’ వేలానికి హాజరై, అబ్రార్ కోసం బిడ్డింగ్‌ వేశారు.

వేలం సమయంలో సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి మాట్లాడుతూ.. తమకు ఫలానా ఆటగాళ్లను తీసుకోవద్దని ఎటువంటి సూచనలు రాలేదని తెలిపారు.

వెటోరికి ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉండకపోవచ్చని, సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ కొనుగోలును ప్రోత్సహించకుండా ఉండాల్సిందని గావస్కర్ అభిప్రాయపడ్డారు.

“ఇంకా సమయం మించిపోలేదు, చేసిన తప్పును సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నా” అని తెలిపారు.

ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ వివాదం రేగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మార్చి 28న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ విమర్శలు సోషల్ మీడియాకే పరిమితమవుతాయని కొందరు భావించినా, గావస్కర్ వంటి క్రీడా ప్రముఖులు జోక్యం చేసుకోవడం ఈ వివాద తీవ్రతను పెంచింది.

ఇంగ్లండ్ బోర్డు లేఖ

ఐపీఎల్‌తో సంబంధమున్న నాలుగు ‘ద హండ్రెడ్’ ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ఆటగాళ్లను తీసుకోవద్దని భావిస్తున్నట్లు ఫిబ్రవరిలోనే బీబీసీ స్పోర్ట్‌కు కొన్నివర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఎనిమిది జట్లకు లేఖ రాసింది.

అనంతరం, “జాతీయత ఆధారంగా క్రీడాకారులను దూరం పెట్టకూడదు” అని ఫ్రాంచైజీలతో కలిసి గవర్నింగ్ బాడీ ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది.

‘ద హండ్రెడ్’ వేలంలో నమోదు చేసుకున్న అయిదుగురు పాక్ ఆటగాళ్లలో ముగ్గురు అమ్ముడుపోలేదు.

ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు తీసుకోగా, అబ్రార్‌ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసింది. జులైలో ఈ లీగ్ ప్రారంభం కానుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)