SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, PTI
పహల్గాం కాల్పుల అనుమానితుల చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. కాల్పుల్లో ముగ్గురు పాల్గొన్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయని పీటీఐ తెలిపింది.
ఈ ముగ్గురిని ఆసిఫ్ ఫాజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించామని అధికారులు చెప్పారు.
ఆసిఫ్ ఫాజిని మూసాగా, సులేమాన్ షాను యూనస్‌గా, అబు తల్హాను ఆసిఫ్‌గా పిలుస్తారని అధికారులు తెలిపారు.
కాల్పులనుంచి తప్పించుకున్నవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుమానితుల స్కెచ్‌లను గీయించినట్లు అధికారులు చెప్పారు.

దాడి చేసింది ఎవరు?
బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ అందించిన సమాచారం ప్రకారం…
మంగళవారం పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన దాడిని ఎవరు చేశారనే దానిపై అధికారి ధృవీకరణ లేదు.
అయితే, నిఘా వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదికలు, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న, అంతగా ప్రసిద్ధి చెందని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్ ) ఈ దాడికి బాధ్యత వహించి ఉండవచ్చని సూచిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేసిన తర్వాత ఈ బృందం ఏర్పడి ఉండవచ్చని, సాయుధ సమూహంగా మారడానికి ముందు ఇది ఆన్‌లైన్‌లో ప్రచారం చేసిందని నివేదికలు వెలువడ్డాయి.
2023లో భారత ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యువతను రిక్రూట్ చేసుకోవడం, ఉగ్రవాద ఆలోచనలను ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేయడం, జమ్మూ కశ్మీర్‌లోకి ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడం వంటి ఆరోపణలు చేసింది.
భారత ప్రభుత్వం టీఆర్ఎఫ్‌ను “భారతదేశ జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికి హానికరం” అని పేర్కొంది.
“ఈ బృందం లష్కరే శాఖగా కనిపిస్తోంది. ఒక్కటే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అది తన కార్యకలాపాలను కొనసాగించే సంకేతాలు కూడా కనపడుతున్నాయి” అని సైనిక చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ బీబీసీకి చెప్పారు.
“ఈ విధంగా నియంత్రితమయ్యే గ్రూపులు తమ మద్దతుదారులకు తాము ఇప్పటికీ చురుకుగా ఉన్నామని, తాము ఉపయోగకరమైన గ్రూపేనని చూపడానికి దాడులు చేస్తాయి.”

ఫొటో సోర్స్, ANI
‘దాడిలో నా కొడుకు హుస్సేన్ షా చనిపోయాడు’
కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన సయ్యద్ హుస్సేన్ షా జీవనోపాధి కోసం పర్యటకులను గుర్రపు స్వారీలపై తీసుకెళ్లేవారు.
ఈ దాడిలో ఆయన కూడా మరణించారు.
ఆయన తండ్రి ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా కొడుకు అమాయకుడు, ఈ దాడిలో చనిపోయాడు” అని అన్నారు.
“నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అక్కడ కాల్పులు జరిగాయని మేం విన్నాం. నా కొడుకుకు ఫోన్ చేశాను. కానీ స్విచ్ ఆఫ్ చేసి ఉంది.”
తరువాత మేం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం, అక్కడ నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడని వాళ్ళు చెప్పారు. తరువాత ” నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, నా కొడుకు చనిపోయాడని నాకు తెలిసింది” అని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి ఏవైనా అభ్యర్థనలు ఉన్నాయా అని ఒక విలేకరి అడిగినప్పుడు, “నా కొడుకే వెళ్ళిపోయాడు, ఇక నాకు ఏ అభ్యర్థనలు ఉంటాయి?” అని ఆయన బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Siddharth Bakaria
ప్రయాణాలను రద్దు చేసుకుంటున్న జనం
ముంబై నుంచి బీబీసీ ప్రతినిధి చెరిల్ మోలన్ అందిస్తున్న సమాచారం మేరకు
ట్రావెల్ ఏజెంట్లు, టూర్ గైడ్లు, పర్యటక రంగంపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది ఇతరులు కశ్మీర్ ఉగ్రవాద దాడి వల్ల తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని భయపడుతున్నారు.
గో జమ్మూ కశ్మీర్ అనే ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న సిద్ధార్థ్ బకారియా మాట్లాడుతూ, చాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని అన్నారు.
“ఇప్పటివరకు, 270 మంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని అభ్యర్థించారు,” అని బకారియా చెప్పారు, దీనివల్ల వారికి రూ. 4 కోట్లు ఖర్చవుతుందని అన్నారు.
ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని అభ్యర్థించిన కొంతమంది కస్టమర్లు కశ్మీర్ ప్రజలపై కోపం వ్యక్తం చేశారని, దాడికి వారినే నిందించినట్లు కనిపించిందని ఆయన అన్నారు. అయితే, స్థానిక ప్రజలు ఈ దాడిని ఖండించారు. నిన్న సాయంత్రం నుంచి ఆ ప్రాంతంలో కొన్ని నిరసనలు జరిగాయి.
పహల్గాంలోని మూడు హోటళ్లలో రిజర్వేషన్లలో పనిచేసే ఒక మహిళ తన గుర్తింపును వెల్లడించడానికి ఇష్టపడలేదు, చాలా మంది హోటల్ గదుల రిజర్వేషన్‌లను కూడా రద్దు చేస్తున్నారని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని అన్నారు.
“ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారు; వారు కశ్మీర్‌కు రావడానికి ఇష్టపడటం లేదు” అని ఆయన అన్నారు.
పహల్గాంలోని టాక్సీ డ్రైవర్ ఉమర్ షమ్మర్ షఫీ వానీ మాట్లాడుతూ, ప్రజలు త్వరలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారని చెప్పారు. దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 700 మంది టాక్సీలో తమ ఇళ్లకు, విమానాశ్రయానికి ప్రయాణించారని ఆయన అన్నారు.
“ఈ దాడి మా వ్యాపారాలను పూర్తిగా నాశనం చేసింది. మేం మా జీవనోపాధి కోసం పర్యటకంపై ఆధారపడుతున్నాం. ఈ సంఘటన తర్వాత వారు కోలుకోగలరా లేదా అని డ్రైవర్లలో భయం ఉంది” అని ఆయన అన్నారు.
గుజరాత్‌కు చెందిన ఒక పర్యటకుడు బీబీసీతో మాట్లాడుతూ… అకస్మాత్తుగా జరిగిన కాల్పుల వల్ల గందరగోళం చెలరేగిందని, అందరూ ఏడుస్తూ, అరుస్తూ అక్కడికి, ఇక్కడికి పరిగెత్తడం ప్రారంభించారని అన్నారు.
ఈ దాడిలో మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభం ద్వివేది ఒకరు. అతను ఇటీవల వివాహం చేసుకుని తన భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
శుభమ్ ద్వివేది బంధువు సౌరభ్ ద్వివేది వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ, “శుభమ్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు. ఆయన తన భార్యతో కలిసి పహల్గాంలో ఉన్నారు. సంఘటన తర్వాత, అతని భార్య నా మామకు ఫోన్ చేసి శుభమ్ తలపై కాల్చిచంపారని చెప్పింది. వ్యక్తుల పేర్లు అడిగిన తర్వాతే కాల్పులు ప్రారంభమయ్యాయని కూడా చెప్పారు. అన్ని లాంఛనాలు పూర్తయిన తర్వాత 2-3 రోజుల్లో శుభమ్ మృతదేహాన్ని అప్పగిస్తారని మాకు సమాచారం అందింది” అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)