SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారంలో రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో ఆయన ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిత పర్యటనకు సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
ఫిబ్రవరి 25-26 తేదీలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
ఇటీవల జెరూసలేంలో ఒక సమావేశంలో ప్రసంగిస్తూ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని వెల్లడించారు.

“వచ్చే వారం ఇక్కడికి ఎవరు వస్తున్నారు? నరేంద్ర మోదీ. ఆయన పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా ఉంది” అని అమెరికాలోని ప్రధాన యూదు సంస్థల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ నెతన్యాహు అన్నారు.
భారత్, ఇజ్రాయెల్ మధ్య సహకారం బాగుందని నెతన్యాహు అన్నారు.
“మేం అన్ని రకాల సహకారం గురించి మాట్లాడుతాం. మీకు తెలుసా? ఇప్పుడు భారతదేశం చిన్న దేశం కాదు, 140 కోట్ల జనాభాతో చాలా శక్తిమంతమైంది, ప్రజాదరణ పొందింది” అని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన గురించి భారతదేశం నుంచి ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ, పశ్చిమాసియా లోతైన భౌగోళిక రాజకీయ మార్పులను ఎదుర్కొంటున్న కీలక సమయంలో ఈ పర్యటన జరగనుంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌ని సందర్శించవచ్చని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఇజ్రాయెల్ వెళ్తున్నారు అనే వార్తలు వెలువడుతున్నాయి.
ఈ మార్పు కేవలం దౌత్యపరమైన షెడ్యూల్‌కు సంబంధించిన విషయమా లేదా దీనికి విస్తృత వ్యూహాత్మక సంకేతాలున్నాయా? అన్న ప్రశ్నపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో సోర్స్, JACK GUEZ/AFP via Getty Images
రెండో పర్యటన
ఈ పర్యటనను అర్థం చేసుకోవాలంటే, కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితంకాకుండా, పశ్చిమాసియాలో ఉన్న ప్రస్తుత అస్థిరత, భారతదేశ కొత్త విదేశాంగ విధానం, ప్రాంతీయ శక్తి సమతుల్యంలో జరుగుతున్న మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇది రెండో ఇజ్రాయెల్ పర్యటన కానుంది. ఇంతకుముందు ఆయన 2017 జులైలో ఇజ్రాయెల్‌ను సందర్శించారు.
ప్రధాని మోదీ ఆనాటి పర్యటనకు ముందు, రెండు దేశాల మంత్రుల మధ్య భేటీలు జరిగాయి. నిరుడు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి సహా కొందరు మంత్రులు భారత్‌కు వచ్చారు.
గత ఏడాది నవంబర్‌లో రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారాన్ని పెంచుకోవడానికి భారత్, ఇజ్రాయెల్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
డిసెంబర్‌లో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్, విదేశాంగ మంత్రి గిడియన్ సార్‌లను కూడా కలిశారు.
రహస్య భాగస్వామ్యం నుంచి బహిరంగ సహకారందాకా
గత మూడు దశాబ్దాలలో భారత్-ఇజ్రాయెల్ సంబంధాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
1992లో అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుంచి, రెండు దేశాల మధ్య రక్షణ, వ్యవసాయం, సాంకేతికత, నిఘా రంగాలలో సహకారం పెరిగింది.
అయితే, చాలా కాలం పాటు, అరబ్ దేశాలు, పాలస్తీనా రాజ్యం మధ్య సమతుల్యతను కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున, ఇజ్రాయెల్‌తో తన సంబంధాలను ఎక్కువగా ప్రచారం చేయలేదు భారత్.
అయితే, నరేంద్ర మోదీ 2017 ఇజ్రాయెల్ పర్యటన గురించి బాగా ప్రచారం జరిగింది.
మోదీ ఇజ్రాయెల్ పర్యటనను “డీ-హైఫనేషన్” కు నాందిగా భావించారు. ఈ పర్యటన ద్వారా భారత్.. ఇజ్రాయెల్, పాలస్తీనా, మిగతా అరబ్ ప్రపంచాన్ని వేర్వేరుగా చూస్తోందని స్పష్టమైందని విశ్లేషకులు అంటున్నారు.
“మోదీ పర్యటన తర్వాత, ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచం మధ్య ఉన్న పాత ద్వంద్వ భావన చాలావరకు తగ్గింది. అంటే మీరు అరబ్బులతోనా లేదా ఇజ్రాయెల్‌తోనా అనే భావనను తొలగిపోయింది. ఇప్పుడు ఈ సంబంధం ద్వైపాక్షికత, జాతీయ ప్రయోజనాలు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై ఆధారపడి ఉంది” అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌తో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఫజ్జూర్ రెహమాన్ అంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
నెతన్యాహు భారత్‌కి ఎందుకు రాలేదు, మోదీ ఇజ్రాయెల్‌కి ఎందుకు వెళ్తున్నారు?
గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశానికి రావాల్సి ఉంది, కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ వెళ్తున్నారు.
నాయకుల పర్యటనలు చాలా సందర్భాల్లో రాజకీయ సందేశాలను తెలియజేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
“పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాల మధ్య సమావేశాలు, చర్చలు అవసరం కాబట్టి, నెతన్యాహు భారత్‌కి రావడానికి బదులుగా ప్రధాన మంత్రి మోదీ ఇజ్రాయెల్‌ను సందర్శించడం మరింత అనుకూలంగా భావించి ఉండొచ్చు” అని విదేశాంగ విధాన నిపుణుడు హర్ష్ వి పంత్ అన్నారు.
ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలు, భద్రతా సవాళ్లు, ప్రాంతీయ ఉద్రిక్తతలు.. విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.
“నెతన్యాహూ రాకపోవడానికి కారణం అంతర్గత రాజకీయ పరిస్థితులు లేదా ప్రాంతీయ క్లిష్టతలు కావచ్చు” అని ఫజ్జూర్ రెహమాన్ అన్నారు.
కానీ కొందరు నిపుణులు దీన్ని భారతదేశం క్రియాశీల దౌత్యంలో భాగంగా భావిస్తున్నారు. వ్యూహాత్మక చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ స్వయంగా ముందడుగు వేయాలనుకుంటోందని వారు భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP via Getty Images
లాంఛనప్రాయమా? వ్యూహమా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాంతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులంటున్నారు.
గాజా యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అబ్రహం ఒప్పందాల తరువాత మారుతున్న ప్రాంతీయ సమీకరణాలు పశ్చిమాసియాను కొత్త దిశలో నడిపించాయి.
ఇంధన భద్రత, వాణిజ్య మార్గాలు, భారీ ప్రవాస భారతీయ జనాభా కారణంగాఈ ప్రాంతం భారత్‌కి చాలా ముఖ్యమైంది.
“ఇరాన్, గాజా వంటి సమస్యలను ఇజ్రాయెల్ ఎలా చూస్తుందో భారత్ తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రాంతీయ స్థిరత్వం, భారత ఆర్థిక ప్రయోజనాలు దీంతో ముడిపడి ఉన్నాయి” అని హర్ష్ పంత్ అన్నారు.
గాజా యుద్ధం కారణంగా అనేక ప్రధాన దేశాలు ఇజ్రాయెల్‌ను తప్పించుకుంటున్నాయి. దీని వల్ల మోదీ పర్యటన దౌత్య వ్యూహంలో భాగమా అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఆధునిక విదేశాంగ విధానంలో అగ్రనేతల వ్యక్తిగత పాత్ర మరింతగా పెరిగిందని నిపుణులు కూడా అంటున్నారు.
“పొరుగు దేశాలతో ఉన్నత స్థాయి వ్యవహారం మరింత ముఖ్యమైందిగా మారింది. కొంతకాలంగా భారత్, ఇజ్రాయెల్ మధ్య అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగలేదు. కాబట్టి ఈ ఖాళీతనాన్ని పూరించడమే ఈ పర్యటన ఉద్దేశం” అని హర్ష్ పంత్ అంటున్నారు.
ఈ పర్యటనను ఒక ప్రధాన ఒప్పంద ప్రకటన కంటే వ్యూహాత్మక కొనసాగింపుగా చూడాలని హర్ష్ పంత్ అంటున్నారు.
ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలో భారత్‌లో ఇప్పుడు ఎటువంటి సంకోచం లేదని, బదులుగా రెండు దేశాలు ప్రతి రంగంలోనూ సంబంధాలను స్పష్టంగా బలోపేతం చేసుకుంటున్నాయని ఫజుర్ రెహమాన్ అన్నారు.
ఆర్థిక దౌత్యానికి కొత్త కోణం?
ఇటీవలి సంవత్సరాల్లో, భారత్ పశ్చిమాసియాలో ఆర్థిక, బహుపాక్షిక సహకారం కొత్త నమూనాలపై పనిచేయడం మొదలుపెట్టింది.
భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కూడిన ‘ఐ2యూ2’ సమూహాన్ని ప్రాంతీయ భాగస్వామ్యానికి కొత్త చట్రంగా పరిగణిస్తున్నారు.
అదనంగా, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనమిక్ కారిడార్ (ఐఎమ్ఈఈసీ) చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు సాధ్యమైన ప్రత్యామ్నాయంగా చూడవచ్చని భావిస్తున్నారు.
‘ఐ2యూ2’, ఐఎమ్ఈఈసీ వంటి ఫ్రేమ్‌వర్క్‌లను ముందుకు తీసుకెళ్లడం అవసరం. గాజా యుద్ధం తర్వాత, అవి నెమ్మదిస్తాయని అనిపించింది. అందుకే ఈ హైలెవల్ పర్యటన వాటిని తిరిగి ఉత్తేజపరుస్తుంది. ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా, ఈ రెండు ఫ్రేమ్‌వర్క్‌లను ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది” అని ఫజ్జూర్ రెహమాన్ అన్నారు.
ఇజ్రాయెల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణను బలపరచాలని కోరుతోంది,, దీనిలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
అరబ్ ప్రపంచంతో సమతుల్యత
భారత్ పశ్చిమాసియా విధానంలో ముఖ్యమైన అంశం సమతుల్యత అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతిక సహకారాన్ని భారత్ పెంచుకున్నప్పటికీ, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలతో ఆర్థిక, ఇంధన భాగస్వామ్యాలను కూడా బలపరుచుకుంది.
“భారత్.. అరబ్ దేశాలతోనూ బలమైన సంబంధాలను కొనసాగించింది” అని ఫజ్జూర్ రెహమాన్ అన్నారు.
ఈ సమతుల్యత భారత్‌ను ఈ ప్రాంతంలో నమ్మకమైన, ఆమోదయోగ్యమైన భాగస్వామిగా మారుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో బహిరంగ వేదిక నుంచి ప్రసంగిస్తే, అది కేవలం ద్వైపాక్షిక సందేశం మాత్రమే కాదు, మొత్తం ప్రాంతానికి ఒక సంకేతం అవుతుందని నిపుణుల అభిప్రాయం.
లోతైన విభజనలు ఉన్న ప్రాంతంలో భారత్ తనను తాను “విశ్వసనీయ భాగస్వామి”గా చూపించుకోవాలని కోరుకుంటుందని హర్ష్ పంత్ అన్నారు. స్థిరత్వం, శాంతికి ప్రాధాన్యమిస్తూ భారత్ సందేశాన్ని అందించే అవకాశం ఉంది.
మోదీ ఇజ్రాయెల్ పర్యటనను కేవలం దౌత్యపరమైందిగా చూడకూడదని నిపుణులు భావిస్తున్నారు.
నరేంద్ర మోదీ పర్యటన భారత్-ఇజ్రాయెల్ సంబంధాలలో కొనసాగింపును ప్రతిబింబించడమే కాకుండా, ఇప్పుడు పశ్చిమాసియాలో అజెండాను నిర్ణయించే పాత్రను భారత్ పోషించగలదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.
“ఒకవైపు ఇజ్రాయెల్‌తో తన సంబంధాలను భారత్ బలోపేతం చేసుకుంది. మరోవైపు కొన్నేళ్లుగా పశ్చిమాసియాతో, ముఖ్యంగా అరబ్ దేశాలతో తన సాన్నిహిత్యాన్ని కూడా పెంచుకుంది. ఈ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ప్రధానమంత్రి మోదీ యుద్ధం పరిష్కారం కాదన్న సందేశాన్ని కూడా ఇవ్వొచ్చు” అని ఫజ్జూర్ రెహమాన్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



