Home జాతీయ national telgu ద్వారబంధాల చంద్రయ్య : అల్లూరి సీతారామరాజు కన్నా ఎన్నో ఏళ్ల ముందే బ్రిటిషర్లకు ఎదురొడ్డిన ‘మన్యం...

ద్వారబంధాల చంద్రయ్య : అల్లూరి సీతారామరాజు కన్నా ఎన్నో ఏళ్ల ముందే బ్రిటిషర్లకు ఎదురొడ్డిన ‘మన్యం వీరుడు’

8
0

SOURCE :- BBC NEWS

ద్వారబంధాల చంద్రయ్య

ఫొటో సోర్స్, Facebook/ద్వారబంధాల-చంద్రయ్య

  • ఒక గంట క్రితం

  • చదివే సమయం: 8 నిమిషాలు

తెలుగు వారికి అల్లూరి సీతారామరాజు గురించి తెలిసే ఉంటుంది. అయితే, అల్లూరి కన్నా 40 ఏళ్ల ముందు బ్రిటిష్‌ వారిపై పోరాడిన మరొకరు ఉన్నారు. ఆయనే ద్వారబంధాల చంద్రయ్య.

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్‌ వారిపై జరిగిన తిరుగుబాట్లకు ప్రత్యేక స్థానం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీగా పిలిచే గోదావరి-విశాఖ అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో రెండు తిరుగుబాట్లు జరిగాయి.

మొదటిది చంద్రయ్య నాయకత్వంలో 1879-80 నాటి రంప తిరుగుబాటు కాగా, రెండోది అల్లూరి నాయకత్వంలో 1922-24లో జరిగింది.

ఈ రంప తిరుగుబాట్ల గురించి భారతీయ, బ్రిటిష్ అధికారులు విస్తృతంగా రికార్డు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, బ్రిటిష్ అధికారుల రికార్డుల్లో చంద్రయ్యను నేరస్తునిగా నమోదు చేసుకున్నారు. భారతీయులు దీన్ని విప్లవ తిరుగుబాటుగా చూస్తారు.

రంప పితూరీ అని పిలిచే ఈ తిరుగుబాటునే, గూడెం గిరిజనులు ”చంద్రయ్య పితూరీ” అని పిలిచేవారని బీబీసీతో చెప్పారు చరిత్రకారుడు బద్దెల రామచంద్రారెడ్డి.

రామచంద్రా రెడ్డే కాకుండా, ఐ.మల్లికార్జున శర్మ రచించిన, 1967లో హైదరాబాద్ మార్క్సిస్ట్ స్టడీ ఫోరం ప్రచురించిన ”రోల్ ఆఫ్ రివల్యూషనరీస్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ – ఎ క్రిటికల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ రివల్యూషనరీ మూమెంట్స్: 1918-1934” పుస్తకంలో చంద్రయ్య గురించి రాశారు.

”1840 నుంచి గోదావరి ఏజెన్సీలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. వాటిలో 1879లో ద్వారబంధాల చంద్రా రెడ్డి లేదా చంద్రయ్య నాయకత్వంలోని రంప తిరుగుబాటు అత్యంత ముఖ్యమైనది. శ్రీరామరాజు (అల్లూరి) తిరుగుబాటు కంటే ఇది తీవ్రమైనది” అని రాశారు శర్మ.

ఏటుకూరు బలరామమూర్తి రచించి, 1953లో మొదటిసారి ప్రచురించిన ”ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర” పుస్తకంలో కూడా చంద్రయ్య గురించి వివరంగా ఉంది.

”తిరుగుబాటుదారులకు ద్వారబంధాల చంద్రయ్య, పులిచింత సాంబయ్య, అంబుల్ రెడ్డి నాయకులు. 1879 ఏప్రిల్‌లో అడ్డతీగల పోలీసు స్టేషన్‌ను ద్వారబంధాల చంద్రయ్య ధ్వంసం చేశారు. అదే ఏడాది నవంబరులో చంద్రయ్య అనుచరులు 79 మందిని ప్రభుత్వం కాల్చివేసింది. 1880 ఫిబ్రవరిలో చంద్రయ్యను కూడా పోలీసులు కాల్చివేశారు” అని రాశారు.

ద్వారబంధాల చంద్రయ్య

ఫొటో సోర్స్, Facebook/ద్వారబంధాల-చంద్రయ్య

చంద్రయ్య పోరాటం గురించి ఈ తిరుగుబాటుపై విస్తృతంగా అధ్యయనం చేసిన రామచంద్రా రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

ఆయన పుదుచ్చేరిలోని కంచిమామునివర్ గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రీసెర్చ్‌లో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేశారు.

ఆధునిక భారతదేశ చరిత్రపై లోతైన పరిశోధన చేయడంతో పాటు, ”ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ కలోనియల్ ఆంధ్ర: గోదావరి అండ్ వైజాగపటం రీజియన్స్ 1857-1917” అనే పేరుతో పుస్తకం రాశారు.

రామచంద్రా రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం… 1879 మే నాటికే గిరిజనుల తిరుగుబాటు గూడెం కొండలకు చేరింది.

మే 3న చంద్రయ్య, ఆయన మనుషులు చోడవరం పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తగులబెట్టారు. మే 8న అడ్డతీగల పోలీస్ స్టేషన్, లైన్‌లను ధ్వంసం చేశారు.

“చంద్రయ్య మైదాన ప్రాంత గ్రామాలలో దొంగతనాలు చేస్తున్నాడు, తుని వరకు భయం వ్యాపించింది” అని చంద్రయ్య గురించి అప్పటి బ్రిటిష్ అధికారులు ఒక నివేదికలో రాశారు.

రంప పరిణామాలతో ప్రభుత్వం చంద్రయ్య, ఆయన అనుచరుడు పండయ్యలను పట్టుకోవడానికి 200, 100 రూపాయల చొప్పున రివార్డు ప్రకటించింది.

ద్వారబంధాల చంద్రయ్య

ఫొటో సోర్స్, indianculture.gov.in

ఎవరీ చంద్రయ్య?

అల్లూరి సీతారామరాజుపై గిరిజన ప్రాంతంలో మౌఖికంగా చెప్పిన కథల ఆధారంగా రచయిత ఎస్.రామచంద్రరావు తన పుస్తకంలో, చంద్రయ్య గురించి ప్రస్తావించారని, కరవు సమయంలో బొబ్బిలి ప్రాంతం నుంచి లగరాయికి ఆయన వలస వచ్చారని రాశారని రామచంద్రా రెడ్డి తెలిపారు.

చంద్రయ్య కొద్దిగా ఆస్తిపాస్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని రామచంద్రారెడ్డి చెప్పారు.

1879 నాటి రంప తిరుగుబాటు కన్నా ముందు చంద్రయ్య ఆరు నెలలు జైలు జీవితం గడిపారు. దీనికి కారణం తెలియదు.

చంద్రయ్య చనిపోయిన తరువాత ఆ మృతదేహాన్ని అప్పటి జైలర్ గుర్తు పట్టి పోల్చినట్టుగా, 1880 ఫిబ్రవరి 20 నాటి G.O. 1152 (మిలటరీ)లో ఉందని రామచంద్రారెడ్డి బీబీసీతో చెప్పారు.

1879 ఏప్రిల్‌లో గూడెం ఏజెన్సీలో జరిగిన ఒక దోపిడీ విచారణ నిమిత్తం కొయ్యూరు పోలీసులు చంద్రయ్య లేని సమయంలో ఆయన ఇంటిని సోదా చేయడం, ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉన్నప్పటికీ పోలీసులు ప్రవర్తించిన తీరు చంద్రయ్యకు పోలీసులపై కోపాన్ని పెంచిందన్నారు రామచంద్రా రెడ్డి.

‘చంద్రయ్యకు జంప పండయ్య సహాయపడ్డారు. చంద్రయ్య తిరుగుబాటు చేసేలా దుచర్తి ముఠాకు చెందిన చెక్క వెంకన్న దొర ప్రోత్సహించారని బ్రిటిష్ అధికారుల అనుమానం.

1879-80 వరుస దాడులు

1879 మే నుంచి 1880 ఫిబ్రవరిలో చంద్రయ్య మరణం వరకూ ఆయన బృందానికీ, పోలీసులకు మధ్య అనేక ఘర్షణలు జరిగాయి.

1879 మే 12న కోట సమీపంలోని వాడపల్లి గ్రామాన్ని చంద్రయ్య ఆక్రమించారు.

మే 15న రెండు వందల మంది ఉన్న ఆయన అనుచరులు కోటకు ఒక మైలు దూరంలో 19 మందితో కూడిన పోలీసు బృందంపై దాడి చేసి, వారిపై కాల్పులు జరిపారు. ఒక బ్రిటిష్ కానిస్టేబుల్ మరణించారు.

రెండు రోజుల తర్వాత గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మిల్లెట్ ఆకస్మిక దాడి చేసి, తిరుగుబాటుదారులు దొంగలించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఆ దాడిలో చంద్రయ్య తృటిలో తప్పించుకున్నా, ఆయన సోదరుడు, భార్య, తల్లి పోలీసులకు దొరికారు. ఆ తరువాత చంద్రయ్యపై రివార్డు వెయ్యి రూపాయలకు, పండయ్యపై 300కి పెంచారు.

జూన్ నుంచి చంద్రయ్య పోలీసులపై దాడులు మళ్లీ ప్రారంభించారు. మనుషులను సమీకరించడంతో పాటు, పోలీసులపై దాడులు చేసి ఆయుధాలు సమకూర్చుకున్నారు.

ఉత్తరం వైపు నుంచి వస్తున్న కెప్టెన్ బ్లాక్స్‌లాండ్, దక్షిణం వైపు నుంచి వస్తున్న మిల్లెట్‌లు తన వైపు రాకుండా, కొండ దారుల్లో రాతి కట్టడాలు ఏర్పాటు చేశారు.

అదే ఏడాది జూన్ 3న, పొటలూరు ఘాట్ దగ్గర దొరచింతపాలెం ముఠాదారుని బావమరిది సుంకం జునపాలును గూడెపు మావిలి దేవతకు బలి ఇచ్చారు చంద్రయ్య’ అని రామచంద్రారెడ్డి చెప్పారు.

‘ఇక్కడ ముఠాదారులు అంటే స్థానిక పాలకుల వంటివారు. తిరుగుబాటుదారుల కదలికల గురించి గోదావరి జాయింట్ మేజిస్ట్రేట్‌కు సమాచారం అందించారనేది జునపాలుపై చంద్రయ్య ఆరోపణ.

ఆ ఘటన తరువాత మట్టపాలెం గ్రామస్తులందరినీ తనతో పాటు ఉండిపోవాలని చంద్రయ్య బెదిరించినట్టు బ్రిటిష్ అధికారులు రాసుకున్నారు. క్రమంగా ఆ కొండ ప్రాంతాల్లో చంద్రయ్య పట్టు పెంచుకున్నారు. నాయకుడిగా ఎదిగారు’ అని బీబీసీతో చెప్పారు డాక్టర్ రామచంద్రారెడ్డి.

“అన్ని రకాలుగా చూస్తే అతను (చంద్రయ్య) రంపలో బయటపడిన దొరల (ముఠాదారులు) కన్నా చాలా భిన్నమైన నేరస్తుడు. అతణ్ణి కాల్చడమో, ఉరితీయడమో చేసే వరకూ చాలా సమస్యలు వస్తాయి” అంటూ విశాఖపట్నం బ్రిటిష్ అధికారి తన నివేదికలో రాశారని చెప్పారు రామచంద్రారెడ్డి.

చరిత్రకారుడు రామచంద్రా రెడ్డి

‘‘జూన్ 9న కెప్టెన్ బ్లాక్స్‌లాండ్, విల్లాక్, మిల్లెట్‌ అనే పోలీసు అధికారులను చంద్రయ్య 200 మందితో కలసి చుట్టుముట్టి, అరెస్టయిన తన కుటుంబాన్ని, ప్రజల్ని విడిచిపెట్టాలని, జుద్దంగి తాలూకాను తనకు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు.

లేకపోతే అందర్నీ చంపేస్తానని, వెయ్యి మంది జనాన్ని పోగు చేయగలనని బ్రిటిష్ అధికారులను హెచ్చరించారు. దీంతో కొంత సమయం తరువాత, బ్రిటిష్ బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి.

ఆ క్రమంలో దుచర్తిని తన నియంత్రణలోకి తీసుకున్నారు చంద్రయ్య. ఆ సమయంలో కొందరు పోలీసులు వారికి చిక్కారు.

వారిలోని ఇద్దరు కానిస్టేబుళ్లను చంద్రయ్య స్వయంగా ఉరితీశారు. మరో కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో తప్పించుకున్నాడు.

అదే సమయంలో చంద్రయ్యకు అప్పటి పిఠాపురం రాజా లేఖ రాశారు. పితూరీ ఆపాలంటూ రాజా లేఖ రాసినట్టుగా 1879 జూన్ 27నాటి G.O.1523 (Judl) లో ఉంది’ అని చరిత్రకారుడు రామచంద్రా రెడ్డి చెప్పారు.

‘‘జూన్ 12న, పోలీస్ అధికారి మిల్లెట్, ఆయన యాభై మంది కానిస్టేబుళ్ల బృందంపై చోడవరం, అడ్డతీగల మధ్య చంద్రయ్య, ఆయన బృందం దాడి చేసింది. దీంతో వారు అడ్డతీగల స్టేషన్‌కు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

అక్కడా దాడి జరిగింది. 16న అన్నవరం వెళ్లే ప్రయత్నం చేసిన పోలీస్ అధికారి మిల్లెట్‌పై చంద్రయ్య బృందం దాడి చేయగా, ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. చాలా మంది అడవిలో చెల్లాచెదురయ్యారు. అదే రాత్రి అడ్డతీగలపై మళ్లీ దాడి జరిగింది.

తరువాత కూడా పితూరీ కొనసాగింది. తమ్మన్న దొర, చంద్రయ్య ఉద్యమాన్ని నడపడానికి రేకపల్లికి వచ్చారు.

1000 మందితో కూడిన పెద్ద బలగంతో చింతూరుపై దాడి చేసి దోచుకున్నారు. అయితే చింతూరును తిరిగి తమ అదుపులోకి తెచ్చుకోవడానికి (బ్రిటిష్ రికార్డుల్లో ఉపయోగించిన పదం చింతూరును కాపాడటానికి) లార్డ్ గల్లిమోర్ అనే అధికారి, కొందరు పోలీసు సిబ్బందితో కలసి శబరి నదిలో స్టీమర్‌పై వచ్చారు.

వారిపై 1879 ఆగస్టు 12న చింతూరుకు కొన్ని మైళ్ల దిగువన ఉన్న సేతుపల్లి – రామవరం మధ్య దాడి జరిగింది. అయితే, మొత్తానికి చింతూరు చేరుకున్న పోలీసులు తిరుగుబాటుదారులను తరిమేశారు. ఆ ఘటనలో చంద్రయ్య తొడకు గాయమైంది.

1879 సెప్టెంబర్ 7న, 10వ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ బ్రిగ్స్ చింతూరు దగ్గర్లోని యగతోట గ్రామంలో చంద్రయ్య బృందంపై మెరుపుదాడి చేయగా, చంద్రయ్య తప్పించుకున్నారు.

ముగ్గురు తిరుగుబాటుదారులు ఆయుధాలతో పట్టుబడ్డారు. ఇక 1880 జనవరి 16న, గుమలూరు సమీపంలో చంద్రయ్య బృందంపై విల్లాక్ నేతృత్వంలో పోలీసులు మెరుపుదాడి చేసి, మడకం రాజయ్య సహా ఆరుగురిని చంపారు’’ అని రామచంద్రారెడ్డి చెప్పారు.

ద్వారబంధాల చంద్రయ్య

ఫొటో సోర్స్, indianculture.gov.in

పట్టించిన వారిని వదిలేస్తాం: బ్రిటిష్ అధికారులు

చంద్రయ్య అనేకసార్లు తమ పోలీసుల నుంచి తప్పించుకుపోవడంతో ఆయన్ను పట్టుకోవడానికి కొత్త వ్యూహం పన్నారు బ్రిటిష్ అధికారులు. రివార్డులను పెంచడంతో పాటు, ఆయన బృందంలోనే కోవర్టు ఆపరేషన్ ప్లాన్ చేశారు.

చంద్రయ్యను, ఆయన ముఖ్య అనుచరులను పట్టించిన వారికి క్షమాభిక్ష పెడతామని ప్రకటించారు. చంద్రయ్యను పట్టుకుంటే, నలుగురికి క్షమాభిక్ష, తమ్మన్న దొరను పట్టుకుంటే నలుగురికి, యెల్లజూరి జగ్గయ్యకు ఇద్దరికి, మడకం చిన్నయ్యకు ఇద్దరికి చొప్పున క్షమాభిక్ష పెడతామని బ్రిటిష్ అధికారులు ప్రకటించారు.

అంటే బృందంలోని వారు తమ నాయకులను పట్టిస్తే, ఆ బృందంలోని సభ్యులను ఏ శిక్షా లేకుండా వదిలేస్తారన్నమాట” అని వివరించారు రామచంద్రా రెడ్డి.

“బ్రిటిష్ అధికారుల ఎత్తుగడ ఫలించి, చంద్రయ్యను పట్టించడానికి జంప పండయ్య ఒప్పుకున్నారు. పథకం ప్రకారం దళాలు మాటువేసి ఉన్న చోటుకు, చంద్రయ్యను తీసుకెళ్తున్నాడు పండయ్య. అయితే, చంద్రయ్యకు అనుమానం వచ్చి పండయ్యపై కాల్పులు జరిపాడు. ఆ పెనుగులాటలో కుమనూరు సమీపంలో పండయ్య చేతిలో చంద్రయ్య చనిపోయాడు. 1880 ఫిబ్రవరి 12న ఈ ఘటన జరిగింది” అని రామచంద్రా రెడ్డి బీబీసీకి చెప్పారు.

చంద్రయ్యను పోలీసులు చంపారని ఇతర రచయితలు రాయగా, డాక్టర్ రామచంద్రా రెడ్డి పరిశోధన ప్రకారం, చంద్రయ్యను పండయ్య కాల్చారు.

మూడు రోజుల తర్వాత చంద్రయ్యను పట్టించిన జంప పండయ్య, ఆయనకు సాయం చేసిన బాలయ్య పడాల్ (ఆయన భీమవరం మున్సిఫ్ ఉద్యోగి – గోలసింగి బాలయ్య) బ్రిటిష్ అధికారుల ముందు లొంగిపోయారు.

ముందస్తు ఒప్పందం ప్రకారం వారికి క్షమాభిక్ష ప్రకటించిన బ్రిటిష్ అధికారులు, చెరో 500 రూపాయల బహుమానం ఇచ్చారు.

చంద్రయ్య అనుచరుల్లో కొందరు

తెగల పెంటడు, మడకం చిన్నయ్య, బిరంపల్లికి చెందిన పాండు దొర, దొరచింతపాలెం బుచ్చన్న, పోడెం యర్రప్ప, యెల్లజూరి జగ్గయ్య – వీరంతా చంద్రయ్య అనుచరుల్లో ముఖ్యులు. వీరిలో చంద్రయ్యకు జగ్గయ్య సర్దార్‌గా ఉండేవారు. చంద్రయ్య తర్వాత స్థానం ఆయనదే.

మడకం చిన్నయ్యకు తనదైన బృందం ఉండేది. చంద్రయ్య ముఖ్య అనుచరుల్లో ఒకరైన మడకం చిన్నయ్యను గూడెం కొత్తవీధి ముఠాదారు కుమారుడు సోబిల్ దొర నేతృత్వంలోని గ్రామస్తులు మార్చి చివరి వారంలో పట్టించారు.

స్టాంపు, విగ్రహాలు

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ద్వారబంధాల చంద్రయ్య గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

కొన్ని చోట్ల ఆయన విగ్రహాలు పెట్టారు. భారత ప్రభుత్వం చంద్రయ్యపై ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.

సామాన్య ప్రజలకు తెలిసేలాగా మాధ్యమాల్లో పెద్దగా ప్రచారం జరగకపోయినా, చరిత్ర పరిశోధకులకు, రంప పితూరి గురించి, భారత స్వతంత్ర ఉద్యమంలో గిరిజన తిరుగుబాట్ల గురించి చదివిన వారికి చంద్రయ్య పేరు తెలుసు.

అంతే కాదు, అల్లూరి సీతారామరాజు గురించి రాసే చాలామంది ఆయన కంటే ముందు జరిగిన తిరుగుబాటుగా 1879 రంప పితూరి గురించి కొద్దిగా అయినా రాసి అందులో చంద్రయ్య పేరు ప్రస్తావించేవారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ 9వ తరగతి తెలుగు పాఠ్యాంశాల్లో ఈయన జీవిత చరిత్రను చేర్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)