SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP
దుబాయ్‌లో ఖర్జూర వృక్షం ఆకారంలో ఉండే మానవ నిర్మిత ఐలండ్ పామ్ జుమేరాలోని ఓ బార్‌లో స్టెఫనీ బేకర్ తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ ఐలండ్‌లో అనేక విలాసవంతమైన హోటళ్లు, బీచ్ క్లబ్బులు ఉన్నాయి.
అయితే మరో ప్రాంతానికి వెళ్లేందుకు వాళ్లు బయటకు రాగానే రాత్రిపూట ఆకాశంలో అసాధారణమైన వెలుగు రేఖలు దూసుకెళుతూ కనిపించాయి.
కొన్ని క్షణాల తర్వాత, ఒక డ్రోన్ అవశేషాలు ఫెయిర్‌మాంట్ అనే ఫైవ్‌స్టార్ హోటల్‌పై పడ్డాయి. అప్పుడు బేకర్, ఆమె స్నేహితులు వీధిలో నిల్చుని ఉన్నారు.
“ఊహించనిదేదో కనిపించడంతో మేమంతా భయపడ్డాం” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Stephanie Baker
జనాభాలో విదేశీయులే ఎక్కువ
బ్రిటన్‌కు చెందిన బేకర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఏడాది క్రితం దుబాయ్ వచ్చారు. దుబాయ్ ఈ ప్రాంతంలో కెల్లా సురక్షిత ప్రదేశమని తాను భావించినట్లు ఆమె చెప్పారు.
ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన రెండు వారాల తర్వాత కూడా తాను ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లే ఉద్దేశమేదీ లేదన్నారు.
“ఏమైనా కానివ్వండి, ప్రస్తుతం ఈ పరిస్థితుల్ని చక్కదిద్దున్న తీరు చూస్తే నేను మరింత సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తోంది” అని ఆమె చెప్పారు.
2 లక్షల 40వేల మంది బ్రిటన్ పౌరులతో సహా వివిధ దేశాల నుంచి వచ్చిన బేకర్ లాంటి లక్షల మంది ప్రవాసులకు దుబాయ్ ప్రస్తుతం ఇల్లుగా మారింది. దుబాయ్ జనాభాలో ఎమిరేట్స్ ప్రజలు కేవలం 10శాతం మాత్రమే.
అస్థిరత రాజ్యమేలే ప్రాంతంలో దుబాయ్ కొన్ని దశాబ్ధాలుగా సురక్షితమైన, సుస్థిరమైన నగరంగా నిలిచింది.
ఆకాశ హర్మ్యాలు, పన్నులు లేని జీతాలు, వ్యక్తిగత భద్రత విషయంలో ఉన్న గుర్తింపు లాంటివి దుబాయ్‌ని బిజినెస్ టూరిజం హబ్‌గా మార్చేశాయి.
ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు మెరుగైన జీవితం కోసం ఇక్కడకు వస్తున్నారు.
ఫొటో సోర్స్, Eti Bhasin
“ఇక్కడే ఉంటాం”
కొన్ని దశాబ్ధాలుగా దుబాయ్‌లో నివసిస్తున్న వారితో పాటు ఇటీవలే ఇక్కడకు వచ్చిన 20 మందితో బీబీసీ మాట్లాడింది. తాజా పరిణామాలతో తాము షాక్ తిన్నట్లు ఎక్కువమంది చెప్పారు. అయితే వారిలో ఒక్కరు కూడా ఈ నగరాన్ని వదిలి వెళ్లాలని అనుకోవడం లేదు.
“ఇలాంటిది తొలిసారి చూస్తున్నాం” అని ఎతి భాసిన్ చెప్పారు. ఆమె భారతీయురాలు. ఆమె కుటుంబానికి దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయి. ఆమె జీవితం అంతా ఇక్కడే గడిచింది.
“దుబాయ్ వేగంగా పెద్ద నగరంగా అభివృద్ధి చెందింది. మాకు అధికారుల మీద నమ్మకం ఉంది. ఇది నా ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను” అని ఆమె చెప్పారు.

ఆందోళనల మధ్య..
గత కొన్ని వారాలుగా జరుగుతున్న సంఘటనలు కొంతమందికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆడమ్ కాల్లౌ, ఆయన భార్య పిల్లలు 2024లో బ్రిటన్ నుంచి దుబాయ్ వచ్చారు. భద్రత విషయంలో దుబాయ్‌కున్న గుర్తింపు వాళ్లను ఇక్కడకు తీసుకువచ్చింది.
యుద్ధం మొదలైన తర్వాత నగరంలో పేలుళ్ల మోతలకు భయపడి మొదట్లో కొన్ని రోజులు ఈ కుటుంబం అంతా ఒకే గదిలో నిద్రపోయింది. పిల్లలు కిటికీ పక్కన పడుకోవడానికి భయపడ్డారు.
“మేము సురక్షితంగా ఉండేందుకు అధికారులు చేయాల్సినదంతా చేస్తున్నారు. అయితే మాకంత సురక్షితంగా అనిపించడం లేదు. ఇప్పుడసలు సమస్య ఏంటంటే ఇది ఇక సర్వసాధారణంగా మారుతుందేమో” అని కాల్లౌ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
విమాన సర్వీసుల రద్దు
ఒక చిన్న గల్ఫ్ వాణిజ్య నౌకాశ్రయం నుంచి అంతర్జాతీయ గమ్యస్థానంగా దుబాయ్ చాలా వేగంగా ఎదిగింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది 9 కోట్ల మంది ప్రయాణీకులు వచ్చారు.
యుద్ధం మొదలైన తర్వాత వేలసంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ ప్రాంతంలో రద్దీగా ఉండే ట్రావెల్ హబ్ ఒక్కసారిగా ఆగిపోయినట్లైంది.
ఇటీవల తాత్కాలికంగా విమానాల రాకపోకలను పునరుద్దరించారు. తక్కువ విమానాలను నడుపుతున్న ఎమిరేట్స్ పాలకవర్గం పూర్తి స్థాయిలో కార్యకలాపాలను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
సందర్శకులు ఎక్కువగా వచ్చే సమయంలో విమాన రాకపోకలు తగ్గడంతో దాని ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఫొటో సోర్స్, Dr Naim Maadad
తగ్గిన సందర్శకుల రాక
దుబాయ్‌కి దూరంగా ఉండాలని భావిస్తున్నవారు తమ విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లు రద్దు చేసుకుంటున్నారు.
కొన్ని ఖరీదైన హోటళ్లలో రూములు తక్కువ ధరకు బుక్ అవుతున్నాయి.
“దురదృష్టత్తువశాత్తూ, మే వరకు అన్నీ క్యాన్సిల్ అవడాన్ని మేము చూస్తున్నాం” అని గేట్స్ హాస్పిటాలిటీ వ్యవస్థాపకుడు డాక్టర్ నయీమ్ మాదద్ చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన మాదద్, 20 ఏళ్ల క్రితం దుబాయ్ వచ్చి ఇక్కడే ఉంటున్నారు.
“మొదటి త్రైమాసికం ప్రారంభం సరిగ్గా లేకపోతే, ఏడాది మొత్తం పరుగులు తీయాల్సి వస్తుంది” అని ఆయన బీబీసీతో అన్నారు.
దుబాయిలోని విలాసవంతమైన జీవితం అనేకమంది సందర్శకుల్ని ఆకర్షిస్తోంది. దుబాయ్ గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల ముందు నిలిపి ఉంచిన సూపర్ కార్లు, హోటల్ పై అంతస్తుల్లో ఆకాశంలో కట్టినట్లుగా కనిపించి స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ బీచ్‌లలో సన్‌బాత్‌లు వంటివి కూడా సందర్శకులు దుబాయ్ వచ్చేందుకు ప్రోత్సహిస్తున్నాయి.
అయితే దీని వెనుక మరొక చేదు నిజం కూడా ఉంది.
ఫొటో సోర్స్, Planet Labs PBC via REUTERS
దుబాయ్‌కి మరోవైపు
అవకాశాల విషయంలో దుబాయ్‌లో తీవ్ర వైవిధ్యం కనిపిస్తోంది.
ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలు, ఫోటోల్లో అద్దాలతో కట్టిన ఆకాశహర్మ్యాలు కనిపిస్తున్నా, ఈ ఆర్థిక వ్యవస్థకు శక్తిని అందిస్తున్న వలస కూలీలకు సాధారణ వేతనాలే దక్కుతున్నాయి. వాళ్లు నగర శివార్లలో ఇరుకు గదుల్లో జీవిస్తున్నారు.
యూఏఈలో పని చేస్తున్న కార్మికుల్లో ఎక్కువమంది విదేశాల నుంచి వచ్చినవారే. నగరంలో వేగంగా విస్తరిస్తున్న జనాభాలో సగానికి పైగా దక్షిణాసియా వాసులే ఉన్నారు. వారంతా నిర్మాణం, లాజిస్టిక్స్, డెలివరీ విభాగాల్లో పని చేస్తున్నారు.
యుద్ధం వల్ల తమ జీవితాలు ప్రభావితం అయ్యాయని వారిలో కొంతమంది చెప్పారు.
పాకిస్తాన్ నుంచి వచ్చి హంజా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు.
యుద్ధం కారణంగా ప్రజలు అనేకమంది ఇళ్లలోనే ఉండిపోవడంతో ఆర్డర్లు పెరిగాయని ఆయన చెప్పారు.
“ఏదైనా పేలుడు శబ్ధం విన్నప్పుడు లేదా శకలాలు కూలిపోవడం కనిపించినప్పుడు కొంత భయం వేసేది. అయితే నేను పని చేయడం ఆపలేదు” అని హంజా అన్నారు.
“నా కుటుంబం నా మీదనే ఆధారపడి ఉంది. భయంతో ఇంట్లోనే కూర్చునే సౌలభ్యం లేదు నాకు” అని హంజా చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల పరిస్థితులు, చాలీ చాలని వేతనాలు, పనిచేసే చోట పరిస్థితులు, యజమాని స్పాన్సర్‌షిప్ నిబంధనల గురించి హక్కుల సంస్థలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హంజాతో సహా వలస కార్మికుల్లో అనేకమంది తాము దుబాయ్‌లోనే ఉంటామని చెబుతుంటే, కొద్దిమంది ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు విమాన సర్వీసుల కోసం చూస్తున్నారు.
ఫొటో సోర్స్, AFP
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ఉద్యోగి ఒకరు గత వారం ఆస్ట్రేలియా వెళ్లారు. ఆమె తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు.
“ప్రతీరోజూ పేలుళ్లు జరుగుతున్నట్లు తెలిసి ఆందోళనగా ఉంది. ప్రస్తుతానికి దుబాయ్ వదిలి రావడం మంచిదైంది. అంతా సర్దుకున్నాక తిరిగి వెళతా” అని ఆమె బీబీసీతో చెప్పారు.
పశ్చిమ దేశాలు వలస విధానాలను కఠినతరం చేయడం, వలస ప్రభావంపై చర్చ జరుగుతున్న సమయంలో దుబాయ్ కొత్త విధానానికి నమూనాగా నిలిచింది.
కరోనా తర్వాత దుబాయ్‌కి కోటీశ్వరుల రాక పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ, సంపన్నులను ఆకర్షించే ప్రాంతంగా ఎమిరేట్స్ గుర్తింపు పొందింది.
ఇండియన్ ఇంజనీర్, ఈజిప్షియన్ డాక్టర్, ఫిలిప్పీన్స్ నర్స్.. ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఔత్సాహిక నిపుణులకు యూరప్, నార్త్ అమెరికన్ దేశాల కంటే తేలిగ్గా దుబాయ్ వీసా లభించేది. దీంతో వారు ఎక్కువ జీతాలను డిమాండ్ చేసేవారు.
అనుమానిత వ్యవస్థీకృత నేరస్తులకు కూడా దుబాయ్ కేంద్రంగా మారింది. అంతర్జాతీయ మీడియా, దర్యాప్తు సంస్థలు దీన్ని హైలెట్ చేశాయి.
దీంతో అనేక దేశాలకు చెందిన నేరస్తుల్ని అప్పగించడంలో యూఏఈ సహకారం ఇటీవల పెరిగింది.
ఫొటో సోర్స్, NurPhoto/Getty Images
దుబాయ్ బ్రాండ్ నిలబడుతుందా?
ఎప్పుడూ అల్లకల్లోలంగా ప్రాంతంలో భద్రత, సుస్థిరతకు ఒయాసిస్ లాంటి నగరం అనే బ్రాండుకు ఇప్పుడు ముంపు పొంచి ఉందా?
తాజా దాడులు దుబాయ్ బ్రాండుకు కొంత ఇబ్బంది కరమేనని, అయితే అది కొద్దికాలమేనని మిడిల్ ఈస్ట్ పొలిటికల్ ఎకానమీ నిపుణుడు క్రిస్టఫర్ డేవిడ్ సన్ అన్నారు.
“ప్రాథమిక అంశాలైన మౌలిక వసతులు, నిబంధనలు, వాతావరణం, భౌగోళిక స్వరూపం ఏ మాత్రం మారదు. దీర్ఘకాలంలో దుబాయ్‌కున్న గుర్తింపు అలాగే ఉంటుంది” అని క్రిస్టఫర్ అభిప్రాయపడ్డారు.
దాడుల గురించి, దాడులు జరిగే అవకాశాల గురించి నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయడం, మొబైల్ ఫోన్లకు సమాచారం పంపిస్తూ ఉండటంతో ప్రజలు, వాణిజ్యవర్గాలు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
దేశంలో ప్రజల్ని కాపాడుకుంటామని అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయేద్ మరోసారి హామీ ఇచ్చారు. యూఏఈ భద్రతకు ముప్పు తలపెట్టాలని చూసే వారికి తాము అంత తేలిగ్గా లొంగిపోమని ఆయన అన్నారు.
నగరంలో పరిస్థితులు సవ్యంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేందుకు సీనియర్ నాయకులు తరచుగా ప్రజల్లో కనిపిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ, యూఏఈలో బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించరు. దేశాన్ని, దేశ నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం, విమర్శించడంపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
యుద్ధానికి సంబంధించి ధృవీకరించని వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తే భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇరానియన్ మిస్సైళ్లను చిత్రీకరిస్తున్నారనే ఆరోపణల మీద 60 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
యుద్ధం మొదలైన తర్వాత కొన్ని రోజులు నిశబ్ధంగా ఉన్న వీధుల్లో మళ్లీ ట్రాఫిక్, ప్రజలతో సాధారణ పరిస్థితి కనిపిస్తోంది.
యూఏఈ, దుబాయ్ బ్రాండ్‌పై దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందనేది యుద్ధం ఎలా ముగుస్తుందనే దాని మీద ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు
“ఇరాన్ బలహీన పడితే యూఏఈ బ్రాండ్ మరింత విస్తరిస్తుంది” అని డేవిడ్‌సన్ చెప్పారు.
అలా కాకుండా ప్రస్తుత పాలక వర్గం నిలబడితే, గల్ఫ్ దేశాల్లో ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాం ఉందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఒకరు బీబీసీతో చెప్పారు.
“అది ఆందోళన కలిగించే అంశం. ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు నష్టం జరిగితే అది వ్యాపారాల సెంటిమెంట్ మీద ప్రభావం చూపుతుంది” అని ఆయన చెప్పారు.
బుధవారం ఇరాన్ బ్యాంకుపై దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక, బ్యాంకింగ్ ప్రయోజనాలు ముడి పడి ఉన్న సంస్థలపై దాడి చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. దీంతో దుబాయ్‌లోని అనేక సంస్థలు ఆఫీసును ఖాళీ చేయాలని సిబ్బందిని ఆదేశించాయి.
ప్రస్తుతానికి అనేక మంది జాగ్రత్తగా, ఆశతో దుబాయ్‌లోనే ఉంటున్నారు. 2008లో ఆర్థిక సంక్షోభం, 2020లో కరోనా మహమ్మారి లాంటి సంక్షోభాలను దాటుకుని శక్తివంతంగా ఎదిగిందని వాళ్లు చెబుతున్నారు.
“దుబాయ్ చాలా వేగంగా కోలుకుంటుంది. కష్టాలను తట్టుకునే సామర్థ్యం యూఏఈ డీఎన్ఏలో ఉంది” అని మాదద్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



