Home జాతీయ national telgu ‘దిల్లీ మద్యం కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపై విచారణ జరపాలి’ అని కోర్టు ఎందుకంది?

‘దిల్లీ మద్యం కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపై విచారణ జరపాలి’ అని కోర్టు ఎందుకంది?

7
0

SOURCE :- BBC NEWS

దిల్లీ, లిక్కర్, కవిత, ఎన్నికలు, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, x.com/RaoKavitha

  • 3 గంటలు క్రితం

  • చదివే సమయం: 5 నిమిషాలు

దిల్లీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిశ్చార్జ్ చేస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది.

కవితతో పాటు దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు.

కేసు చార్జిషీటు నిండా లోపాలే అంటూ సీబీఐపై ఘాటుగా వ్యాఖ్యానించిన న్యాయమూర్తి, అసలు ఈ కేసు విచారణ చేసిన సీబీఐ అధికారిపై విచారణ చేయాలని ఆదేశించారు.

దిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ కేంద్రంగా అక్రమాలు, అవినీతి జరిగాయని పలు కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు దీనిపై కేసు నమోదు చేశాయి.

ఆ కేసుల్లో అప్పటి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు అరెస్ట్ అయ్యారు. 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అదే ఏడాది ఆగస్టు 27న సుప్రీం కోర్టు కవితకు బెయిల్ ఇచ్చింది. మిగిలినవారికీ వేర్వేరు సమయాల్లో బెయిల్ వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
దిల్లీ, లిక్కర్, కవిత, ఎన్నికలు, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

ఈ కేసులో సీబీఐ చార్జిషీటు సమర్పించగా, ఆరోపణలు ఎదుర్కొన్నవారందరినీ కోర్టు డిశ్చార్జ్ చేసింది. అంటే చట్ట ప్రకారం ఆ చార్జిషీటు, కేసు విచారణ అర్హత లేనివని కోర్టు ప్రకటించింది.

ఈ కేసులో కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియాలతో పాటు బోయినపల్లి అభిషేక్, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ రెడ్డిలను కూడా కోర్టు డిశ్చార్జ్ చేసింది.

కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కులదీప్ సింగ్‌ను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అసలు ఈ చార్జిషీటులోనే పరస్పర విరుద్ధ అంశాలు రాశారని దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్స్ స్పెషల్ న్యాయమూర్తి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, అసలు ఈ కేసు విచారణ చేసిన సీబీఐ అధికారిపై డిపార్టుమెంటల్ ఎంక్వైరీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారని ‘లైవ్ లా’ రిపోర్ట్ చేసింది.

కేసు విచారణ సందర్భంగా కోర్టు సీబీఐను తీవ్రంగా మందలించినట్టు లైవ్ లా రిపోర్ట్ చేసింది. ”చార్జిషీటు లోపభూయిష్టంగా, సరైన రీతిలో విచారణ చేయకుండా ఉందని” కోర్టు సీబీఐని ఘాటుగా విమర్శించినట్టు లైవ్ లా రాసింది. సాక్ష్యాలు లేకుండా వేలాది పేజీలు రాయడంతో పాటు, అనేక మిస్‌లీడింగ్ ఆరోపణలు ఉన్నట్టు కోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించిందని రాసింది.

దిల్లీ, లిక్కర్, కవిత, ఎన్నికలు, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, kavitha_kalvakuntla/Insta

‘ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నాకు జరిగిన అవమానం తీరదు’

”దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు తప్పుడు కేసు అని ఎప్పటి నుంచో చెబుతున్నా. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నాను. కోర్టు తీర్పుతో అదే జరిగింది. కానీ ఐదున్నర నెలలు కుటుంబానికి దూరం ఉన్నా. అవమానాలు, బాధ, వ్యక్తిత్వ హననం ఎదుర్కొన్నా. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నాకు జరిగిన అవమానం తీరదు. మా కుటుంబానికి అన్యాయం జరిగింది. కష్ట సమయంలో అండగా నిలిచిన తల్లిదండ్రులకు, అత్తమామాలకు, భర్తతో పాటు ఆయన కుటుంబానికి ధన్యవాదాలు. పార్టీ పెట్టనున్న రెండు నెలల ముందు ఈ తీర్పు రావడమంటే ప్రకృతి ఆశీర్వాదం ఇచ్చినట్లే” అని కవిత వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై కేటీఆర్ కూడా స్పందించారు.

”ఈ లిక్కర్ స్కాం పేరు చెప్పి కేజ్రీవాల్ సర్కారును అధికారం నుంచి దింపారు. మా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కేసు వల్ల బలైపోయింది. ఈ కేసులో కవితగారికి న్యాయం జరిగినట్టుగానే, మా నాయకుల మీద పెట్టే తప్పుడు కేసుల నుంచి బయటకు వస్తాం” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కేటీఆర్.

అయితే బీఆర్ఎస్ ఓటమికి తానే కారణం అనే ధోరణిలో కేటీఆర్ ఎక్స్ పోస్ట్ పెట్టడాన్ని తప్పు పట్టిన కవిత, బీఆర్ఎస్ ఓటమికి తనను కారణం అంటే సహించబోనని చెప్పారు.

దిల్లీ, లిక్కర్, కవిత, ఎన్నికలు, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

డిశ్చార్జ్ అంటే…

‘డిశ్చార్జ్ అంటే కేసు విచారణకు తీసుకోకుండానే, విచారణ చేయడానికి తగిన సాక్ష్యాలు లేవని నిర్ధరించి కేసును కొట్టివేయడం. అక్విటల్ అంటే కేసు విచారణ తరువాత, అంటే కోర్టులో సాక్ష్యులను విచారించిన తరువాత కేసును కొట్టివేయడం. డిశ్చార్జి చేయడాన్ని కేసు కొట్టివేయడం అనవచ్చు. అక్కడితో ఆ కేసు ముగిసినట్టే. అయితే, ఒకవేళ విచారణ సంస్థ కావాలనుకుంటే దానిపై అప్పీలుకు వెళ్లవచ్చు” అని బీబీసీకి వివరించారు న్యాయవాది లక్ష్మీనారాయణ.

“ఏదైనా ఒక కేసు నమోదైనప్పుడు.. తనను ఆ కేసులో ఇరికించారని, లేదా ఆ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ అందులో నిందితుడిగా పేర్కొన్న వ్యక్తి మేజిస్ట్రేట్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఆ కేసు విచారణార్హం కాదని భావిస్తే కోర్టు డిశ్చార్జ్ చేస్తుంది. అంటే, ఆ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేసినట్టే” అని ఏపీ హైకోర్ట్ సీనియర్ న్యాయవాది ఉల్లం శేషగిరిరావు తెలిపారు.

“ఒకవేళ కేసులో చార్జిషీట్ నమోదై, నిందితుడిపై నమోదైన అభియోగాలకు సంబంధించి కోర్టు విచారణ జరిపిన అనంతరం సదరు వ్యక్తిపై నేరాభియోగాలు రుజువు కాకపోతే సదరు వ్యక్తిపై కేసు కొట్టివేస్తూ విడుదల చేయడాన్ని అక్విటెడ్‌ అంటారు.”

కేసు డిశ్చార్జి చేస్తే వారు నిర్దోషి అనే అర్థమని శేషగిరిరావు చెప్పారు.

దిల్లీ, లిక్కర్, కవిత, ఎన్నికలు, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, FaceBook/BRS Party

అసలేంటీ దిల్లీ లిక్కర్ కేసు?

గతంలో దిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తర్వాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్‌లో గోల్‌మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయించారు అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్. దీంతో మొత్తానికి ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది ఆప్ ప్రభుత్వం.

అంతా బాగానే ఉంది కానీ, ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే ఎంక్వైరీ జరిగింది. ఆ తరువాత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. ఆ వెంటనే, దీని వెనుక కేసీఆర్ కుమార్తె కవిత హస్తం కూడా ఉందని దిల్లీ బీజేపీ నాయకులు ఆరోపించారు.

”దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో కవిత అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన 100 కోట్లరూపాయల ముడుపులలో కవిత ప్రమేయం ఉంది. 2021-22 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. అనంతరం హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్టు దర్యాప్తులో తేలింది” అని ఈడీ కవితను అరెస్ట్ చేసిన సమయంలో ప్రకటించింది.

ఇవాళ దిల్లీ కోర్టు ఈ కేసు విచారణార్హమైనది కాదని తీర్పు ఇచ్చింది.

మరోవైపు ఈ కేసులో సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి తీర్పుపై దిల్లీ హైకోర్టులో సీబీఐ అప్పీలుకు వెళ్లినట్టు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)