SOURCE :- BBC NEWS

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు.. గోదావరి నది ఉత్తర ఒడ్డు.. ఎత్తైన దండకారణ్యపు కొండల మధ్య ఉన్న మైదాన ప్రాంతంలోని వాజేడు పోలీస్ స్టేషన్ అది. మారుమూల ప్రాంతాల్లో ఉండే స్టేషన్లలా కాకుండా పకడ్బందీ భవనంతో ఉంది నిర్మాణం.
అదే ప్రాంగణంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) క్యాంపు కూడా ఉంది. అక్కడ తుపాకులు పట్టుకుని గస్తీ కాస్తున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు కనిపించారు.
అక్కడికి కొత్తవారు ఎవరొచ్చినా చాలా ఆరా తీస్తారు. ఇక మీడియాకు ఆ పోలీస్‌స్టేషన్ బయట ఉన్న ‘వాజేడు పోలీస్ స్టేషన్’ అనే బోర్డును ఫోటో కూడా తీయనివ్వని పరిస్థితి ఉంది.
ఆ స్టేషన్ దాటి రెండు అడుగులు వేస్తే వచ్చే పాఠశాల, దానికి కాస్త పక్కగా ఉన్న కాలేజీ ప్రాంగణాల్లో పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు కనిపిస్తారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వారిని తీసుకువచ్చిన భారీ వాహనాలు అక్కడే పార్కు చేసి ఉన్నాయి.
వారు అడవిలోకి వెళ్లేందుకు వీలుగా వందల సంఖ్యలో టూవీలర్లు సిద్ధంగా ఉన్నాయి.
అలాగే గోదావరి వెంట, కాస్త లోపలకి వెళ్తే వెంకటాపురం. ఈ స్టేషన్ కూడా పెద్దదే కానీ, వాజేడు అంత పెద్ద ప్రాంగణం కాదు. స్టేషన్లో ఎక్కడ చూసినా కొత్తగా వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బందే కనిపించారు.
ఆ స్టేషన్ ఎదురుగా కొన్ని ఛత్తీస్‌గఢ్ రిజిస్ట్రేషన్ బండ్లున్నాయి. పక్కన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో, బాంబులను తట్టుకోగలిగే సీఆర్పీఎఫ్ వాహనం పార్కు చేసి ఉంది.


‘అక్కడ ఎన్నిరోజలుంటామో తెలియదు’
వెంకటాపురం నుంచి ఏటూరునాగారం వెళ్తుంటే మధ్యలో మోరుమూరు గ్రామం ఉంది. అక్కడ సాయంత్రం నాలుగు గంటల వేళ, వరుసగా బస్సులు ఆగి ఉన్నాయి. అందులో వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడ కనిపించారు. వారి చేతుల్లో ఆధునిక తుపాకులు, కొందరి చేతుల్లో ఇతర ఆయుధ సామగ్రి, వారికి కావాల్సిన ఇతర సౌకర్యాలిచ్చే బండ్లున్నాయి.
చక్కని రోడ్డు మార్గం ఉండి కూడా, మందు పాతరల విషయంలో జాగ్రత్త కోసం వారంతా రోడ్డు దిగి నడిచి వెళ్తున్నారు.
”ఇటీవలే వారం రోజుల పాటు అడవిలో ఉండి వచ్చాం. మళ్లీ వెళ్తున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులుంటామో తెలియదు” అని ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బీబీసీకి చెప్పారు.
అక్కడ ఎవర్నీ వీడియోలు, ఫోటోలు తీయనివ్వడం లేదు సీఆర్పీఎఫ్ సిబ్బంది. మీడియాతో మాట్లాడటానికి కూడా వారు ఆసక్తిగా లేరు.
సమీపంలోని పాలెం వాగు మీద ఉన్న ప్రాజెక్టు దగ్గర బీబీసీ బృందం దాదాపు గంటన్నర నుంచి 2 గంటల పాటు ఉంది. ఆ సమయంలోనే హెలికాప్టర్లు కనీసం పది రౌండ్లు వేశాయి.
వెంకటాపురం నుంచి కర్రిగుట్టల్లోకి ట్రిప్పులు వేస్తున్నాయి. సీఆర్పీఎఫ్ సిబ్బందినో లేక వారికి కావల్సిన వస్తువులనో అవి తీసుకు వెళ్తున్నాయి. ప్రతిసారీ కొత్త మార్గంలో కొత్త ఎత్తులో అవి ప్రయాణిస్తున్నాయి.

రెండు వారాలుగా ఆపరేషన్
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఆపరేషన్ కగార్‌లో భాగంగా కర్రిగుట్టల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఉత్తర తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
కర్రిగుట్టలు కేంద్రంగా దాదాపు రెండు వారాలుగా ఈ ఆపరేషన్ సాగుతోంది.
ప్రస్తుతానికి ఆదివాసీ గ్రామాల వారు మాత్రం నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని చిన్నఊట్ల నుంచి, తెలంగాణలోని తిప్పాపురం, ముత్తారం వరకూ పలు ఆదివాసీ గ్రామాలను సందర్శించినప్పుడు అదే కనిపించింది.
వారందరికీ ఇక్కడ పెద్ద ఆపరేషన్ జరుగుతోందని మాత్రం తెలుసు.
”రాత్రుళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి మాకు” అని రాచపల్లి గ్రామం దగ్గర గొర్రెలు కాస్తున్న వ్యక్తి బీబీసీతో చెప్పారు.

లోపల ఏం జరుగుతోంది?
ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కర్రి గుట్టల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారా, లేరా? మావోయిస్టు సీనియర్ నాయకులు ఉన్నారా, లేరా? సీఆర్పీఎఫ్ ఆపరేషన్‌లో భాగంగా భారీగా ఎదురు కాల్పులు ఏమైనా జరిగాయా? అన్నది ఎక్కడా ఎవరి వద్దా స్పష్టమైన సమాచారం లేదు. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వాదన వినిపిస్తున్నారు.
ములుగు జిల్లాకు చెందిన పలువురు మీడియా ప్రతినిధులు మాత్రం ”కర్రి గుట్టల్లో మావోయిస్టు పెద్ద నాయకులు ఎవరూ లేరు. కర్రి గుట్టలవైపు రాకండి అంటూ సామాన్య ప్రజలను ఉద్దేశించి మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఆధారంగా సీఆర్పీఎఫ్ వారు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. కానీ, వారు ఆశించిన ఫలితం ఇప్పటి వరకైతే రాలేదు” అని చెబుతున్నారు.
సీఆర్పీఎఫ్ బలగాలు కూడా దాదాపు దీనిని విశ్వసిస్తున్నప్పటికీ, వారు బహిరంగంగా అంగీకరించడం లేదు.
మరోవైపు పెద్ద సంఖ్యలో కాకపోయినా, సాధారణ సంఖ్యలో మావోయిస్టులు ఉండవచ్చని వారు చెబుతున్నారు. అంతేకాదు, మావోయిస్టులు ఉన్నా లేకపోయినా ఆపరేషన్ కొనసాగుతుందని సీఆర్పీఎఫ్ సంకేతాలు ఇచ్చింది.

ఎప్పటివరకు ఈ ఆపరేషన్?
”ఎంతమంది మావోయిస్టులు, ఆయుధాలు దొరికాయన్నది ముఖ్యం కాదు. కర్రిగుట్టల్లో ఇప్పటి వరకూ మావోల పెత్తనం సాగింది. మనుషులను అక్కడ తిరగనివ్వలేదు. ఇప్పుడు మేం స్వేచ్ఛ ఇచ్చాం. కాబట్టి మొత్తం కర్రిగుట్టలను స్వాధీనం చేసుకునే వరకూ మా ఆపరేషన్ కొనసాగుతుంది” అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు.
అసలు సీఆర్పీఎఫ్ వారు మావోల లేఖ చూసి ఆపరేషన్ ప్రారంభించారా? లేక ముందుగానే ప్రణాళిక వేశారా అన్నది స్పష్టత లేదు. అటు మావోలు సైతం వ్యూహాత్మకంగా లేఖ రాశారా? లేదంటే లేఖ రాసి ఇరుక్కుపోయారో తెలియదు.
దీంతో మావోయిస్టులు దొరికినా, దొరకకపోయినా.. కర్రిగుట్టలను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకూ సీఆర్పీఎఫ్ వెనక్కు తగ్గకపోవచ్చని తెలుస్తోంది. ఇది కూడా ఒక రకంగా మావోయిస్టులకు దెబ్బే. ఎందుకంటే కర్రిగుట్టల ప్రాంతం మావోయిస్టులకు మంచి స్థావరంగా ఉండేది. ఇప్పుడు వారి బలమైన స్థావరంపై పోలీసులు పట్టుసంపాదిస్తున్నారు. ఒక్కో పెద్ద కొండ మీదా సీఆర్పీఎఫ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వెళ్తోంది.
అలాగే ఇతరులు రాకుండా కర్రిగుట్టల చుట్టూ పాతిపెట్టిన, ఎందరో సామాన్య ఆదివాసీలను బలితీసుకున్న మందుపాతరలను కూడా సీఆర్పీఎఫ్ నిర్వీర్యం చేస్తోంది. కుదరని చోట పేల్చేస్తున్నారు. ఆ శబ్దాలు కూడా గ్రామాలకు వినిపిస్తున్నాయి.
”తెలంగాణ పోలీసులు మాకు సహకరించడం లేదు” – రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు బీబీసీతో చెప్పిన మాట ఇది.
మరో సీఆర్పీఎఫ్ క్షేత్ర స్థాయి అధికారి ఇదే అంశాన్ని కాస్త విపులంగా చెప్పారు.
”కారణం ఏంటో కానీ, ఆపరేషన్ విషయంలో సహకారం లేదు. అలాగని పూర్తి సహకారం లేదని కాదు. భోజనం, వసతి వంటి వాటి విషయంలో తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారు” అని బీబీసీతో ఆయన చెప్పారు.
తెలంగాణ పోలీసులు కూడా అదే చెబుతున్నారు.
”ఈ ఆపరేషన్‌లో మా పాత్ర ఏమీ లేదు. ఇది పూర్తిగా సీఆర్పీఎఫ్ నిర్వహిస్తున్నది” అని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

కొత్తగా మూడో క్యాంపు
కర్రిగుట్టల ఆపరేషన్ తాత్కాలికమైనది కాదని అక్కడి పరిస్థితులను గమనిస్తే అర్థమవుతుంది.
తెలంగాణలోని చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేరి వైపు వెళ్తున్నప్పుడు సరిహద్దుల్లో పూసుగుప్ప, బీమారం, చిన్నఊట్ల దగ్గరలో ఇప్పటికే రెండు సీఆర్పీఎఫ్ క్యాంపులు ఉండగా, మూడో క్యాంపును కొత్తగా నిర్మిస్తున్నారు. ఇక పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు ద్విచక్రవాహనాల మీద క్యాంపుల వైపు తిరిగి రావడం కనిపిస్తుంది.
చిన్నఊట్ల వంటి గ్రామాలకు దగ్గరలో బృందాలుగా కానిస్టేబుళ్లను గస్తీకి ఉంచారు.
”ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడు ఆపుతారో తెలియదు కానీ, ఇప్పట్లో మాత్రం ఆగేలా లేదు” అని ఒక పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.
గతంలో ప్రకటించిన ముగ్గురి మరణాలకు అదనంగా మే 5న తెలంగాణలో ఆలుబాక దగ్గరలోని తడపల దగ్గర మరో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టు సీఆర్పీఎఫ్ చెబుతోంది. ఈ ఎన్కౌంటర్ వార్తలు ఇంకా నిర్ధరణ కావల్సి ఉంది. అవి నిజమైతే, ఈ ఆపరేషన్‌లో మరణించిన మావోల సంఖ్య సీఆర్పీఎఫ్ ప్రకారం ఐదు, మావోల ప్రకారం ఎనిమిదికి చేరుతుంది.
మరోవైపు శాంతి చర్చల కోసం మావోలు సిద్ధమైనా, ప్రజా సంఘాలు విజ్ఞప్తులు చేస్తున్నా, కేంద్రం మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
చర్చల మీద చర్చ
కర్రి గుట్టల్లో ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇటు మావోయిస్టులతో చర్చల విషయం మరోసారి విస్తృతంగా ప్రస్తావనకొస్తోంది. అయితే, లొంగుబాటు తర్వాతే చర్చలు జరుగుతాయని కేంద్రం ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది.
‘‘తుపాకులతో అమాయకులను చంపేస్తున్న మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకులు వీడనిదే చర్చలు ఉండవు’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. చర్చలకు కేంద్రం ముందుకు రావాలన్న ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు.
‘‘మావోయిస్టులపై నిషేధం విధించింది కాంగ్రెస్ పార్టీయేనన్నది గుర్తు పెట్టుకోవాలి’’ అని బండి సంజయ్ అన్నారు.
శాంతి చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరాసక్తంగా ఉందని, మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.
‘‘తుపాకులు విడిచి పెట్టాలా వద్దా అన్నదానిపై చర్చల్లో నిర్ణయించాలి తప్ప, అసలు లొంగిపోవాలన్నదే చర్చలకు షరతుగా పెట్టడం సమంజసం కాదు. ఆయుధాలు వదిలిపెట్టడం, లొంగిపోవడం అన్నవి చర్చల్లో భాగంగా ఉండాలి’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
మరోవైపు తెలంగాణ మంత్రి సీతక్క, భారత రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావులు కూడా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌ను నిలిపేయాలని ఇటీవల డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని వారు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)