SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
‘‘పాకిస్తాన్, తుర్కియే స్నేహం చిరకాలం ఉండాలి’’ సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఈ మాటలు రాసింది తుర్కియే అధ్యక్షులు రీసెప్ తాయిప్ ఎర్దొవాన్.
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మంగళవారం(మే 13) ఎర్దొవాన్‌కు కృతజ్ఞతలు చెప్పగా, తుర్కియే అధ్యక్షుడు ఇలా బదులిచ్చారు.
భారత్, పాకిస్తాన్ ముఖాముఖి తలపడే స్థితికి చేరువైనప్పుడు, తుర్కియే బహిరంగంగా పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించింది.
భారత్, పాకిస్తాన్‌లకు సంబంధించిన ఏ విషయంలోనైనా పాకిస్తాన్ వైపు నిలబడడం తుర్కియేకు ఇదే మొదటిసారి కాదు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై అనేక సందర్భాల్లో పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడింది తుర్కియే.
గతంలో మన నుంచి సాయం అందుకుని, ఇప్పుడు పాకిస్తాన్‌కు సాయం చేస్తూ ఎగదోస్తోందని తుర్కియేపై మండిపడుతున్నారు భారతీయులు.
టూరిజంతోపాటు అనేక సరుకుల ఎగమతుల ద్వారా ఇండియా నుంచి లబ్ది పొందుతున్న తుర్కియేను బాయ్‌కాట్ చేయాలంటూ ఆన్‌లైన్‌లో డిమాండ్‌లు కూడా వినిపిస్తున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్ సంక్షోభంలో తుర్కియే
భారత్, పాకిస్తాన్ మధ్య తాజా సంక్షోభం మొదలైన తర్వాత మే 9న పాకిస్తాన్‌కు మద్దతుగా ఎర్దొవాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
పాకిస్తాన్ ప్రజలను తనకు సోదరులుగా అభివర్ణించిన ఎర్దొవాన్, వారి కోసం అల్లాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. పహల్గాం దాడి మీద అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాలన్న పాకిస్తాన్ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.
దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత తుర్కియే వాయుసేనకు చెందిన సీ-130 జెట్ విమానం ఒకటి పాకిస్తాన్‌లో ల్యాండ్ అయింది. సంక్షోభానికి ముందు తుర్కియే యుద్ధనౌక కరాచీ పోర్టుకు చేరుకుంది.
ఇంధనం నింపుకోవడం కోసం విమానాన్ని ల్యాండింగ్ చేశామని, పరస్పర సామరస్యంలో భాగంగా యుద్ధనౌకను పంపామని తుర్కియే తెలిపింది.
సంక్షోభం సమయంలో తుర్కియే తయారీ సోన్‌గార్ డ్రోన్లతో పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడి చేసిందని మే 8న భారత్ ఆరోపించింది. అయితే, ఆరోపణలను పాకిస్తాన్ రక్షణమంత్రి ఖండించారు.
సోన్‌గార్ డ్రోన్లను తుర్కియేకు చెందిన డిఫెన్స్ సంస్థ ఆసిస్‌గార్డ్ తయారు చేస్తుంది. ఇవి ఆయుధాలను మోసుకెళ్లే యూఏవీ (అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్స్)లు.
పశ్చిమాసియాలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన ఏకైక దేశం తుర్కియే. ఇతర గల్ఫ్ దేశాలు పాకిస్తాన్‌కు మద్దతివ్వడం లేదు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
భారత్‌కు తుర్కియే ఎందుకు మద్దతివ్వడం లేదు?
2023 ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను తీవ్ర భూకంపం కుదిపేసింది. వేలమంది చనిపోయారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు.
తుర్కియే, సిరియాలలో సహాయం, పునరావాసం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద తుర్కియేకు విమానంలో సహాయ సామాగ్రి కూడా పంపింది భారత్.
భారత్, తుర్కియే మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ ఆపరేషన్ ప్రతిబింబించిందని, స్నేహితులు ఒకరికొకరు ఎప్పుడూ సాయం చేసుకుంటారని భారత్‌లో అప్పటి తుర్కియే అంబాసిడర్ ఫిరాత్ సునేల్ అన్నారు.
ఆ మానవతా సాయం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్‌ను మిత్రదేశంగా, పాకిస్తాన్‌ను సోదరదేశంగా తరచూ తుర్కియే చెబుతుంటుంది.
అయితే, ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తుర్కియే ఎక్కువ సందర్భాల్లో పాకిస్తాన్ వైపు నిల్చుంది.
చారిత్రకంగా పాకిస్తాన్‌తో దగ్గరి సంబంధాలున్న యూఏఈ, సౌదీ అరేబియాతో ప్రస్తుతం భారత్‌కు బలమైన బంధం ఉంది. కానీ ఈ వ్యవహారంలో తుర్కియే వైఖరి ఎందుకు భిన్నంగా ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
తుర్కియే వైఖరి ఎందుకు మారడం లేదు?
డాక్టర్ ఒమర్ అనస్ తుర్కియేలోని అంకారా యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయన అభిప్రాయం ప్రకారం…
”ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియా, యూఏఈలతో భారత్ సంబంధాలు కీలకంగా మారాయి. ఎందుకంటే ఆ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుంది. ఇది పక్కన పెడితే భారత్‌కు చెందిన లక్షల మంది కార్మికులు ఈ దేశాల్లో పని చేస్తున్నారు. అదే సమయంలో భారత్, తుర్కియే మధ్య వాణిజ్య సంబంధాలు చాలా తక్కువ. ఒకదానిమీద మరొకటి ఆధారపడిలేదు. అందుకే తుర్కియే వ్యవహారశైలి భిన్నంగా ఉంది”
1948లో భారత్, తుర్కియే మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ, అనేక దశాబ్దాల తర్వాత కూడా రెండు దేశాలు ఒకదానికొకటి దగ్గర కాలేకపోయాయి.
భారత్, తుర్కియే మధ్య బలహీన సంబంధాలకు రెండు ప్రధాన కారణాలున్నాయి. కశ్మీర్ విషయంలో తుర్కియే పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండో కారణం కోల్డ్ వార్ సమయంలో తుర్కియే అమెరికా క్యాంపులో ఉంది. భారత్ అలీన విధానాన్ని అవలంబించింది.
( 1947 నుంచి 1991 మధ్య అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య సుదీర్ఘకాలం సాగిన రాజకీయ, సైనిక పోటీనే కోల్డ్‌వార్ లేదా ప్రచ్ఛన్నయుద్ధం అంటారు)
కోల్డ్‌వార్ బలహీనపడడం మొదలైన తర్వాత, పాశ్చాత్య దేశాలకు అనుకూలుడిగా, ఉదారవాదిగా పేరున్న అప్పటి తుర్కియే అధ్యక్షుడు తుర్‌గుత్ ఓజాల్, భారత్‌తో సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు.
1986లో భారత్‌లో పర్యటించారు ఓజాల్. రెండు దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో సైనిక ప్రతినిధుల ఆఫీసులను ప్రారంభించాలని ఆ పర్యటనలో ఓజాల్ ప్రతిపాదించారు. ఆ తర్వాత అప్పటి భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1988లో తుర్కియేలో పర్యటించారు. రాజీవ్ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో సంబంధాలు మెరుగుపడ్డాయి.
అయినప్పటికీ కశ్మీర్ సమస్య విషయంలో తుర్కియే వైఖరి పాకిస్తాన్‌కు అనుకూలంగానే ఉంది. అందుకే భారత్, తుర్కియే మధ్య సాన్నిహిత్యం పెరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘పాకిస్తాన్‌తో సంబంధాలే తుర్కియేకు ముఖ్యం’
2014లో నరేంద్ర మోదీ భారత ప్రధాని అయ్యారు. అదే ఏడాది ఎర్దొవాన్ తుర్కియే అధ్యక్షుడయ్యారు. 2017లో ఎర్దొవాన్ తుర్కియే అధ్యక్షునిగా భారత పర్యటనకు వచ్చారు. కానీ నరేంద్ర మోదీ తుర్కియేలో ఎప్పుడూ పర్యటించలేదు.
మోదీ 2019లో తుర్కియేలో పర్యటించాల్సిఉంది. కానీ కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితిలో ఎర్దొవాన్ చేసిన ప్రకటన తర్వాత ఆ పర్యటన వాయిదా పడింది.
పాకిస్తాన్‌కు మద్దతిస్తున్నందున తుర్కియేపై భారత్ ఒకింత అసహనంగానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో భారత్ ఆగ్రహంపై తుర్కియేకు ఆందోళన లేదా?
”అమెరికా కారణంగా, భారత్ ఏం ఆలోచిస్తోందో తుర్కియే పట్టించుకోవడం లేదు. భారత్‌కు అమెరికాకు సన్నిహిత దేశం. అమెరికా, యూరప్‌తో తుర్కియే సంబంధాలు గడచిన చాలా ఏళ్లగా అంత మెరుగ్గా లేవు’’ అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పశ్చిమాసియా అధ్యయన కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ ఏకే పాషా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, తుర్కియే ఉమ్మడి ప్రయోజనాలు
ఇస్లామిక్ గుర్తింపు రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా బలమైన సంబంధాలు నెలకొనడానికి కారణం. కానీ ఇది దీనికే పరిమితం కాదు. సంక్షోభాల సమయంలో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా ఉన్నాయి.
ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో పాకిస్తాన్, తుర్కియే సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, రీజనల్ కోఆపరేషన్ డెవలప్‌మెంట్ వంటి సంస్థల్లో కలిసి ఉన్నాయి.
సైప్రస్‌లో గ్రీస్‌కు వ్యతిరేకంగా తుర్కియే చేసే ఆరోపణలకు పాకిస్తాన్ మద్దతిచ్చింది. 1964, 1971 సంవత్సరాల్లో మిలటరీ సాయానికి హామీ ఇచ్చింది.
తుర్కియే కూడా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు నిరంతరాయంగా మద్దతిస్తోంది.
2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు భారత్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుచేసినప్పుడు, మరుసటి నెలలోనే ఎర్దొవాన్ ఐక్యరాజ్యసమితిలో దీనికి వ్యతిరేకంగా ప్రసంగించారు.
అయితే కొంతకాలంగా ఎర్దొవాన్ కశ్మీర్ అంశాన్ని ప్రధాన వేదికలపై లేవనెత్తడం లేదని డాక్టర్ అనాస్ చెప్పారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో సెప్టెంబరు 24న చేసిన ప్రసంగంలో ఎర్దొవాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. చాలా ఏళ్ల తర్వాత ఎర్దొవాన్ కశ్మీర్ గురించి ప్రస్తావించకుండా ప్రసంగాన్ని ముగించారు.
అయితే కశ్మీర్ విషయంలో ఎర్దొవాన్ వైఖరి భవిష్యత్తులో మరింత కఠినంగా ఉంటుందని ప్రొఫెసర్ ఏకే పాషా భావిస్తున్నారు.
2003లో ప్రధానమంత్రి, 2014లో అధ్యక్షుడు అయిన తర్వాత ఎర్దొవాన్ పాకిస్తాన్‌లో పదిసార్లకు పైగా పర్యటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు ఆ దేశాన్ని తన రెండో ఇల్లుగా ఎర్దొవాన్ అభివర్ణించారు.
ఆ పర్యటనలో రెండు దేశాలు 24 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవాలని అంగీకారానికొచ్చాయి.
”గడచిన రెండు దశాబ్దాలుగా నాటోపై తుర్కియే పట్టు కోల్పోతోంది. దీంతో గత 20 ఏళ్లగా రష్యా, చైనా, పాకిస్తాన్‌తో తుర్కియే సంబంధాలు పెంపొందించుకుంటోంది. నాటోలో ఏదన్నా జరిగితే పాకిస్తాన్ కూడా తుర్కియేకు ముఖ్యమైన దేశంగా ఉంటుంది” అని డాక్టర్ ఒమైర్ అనాస్ వివరించారు.
”మరో కోణం ఏంటంటే…ఆయుధాల విషయానికొస్తే ఓవైపు పాశ్చాత్య దేశాలుంటే, ఇంకో వైపు చైనా, తుర్కియే ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ సంక్షోభంలో తుర్కియే తన ఆయుధాలను పరీక్షించుకుంది. ప్రపంచం మొత్తం తన ఆయుధాలను కొనాలని తుర్కియే భావిస్తోంది” అని ఆయన విశ్లేషించారు.
భౌగోళికంగా గల్ఫ్ ప్రాంతంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వం నుంచి తుర్కియే సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ దేశాల పలుకుబడిని తగ్గించడానికి పాకిస్తాన్, మలేసియా వంటి గల్ఫేతర ముస్లిం దేశాలతో సంబంధాలను తుర్కియే బలపరుచుకుంటోంది.
దీంతోపాటు హిందూ మహాసముద్రంపై తుర్కియే దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో తుర్కియే నౌకాదళం, పాకిస్తాన్ నేవీ కలిసి హిందూమహాసముద్రంలో సంయుక్తంగా అనేకసార్లు యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)