Home LATEST NEWS telugu తాజా వార్తలు టీ20 వరల్డ్ కప్: భారత్‌తో మ్యాచ్ ఆడనని చెప్పిన పాకిస్తాన్, అయినా పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం...

టీ20 వరల్డ్ కప్: భారత్‌తో మ్యాచ్ ఆడనని చెప్పిన పాకిస్తాన్, అయినా పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం భారత్ శ్రీలంక‌కు ఎందుకు వెళుతోంది?

3
0

SOURCE :- BBC NEWS

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్, పాకిస్తాన్ మ్యాచ్,  శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

7 ఫిబ్రవరి 2026

రాజకీయ ఉద్రిక్తతలు, అనిశ్చితి మధ్య ఐసీసీ టీ-29 పురుషుల ప్రపంచ కప్‌ ప్రారంభమవుతోంది. భారత్, శ్రీలంక ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్నాయి.

బంగ్లాదేశ్ టోర్నీని బహిష్కరించింది. భారత్‌తో మ్యాచ్‌లు ఆడేది లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నియమావళి ప్రకారం భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ నిరాకరిస్తే, ఆ జట్టు పాయింట్లు కోల్పోతుంది. ఆ మ్యాచ్ గరిష్ఠ పాయింట్లు భారత్ ఖాతాలో పడతాయి.

భారత్‌తో మ్యాచ్‌లు ఆడకూడదనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది.

పాక్ నిర్ణయం తమకు ఆర్థిక నష్టాన్ని కలగచేస్తుందని అందులో తెలిపింది.

భారత్‌తో పాకిస్తాన్ ఆడకపోవడం వల్ల కలిగే ప్రభావంపై అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతోంది. మ్యాచ్ ఆడకపోవడం వల్ల పాకిస్తాన్‌కు భారీ జరిమానా పడకుండా కాపాడే ప్రపంచ కప్ ఒప్పందంలోని ఓ నిబంధన గురించి చర్చ జరుగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్, పాకిస్తాన్ మ్యాచ్,  శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

పీసీబీకి శ్రీలంక రాసిన లేఖలో ఏముందంటే..

శ్రీలంక క్రికెట్ బోర్డు పీసీబీకి లేఖ రాసిందని శ్రీలంక వార్తా సంస్థ న్యూస్‌వైర్‌ను ప్రస్తావిస్తూ పీటీఐ తెలిపింది.

భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడకపోవడం వల్ల హోటల్ గదుల రద్దు, విమాన రిజర్వేషన్లు, తదితర నష్టాలు వస్తాయని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జారీ చేసిన లేఖలో తెలిపింది.

భారత్-పాక్ మ్యాచ్ జరక్కపోతే శ్రీలంక క్రికెట్ బోర్డు మీద మాత్రమే కాక, టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతీ వాటాదారుడిపై కూడా ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొంది.

అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెట్ ఏకాకి అయిన సందర్భంలోె, దాన్నుంచి బయటకు తీసుకురావడంతో తమ బోర్డు ఎలాంటి పాత్ర పోషించిందో ఎస్‌ఎల్‌సి ఆ లేఖలో పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డుకు గుర్తుచేసింది.

ఇతర దేశాల క్రికెట్ జట్లు పాక్‌లో పర్యటించడానికి సంకోచించినప్పుడు తాము చాలా సార్లు పాక్‌లో మ్యాచ్‌లు ఆడినట్లు తెలిపింది

లాహోర్‌లో శ్రీలంక జట్టు బస్సుపై 2009లో ఉగ్రవాద దాడి తర్వాత ఇతర దేశాల క్రికెట్ జట్లు తమ పాక్ పర్యటనలను రద్దు చేసుకున్నాయి.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్, పాకిస్తాన్ మ్యాచ్,  శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

భారత్- పాక్ ఏమంటున్నాయి?

ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు శ్రీలంకకు వెళుతుందని, మ్యాచ్ రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి సూచనలు అందలేదని భారత జట్టు కెప్టెన్ టోర్నమెంట్ ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

“మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మేం ఆడేందుకు నిరాకరించడం లేదు. పాకిస్తాన్ అంగీకరించడంలేదు. మ్యాచ్ ఆడాలని ఐసీసీ చెప్పింది. ప్రభుత్వం తటస్థ వేదికను నిర్ణయించింది. కొలంబో వెళ్లడానికి మాకు విమాన టిక్కెట్లు బుక్ చేశారు. మేం వెళుతున్నాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం” అని సూర్య కుమార్ యాదవ్ చెప్పాడు.

“భారత్‌త్ మ్యాచ్ ఆడాలా లేదా అన్నది మా చేతుల్లో లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. మేము ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాం. ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తాం” అని పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు.

సెమీ ఫైనల్స్‌లో రెండు జట్లు ఆడాల్సి వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ “సెమీస్ లేదా ఫైనల్స్‌లో మేం భారత్‌తో ఆడాల్సి వస్తే, మేం మా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వ్యవహరిస్తాం” అని ఆఘా చెప్పాడు.

ఆఘా వ్యాఖ్యలను బట్టి చూస్తే గ్రూప్ దశ తర్వాతి మ్యాచ్‌లపైనా పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందోననే అనిశ్చితి కొనసాగుతోంది.

గతంలో కొన్ని జట్లు టోర్నమెంట్ల నుంచి వైదొలగిన సంఘటనలు ఉన్నాయి. భారత్, పాక్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన 1996 ప్రపంచ క్రికెట్ కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు శ్రీలంక‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి.

2003 ప్రపంచ‌కప్‌లో హరారేలో జింబాబ్వేతో మ్యాచ్‌ ఆడేందుకు ఇంగ్లండ్ నిరాకరించింది. జింబాబ్వేలో భద్రత సమస్యలు, సామాజిక అశాంతి కారణంగా తాము ఆ దేశంతో మ్యాచ్ ఆడమని చెప్పింది.

టోర్నీలలో మ్యాచ్‌లు ఆడని దేశాలకు ఐసీసీ జరిమానా లేదా ఎలాంటి శిక్షా విధించలేదు. ఈ మ్యాచ్‌లలో పాయింట్లన్నీ ప్రత్యర్థి జట్టు ఖాతాలో పడ్డాయి.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.4 ప్రకారం ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా సరే, తన వ్యవహారాలను స్వయంప్రతిపత్తితో నిర్వహించుకోవాలి. క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు.

జింబాబ్వే ప్రభుత్వం 2019లో ఆ దేశ క్రికెట్ బోర్డును రద్దు చేసింది. దీంతో జింబాబ్వే క్రికెట్ జట్టు మూడు నెలల పాటు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనకుండా ఐసీసీ సస్పెండ్ చేసింది.

దీంతో నిధులు ఆగిపోవడంతో జింబాబ్వేను ప్రపంచ కప్ అర్ఘత పోటీల నుంచి పక్కన పెట్టారు.

నాలుగేళ్ల తర్వాత, శ్రీలంక జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా ఆ దేశ ప్రభుత్వం తమ క్రికెట్ బోర్డును రద్దు చేసింది. దీంతో శ్రీలంక అండర్19 ప్రపంచ కప్‌ను నిర్వహించే హక్కు కోల్పోయింది.

తర్వాత రెండు దేశాల ఐసీసీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్, పాకిస్తాన్ మ్యాచ్,  శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

“ఫోర్స్ మజ్యూర్” పై చర్చ ఎందుకు?

భారత్- పాక్ మ్యాచ్ విషయంలో ఐసీసీ లేదా పాక్ క్రికెట్ బోర్డు నుంచి స్పష్టత లేకపోవడంతో అందరి దృష్టి ‘సభ్యుల భాగస్వామ్య ఒప్పందం’ వైపు మళ్లింది. ఈ ఒప్పందం నిబంధనల్లో ఒకటైన ఫోర్స్ మజ్యూర్‌పై చర్చ జరుగుతోంది.

ఈ నిబంధనను ఉపయోగించి పాక్ జరిమానా నుంచి తప్పించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

టీ-20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లన్నీ ‘సభ్యుల భాగస్వామ్య ఒప్పందం’‌ పై సంతకాలు చేశాయి.

ఫోర్స్ మజ్యూర్ అంటే ఒప్పందం కుదుర్చుకున్న పార్టీల నియంత్రణలో లేని, అసాధారణ పరిస్థితులు, ఊహించని ఘటనలు ఏర్పడినప్పుడు ఒప్పందాన్ని నెరవేర్చలేకపోవడం. ఇందులో అసాధారణ పరిస్థితులకింద యుద్ధం, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి పేర్కొన్నారు. టీ-20 వరల్డ్ కప్‌లో సభ్యుల భాగస్వామ్య ఒప్పందాం‌నికి సంబంధించిన కాపీ తమ వద్ద ఉందని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ఒక కథనంలో తెలిపింది.

ఇందులో పాకిస్తాన్ మ్యాచ్ బహిష్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఉండవచ్చనే దానిపై న్యాయ నిపుణులు నందన్ కామత్, అలీ రజా మాట్లాడారు.

వారి మధ్య జరిగిన సంభాషణ ప్రకారం ‘సభ్యుల భాగస్వామ్య ఒప్పందం’ లోని క్లాజ్ 12 ఐసీసీ టోర్నీల్లో అసాధారణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు ఇంకా అలాంటి అనూహ్య పరిస్థితుల పరిణామాలను వివరిస్తుంది.ప్రభుత్వ ఉత్తర్వులను ఈ నిబంధన ‘ఫోర్స్ మజ్యూర్’గా నిర్వచిస్తుంది.

భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాక్ క్రికెట్ బోర్డు తాము ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని వాదించే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషించారు.

మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకునే ఏ జట్టైనా తమ నిర్ణయాన్ని ఐసీసీకి అధికారికంగా తెలియజేయాలని ‘సభ్యుల భాగస్వామ్య ఒప్పందం’‌ చెబుతోంది.

భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూడా ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక ఉత్తర్వుల కాపీని ఐసీసీకి అందించాల్సి ఉంటుంది.

ఈ నోటీసులో, ఒప్పందంలో పేర్కొన్న బాధ్యతల్ని ఎందుకు నెరవేర్చలేక పోతున్నామో పాక్ క్రికెట్ బోర్డు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్, పాకిస్తాన్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు మైదానంలోకి దిగదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.

పాక్ ప్రభుత్వ ప్రకటన తర్వాత, 2026 టీ20 వరల్డ్ కప్ ‌చర్చ మొత్తం పాకిస్తాన్ ఆడనని చెబుతున్న మ్యాచ్ మీదకు మళ్లింది.

నిబంధనల ప్రకారం, పాకిస్తాన్ నిర్ణయం పాయింట్ల పట్టికపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

టోర్నీలో ప్రతి మ్యాచ్‌లోని పాయింట్లు సెమీ-ఫైనల్స్‌కు మార్గాన్ని నిర్ణయిస్తాయి.

పాక్ మ్యాచ్‌లు ఆడకపోతే భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అవి టీవీ ప్రసార హక్కుల ఒప్పందాలను ఎలా ప్రభావితం చేస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ వల్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. నిరుటి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ మ్యాచ్‌నను జియో హాట్‌స్టార్‌లో 60 కోట్ల మందికి పైగా చూశారు.

టీ-20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ నియమావళి ఎలా ఉందనే విషయాన్ని బీబీసీ స్పోర్ట్స్ సమీక్షించింది.

“ఒక జట్టు ఓటమిని అంగీకరించినా లేదా ఆ జట్టు మ్యాచ్ ఆడేందుకు నిరాకరించినట్లు మ్యాచ్ రిఫరీ అభిప్రాయపడినా, ఆ జట్టు ఓడిపోయినట్టుగా పరిగణిస్తారు” అని ఆట నియమావళి చెబుతోంది.

ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం “మ్యాచ్ ఆడేందుకు ఏదైనా జట్టు నిరాకరిస్తే” ఆ జట్టు, జట్టు కెప్టెన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి.

దీని వలన పాకిస్తాన్‌పై మరిన్ని ఆంక్షలకు తలుపులు తెరుచుకుంటాయి. అయితే 2024 టీ-20 ప్రపంచ కప్‌కు కూడా ఇదే నిబంధన అమలులో ఉంది. కాబట్టి తాజా సంఘటన విషయంలో ప్రత్యేక నిబంధన ఏదీ ఉండే అవకాశం లేదు.

ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఆడని జట్టు విషయంలో కోడ్ ఆఫ్ కండక్ట్ స్పష్టంగా ఉంది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం పాక్‌తో మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో వెళ్లి ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశం నిర్వహిస్తుంది.

దీని తర్వాత పాకిస్తాన్ ఆడటానికి నిరాకరిస్తే పాక్ మ్యాచ్ ఓడిపోయినట్లు పరిగణిస్తారు. భారత్ జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. దీని వల్ల రన్‌రేట్ నెగటివ్‌గా ప్రభావితమవుతుంది.

ఈ మ్యాచ్ కోసం భారత్ కూడా శ్రీలంక వెళ్లకపోతే, మ్యాచ్ రద్దైనట్లు ప్రకటిస్తారు. అప్పుడు రెండు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో రెండు పాయింట్లు చాలా కీలకమైనవి. పాక్ ఓటమి ఆ జట్టును గ్రూప్‌లో వెనక్కి నెట్టేస్తుంది.

గ్రూప్ దశలో పాకిస్తాన్ ఆడటానికి నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ జట్టు ఇప్పటికే వాటిలో ఒక మ్యాచ్, భారతదేశంతో ఆడటానికి నిరాకరించింది.

పాకిస్తాన్ తన గ్రూప్‌లో నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాతో ఆడుతుంది. ఈ టీముల మీద పాక్ గెలుపు తేలికే అని అనుకోవచ్చు. అయితే, 2024 టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ అమెరికా చేతిలో ఓడిపోయిందనే విషయం మర్చిపోకూడదు.

ఈ టోర్నీలో కూడా పాక్ మీద అమెరికా విజయం సాధిస్తే, అది పాక్‌కు పెద్ద సవాలుగా మారవచ్చు.

ఐసీసీ నియమావళి ప్రకారం మ్యాచ్ ఆడటానికి నిరాకరించే జట్టు నికర రన్ రేట్‌లో కూడా నష్టాన్ని చవిచూస్తుంది. గ్రూప్‌లో రెండు జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పుడు నికర రన్‌రేట్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.

నెట్ రన్‌రేట్ నియమావళి ప్రకారం మైదానంలోకి దిగని ఏ జట్టైనా 20 ఓవర్లలో సున్నా పరుగులు చేసినట్లు పరిగణిస్తారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్, పాకిస్తాన్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

టీ ట్వంటీ ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్

ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే టీట్వంటీ ప్రపంచ కప్ మార్చి 8 వరకు కొనసాగుతుంది. ఈ 30 రోజుల్లో ఎనిమిది వేర్వేరు వేదికలలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి.

టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య కొలంబోలో జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.

టీ-20 పురుషుల ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి

భద్రత కారణాల దృష్ట్యా, బంగ్లాదేశ్ ప్రభుత్వం తన అన్ని మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఐసీసీ అందుకు అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగింది.

బంగ్లాదేశ్ టీ-20 టోర్నీలో ఆడకపోవడం ఇదే తొలిసారి. 2007లో జరిగిన తొలి టీ ట్వంటీ ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

ఇప్పటివరకు ఏ జట్టు వరుసగా రెండుసార్లు టీ ట్వంటీ ప్రపంచ కప్‌‌ను గెలవలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS