Home జాతీయ national telgu జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎలా మరణించారు? ఆయన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏం ఉంది?

జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎలా మరణించారు? ఆయన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏం ఉంది?

16
0

SOURCE :- BBC NEWS

ఎప్‌స్టీన్, ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయశాఖ, ఆత్మహత్య, జైలు, లైంగిక నేరాలు

(హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే కంటెంట్ ఉంది)

జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణానికి సంబంధించి గతంలో బయటకు రాని ఫొటోలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది.

ఆ ఫొటోల్లో జెఫ్రీ ఎప్‌స్టీన్ మృతదేహం స్ట్రెచర్‌పై ఉండడం, వైద్యులు చికిత్స అందిస్తుండడం కనిపిస్తోంది.

మొత్తం 20 ఫోటోలున్నాయి. వీటిలో చాలా ఫోటోలు కలవరపరిచేలా ఉన్నాయి. కస్టడీలో ఎప్‌స్టీన్ మరణంపై ఎఫ్‌బీఐ నివేదిక, పోస్టుమార్టం నివేదిక, అంతర్జాతీయ జైలు డాక్యుమెంట్లను బయటపెట్టడంలో భాగంగా ఈ ఫొటోలను అమెరికా ప్రభుత్వం ప్రచురించింది.

అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన లక్షలాది డాక్యుమెంట్లలో ఇవి కొన్ని.

2019 ఆగస్ట్ 10న ఎప్‌స్టీన్‌ జైలు గదిలో చనిపోయి కనిపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఎప్‌స్టీన్, ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయశాఖ, ఆత్మహత్య, జైలు, లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, Department of Justice

ఎప్‌స్టీన్ స్ట్రెచర్‌పై ఉన్న ఫొటోలు

సెక్స్ ట్రాఫికింగ్, కుట్ర ఆరోపణలపై విచారణ కోసం ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో ఉంచారు.

”జెఫ్రీ ఎప్‌స్టీన్ డెత్ ఇన్వెస్టిగేషన్” టైటిల్‌తో ఎఫ్‌బీఐ కొత్త రిపోర్టు విడుదలయింది. న్యూయార్క్‌లోని ఏజెన్సీ ఫీల్డ్ ఆఫీస్ ఎప్‌స్టీన్ మరణంపై దర్యాప్తు చేసినట్టు కనిపిస్తోంది.

23పేజీల రిపోర్టులో ప్రతి పేజీపై ”అన్‌క్లాసిఫైడ్” అనే ముద్ర ఉంది.

ఎలాంటి మార్పులూ చేయని ఈ డాక్యుమెంట్లను బీబీసీ వెరిఫై పరిశీలించింది. ఎప్‌స్టీన్ మెడకు సంబంధించిన క్లోజ్ అప్ ఫోటోలు ఉన్నాయి. గాయం గుర్తులు కనిపిస్తున్నాయి. ఎప్‌స్టీన్ పోస్ట్‌మార్టం, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన మానసిక ఆరోగ్యంపై సైకాలజీ రిపోర్టు వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

స్ట్రెచర్‌పై ఉన్న ఎప్‌స్టీన్‌ను బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్టు చాలా ఫొటోల్లో కనిపిస్తోంది. వాటిపై 2019 ఆగస్టు 10వ తేదీ, స్థానిక సమయం ఉదయం 6:49నిమిషాలు అని ఉంది. ఇది ఎప్‌స్టీన్ తన సెల్‌లో అచేతనంగా పడిఉన్నట్టు గుర్తించిన సమయానికి దాదాపు 16నిమిషాల తర్వాత. ఫొటోల్లో లొకేషన్ స్పష్టంగా కనిపించడం లేదు. ఎప్‌స్టీన్‌ను 6 గంటల 39 నిమిషాలకు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. ఈ ఫొటోలు అక్కడే తీసినట్లు కనిపిస్తోంది.

ఎప్‌స్టీన్, ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయశాఖ, ఆత్మహత్య, జైలు, లైంగిక నేరాలు

ఎప్‌స్టీన్ మరణానికి ముందు జైలులో ఏం జరిగింది?

మరో మూడు ఫొటోలు కూడా ఆస్పత్రిలోనే తీసినట్టు కనిపిస్తోంది. ఆ ఫొటోల్లో ఆయన తల క్లోజప్‌లో కనిపిస్తోంది. మెడమీద గాయం ఉంది. ప్రతి ఫొటో మీద ఎప్‌స్టీన్ పేరు ఉంది. ఫొటోల్లో ఆయన పేరు ఇంగ్లిష్ స్పెల్లింగ్ భిన్నంగా ఉంది.

ఎప్‌స్టీన్ మృతదేహానికి సంబంధించి కొత్తగా విడుదలైన ఫొటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ విధానంలో బీబీసీ వెరిఫై పరిశీలించింది. జనవరి 30కి ముందు ఇవి ఆన్‌లైన్‌లో ఎక్కడా ప్రచరితమవలేదని తేలింది.

అమెరికా న్యాయశాఖ, న్యూయార్క్‌లోని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ సమర్పించిన 89పేజీల ఎప్‌స్టీన్ పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్‌బీఐ న్యూయార్క్ ఫీల్డ్ ఆఫీస్ ఈ మెయిల్స్ కూడా ఆ ఫైల్స్‌లో ఉన్నాయి.

ఓసీఎంఈ పోస్ట్‌మార్టమ్ రిపోర్టులోని కొన్నిభాగాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎప్‌స్టీన్ మెడలోని థైరాయిడ్ కార్టిలేజ్‌పై రెండు గాయాలకు సంబంధించిన స్కానింగ్ రిపోర్టులు ఉన్నాయి.

సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో 2019 జులై 6న ఎప్‌స్టీన్‌ను అరెస్టు చేసిన దగ్గరనుంచి ఆయన మరణం వరకు న్యూయార్క్ మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో ఎప్‌స్టీన్ డిటెన్షన్‌కు సంబంధించిన ఆరు పేజీల టైమ్‌లైన్ ఎఫ్‌బీఐ రిపోర్టులో ఉంది.

2019 జులై 23న ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఎప్‌స్టీన్‌ను సూసైడ్ వాచ్‌లో ఉంచారని ఆ రిపోర్టులో ఉంది.

సెల్‌లోని మరో ఖైదీ నికోలస్ టార్టగ్‌లివోన్ తనను చంపడానికి ప్రయత్నించారని ఎప్‌స్టీన్ ఆరోపించారు.

మాజీ పోలీసు అధికారి అయిన నికోలస్ హత్యారోపణలు ఎదుర్కొంటున్నారు.

ఎప్‌స్టీన్, ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయశాఖ, ఆత్మహత్య, జైలు, లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

‘మళ్లీ నా జీవితం నాకు కావాలి’

”నన్ను నేను చంపుకోవాలనుకోవడం లేదు”, ”నా ప్రాణాలు తీసుకోవాలనుకోవడం పిచ్చి విషయం” అని తర్వాతి రోజు సైకాలజిస్ట్‌తో జరిగిన సమావేశంలో ఎప్‌స్టీన్ చెప్పినట్టు డాక్యుమెంట్లలో ఉంది.

”ఈ కేసులో పోరాడడానికి చాలా వెచ్చించాను. నాకు జీవితం ఉంది. వెనక్కి వెళ్లి మళ్లీ నా జీవితం గడపాలనుకుంటున్నా” అని జూలై 25న ఆయన చెప్పినట్టు సైకాలజిస్ట్ రిపోర్టులో ఉంది.

ఎప్‌స్టీన్‌ను ఒంటరిగా ఉంచొద్దని, ”30 నిమిషాలకోసారి తనిఖీలు” అవసరమని, ఆకస్మిక తనిఖీలు చేస్తుండాలని జైలు వార్డెన్‌కు సూచించినట్టు అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఇతర పత్రాల్లో ఉంది.

ఎప్‌స్టీన్ మరణానికి ఒక్కరోజు ముందు ఆయన సెల్‌మేట్(సెల్‌లో ఎప్‌స్టీన్‌తో ఉండే మరో వ్యక్తి)ని విడుదల చేశారు.

ఆగస్టు 9 రాత్రి జైలు గార్డులు షెడ్యూల్ ప్రకారం మూడు గంటలకు, ఐదు గంటలకు తనిఖీలు నిర్వహించలేదని జైలు డాక్యుమెంట్లలో ఉంది. యూనిట్‌లోని కెమెరా వ్యవస్థ కూడా పనిచేయలేదు. ఉదయంపూట సిబ్బంది చేసిన తనిఖీల్లో ఎప్‌స్టీన్ మృతదేహాన్ని గుర్తించారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో భాగంగా కొన్ని భాగాలు తొలగించిన అదే ఎఫ్‌బీఐ రిపోర్టులో కేవలం 17పేజీలు ప్రచురితమయ్యాయి. అందులో సైకాలజిస్ట్ రిపోర్టు లేదు.

ఎప్‌స్టీన్ నిర్బంధానికి సంబంధించిన టైమ్‌లైన్ లేదు. ఫైల్‌లోని ఇమేజ్‌లు స్పష్టతతో లేవు. ఒకే నివేదికకు సంబంధించి రెండు వేర్వేరు వెర్షన్లను ఫైల్స్‌లో ఎందుకు చేర్చారనేదానిపై స్పష్టతలేదు.

దీనిపై స్పందించాల్సిందిగా అమెరికా న్యాయశాఖను కోరాం.

స్పందించడానికి ఎఫ్‌బీఐ నిరాకరించింది.

(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)