SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Gelsenkirchen Police
-
- రచయిత, బెథానీ బెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
15 ఫిబ్రవరి 2026, 11:34 IST
-
చదివే సమయం: 6 నిమిషాలు
జర్మనీలో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ దోపిడీని ఇటీవల కాలపు ‘అద్భుతదోపిడీ’గా వర్ణిస్తున్నారు.
క్రిస్మస్ తరువాత అంతగా సందడి లేని వారాంతంలో పశ్చిమ జర్మనీలోని గెల్సెన్‌కిర్చెన్ హై స్ట్రీట్ బ్యాంక్ గోడకు డ్రిల్లింగ్ మెషిన్‌తో రంధ్రం చేసి ఓ దొంగల ముఠా లోపలకు చొరబడి 3వేలకు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను లక్షలాది యూరోలను దోచుకుని పారిపోయింది.
ఈ దొంగతనం జరిగి నెల గడిచిన తర్వాత కూడా పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఈ దోపిడీపై బ్యాంక్ ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితకాల పొదుపు, ఖరీదైన ఆభరణాలు, విలువైన వస్తువులు పోగొట్టుకున్నామని వారిలో కొందరు చెప్పారు. దోపిడీ వార్త తెలిసి వారంతా దిగ్భ్రమకు గురయ్యారు. గందరగోళంలో ఉన్నారు.
ఈ ఘటనతో సంస్థలపై ఉన్న నమ్మకం చెదిరిపోతున్న బలమైన భావన ఏర్పడింది.

ఫొటో సోర్స్, Gelsenkirchen police
‘తెలిసినవారి పనా’?
ఈ కేసులో అనేక క్లిష్టమైన ప్రశ్నలున్నాయి. వాటిలో కొన్నింటిని పశ్చిమ రాష్ట్రం నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియా హోం మంత్రి హెర్బెర్ట్ రాయల్ వివరించారు.
ఏం జరుగుతోందో ఎవరూ ఎందుకు గుర్తించలేకపోయారు? ఇది లోపలి వ్యక్తుల పనా?
డ్రిల్ జరుగుతున్న శబ్దం ఎవరూ ఎందుకు వినలేదు? బ్యాంక్ సేఫ్ రూమ్ సరిగ్గా ఎక్కడ ఉందన్న సంగతి దొంగలకు ఎలా తెలుసు?
బ్యాంక్ భద్రతా వ్యవస్థలు చాలా బలహీనమైనవా?
సాక్షులు ముందుకు రావాలని గెల్సెన్ కిర్చెన్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దొంగలు బ్యూర్ టౌన్ నీన్‌హోఫ్‌స్ట్రాస్‌లోని స్పార్కస్సె సేవింగ్స్ బ్యాంక్‌లోకి పక్కనే ఉన్న బహుళ అంతస్థుల కార్ పార్కింగ్ ద్వారా చొరబడ్డారని దర్యాప్తు బృందం భావిస్తోంది.
కారు పార్కింగ్‌కు, బ్యాంకుకు మధ్య ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను దొంగలు తెరవగలిగారని భావిస్తున్నారు.
సాధారణంగా బయటివైపునుంచి ఆ తలుపు తెరవలేరు. అయితే ఆ తలుపును సరిగ్గా మూయకుండా ఈ గ్యాంగ్ ఏర్పాట్లు చేసుకున్నట్టుందని, దీంతో ”కార్ పార్కింగ్ నుంచి స్పార్కస్సే భవనంలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించారని” భావిస్తున్నారు.
అక్కడినుంచి దొంగలు అనేక సెక్యూరిటీ వ్యవస్థలను దాటుకుని, బ్యాంక్ బేస్‌మెంట్‌లో వాల్ట్ పక్కనే ఉన్న ఆర్కైవ్ రూమ్‌లోకి ప్రవేశించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
వాళ్లు అక్కడ డ్రిల్లింగ్‌తో గోడకు 40సెంటీమీటర్ల వెడల్పాటి రంధ్రం చేశారు. దానిగుండా స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించారు. అక్కడే సేఫ్ డిపాజిట్ బాక్సులున్నాయి.
ఫొటో సోర్స్, Reuters
‘అలారం మోగినా…’
డిసెంబరు 27, డిసెంబరు 29 మధ్య ఏదో ఒక సమయంలో ఈ దోపిడీ జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు సేఫ్ డిపాజిట్ల గదికి రావడానికి కొద్దిసేపటి ముందే దొంగలు దాదాపుగా దొరికిపోయే పరిస్థితి ఏర్పడింది.
డిసెంబరు 27 ఉదయం ఆరుగంటల తర్వాత గెల్సెన్‌కిర్చెన్ అగ్నిమాపకశాఖ, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు బ్యాంకు నుంచి ఫైర్ అలారమ్ వార్నింగ్ అందింది. ఇది దొంగలు నొక్కిఉండొచ్చు.
6 గంటల15 నిమిషాల సమయానికి పోలీసులు, 20మంది అగ్నిమాపకసిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ”కానీ అక్కడ ఎటువంటి నష్టం జరిగినట్టు కనిపించలేదు ”అని పోలీసులు తమ స్టేట్‌మెంట్‌లో తెలిపారు.
ఫైర్ అలారమ్ సేఫ్ డిపాజిట్ల గది నుంచి వచ్చిందని హెర్బెర్ట్ రాయల్ వెల్లడించారు. కానీ ఆ గది రోల్‌షట్టర్‌తో లాక్ చేసి ఉండడంతో అగ్నిమాపకసిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ”పొగ లేదు, మంటల వాసన లేదు, ఏమైనా తగలబడినట్టు కనిపించలేదు”. దీంతో అలారమ్ నుంచి తప్పుడు సంకేతం అందిందని వారు భావించారు. ఇలాంటివి అసాధారణమేమీ కాదని రాయల్ అన్నారు.
ఆ సమయంలో బ్యాంకులో సెర్చ్ చేసే అధికారం పోలీసులకు లేదని, వారికి వారెంట్ కావాల్సి ఉంటుందని, అది ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన విషయమని పార్లమెంట్ కమిటీకి ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Gelsenkirchen police
‘పెద్ద పెద్ద బ్యాగులు మోసుకెళ్లారు’
సేఫ్ డిపాజిట్ గదిలోకి చొరబడిన దొంగలు దాదాపు మొత్తం 3,250 సేఫ్ డిపాజిట్ బాక్సులను తెరిచి డబ్బులు, బంగారం, ఆభరణాలు తీసుకునున్నారు.
డిసెంబరు 27న ఉదయం 10గంటల 45 నిమిషాలకు మొదటి బాక్స్, 2 గంటల 44 నిమిషాలకు చివరి బాక్స్ పగలగొట్టినట్టు బ్యాంకులోని కంప్యూటర్ల వ్యవస్థ రికార్డు చేసింది. నాలుగు గంటల్లో వాళ్లు చాలా బాక్సులు తెరవగలిగారా లేక రికార్డింగ్ ఆగిపోయిందా అన్నదానిపై స్పష్టత లేదు.
డిసెంబరు 28 రాత్రి కార్ పార్కింగ్ మెట్ల దగ్గర చాలా మంది పెద్ద పెద్ద బ్యాగులు మోసుకెళ్లడం తాము చూశామని తర్వాత ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
దోపిడీ జరిగినది ఎంత మొత్తమన్నది తమకు కచ్చితంగా తెలియదని అధికారులు చెబుతున్నారు. 87మిలియన్ పౌండ్లు(1,075 కోట్లరూపాయలు)ఉండొచ్చని జర్మన్ మీడియా అంచనా వేస్తోంది.
కార్ పార్కింగ్ సెక్యూరిటీ కెమెరాల నుంచి ఫోటోలు, వీడియో దృశ్యాలను పోలీసులు విడుదలచేశారు. ముఖాలు కనిపించకుండా ముసుగు వేసుకున్న వ్యక్తులు, రెండు కార్లు బ్లాక్ ఆడి ఆర్ఎస్ 6, వైట్ మెర్సిడెస్ సిటాన్ ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. రెండు వాహనాలకు ఉన్న నెంబర్ ప్లేట్లు నకిలీవే.
ఫొటో సోర్స్, Gelsenkirchen Police
‘మరో అలారం మోగాకే తెలిసింది’
డిసెంబరు 29 సోమవారం 3 గంటల 58 నిమిషాలకు మరో ఫైర్ అలారమ్ మోగేంత వరకు దోపిడీ జరిగినట్టు ఎవరూ గుర్తించలేదు. బ్యాంకు దగ్గరకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ అల్లకల్లోల పరిస్థితిచూశారు.
అది చూడడానికి ఒక ”చెత్త కుప్ప”లాగా ఉందని హెర్బర్ట్ రాయుల్ చెప్పారు. వేలాది వస్తువులు నేలపై చెల్లాచెదరుగా పడిఉన్నాయి. అవన్నీ దొంగలు వదిలసేసిన సేఫ్ డిపాజిట్ ఖాళీ బాక్సులు.
దొంగలు నీళ్లు, రసాయనాలు పోయడంతో వాటిలో చాలా వరకు పాడైపోయాయని పోలీసులు చెప్పారు. అప్పటినుంచి పోలీసులు ఎంతో కష్టపడి ఆ వస్తువులను జాగ్రత్తగా విడదీసి ఆధారాల కోసం వెతుకుతున్నారు. ఆ బాక్సులు ఎవరివో గుర్తించేందుకు శ్రమిస్తున్నారు.
దోపిడీ వివరాలు బయటికొచ్చిన తర్వాత దాదాపు 200మంది ఖాతాదారులు స్పార్కస్సే దగ్గరకు వచ్చి తమను లోపలకి అనుమతించాలని డిమాండ్ చేశారు. అనేక పెట్రోలింగ్ కార్లతో అక్కడకు వచ్చిన పోలీసులు ప్రవేశద్వారం వద్ద భద్రత ఏర్పాటుచేశారు.
తాను కోల్పోయింది లక్షలరూపాయల విలువైన బంగారం మాత్రమే కాదని, తన తండ్రి, తాతలకు చెందిన ఆభరణాలు పోగొట్టుకున్నానని 63 ఏళ్ల జొయాచిమ్ అల్ఫ్రెడ్ వాగ్నర్ చెప్పారు.
తన అపార్ట్‌మెంట్‌లో అనేక దొంగతనాలు జరిగిన తర్వాత తన విలువైన వస్తువులు భద్రంగా ఉంటాయనే ఉద్దేశంతో సేఫ్ డిపాజిట్ బాక్స్ తీసుకున్నానని ఆయన చెప్పారు. ”బాధ, కోపం తట్టుకోలేక ఏడుపు వచ్చేసింది ” అని ఆయన చెప్పారు.
మరొక ఖాతాదారు తమ ఫ్లాట్ అమ్మకంతో వచ్చిన దాదాపు నాలుగున్నరకోట్ల రూపాయలను రిటైర్‌మెంట్ తర్వాత వాడుకునేందుకు దాచుకున్నారు.
ఒక్కో సెక్యూరిటీ బాక్సుకు సాధారణంగా 11లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని బ్యాంక్ చెప్పింది.
బ్యాంకుకు వ్యతిరేకంగా కేసు పెట్టిన వ్యక్తుల్లో వాగ్నర్ మొదటివారు. భద్రతాలోపానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన దావా వేశారు.
ఫొటో సోర్స్, Gelsenkirchen police
‘బాధితుల మానసిక స్థితిని అంచనావేయలేం’
నేరంలో తామూ బాధితులమేనని బ్యాంక్ చెప్పింది. ”అధునాతన సాంకేతిక వ్యవస్థలతో భద్రత కల్పించామని”తెలిపింది.
సేఫ్ డిపాజిట్ బాక్సుల్లోని తమ వస్తువులకు కొందరి దగ్గర రసీదులున్నాయి. మరికొందరి దగ్గర లేవు.
బాక్సుల్లో ఏముందో స్పార్కస్కేకు కూడా తెలియదని, ఎవరికేంకావాలంటే అది బాక్సుల్లో పెట్టుకోవచ్చని హెర్బర్ట్ రాయుల్ చెప్పారు.
‘‘క్లయింట్ల మానసిక స్థితిపై కలిగే ప్రభావాన్ని అంచనావేయలేమని ఆయన అన్నారు.
బాధితులకు మనం సాయం చేయాల్సిన అవసరముంది”అని ఆయన చెప్పారు. చాలా మందికి ఇది తమ ఆస్తులు పోగొట్టుకోవడం మాత్రమే కాదని, భద్రత విషయంలో తమకున్న సామర్థ్యంపై కూడా ప్రభావం పడుతుందని, సమాజంపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.
నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద నేరంపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ చీఫ్ టిమ్ ఫ్రొమ్మేయర్ చెప్పారు.
”ఈ కేసు తీవ్రతపై నా విభాగానికి, ఉద్యోగులందరికీ అవగాహన ఉంది. ఆర్థికనష్టం, అనిశ్చితి, నిస్పృహ చాలా ఎక్కువగా వ్యాపించి ఉన్నాయి” అని ఆయన చెప్పారు.
దోపిడీ విషయం బయటకు వచ్చిన కాసేపటికే ఫార్ రైట్ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ)బ్యాంకు బయట ర్యాలీ నిర్వహించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని కొందరు ఆరోపించారు.
దోపిడీ రాజకీయ అంశంగా మారిందని జర్మన్ మ్యాగజైన్ డెర్ స్పైగల్ చెప్పింది. ‘‘హామీలన్నీ డొల్ల అని,, వ్యవస్థల పతనం, అంతిమంగా ఎవరినీ జవాబుదారిగా చేయరనే భావన పెరిగిందని’’ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



