Home జాతీయ national telgu చదువు విషయంలో గొడవ, తండ్రిని రైఫిల్‌తో కాల్చిచంపి ముక్కలు చేసి డ్రమ్ములో దాచినట్లు కొడుకుపై ఆరోపణలు

చదువు విషయంలో గొడవ, తండ్రిని రైఫిల్‌తో కాల్చిచంపి ముక్కలు చేసి డ్రమ్ములో దాచినట్లు కొడుకుపై ఆరోపణలు

9
0

SOURCE :- BBC NEWS

లఖ్‌నవూ

ఫొటో సోర్స్, Sarfuddin/BBC

(గమనిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు)

లఖ్‌నవూలో ఫిబ్రవరి 20 నుంచి కనిపించకుండా పోయిన ఒక వ్యాపారి మొండెం, ఆయన ఇంట్లోని ఒక డ్రమ్ములో లభించింది.

ఆయన మృతదేహాన్ని అనేక ముక్కలుగా చేసి, కొన్ని శరీర భాగాలను నగరంలోని మరో ప్రాంతంలో పారేసినట్లు పోలీసులు గుర్తించారు.

మృతుని పేరు మానవేంద్ర ప్రతాప్ సింగ్. వయస్సు 49 ఏళ్లు. లఖ్‌నవూలోని జాలౌన్ అనే సంపన్న ప్రాంతానికి చెందినవారు. ఆయన లఖ్‌నవూలో వ్యాపారం చేసేవారు.

ఈ హత్య కేసులో ఆయన కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అక్షత్ ప్రతాప్ సింగ్ నేరాన్ని అంగీకరించారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ విక్రాంత్ వీర్ తెలిపారు.

‘ఫిబ్రవరి 20న తనకూ, తన తండ్రికి మధ్య వివాదం జరిగిందని ప్రాథమిక విచారణలో అక్షత్ తెలిపారు. ఆ తర్వాత తండ్రిని కాల్చి చంపానని చెప్పారు’ అని విక్రాంత్ వీర్ వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

‘నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నాం. విచారణతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

మానవేంద్ర సింగ్‌కు చెందిన లైసెన్స్‌డ్ రైఫిల్‌తోనే అక్షత్ తన తండ్రిని చంపినట్లు ఆరోపణలు వచ్చాయి

ఫొటో సోర్స్, Sarfuddin/BBC

‘కాల్చి చంపి, మృతదేహాన్ని ముక్కలు చేశాడు’

ఆషియానా ఏరియాలో మానవేంద్రకు మూడంతస్తుల ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఆయన హత్య జరిగింది. ఇది లఖ్‌నవూ విమానాశ్రయానికి దగ్గరలో ఉంటుంది.

నిందితుడు తన తండ్రికి చెందిన లైసెన్స్‌డ్ రైఫిల్‌తోనే ఈ హత్య చేశారని, తర్వాత ఆ రైఫిల్‌ను తాము స్వాధీనం చేసుకున్నామని ఆషియానా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఛత్రపాల్ సింగ్ తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మానవేంద్ర ప్రతాప్ సింగ్‌కు అతని కుమారుడు అక్షత్ మధ్య చదువు విషయంలో వివాదం నడుస్తోంది. అక్షత్ ప్రస్తుతం బీకామ్ చదువుతున్నాడు.

‘మానవేంద్ర సింగ్ తన కుమారుడిని నీట్ (మెడికల్) పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని, మెడికల్ రంగంలో కెరీర్ ఎంచుకోవాలని ఒత్తిడి చేసేవారని తెలిసింది. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి’ అని విక్రాంత్ వీర్ చెప్పారు.

‘శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆ సమయంలో అక్షత్ తన తండ్రిని రైఫిల్‌తో కాల్చి చంపాడు. తర్వాత మృతదేహాన్ని మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు తీసుకువచ్చాడు. ఒక ఖాళీ గదిలోకి తీసుకెళ్లి శవాన్ని ముక్కలు చేశాడు’ అని ఆషియానా పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో నిందితుడు ప్యాక్ చేశారు. కొన్ని భాగాలను సద్రౌనా ప్రాంతంలో పారేశాడు. మిగిలిన భాగాలను ఇంట్లోనే ఒక నీలం రంగు డ్రమ్ములో దాచిపెట్టాడు.

మృతదేహానికి సంబంధించిన అన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నామని బీబీసీకి ఎస్‌హెచ్‌వో ఛత్రపాల్ సింగ్ తెలిపారు.

నిందితుడు లఖ్‌నవూలోని ఒక స్కూలులో 12వ తరగతి వరకు చదివారు. ప్రస్తుతం బీకామ్ చదువుతున్నారు.

మానవేంద్ర ప్రతాప్ సింగ్, లఖ్‌నవూలో వ్యాపారం చేసేవారు

ఫొటో సోర్స్, Sarfuddin/BBC

అదృశ్యం నుంచి హత్య వరకు

తన తండ్రి మానవేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించడం లేదని ఫిబ్రవరి 20న ఆషియానా పోలీస్ స్టేషన్‌లో అక్షత్ ఫిర్యాదు చేశారని డీసీపీ విక్రాంత్ వీర్ తెలిపారు.

‘ఆ తర్వాత పోలీసులు ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో, నిందితుడి ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందడంతో, ఫిబ్రవరి 23న పోలీసులు అక్కడికి చేరుకుని వారి ఇంటిని తనిఖీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక గదిలో ఉన్న డ్రమ్ములో మృతదేహం బయటపడింది.

మానవేంద్ర సింగ్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు అక్షత్‌తో పాటు ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమె స్థానిక పాఠశాలలో చదువుతున్నారు’ అని ఆయన వెల్లడించారు.

అక్షత్ ఇంతకుముందు నీట్ కోచింగ్ తీసుకున్నాడని, రెండుసార్లు పరీక్ష రాసినా ఉత్తీర్ణుడు కాలేకపోయాడని మృతుడి బంధువుల్లో ఒకరు చెప్పారు. వారు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

‘ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉండటం, కుటుంబ ఒత్తిడి, కోపం, సుదీర్ఘకాలంపాటు ఒత్తిడికి లోనుకావడం వంటివి కొన్నిసార్లు హింసాత్మక ప్రవర్తనకు దారి తీయవచ్చు’ అని లఖ్‌నవూలోని యూనిటీ కాలేజీలో సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ షమ్సీ అక్బర్ పేర్కొన్నారు.

‘‘చదువు విషయంలో ఒత్తిడి లేదా బలవంతం చేయడం అనేది ఒక ‘ట్రిగ్గర్’లా పనిచేయొచ్చు. అయితే ఇలాంటి దారుణానికి పాల్పడటం అనేది కేవలం మానసిక అనారోగ్యం వల్లే జరిగిందని చెప్పలేం. దీని వెనుక కారణాలపై క్లినికల్ సైకాలజిస్టుల సమగ్ర విశ్లేషణ తర్వాతే ఒక నిర్ధారణకు రాగలం’ అని షమ్సీ అక్బర్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)