Home జాతీయ national telgu గోల్కొండ బ్లూ డైమండ్: వేలంలో రూ.400 కోట్లు పలుకుతుందని అంచనా, ఏమిటి దీని ప్రత్యేకత?

గోల్కొండ బ్లూ డైమండ్: వేలంలో రూ.400 కోట్లు పలుకుతుందని అంచనా, ఏమిటి దీని ప్రత్యేకత?

5
0

SOURCE :- BBC NEWS

గోల్కొండ బ్లూ డైమండ్

ఫొటో సోర్స్, Christie’s

ఇందౌర్‌ హోల్కర్లు, బరోడా గైక్వాడ్‌లు అనే రెండు మరాఠీ రాజవంశాల వారు ఒకప్పుడు సేకరించిన అరుదైన ‘బ్లూ డైమండ్’ త్వరలో వేలానికి రానుంది. ఈ వజ్రాన్ని ‘ది గోల్కొండ బ్లూ’ అని కూడా పిలుస్తారు.

వేలానికి రానున్న ప్రపంచంలోని అతిపెద్ద లేత నీలం వజ్రం ఇదేనని ఈ ఆక్షన్‌ను నిర్వహించే ‘క్రిస్టీస్’ అనే సంస్థ ప్రకటించింది.

ఈ వజ్రం 23.24 క్యారెట్ల బరువు తో పియర్ ఆకారంలో ఉంటుంది.

మే 14న జెనీవాలో ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు. దీనికి దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 425 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది.

నీలి రంగు వజ్రాలు చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన వజ్రాలలో 0.02 శాతం మాత్రమే నీలం రంగులో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. లేత నీలం రంగు వజ్రాలు ఇంకా అరుదు. చాలా నీలి వజ్రాలు 10 క్యారెట్ల కంటే తక్కువ బరువు ఉంటాయి. కానీ, ‘గోల్కొండ బ్లూ’ వాటి కంటే చాలా పెద్దది.

“ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాలలో ఒకటి. ఈ వజ్రం బరువు, సైజులను దాదాపు 100 సంవత్సరాల నుంచి మార్చలేదు” అని క్రిస్టీస్‌లోని రత్నాల విభాగం అంతర్జాతీయ హెడ్ రాహుల్ కడాకియా బీబీసీతో చెప్పారు.

ఏదైనా వజ్రానికి దాని పరిమాణం, బరువు, స్పష్టత ద్వారా ధర నిర్ణయిస్తారు. అయితే, వజ్రం వెనుక ఉన్న కథ, దాని చరిత్ర కూడా చాలామందిని కొనేలా చేస్తుంది.

‘గోల్కొండ బ్లూ’ డైమండ్ కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
గైక్వాడ్లు, హోల్కర్లు

ఫొటో సోర్స్, Holkar Cultural Centre

రాచరికపు వారసత్వం

“ఇలాంటి రత్నం మా దగ్గరికి వచ్చినపుడు, మా నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆభరణాల వ్యాపారులను సంప్రదిస్తుంటారు. వారి రికార్డులలో ఇలాంటి వజ్రం గురించి ఏదైనా సమాచారం ఉందా? అని అడుగుతుంటారు” అని రాహుల్ చెప్పారు.

ఇటువంటి పరిశోధనల ద్వారానే ‘గోల్కొండ బ్లూ’ డైమండ్ కథ వెలుగులోకి వచ్చింది. ఇందౌర్ చివరి మహారాజు యశ్వంత్ రావ్ హోల్కర్ II తో ఈ కథ ప్రారంభమవుతుంది.

యశ్వంత్ రావ్ భార్య సంయోగితబాయి దేవి. ఆమె కాగల్‌ ప్రాంతానికి చెందిన రాజశ్రీ దత్తాజీరావ్ ఘాట్గే కుమార్తె. ఆయన కొల్హాపూర్‌కు చెందిన ఛత్రపతి షాహు మహారాజ్ బంధువు కూడా. షాహు చొరవతోనే యశ్వంత్ రావ్, సంయోగితలకు వివాహమైంది. ఆ రోజుల్లో అది కులాంతర వివాహం.

యశ్వంత్ రావ్, సంయోగిత చాలాకాలం విదేశాలలో నివసించారు. ఆధునిక పాశ్చాత్య కళను వారు ఇష్టపడేవారు. 1923లో పారిస్‌లో యశ్వంత్ రావ్ అభ్యర్థన మేరకు ఆభరణాల వ్యాపారి చౌమెట్ ఒక కంకణాన్ని తయారు చేశారు. ఆ కంకణానికి నీలిరంగు వజ్రం అమర్చారు. ఈ వజ్రం యశ్వంత్ రావ్ కలెక్షన్‌లోనిది. అది గోల్కొండ గనిలో దొరికినట్లు రికార్డుల్లో ఉంది.

గోల్కొండ వజ్రం

ఫొటో సోర్స్, Christie’s

పది సంవత్సరాల తరువాత, మరొక ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి మౌబౌసిన్ ద్వారా సంయోగిత దేవికి ఒక హారాన్ని తయారు చేయించారు యశ్వంత్ రావ్. ఈ హారాన్ని గోల్కొండ బ్లూ వజ్రంతో పాటు పెద్ద పచ్చతో అమర్చారు. ఇందౌర్ ముత్యాలు అని పిలిచే రెండు పెద్ద తెల్ల వజ్రాలు కూడా ఇందులో పొదిగారు.

సంయోగిత దేవి చిత్రాన్ని ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌట్ డి మోన్వెల్ గీశారు, అందులో ఆమె ఈ వజ్ర హారాన్ని ధరించినట్లు కనిపిస్తుంది.

ఆ తరువాత, యశ్వంత్ రావ్ హోల్కర్ ఈ నీలి వజ్రాన్ని 1947 జనవరిలో ప్రసిద్ధ అమెరికన్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్‌స్టన్‌కు విక్రయించారు. విన్‌స్టన్‌ దానిని అదే సంవత్సరం జూన్‌లో బరోడా మహారాజుకు అమ్మేశారు.

భారతదేశం స్వాతంత్య్రం పొంది, రాచరిక రాజ్యాలు క్రమంగా విలీనం అవుతున్న సమయమది.

కొంతకాలం తర్వాత, హ్యారీ విన్‌స్టన్‌ మళ్లీ ఆ నీలిరంగు వజ్రాన్ని కొనుగోలు చేశారు. అనంతరం, దానిని ప్రస్తుత యజమానులకు విక్రయించారు. ఈ వజ్రాన్ని జేఏఆర్ ఆభరణాల వ్యాపారులు తయారుచేసిన ఒక ఉంగరంలో అమర్చారు.

సంయోగిత దేవి

ఫొటో సోర్స్, Holkar Cultural Centre

నీలి వజ్రాలకు ఎందుకంత డిమాండ్?

నీలి వజ్రాలు అనేక కారణాల వల్ల ఇతర తెల్లని లేదా పారదర్శక వజ్రాల కంటే భిన్నంగా ఉంటాయి. అవి భూమిలో చాలా లోతులో దొరుకుతాయి. బోరాన్ వంటి రసాయనాలు ఈ వజ్రాలకు నీలి రంగును ఇస్తాయి. ఈ వజ్రాలు ఉండే లోతుకు వెళ్లడం కష్టం. అందుకే, ఇవి అరుదైనవి. ఈ వజ్రాలకు రసాయనాలు, ఇతర ధాతువులు అంటుకుంటాయి. అందుకే, ఈ వజ్రాలు లభిస్తే వాటిని అధ్యయనం చేసి, భూ అంతర్భాగం గురించి కీలక సమాచారం కూడా సేకరిస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ గనుల్లో నీలి వజ్రాలు దొరుకుతాయి. వాటిలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లూరు గనిలో, గోదావరి, కృష్ణానది లోయల మధ్య గుర్తించారు.

ఈ ప్రాంతం ఒకప్పుడు గోల్కొండ రాజుల పాలనలో ఉండేది. అక్కడి గనులలో లభించిన వజ్రాల అమ్మకాలు కొనుగోళ్లు గోల్కొండ కేంద్రంగానే జరిగేవి. అందుకే వీటిని గోల్కొండ వజ్రాలు అని పిలుస్తారు.

కొల్లూరు గనులను ప్రపంచంలోని పురాతన వజ్రాల గనులలో ఒకటిగా పరిగణిస్తారు. కోహినూర్, డ్రెస్డెన్ గ్రీన్, హోప్ డైమండ్ వంటి రత్నాలు ఈ గనులలోనే కనుగొన్నారు.

గోల్కొండ బ్లూ డైమండ్

ఫొటో సోర్స్, Christie’s

“ప్రపంచంలోనే తెలుపు, ఆకుపచ్చ, గులాబీ, నీలం వంటి వివిధ రంగుల వజ్రాలు దొరికిన ఏకైక ప్రదేశం గోల్కొండ. అక్కడి నుంచి వచ్చిన వజ్రాలు ఎప్పుడూ మంచి ధర పలుకుతాయి” అని రాహుల్ కడాకియా చెప్పారు.

‘గోల్కొండ బ్లూ’ ప్రపంచ ప్రఖ్యాత ‘హోప్ డైమండ్’ లో సగం బరువు ఉంటుంది. కానీ హోప్ డైమండ్ ముదురు నీలం రంగులో ఉంటుంది. గోల్కొండ బ్లూ లేతగా, ఆకాశం రంగులో ఉంటుంది.

నీలి వజ్రాలు ప్రకృతిలో చాలా అరుదు. 20 క్యారెట్లకు పైగా బరువున్న నీలి వజ్రాలు ఇంకా అరుదుగా లభిస్తాయి. అందుకే, ఈ వజ్రాలకు అధిక డిమాండ్ ఉంది.

గోల్కొండ బ్లూతో సమానమైన రంగు కలిగిన 14.62 క్యారెట్ల బరువున్న ఓపెన్‌ హైమర్ బ్లూ వజ్రం 2016లోనే 50 మిలియన్ డాలర్లకు (అప్పుడు రూ. 380 కోట్లు) అమ్ముడైంది.

2022లో డీ బీర్స్‌కు చెందిన కల్లినన్ బ్లూ డైమండ్ అంతకంటే ఎక్కువ ధర (57 మిలియన్ డాలర్లు) పలికింది.

23 క్యారెట్లకు పైగా ఉన్న ఈ గోల్కొండ బ్లూ డైమండ్ భారీ ధరను పొందే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)