Home జాతీయ national telgu కేరళ స్టోరీ 2: మత ప్రాతిపదికన ఓట్ల పోలరైజేషన్‌కు బాట వేస్తుందా?

కేరళ స్టోరీ 2: మత ప్రాతిపదికన ఓట్ల పోలరైజేషన్‌కు బాట వేస్తుందా?

6
0

SOURCE :- BBC NEWS

కేరళ స్టోరీ 2, బీజేపీ, హిందూత్వ రాజకీయాలు

ఫొటో సోర్స్, facebook.com/SunshinePicturesOfficial

కేరళ హైకోర్టులో న్యాయ పోరాటం తర్వాత కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేరళ స్టోరీ2 : గోస్ బియాండ్ సినిమా విడుదలైంది.

అయితే ఈ సినిమా రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆశించినంత ఊతం ఇవ్వకపోవచ్చు.

కాకపోతే రాష్ట్రంలో రానున్న రోజుల్లో సామాజిక, రాజకీయ మతపరమైన పునరేకీకరణకు ఇది బాటలు వేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

సినిమా టైటిల్‌లో కేరళ పేరు ఉపయోగించడంపై హైకోర్టులో కేసు దాఖలైంది. సినిమా ప్రదర్శనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను 24 గంటల్లోనే డివిజన్ బెంచ్ ఎత్తేసి పిక్చర్ రిలీజ్‌కు మార్గం సుగమం చేసింది.

2023 మేలో వచ్చిన ‘కేరళ స్టోరీ’కి సీక్వెల్ ఇది. కేరళ స్టోరీ సినిమా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అకస్మాత్తుగా ఎదురైన న్యాయపరమైన అడ్డంకులతో ఈ సినిమా సామాజిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

“ప్రజలంతా సామరస్యంగా నివసిస్తున్న రాష్ట్రం” అనే వాస్తవాన్ని సవాలు చేస్తూ సామాజిక సంబంధాలు ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందన్న మాట వినిపించింది.

“సమాజంలోని వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి భవిష్యత్‌లో హిందూత్వకు అనుకూలమైన భూమిగా మార్చే ప్రయత్నం ఇది. వాస్తవాల మీద ఆధారపడి తీసింది కాదు” అని రాజకీయ విశ్లేషకుడు సన్నీ కుట్టీ అబ్రహం బీబీసీతో అన్నారు.

“కేరళలో పార్టీ నిర్మాణానికి నెమ్మదిగా ఇటుక మీద ఇటుక పేర్చే ప్రక్రియను ఎంచుకున్నారు” అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జె. ప్రభాశ్ చెప్పారు.

కేరళ స్టోరీ 2, బీజేపీ, హిందూత్వ రాజకీయాలు

ఫొటో సోర్స్, facebook.com/SunshinePicturesOfficial

“కేరళీయుల్ని రాక్షసులుగా చిత్రీకరిస్తున్నారు”

కేరళ స్టోరీ పార్ట్ వన్‌లో మాదిరిగానే సీక్వెల్‌లోనూ ముస్లిం పురుషులు హిందూ, క్రిస్టియన్ మహిళలను ఎలా ఆకర్షిస్తారో, వారికి మాయ మాటలు చెప్పి ఎలా మోసం చేస్తారో, చివరకు ఆ మహిళలను తమ మత ఆచారాలకు లొంగిపోయేలా ఎలా బలవంతం చేస్తారో చూపించారు.

సినిమా ట్రైలర్ చూసిన వారికి ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఈ సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.

“ఈ ప్రమాదకరమైన ప్రచారాన్ని కొనసాగించడం ద్వారా వాళ్లు మలయాళీలను ‘మైనారిటీలు’గా మారుస్తున్నారు. ఈ ప్రచారం కేరళీయుల్ని రాక్షసులుగా చిత్రీకరిస్తుంది. వాళ్లు దీని పునరావృతం చేయడం ద్వారా కొంతకాలం తర్వాత సహజంగానే అబద్దాలు నిజాలుగా మారతాయి. కేరళలో వృద్ధుల సంఖ్య ఎక్కువ. శక్తివంతమైన కులాల జనాభా తగ్గుతోంది. కాబట్టి మహిళలు రక్షించుకోవలసిన వనరుగా మారారు” అని తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ప్రొఫెసర్ జె. దేవిక బీబీసీతో చెప్పారు.

“నేటితరం యువతను తీసుకుంటే, వారిలో క్రమశిక్షణ లేదని, జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే విషయంలో వారు తల్లిదండ్రుల మాటల్ని తిరస్కరిస్తారనే భయం ఉంది. పునరేకీకరణకు ఇదేమార్గం చూపిస్తోంది. ఇందుకు తప్పును ముస్లింల మీదకు నెట్టేస్తున్నారు. దేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగానే హిందూత్వ నిర్మాణంలో హిందూ మహిళల్ని భాగస్వాముల్ని చేసేందుకు ముస్లింలను బూచిగా చూపిస్తున్నారు” అని ఆమె అన్నారు.

కేరళ స్టోరీ 2, బీజేపీ, హిందూత్వ రాజకీయాలు

ఫొటో సోర్స్, facebook.com/SunshinePicturesOfficial

మత మార్పిడుల లెక్కలేం చెబుతున్నాయి?

అయితే ట్రైలర్‌లో చూపించినవన్నీ అవాస్తవాలని, ఒక వ్యక్తి ఒక మతం నుంచి మరో మతంలోకి మారినప్పుడు ప్రభుత్వం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్లు చెబుతున్నాయి.

వాస్తవానికి 2020-2024 మధ్య విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ల అధ్యయనం ఆధారంగా వచ్చిన నివేదికలు సినిమాలో చూపించినవన్నీ అబద్దమని రుజువు చేస్తున్నాయి.

2020లో ఇతర మతాల కంటే ఎక్కువగా హిందూ మతంలోకి మారారు. మొత్తం 506 మంది మత మార్పిడి కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 241 మంది క్రిస్టియానిటీ లేదా ఇస్లాం మతాల నుంచి హిందూయిజంలోకి మారారు

506 మందిలో ఇస్లాంలోకి మారినవారు 144 మంది అయితే క్రిస్టియానిటీ స్వీకరించినవారు 119 మంది.

ఇస్లాం లేదా క్రిస్టియానిటీ నుంచి హిందూత్వంలోకి మారిన వారిలో ఎక్కువ మంది మహిళలేనని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.

2024లో 365 మంది కేరళవాసులు హిందూయిజంలోకి మారారని ఆ ఏడాది విడుదలైన గెజిట్ నోటిఫికేషన్స్‌ మీద అధ్యయనంలో వెల్లడైందని ది న్యూస్ మినిట్ కథనం వెల్లడించింది.

ఇందులో 262 మంది దళిత క్రిస్టియన్లు, ముస్లింలు ఉన్నారు. వారిలో అనేక మందికి షెడ్యూల్ కుల హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

గెజిట్ నోటిఫికేషన్లను ప్రస్తావిస్తూ రాసిన ఈ కథనం ప్రకారం 154 మంది హిందూ మహిళలు, 122 మంది హిందూ పురుషులు (మొత్తం 276 మంది) ముస్లిం మతంలోకి మారారు.

42 మంది మహిళలు, 25 మంది పురుషులు క్రిస్టియానిటీ నుంచి ఇస్లాంలోకి మారారు.

క్రిస్టియానిటీ నుంచి హిందూయిజంలోకి 180 మంది మహిళలు,149 మంది పురుషులు మారగా 24 మంది ముస్లిం పురుషులు 12 మంది ముస్లిం పురుషులు హిందూయిజంలోకి మారారని న్యూస్ మినిట్ కథనం తెలిపింది.

ఈ కథనం ప్రకారం హిందూయిజం నుంచి క్రైస్తవంలోకి 130 మంది మహిళలు, 104 మంది పురుషులు, ఇస్లాం నుంచి క్రైస్తవంలోకి 13 మంది మహిళలు, 8 మంది పురుషులు మారారు.

కేరళ స్టోరీ 2, బీజేపీ, హిందూత్వ రాజకీయాలు

ఫొటో సోర్స్, facebook.com/SunshinePicturesOfficial

రాజకీయ పరిణామాలు

హిందువులు లేదా క్రిస్టియన్ మహిళల్ని ముస్లిం యువకులు పెళ్లి చేసుకున్న సంఘటనలు కొన్ని ఉన్నాయని, వాటిని కాదనలేమని అబ్రహం చెప్పారు. వీరిలో కొంతమంది దేశం విడిచి వెళ్లి ఉగ్రవాద సంస్థల్లో చేరారు.

“అయితే ఇక్కడ ఏ సమస్యా లేదు. ఇది కేరళ స్టోరీ కాదు. కేరళలో తమ బలాన్ని పెంచుకునేందుకు హిందూత్వ శక్తులు విద్వేషాలను సృష్టిస్తున్నాయి” అని ఆయన చెప్పారు.

“ఇలాంటి స్టోరీలు వస్తూనే ఉంటాయి. అవి సమాజంలో పోలరైజేషన్‌కు దారితీసి బీజేపీ స్థిరపడటానికి కారణమవుతాయి. రాష్ట్రంలో బీజేపీ శక్తి పరిమితంగా ఉంది కాబట్టి ఇప్పటికైతే వీటి వల్ల రాజకీయంగా పెద్ద ప్రభావం ఏమీ ఉండదు. బీజేపీకి క్రైస్తవుల మద్దతు అనేది పరిస్థితులను బట్టి మారుతుంది” అని ప్రొఫెసర్ ప్రభాశ్ తెలిపారు

అయితే ఆయన ఇటీవలి పరిణామాల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ డెమోక్రటిక్ ప్రభుత్వానికి శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అధ్యక్షుడు వెల్లపల్లి నటేశన్ మద్దతును సీపీఎం అంగీకరించింది. ఇటీవల ఆయన ముస్లింలను సీపీఎంకు దూరం చేసే వ్యాఖ్యలు చేశారు.

“అంతిమంగా ఇదంతా బీజేపీకి ఉపయోగపడుతుంది. హిందూ సమాజానికి, అందులోనూ ప్రధానంగా ఎళవ (కల్లుగీత వర్గం) కులస్తులకు సీపీఎం ప్రాతినిధ్యం వహిస్తుందని అందరికీ తెలుసు. తమకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీల్లో బీ టీమ్‌కు ఓటేయడం ఎందుకు, ఏ టీమ్‌ అయిన బీజేపీకి ఓటేస్తే చాలని వాళ్లు త్వరలోనే గ్రహిస్తారు” అని ప్రొఫెసర్ ప్రభాశ్ చెప్పారు.

“ఇక తర్వాత చెప్పాలంటే చర్చ్ నాయకులు. వీళ్లు తమ అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ప్రధానమంత్రిని కలిశారు. వీటన్నింటినీ కలిపి చూస్తే, ఇది ఈసారి జరిగే ఎన్నికల్లో కాకున్నా ఆ తర్వాత జరిగే ఎన్నికల్లోనైనా బీజేపీకి లాభిస్తుంది” అని ప్రొఫెసర్ ప్రభాశ్ అభిప్రాయపడ్డారు.

కేరళ స్టోరీ 2, బీజేపీ, హిందూత్వ రాజకీయాలు

ఫొటో సోర్స్, facebook.com/SunshinePicturesOfficial

సినిమాపై ఆసక్తి లేదన్న కేరళ బీజేపీ అధ్యక్షుడు

సినిమా విషయంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తప్ప మిగిలిన పార్టీల నేతల స్పందన ఊహించినట్లే ఉంది.

‘‘కేరళలో మత సామరస్యం, సామాజిక నిర్మాణాన్ని దెబ్బ తీసేలా ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో మొత్తం రాష్ట్ర ప్రజలను అవమానించడం, ప్రజలను విడదీసే ప్రయత్నాలు చేయడం లాంటివి ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదు” అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

“దేశ ప్రజలను విడదీసే చర్యలను గట్టిగా వ్యతిరేకించాలి. ఈ సినిమాలో చూపించినవన్నీ నిజాలు కాదు. ఇవి సమాజానికి హాని చేస్తాయి. ఈ చిత్రం అన్ని హద్దుల్ని దాటేసింది. దేశాన్ని విడదీసేందుకు బీజేపీ ఈ చిత్రానికి నిధులు అందించింది” అని కాంగ్రెస్ నాయకుడు, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడి సతీశన్ అన్నారు.

కేరళ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అనూహ్యమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సినిమా చూసే ఉద్దేశం తనకు లేదన్నారాయన.

“ఆ సినిమా చూడాలన్న ఆసక్తి నాకు లేదు. సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అందులో ఏదైనా చట్ట వ్యతిరేకమని అనిపిస్తే చర్యలు తీసుకోవచ్చు” అని ఆయన అన్నారు.

కేరళ స్టోరీ 2 పెట్టుబడులకు సంబంధించిన విమర్శల గురించి చంద్రశేఖర్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన స్పందించగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)