Home జాతీయ national telgu ‘ఒకరి వీర్యం ఆర్డర్ చేస్తే మరొకరి వీర్యం ఇచ్చారు’ అంటూ ఐవీఎఫ్ కేంద్రాలపై కొందరు మహిళల...

‘ఒకరి వీర్యం ఆర్డర్ చేస్తే మరొకరి వీర్యం ఇచ్చారు’ అంటూ ఐవీఎఫ్ కేంద్రాలపై కొందరు మహిళల ఆరోపణలు, ఏం జరిగింది?

13
0

SOURCE :- BBC NEWS

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Keith Bridle / BBC

“జేమ్స్ పుట్టిన కొద్ది రోజులకే ఏదో తేడా ఉందని నాకు అర్థమైంది” అని లారా చెప్పారు.

లారా, ఆమె భాగస్వామి బెత్‌లకు ఇద్దరు పిల్లలు – జేమ్స్, పెద్దమ్మాయి కేట్. వీరిద్దరూ తుర్కియే ఆక్రమిత ఉత్తర సైప్రస్‌లోని ఒక క్లినిక్‌లో ఐవీఎఫ్ చికిత్స ద్వారా జన్మించారు.

ఈ ఇద్దరు మహిళలు తమ అండాలకు, ఒక అజ్ఞాత, ఆరోగ్యవంతుడైన వీర్యదాతను ఎంచుకున్నారు. తమ ఇద్దరు పిల్లలు బయోలాజికల్‌గా తోబుట్టువులుగా ఉండాలని, అందుకే ఇద్దరికీ ఒకే దాత వీర్యాన్ని ఉపయోగించాలని వారు క్లినిక్‌కు స్పష్టంగా చెప్పారు. దానికి తగ్గట్టుగానే క్లినిక్ వీర్యాన్ని ఆర్డర్ చేసింది.

కానీ, జేమ్స్ పుట్టినప్పుడు, అతని కళ్లు తల్లి బెత్, అలాగే వారు కోరుకున్న వీర్యదాత కళ్ల కంటే భిన్నంగా ఉండటాన్ని దంపతులు గమనించారు.

“క్లినిక్ ఏమైనా తప్పు చేసిందా?” అన్న అనుమానం వారి మనసులో మొదలైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

దాదాపు పదేళ్ల తర్వాత, బెత్, లారాలు తమ పిల్లలకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. ఆ ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. పిల్లలిద్దరూ తాము ఎంచుకున్న వీర్యదాతకు పుట్టలేదని తేలింది. ఆ ఇద్దరు పిల్లలు ఒకరికొకరు బయోలాజికల్‌గా సంబంధమే లేనివారని, అంటే వేర్వేరు దాతల వీర్యం ద్వారా పుట్టారని తెలిసింది.

“ఏదో పెద్ద తప్పు జరిగిందని తెలిసినప్పుడు కలిగిన ఆ భయం మాటల్లో చెప్పలేనిది. ఇది మా పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన కలిగింది” అని బెత్ అన్నారు.

ఐవీఎఫ్ చికిత్స సమయంలో తప్పుడు వీర్యం లేదా అండదాతలను ఉపయోగించారని నమ్ముతున్న ఏడుగురు పిల్లల కుటుంబాలతో బీబీసీ న్యూస్ మాట్లాడింది. ఈ కుటుంబాలు చేసిన డీఎన్ఏ పరీక్షలు వారి అనుమానాలను నిజం చేశాయి.

ఈ కేసులన్నీ నార్త్ సైప్రస్‌లోని క్లినిక్‌లతో ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ చట్టాలు వర్తించవు. దీనిని కేవలం తుర్కియే మాత్రమే అధికారికంగా గుర్తించింది.

బ్రిటీష్ ప్రజలు సంతానలేమి చికిత్స కోసం విదేశాలకు వెళ్లే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతాలలో నార్త్ సైప్రస్ ఒకటి. ఇక్కడి క్లినిక్‌లపై నియంత్రణ తక్కువగా ఉంటుంది. తక్కువ ధరలు, అధిక సక్సెస్ రేటును అవి వాగ్దానం చేస్తుంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజ్ఞాత అండ, వీర్యదాతల ఆప్షన్లను ఈ క్లినిక్‌లు అందిస్తాయి. ఇది ఎల్‌జీబీటీ కమ్యూనిటీ లేదా ఒంటరి వ్యక్తులకు బాగా ఆకర్షిస్తుంటుంది.

ఉత్తర సైప్రస్ క్లినిక్‌లు బ్రిటన్‌లో చట్టవిరుద్ధమైన ‘సెక్స్ సెలక్షన్’ (వైద్య కారణాలు లేకుండానే శిశువు లింగాన్ని ఎంచుకోవడం) వంటి పద్ధతులను కూడా ఆఫర్ చేస్తాయి.

ఆ ప్రాంతానికి చెందిన ఆరోగ్య శాఖ అక్కడి సంతానోత్పత్తి క్లినిక్‌లను పర్యవేక్షిస్తుంది. ఎన్నిసార్లు అభ్యర్థించినప్పటికీ ఈ అంశాలపై వారు స్పందించలేదు.

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Family supplied

‘డెన్మార్క్ నుంచి వీర్యం ఆర్డర్ చేశామనుకున్నాం’

ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని బెత్, లారాలు 2011లో నిర్ణయించుకున్నారు. దీనికోసం వారు ఉత్తర సైప్రస్‌లోని ‘డొగుస్ ఐవీఎఫ్ సెంటర్’‌ను ఎంచుకున్నారు.

అప్పట్లో అక్కడ పేషెంట్ కోఆర్డినేటర్‌గా ఉన్న జూలీ హాడ్సన్, ప్రపంచంలోనే అతిపెద్ద స్పెర్మ్ బ్యాంక్‌గా పేరున్న డెన్మార్క్‌లోని ‘క్రియోస్ ఇంటర్నేషనల్’ నుంచి వీర్యాన్ని తెప్పిస్తామని చెప్పారు.

బెత్ దంపతులు “ఫిన్” అనే దాత ప్రొఫైల్‌కు ఆకర్షితులయ్యారు. ఆయన తనను తాను ఆరోగ్యవంతుడిగా, ధూమపానానికి దూరంగా ఉండే వ్యక్తిగా అభివర్ణించుకున్నారు.

“ఇతరులకు లైఫ్, ఆనందాన్ని ఇవ్వడమే నా లక్ష్యం” అని ఫిన్ తన నోట్‌లో రాశారు. తమ పిల్లలకు దాత ఎవరనే స్పష్టత ఉండాలని బెత్ దంపతులు భావించారు. కళ్లు, జుట్టు వంటి ఫిన్ శారీరక లక్షణాలు కూడా బెత్, లారాల కుటుంబాలకు దగ్గరగా ఉన్నాయి.

“ఫిన్ వీర్యాన్ని ఆర్డర్ చేయడానికి మేం ఏం చేయాలి అని మా పేషెంట్ కోఆర్డినేటర్ జూలీని అడిగాం. దానికి ఆమె ‘డాక్టర్ ఫిర్దేవ్స్ మీ కోసం ఆర్డర్ చేస్తారు’ అని చెప్పారు. అంతే, అంతటితో ఆ విషయం ముగిసింది ” అని లారా గుర్తు చేసుకున్నారు.

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

డొగుస్ క్లినిక్‌లో తమకు ఐవీఎఫ్ చికిత్సను డాక్టర్ ఫిర్దేవ్స్ ఉగుజ్ టిప్ చేశారని లారా దంపతులు చెప్పారు.

తొమ్మిది నెలల తర్వాత లారాకు ‘కేట్’ జన్మించింది. రెండో బిడ్డ కోసం వారు మళ్లీ అదే క్లినిక్‌కు వెళ్లి, మళ్లీ ‘ఫిన్’ వీర్యాన్నే ఉపయోగించాలని కోరారు. దీంతో, ఫిర్దేవ్స్ ఆ వీర్యాన్ని మళ్లీ ఆర్డర్ చేస్తారని హాడ్సన్ ఈమెయిల్ ద్వారా ధ్రువీకరించారు.

ఈసారి బెత్‌కు ‘జేమ్స్’ జన్మించాడు. హోటళ్లు, విమాన ప్రయాణాలు, మందులు కలిపి వీరికి దాదాపు 16,000 పౌండ్స్ (సుమారు రూ.19.87 లక్షలు) ఖర్చయ్యింది. కేవలం వీర్యం కోసమే 2,000 పౌండ్స్ (సుమారు రూ.2.5 లక్షలు) చెల్లించారు.

కానీ, జేమ్స్ ముదురు రంగు కళ్లు, చర్మం వారిలో అనుమానాన్ని రేకెత్తించాయి. కొన్నేళ్ల తర్జనభర్జన తర్వాత చేసిన డీఎన్ఏ పరీక్షలో పిల్లలిద్దరూ ఫిన్‌కు పుట్టలేదని, ఒకరికొకరు తోబుట్టువులు కాదని తేలడంతో ఆ దంపతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

“ఫిన్‌కు సంబంధించిన ప్రొఫైల్, ఆరోగ్యం గురించి మాకు తెలుసు. కానీ, ఇప్పుడంతా శూన్యమైపోయింది” అని బెత్ ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ ఫిర్దేవ్స్‌, హాడ్సన్‌ను సంప్రదించడానికి బెత్, లారాలు ప్రయత్నించారు. కానీ, ఎటువంటి స్పందన రాలేదు.

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

డాక్టర్ల వాదన ఏంటి? క్లినిక్‌లు ఏమంటున్నాయి?

బెత్, లారాల విషయంలో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి బీబీసీ నెలల తరబడి ప్రయత్నించింది. బీబీసీ దర్యాప్తులో ఇదే విధమైన అనుభవం ఎదురైన మరో రెండు బ్రిటీష్ కుటుంబాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ రెండు కుటుంబాలు కూడా కమర్షియల్ డీఎన్ఏ పరీక్షలు చేయించుకోగా, వారి అనుమానాలు నిజమేనని తేలింది. క్లినిక్ అసలు ‘ఫిన్’ వీర్యాన్ని ఆర్డర్ చేసిందా, లేదా అని బెత్, లారా ప్రశ్నిస్తున్నారు.

డాక్టర్ ఫిర్దేవ్స్‌ను బీబీసీ సంప్రదించినప్పుడు, డొగుస్ క్లినిక్‌లో వీర్యం ఆర్డర్ చేసే బాధ్యత తనది కాదని ఆమె చెప్పారు.

దాత ఫిన్ కోసం వచ్చిన అభ్యర్థన సమాచారం ఏదీ తనకు అందలేదని తెలిపారు. అంతేకాకుండా, బెత్, లారాలు చేయించుకున్న కమర్షియల్ డీఎన్ఏ పరీక్షల విశ్వసనీయతపై కూడా ఫిర్దేవ్స్‌ అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు దాతను ఉపయోగించారని “కచ్చితంగా” నిర్ధరించడం సాధ్యం కాదని ఆమె అంటున్నారు.

బెత్, లారాలు కస్టమర్లుగా ఉన్న 2011 నుంచి 2014 మధ్య కాలంలో తాను “ఐవీఎఫ్ చికిత్సలు చేయలేదని” డాక్టర్ ఫిర్దేవ్స్ బీబీసీకి చెప్పారు.

అయితే, అదే సమయంలో ఫిర్దేవ్స్ అందించిన చికిత్సల గురించి డొగుస్ క్లినిక్ వెబ్‌సైట్‌లో వివరణాత్మక సమాచారం ఉంది. బెత్, లారాల చికిత్సకు బాధ్యత వహించిన డొగుస్ క్లినిక్‌ను బీబీసీ సంప్రదించగా వారు స్పందించలేదు.

2015 నాటికి, ఫిర్దేవ్స్, హాడ్సన్ డొగుస్ క్లినిక్ నుంచి బయటికి వచ్చి, ఉత్తర సైప్రస్‌లోని మరో క్లినిక్‌లో కలిసి పని చేయడం ప్రారంభించారు.

వీర్యం ఆర్డర్స్‌ను ఫిర్దేవ్స్‌కు అందించారా లేదా అని హాడ్సన్‌ను బీబీసీ ప్రశ్నించగా, ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

’45 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేదు’

అయితే, బ్రిటీష్ కోర్టులు గుర్తించే అధికారిక డీఎన్ఏ పరీక్షలు కూడా కేట్, జేమ్స్‌లకు బయోలాజికల్‌గా సంబంధం లేదని ధ్రువీకరించాయి.

బెత్ కుటుంబానికి సంబంధించిన పరీక్షలను విశ్లేషించిన ఒక ప్రముఖ ఫోరెన్సిక్ జన్యుశాస్త్ర నిపుణుడు, ఆ ఇద్దరు పిల్లలలో ఎవరికీ దాత ఫిన్‌తో బయోలాజికల్ బంధం ఉండే అవకాశం లేదని మాకు చెప్పారు.

ఈ నేపథ్యంలో, డెన్మార్క్‌లోని స్పెర్మ్ బ్యాంక్ క్రయోస్ ఇంటర్నేషనల్‌ను ఈ విషయమై సంప్రదించాం.

“మాకు అనేక భద్రతా ప్రక్రియలున్నాయి కానీ, అది 100 శాతం హామీ ఇవ్వదు. అది మానవ తప్పిదం” అని కంపెనీ సీఈఓ ఓలే షౌ అన్నారు.

అయితే, క్రయోస్ 45 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు.

ఇలాంటి తప్పులు ఒకటి కంటే ఎక్కువసార్లు జరగడం ‘నిర్లక్ష్యం’ లేదా ‘మోసం’ కిందకే వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

“రోగులకు ఇలాంటి పరిస్థితి తలెత్తడం దారుణమైన విషయం” అని బ్రిటీష్ ఫెర్టిలిటీ సొసైటీకి చెందిన డాక్టర్ ఇప్పోక్రాటిస్ సారిస్ ఈ రిపోర్టులను చూసిన తర్వాత అన్నారు.

“బ్రిటన్‌లో ఇలాంటి సంఘటన జరిగినట్లు ఎప్పుడూ వినలేదు. అండం, వీర్యం లేదా పిండాన్ని మార్చడం అనేది ఏ ఐవీఎఫ్ యూనిట్‌కైనా అతిపెద్ద విషయం” అన్నారు.

ఉత్తర సైప్రస్‌లో క్లినిక్‌లను పర్యవేక్షించే స్వతంత్ర నియంత్రణ సంస్థ లేదు. చట్టాలను గౌరవించడం అనేది క్లినిక్ యజమానుల విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుందని స్థానిక న్యాయవాది, సామాజిక కార్యకర్త మైన్ అట్లీ అన్నారు.

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

‘నా బిడ్డతో అబద్ధం చెప్పాలనుకోవట్లేదు’

2019లో మిరాకిల్ ఐవీఎఫ్ సెంటర్లో ఫిర్దేవ్స్ ద్వారా చికిత్స పొందిన మరో రెండు కుటుంబాలు కూడా ఇదే ఫిర్యాదు చేశాయి.

వీరికి అండదాతల విషయంలో మోసం జరిగింది. తాము ఎంచుకున్న దాతలవి కాకుండా వేరే అండాలను ఉపయోగించారని వారు ఆరోపిస్తున్నారు.

“నా బిడ్డ ఎవరి నుంచి వచ్చారనే విషయంలో వారికి అబద్ధం చెప్పడం నాకిష్టం లేదు” అని కేథరిన్(పేరు మార్చాం) అనే బాధితురాలు పేర్కొన్నారు.

డాక్టర్ ఫిర్దేవ్స్ మాత్రం దాతల విషయంలో ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేమని, రోగులు సంతకం చేసిన ఫారమ్‌లలోనే ఇది ఉందని వాదిస్తున్నారు.

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

ఈ రెండు కుటుంబాలు తాము మోసపోయామని భావిస్తున్నట్లు ఫిర్దేవ్స్‌కు బీబీసీ చెప్పినప్పుడు, ఎగ్ డోనర్స్ ఎంపికను కేవలం ‘మిరాకిల్ ఐవీఎఫ్ సెంటర్’ మాత్రమే నిర్ణయిస్తుందని ఆమె అన్నారు.

మిరాకిల్ ఐవీఎఫ్‌లో తాను చేసిన చికిత్సలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని, రోగుల గోప్యత కారణంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేనని ఫిర్దేవ్స్ పేర్కొన్నారు.

లారా, బెత్ దంపతులు, ఉత్తర సెప్రస్ క్లినిక్, ఐవీఎఫ్

‘మేం ఇప్పటికీ ఒకే కుటుంబం’

పిల్లలకు లారా, బెత్ ఈ నిజాన్ని చెప్పి రెండేళ్లవుతోంది. అయితే, తన మూలాల గురించి తెలిసిన జేమ్స్ ఇంకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

“గుర్తింపు అనేది చాలా ముఖ్యం. అది మీరు ఎవరనేది నిర్ణయిస్తుంది” అని జేమ్స్ అంటున్నారు.

పిల్లలిద్దరికీ ఒకరికొకరు రక్త సంబంధం లేదని తెలిసినా, వారి మధ్య ఉన్న ప్రేమ మాత్రం మారలేదు.

“మేమంతా కలిసి పెరిగాం, మా తల్లులు మమ్మల్ని పెంచారు. రక్తం పంచుకోకపోయినా మేం ఇప్పటికీ ఒకే కుటుంబం” అని కేట్ అన్నారు.

“మాకు ఇద్దరు అద్భుతమైన పిల్లలు ఉన్నారు. చివరికి అంతా మంచే జరుగుతుంది” అని బెత్, లారా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)