SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, ANI
ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ కనిపిస్తోంది.
ముఖ్యంగా, గ్యాస్ సిలిండర్ల కొరత రూపంలో ఈ ప్రభావం రెండు రాష్ట్రాలపై తీవ్రంగా కనిపించడం ప్రారంభమైంది.
హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల వారిపై ఈ ప్రభావం ముందుగా పడింది.
హోటల్ వారు తమ మెనూలో పదార్థాల సంఖ్య తగ్గించడం, హాస్టళ్ల వారు కూడా వడ్డించే పదార్థాలు తగ్గించడం, మరో రెండు రోజుల్లో కొన్ని హోటళ్లు మూతపడతాయన్న వార్తలు కూడా వస్తున్నాయి.

సాధారణంగా, ప్రజలు ఎక్కువగా ఉపయోగించే గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు రెండు రకాలు. ఒకటి డొమెస్టిక్. అంటే, ఇంటి అవసరాల కోసం వాడేది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వ హాస్టళ్ల వంటి వాటికి కూడా డొమెస్టిక్ కేటగిరీ కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. ఇవి ఎర్ర రంగు సిలిండర్లు.
ఇక కమర్షియల్ కనెక్షన్లకు నీలం రంగు సిలిండర్లు ఇస్తారు. హోటెల్స్, హాస్టల్స్, ఇతరత్రా రకరకాల వాణిజ్య అవసరాల కోసం వీటిని వాడతారు.
ప్రస్తుతం ఇంటి అవసరాల కోసం, అంటే డొమెస్టిక్ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే జరుగుతోంది. కానీ, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఆ ప్రభావం వాణిజ్యపరంగా పడింది.
”సోమవారం సాయంత్రం నుంచి మాకు సరఫరా ఆగిపోయింది. డీలర్లు కూడా ఫోన్లు ఎత్తడం లేదు. మాకు కనీసం మేం వాడే దానిలో సగం సిలిండర్లైనా ఇవ్వమని అడుగుతున్నాం. మాకు కాస్త ముందు నుంచీ చెప్పి ఉంటే, మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. ఇవాళ అప్పటికప్పుడు ఇడ్లీ మేకర్ తెచ్చుకున్నాం.
మిగతా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకునేలోపు ప్రభుత్వం కూడా మాకు కొంత గ్యాస్ సరఫరా చేస్తే బావుంటుంది” అని బీబీసీతో చెప్పారు తెలంగాణ హెటల్స్ అండ్ రెస్టారెంట్స్ సంఘం కార్యదర్శి సి.వేణుగోపాల్.
ఫొటో సోర్స్, Getty Images
హోటళ్లలో మొదలైన కొరత
ముఖ్యంగా, లాడ్జింగ్ కలిపి ఉండే హోటళ్ల వారికి ఇంకా పెద్ద సమస్యగా ఉంది. కేవలం రెస్టారెంట్ అయితే మూసేయవచ్చు. కానీ, అప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముందుగా కమిట్ అయిన ప్రకారం కూడా ఆహారం అందించలేని పరిస్థితులు తలెత్తాయని వారు చెబుతున్నారు.
”ముందే ఫుడ్‌కి కమిట్మెంట్ ఇచ్చి ఉంటాం. కానీ, ఇప్పుడు అందించలేని పరిస్థితి” అన్నారు వేణుగోపాల్.
చాలా వరకూ గ్యాస్ ఎక్కువ ఖర్చయ్యే పదార్థాలను వండడం లేదు వ్యాపారులు. ఇడ్లీ వంటివి పెంచి దోశ, పూరీ వంటివి తగ్గిస్తున్నట్టు ఆయన చెప్పారు.
”ప్రభుత్వం కనీసం వారం ముందు చెప్పి ఉంటే, ఇలా మేం గ్యాస్ అందించడం ఆపేస్తామని, మా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేం చేసుకునే వాళ్లం” అన్నారు వేణుగోపాల్. లక్షలాదిగా హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల వారందరికీ దీనివల్ల ఇబ్బందేనని ఆయన గుర్తు చేస్తున్నారు.
దాదాపు ఇదే పరిస్థితి హాస్టళ్ల వారూ ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో, ఇతర అనేక పట్టణాల్లో వేలాది హాస్టళ్లు ఉన్నాయి. ఆయా హాస్టల్ సామర్థ్యాన్ని బట్టి రోజుకు అర సిలిండర్ నుంచి రెండు మూడు సిలిండర్ల వరకూ వాడే హాస్టళ్లు కూడా ఉన్నాయి.
ఫొటో సోర్స్, TS IT Corridor Hostels Association
‘రెసిడెన్షియల్ హోదా కల్పించాలి’
ఈ క్రమంలో ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ పేరిట వచ్చిన నోట్ ఒకటి వైరల్ అయింది.
అందులో హాస్టళ్ల యాజమాన్యాలకు సూచనలున్నాయి. ఆ నోట్ ప్రకారం.. కాఫీ, టీలు నిలిపివేస్తారు. చపాతి, దోశ, పూరీ వంటి గ్యాస్ ఎక్కువ అయ్యే పదార్థాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. పరిస్థితిని బట్టి కొన్ని కూరలు, అదనపు ఆహార పదార్థాలు నిలిపివేస్తారు. రైస్, బేసిక్ మీల్స్ సరఫరా చేస్తారు. సొంతంగా వంట చేసుకునే సౌకర్యం నిలిపివేస్తారు.
”మంగళవారం మధ్యాహ్నం నుంచి మాకు సిలిండర్ల సరఫరా ఆగిపోయింది. డీలర్లు కూడా స్పందించడం లేదు. చిన్న హాస్టళ్లు శుక్రవారం వరకూ, పెద్ద హాస్టళ్లు గురువారం వరకే గ్యాస్ తో నడపగలరు. ప్రస్తుతానికి ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. అయితే, హాస్టళ్లను ఖాళీ చేయించే ప్రసక్తే లేదు. కరోనా సమయంలోనే మేం నడిపాం.
ఇప్పుడు ప్రస్తుతానికి వీలైనంత మందిమి ఒకచోట చేరి, కమ్యూనిటీ కిచెన్ తరహాలో చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే, హాస్టళ్లన్నీ నగరంలో రద్దీ, ఇరుకైన ప్రదేశాల్లో ఉంటాయి. ఖాళీ స్థలం ఉండదు. అక్కడ కట్టెలు, బొగ్గులతో వంట చేయలేం. కాబట్టి, ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకుని కొందరు హాస్టళ్ల వాళ్లు కలపి ఉమ్మడిగా వంట చేయించి సరఫరా చేసుకుంటే, హాస్టళ్లలో ఉండేవారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది” అని బీబీసీతో చెప్పారు ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ట్రెజరర్ మహీధర్.
తక్కువ గ్యాస్‌తో, త్వరగా ఉడికే పదార్థాలు వడ్డించాలని హాస్టళ్ల వారికి గైడ్లైన్స్ ఇచ్చామన్నారు సంఘం ట్రెజరర్ మహీధర్. ”మేం చెప్పేది ఒకటే, హాస్టళ్లలో పిల్లలున్న తల్లితండ్రులెవరూ కంగారుపడొద్దు. ఏం చేసైనా వారికి భోజనం అందిస్తాం” అన్నారు మహీధర్.
తమను కూడా రెసిడెన్షియల్‌గా గుర్తించి కనీసం రోజుకు ఒక సిలిండర్ అయినా ఇవ్వాలని హాస్టళ్ల సంఘం కోరుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
చిరువ్యాపారులను సైతం తాకిన సమస్య
హాస్టళ్లు, హోటళ్ల కంటే భిన్నమైనది చిరు వ్యాపారుల పరిస్థితి. రోడ్లపక్కన చిన్నచిన్న బండ్లు, షెడ్లలో ఆహార పదార్థాలు అమ్మే వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.
వారి సమస్య అర్థం కావాలంటే, ముందుగా ఒక విషయం గమనించాలి. నిబంధనల ప్రకారం వ్యాపార సంస్థగా కమర్షియల్ కనెక్షన్ తీసుకుని సిలిండర్లు వాడే వారు చాలా తక్కువగా ఉంటారు.
ఎక్కువ మంది అనధికారిక మార్గాల్లో ఈ కమర్షియల్ సిలిండర్ కొనడం లేదా డొమెస్టిక్ సిలిండర్లను అధిక ధరకు కొంటుంటారు. సరిగ్గా ఇదే అదనుగా ఆ ధరలు పెంచేశారనీ, అయినా కూడా దొరకడం లేదనీ చిరువ్యాపారులు చెబుతున్నారు.
హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్డుపక్కన భోజనం విక్రయించే షాలోమ్ రాజు బీబీసీతో మాట్లాడారు. ఆయన, ఆయన పక్క దుకాణం వారు చెప్పిన ప్రకారం, బుధవారం ఉదయం ఒక గ్యాస్ సిలెండర్ కోసం 2,300 వరకూ అడిగారనీ, కానీ అది కూడా కచ్చితంగా ఇస్తామని చెప్పలేదనీ అన్నారు.
”సాయంత్రానికి ధర 3 వేల నుంచి 5 వేల వరకూ పెంచారు” కానీ సిలిండర్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదంటున్నారు.”
“బుధవారం వరకూ ఏదో జాగ్రత్తగా నెట్టుకొచ్చాం, కానీ గురువారం నుంచి గ్యాస్ దొరక్కపోతే వ్యాపారం మూయాల్సిందే. నగరంలో ఇరుకుప్రదేశాల్లో కట్టెలు, బొగ్గులతో వంట చేయలేం. ఇంత పెద్ద వంట కరెంటు పొయ్యిల మీద వండలేం. సిటీలో ఇవన్నీ సాధ్యపడవు. అసలు ఈ షాపులకే కరెంటు కనెక్షన్ ఉండదు, కరెంటుకు ఓనర్ ఒప్పుకోరు. గ్యాస్ దొరికితేనే షాపు పెట్టాలి. లేదంటే లేదు” అని బీబీసీతో చెప్పారు షాలోమ్ రాజు.
ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థపై భారం
ఈ మూడు రంగాలపైనా ప్రభావం ఎక్కువైతే, అది పరోక్షంగా ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. హోటళ్లలో ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదురైతే.. వ్యాపార, టూరిస్ట్, ఇతరత్రా పనుల కోసం వచ్చే వారు ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. మెనూ తగ్గితో బయట భోజనాలకు వెళ్లే వారూ, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేవారూ తగ్గుతారు. హోటల్ పరిశ్రమపై ఆధారపడిన డెలివరీ సిబ్బందిపై ప్రభావం ఉంటుంది. హాస్టళ్లలో అసౌకర్యం పెరిగితే వర్క్ ఫోర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఆసక్తి చూపుతారు.. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలివి.
మొత్తంగా చూస్తే, కమర్షియల్ రంగంలో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది.
డొమెస్టిక్ వినియోగానికి మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నాయి గ్యాస్ ఏజెన్సీలు. ప్రభుత్వానిది కూడా అదే మాట.
”మాకు వారం క్రితమే కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆపేశారు. మా దగ్గర ఉన్న స్టాక్ మేరకు పంపిణీ చేసేశాం. ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్లు మా దగ్గర సరిపడా స్టాక్ ఉంది. ఏ లోటూ లేదు. కమర్షియల్ మాత్రం కంపెనీ వారే ఇవ్వడం లేదు. వారం రోజుల నుంచి రాలేదు, మళ్లీ ఎప్పుడు వస్తాయో చెప్పలేం. కాబట్టి ఇంటి వినియోగానికి గ్యాస్ వాడాలనుకునే వారు ఏ రకంగానూ కంగారు పడక్కర్లేదు” అని మాధాపూర్ దగ్గరలోని వెంకటసాయి గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ఎం భాస్కర్ బీబీసీతో చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
‘తగినంత గ్యాస్ నిల్వలున్నాయి, కంగారు పడొద్దు’
అయితే, కమర్షియల్ తరహాలోనే డొమెస్టిక్ సిలిండర్ సరఫరా కూడా ఆపేస్తారేమో, లేదంటే ఇప్పటికే ఆపేశారేమోనన్న భయంతో కొందరు అదనపు సిలిండర్ల కోసం వస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇంటి కనెక్షన్ వినియోగదారులు నిశ్చింతగా ఉండొచ్చన్నది ఏజెన్సీల మాట.
ఇంటి వినియోగదారులు తొందరపడి ఎక్కువ సిలిండర్లు బ్లాక్ చేయకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఒకసారి సిలెండర్ బుక్ చేసిన తరువాత 25 రోజుల వరకూ మళ్లీ గ్యాస్ బుక్ చేసుకోవడం కుదరదు. ”సాధారణంగా ఒక డొమెస్టిక్ కనెక్షన్ వారు ఏడాదికి గరిష్టంగా 15 సిలిండర్లు తీసుకోవచ్చు. ఈ కొత్త రూల్ 25 రోజుల నిబంధన వలన సగటున నెలకు ఒక సిలిండర్ తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ కుటుంబాలకు అది సరిపోతుంది” అన్నారు భాస్కర్.
గ్యాస్ కనెక్షన్ దుర్వినియోగం కాకుండా ఈ ఏర్పాటు సహకరిస్తుందని ఏజెన్సీలు చెబుతున్నాయి. అలాగే, డెలివరీ సమయంలో కోడ్ ఉంటేనే సిలిండర్ ఇస్తారని వారు చెబుతున్నారు.
దీనిపై అటు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు శాఖ దాదాపుగా ప్రతిరోజూ పరిస్థితిని మీడియా ద్వారా సమాచారం అందిస్తోంది.
”గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయి. కంగారు పడవద్దంటూ” కంపెనీలు, డొమెస్టిక్ కస్టమర్లకు మెసేజీలు పంపుతున్నాయి.
”రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా నిఘా బృందాలు ఏర్పాటు చేస్తున్నాం” అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇదే అంశాన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చించిన చంద్రబాబు, లోటు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
కేంద్రం ఏం చెప్పింది?
చమురు శుద్ధి కర్మాగారాలు తమ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, ఆ అదనపు ఉత్పత్తిని పూర్తిగా గృహ వినియోగ అవసరాల కోసమే కేటాయించాలని ఆదేశించినట్లు కేంద్ర పెట్రోయం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
”గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా అందించేందుకు మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతనిస్తోంది. గ్యాస్ సిలిండర్ల నిల్వ, బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి, వరుసగా బుక్ చేసే రెండు సిలిండర్ల మధ్య 25 రోజుల విరామ సమయాన్ని ప్రవేశపెట్టాం.
ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర వాణిజ్యేతర విభాగాలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరాను సమీక్షించడానికి చమురు సంస్థల ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ రంగాల నుంచి వచ్చే విన్నపాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది” అని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎక్స్ ద్వారా ప్రకటించింది.
ఈ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాతనే ఎవరికి కమర్షియల్ సిలిండర్లు అందుతాయి, ఎవరికి లభించవు అనే స్పష్టత రానుంది.
అప్పటి వరకూ హోటళ్లు, హాస్టళ్లు వంటి సంస్థలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇంటి వినియోగదారులకు ఇబ్బంది లేదు. ఇక వివిధ దేవాలయాలు, ఇతరత్రా సంస్థలు తమకు కూడా నిరంతర సరఫరా కావాలని గ్యాస్ కంపెనీలకు ప్రతిపాదనలు చేస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



