SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
14 నిమిషాలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో బడ్జెట్‌పై ప్రసంగిస్తూ భారత్-అమెరికా ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.
అమెరికాకు మోదీ పూర్తిగా లొంగిపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు.
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్, అనిల్ అంబానీ, అదానీకి సంబంధించిన విషయాలను ఆయన ప్రస్తావించారు.
అనిల్ అంబానీ, కేంద్ర మంత్రి హర్దీప్ పురీలపైనా పలు ఆరోపణలు చేశారు.
దీంతో లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాదోపవాదనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
”ఎప్‌స్టీన్‌తో తన సమావేశం కేవలం కొన్ని సందర్భాల్లో, అది కూడా ఒక ప్రతినిధి బృందంలో భాగంగా మాత్రమే జరిగిందని, ఆయనతో కేవలం ఒకే ఒక్క ఈమెయిల్ మార్పిడి జరిగింది” అని హర్దీప్ పురీ వెల్లడించారు.
మరోవైపు, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు దీనిపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ ప్రసంగంలోని తప్పుడు అంశాలను ప్రొసీడింగ్స్ నుంచి తొలగిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలు
రాహుల్ గాంధీ ప్రసంగించడానికి ముందు, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ‘ప్రచురితంకాని పుస్తకం’ గురించి ప్రస్తావించిన తర్వాత తమ నాయకుడు మాట్లడటానికి అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేసింది.
జనరల్ నరవణే పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’లోని కొన్ని విషయాలను రాహుల్ గాంధీ గత వారం లోక్‌సభలో తన ప్రసంగం సందర్భంగా ఉటంకించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ తర్వాత రాజకీయ దుమారం రేగింది.
ప్రచురితంకాని అంశాలను సభలో ప్రస్తావించవద్దని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనడంతో.. వాటిపై తమ నాయకుడికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదంటూ ప్రతిపక్షం ఆరోపించింది.
ఈ వివాదం ముదరడంతో, ఓం బిర్లాను తొలగించడానికి తాము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు ప్రతిపక్ష నాయకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో బుధవారం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు, బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించారు.
ప్రధాని మోదీ అమెరికా ముందు పూర్తిగా లొంగిపోయారని విమర్శించారు.
అలాగే, ఎప్‌స్టీన్ ఫైల్ గురించి కూడా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలున్న అమెరికా ఇన్వెస్టర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు అనిల్ అంబానీని పరిచయం చేసింది కేంద్ర మంత్రి హర్దీప్ పురీయేనని ఆరోపించారు.
”అనిల్ అంబానీ అనే ఒక వ్యాపారవేత్త ఉన్నారు. ఆయన ఇంకా జైలుకు ఎందుకు వెళ్లలేదో ప్రశ్నించాలనుకుంటున్నాను. ఎందుకంటే, ఆయన పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉంది. ఆయన్ను ఎప్‌స్టీన్‌కు పరిచయం చేసిన హర్దీప్ పురీని కూడా అడగాలనుకుంటున్నాను. ఆయనను ఎవరు పరిచయం చేశారో నాకు తెలుసు, అలాగే ఎవరి ద్వారా పరిచయం జరిగిందో హర్దీప్ పురీకి కూడా తెలుసు” అని రాహుల్ గాంధీ అన్నారు.
ఫొటో సోర్స్, ANI
హర్దీప్ పురీ ఏమంటున్నారు?
పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపించిన నేపథ్యంలో, హర్దీప్ పురీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
”ఈ రోజు ప్రొసీడింగ్స్ సందర్భంగా రాహుల్ గాంధీ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావనలో నా పేరు తీసుకొచ్చారు” అని చెప్పారు.
”ఎప్‌స్టీన్‌కు సంబంధించి 30 లక్షల ఫైళ్లు విడుదలయ్యాయి. నేను న్యూయార్క్‌లో ఎనిమిదేళ్ల పాటు ఉన్నాను. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా అక్కడికి వెళ్లాను. 2017లో మంత్రి అయ్యాను. ఆ ఎనిమిదేళ్లలో బహుశా మూడు లేదా నాలుగు సమావేశాలకు సంబంధించిన ప్రస్తావన మాత్రమే ఉంది” అని ఆయన వివరించారు.
”గత ఏడాది నవంబర్‌లో ఒక కార్యక్రమం సందర్భంగా రాహుల్ గాంధీ నా దగ్గరకు వచ్చి, ‘కొన్ని పేర్లు ఆసక్తికరమైన చోట కనిపించాయి’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు అసలు విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. వారికొక నోట్ పంపిస్తానని చెప్పాను’ అని హర్దీప్ పురీ వెల్లడించారు.
”అమెరికాలో భారత రాయబారి పదవి నుంచి రిటైర్ అయిన కొన్ని నెలల తర్వాత, నన్ను ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్ (ఐపీఐ) ఆహ్వానించింది. నేను ఐసీఎంలో సెక్రటరీ జనరల్‌గా పనిచేశాను. దీనికి అధ్యక్షుడిగా ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ఉండేవారు. ఐసీఎం అనేది ఐపీఐ తాలూకా ప్రాజెక్ట్. ఐపీఐలో నా బాస్ టెరీ రోడ్ లార్సన్ ఆ అపఖ్యాతి పాలైన ఎప్‌స్టీన్‌కు తెలుసు. ఐపీఐ, ఐసీఎం ప్రతినిధి బృందంలో భాగంగా కొన్ని సందర్భాల్లో ఎప్‌స్టీన్‌ను కలిశాను. గరిష్టంగా మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే. అంతర్జాతీయ వ్యవహారాలను ఐపీఐ, ఐసీఎం చూసేవి, వాటిలో ఎప్‌స్టీన్ భాగం కాదు” అని ఆయన వివరించారు.
ఎప్‌స్టీన్‌కు సంబంధించిన వ్యవహారాలలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈమెయిల్ ద్వారా జరిగిన సంవాదాలన్నీ ఇప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉన్నాయని హర్దీప్ పురీ స్పష్టం చేశారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, హర్దీవ్ పురీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి దాడికి దిగింది.
పురీని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా సామాజిక వేదిక ‘X’లో ఆరు ప్రశ్నలతో పోస్టు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS



