SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని ఫోటోలు కలవరపరిచేలా ఉంటాయి.
కొచ్చి-ముజ్రిస్ బినాలేలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో చేతులు, కాళ్లు వంకరగా ఉన్న, తలలు ఉబ్బిన పిల్లల ఫోటోలు ప్రదర్శిస్తున్నారు.
ఈ ఫోటోలు మనసును వెంటాడతాయి. కేరళలో ఏటా ఆధునిక కళలకు సంబంధించిన ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.
ఫోటో జర్నలిస్ట్ మధురాజ్ తీసిన ఈ ఫోటోలు కాసర్‌గోడ్ జిల్లాలో క్రిమిసంహారిణి ఎండోసల్ఫాన్ వల్ల 1990లు, 2000ల్లో వందలాదిమంది పిల్లలకు వచ్చిన ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి.
ఎండోసల్పాన్ ధర చాలా తక్కువ. కానీ చాలా ప్రమాదకరమైనది.

కేరళ ప్లాంటేషన్ కార్పొరేషన్ 1970ల నుంచి 20 ఏళ్లకు పైగా కాసర్‌గోడ్‌లోని జీడిపప్పు తోటల్లో ఎండోసల్ఫాన్ ఉపయోగించింది. తర్వాత తేయాకు, వరి, మామిడి వంటి పంటలపై కూడా ఈ క్రిమిసంహారిణి ఉపయోగించారు.
1990ల్లో ఇక్కడ పుడుతున్న పిల్లలు, జంతువులలో పుట్టుకతో వచ్చే లోపాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెప్పారు.
సెరెబ్రల్ పాల్సీ, ఎపిలెప్సీ, హైడ్రోసెఫాలస్ (మెదడులో నీళ్లు చేరడం)వంటి శారీరక, నాడీ సంబంధిత సమస్యలతో పిల్లలు బాధపడ్డారు.
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
చర్మంపై దద్దుర్లు, హార్మోనల్ సమస్యలు, ఆస్తమా, క్యాన్సర్ వంటివి కూడా స్థానికులకు సోకుతున్నట్టు చెప్పారు. వీటికి కారణం ఎండోసల్ఫాన్ అని పర్యావరణ సంస్థలు, కేరళ ప్రభుత్వం తర్వాత వెల్లడించాయి.
కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ రోగాలకు, ఎండో సల్పాన్‌కు సంబంధం లేదని వాదించారు. తగినన్ని ఆధారాలు లేవని అన్నారు. 2004లో కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ పెస్టిసైడ్‌ను ఉపయోగించడం నిలిపివేసింది.
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
సేంద్రీయ కాలుష్య కారకాల ఉత్పత్తి, వాడకంపై 2011లోస్టాక్‌హోమ్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఎండోసల్ఫాన్‌పై నిషేధం విధించింది. అదే ఏడాది దేశంలో ఎండోసల్పాన్ వాడకం, అమ్మకాలు, ఉత్పత్తిపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఐదు వేలమంది బాధితులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని 2017లో కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిలో కొందరికి ఇంకా ఆ మొత్తం అందలేదని మధురాజ్ చెప్పారు.
దీనిపై స్పందించాల్సిందిగా ప్రభుత్వ ఆరోగ్య విభాగాన్ని బీబీసీ సంప్రదించింది.
బాధితుల్లో ఎక్కువమంది పేదవారు. వెనుబడిన కులాలు, గిరిజన వర్గాలకు చెందినవారు. వారికి సరైన పోషణ, వైద్యం అందుబాటులోలేదు.
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
కాసర్‌గోడ్‌లో ఎండో సల్ఫాన్ సమస్య ప్రభావాన్ని మధురాజ్ రెండుదశాబ్దాలకుపైగా డాక్యుమెంట్ చేశారు. క్రిమిసంహారిణి వల్ల ప్రభావితమయ్యారని భావించే ప్రజల ఇళ్లకు అనేకసార్లు వెళ్లారు. వారి జీవితాలపై దీని ప్రభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.
”ఇది కుటుంబాలను పూర్తిగా నాశనం చేసింది” అని మధురాజ్ బీబీసీతో చెప్పారు.
”చాలా ఇళ్లల్లో తల్లిదండ్రులకు శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలు ఒకరి కంటే ఎక్కువమందే ఉన్నారు. వాళ్ల బాగోగులు చూసుకోవడం చాలా కష్టమైన పని. వ్యాధులతో బాధపడుతున్న జీవిత భాగస్వాములను చూసుకునే వృద్ధులు కూడా ఉన్నారు”అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
పౌరహక్కుల సంస్థలు, పర్యావరణ సంస్థలు, స్థానికులు 1990ల చివర్లలో, 2000 దశాబ్దం ప్రారంభంలో ఎండోసల్ఫాన్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనలు నిర్వహించారు.
ఈ క్రిమిసంహారిణి ప్రభావంతో తమ పిల్లలకు ఆరోగ్యసమస్యలు వచ్చాయని భావించిన తల్లిదండ్రులు వైద్యసాయం, నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
అనారోగ్యంపాలైన తమ పిల్లలను బతికించుకోడానికి తల్లిదండ్రులు సంవత్సరాలుగా పోరాడుతున్నారు.
”ఆరోగ్య రంగంలో ఎన్నో ఘనతలు సాధించిన కేరళ, ఎండోసల్ఫాన్ విషాద బాధితులకు మాత్రం న్యాయం చేయలేదని బాధిత ప్రాంతాల్లో నేను చేసిన ప్రతి ప్రయాణంతో నాకర్థమయింది” అని మధురాజ్ చెప్పారు.
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
విమల, ఆమె కూతురు రేష్మా విషాద కథ ఎండోసల్ఫాన్ విషాదాన్న కళ్లకు కడుతుంది. చనిపోయేనాటికి విమల వయసు 28 ఏళ్లు.
రేష్మా అనేక మానసిక సమస్యలతో పుట్టింది. విమల పనికి వెళ్తే అమ్మమ్మ పాపను చూసుకునేది. రేష్మా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. 2014లో అమ్మమ్మ చనిపోయింది.
రేష్మా వెళ్లే ప్రత్యేక స్కూల్ కరోనా సమయంలో 2019లో మూతపడింది.
ఒక్కటే పాపను చూసుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న విమల కూతురిని చంపి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు మీడియాతో చెప్పారు.
ఫొటో సోర్స్, Madhuraj/Kochi Biennale Foundation
ఎండోసల్ఫాన్ విషాదాన్ని మరింతమంది దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా తన ఫోటోలను కొచ్చి బినాలేలో ప్రదర్శనకు ఉంచాలని మధురాజ్ భావించారు.
”ఇలాంటి విపత్తులను, వాటివల్ల జరిగే మానవ నష్టాన్ని మర్చిపోకూడదు” అని ఆయన అన్నారు.
సూచన:
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



