SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
‘ఇషాన్ కిషన్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతని బ్యాట్ తడబడుంటే, టీమిండియా కష్టాలు ఎదుర్కొనేది’ అని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నారు.
పాకిస్తాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో సాధించిన గెలుపు క్రెడిట్‌ను మంజ్రేకర్ ఇషాన్ కిషాన్‌కే ఇచ్చారు.
ఫిబ్రవరి 15న ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సాధించిన 77 పరుగుల గురించి ఇండియాలోనే కాదు, పాకిస్తాన్‌లోనూ మాట్లాడుకుంటున్నారు.
బ్యాటింగ్‌కు కష్టంగా మారిన ప్రేమదాస స్టేడియం పిచ్‌పై ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తప్ప రెండు జట్లలోని మరే ఆటగాడూ అర్థ సెంచరీ సాధించలేదు.
‘‘ఇషాన్ కిషన్ అవుటాఫ్ ద బాక్స్ ఆలోచించి, తన బాధ్యతను నిర్వర్తించిన తీరు అమోఘం’’ అని కెప్టెన్ సూర్యకూమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం కొనియాడాడు.
టీ20 ప్రపంచకప్‌లో ఇది 27వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా వేసిన మొదటి ఓవర్‌లోనే ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో మొదటి ఓవర్ ముగిసే సరికి భారత్ 1/1 స్కోర్‌తో కనిపించింది.
అలాంటి సమయంలో భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనే పాకిస్తాన్ ప్రయత్నం ఫలించనివ్వకుండా ఇషాన్ కిషన్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు.
షాహీన్ అఫ్రిదీ వేసిన ఒక ఓవర్‌లో ఇషాన్ 15 పరుగులు సాధించి పాకిస్తాన్ జట్టునే ఒత్తిడిలోకి నెట్టాడు. ఇషాన్ కిషన్ దూకుడతో పవర్‌ప్లేలో భారత్ 50 పరుగుల మార్కును చేరుకుంది.
ఇషాన్ కిషాన్ 27 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుని ఆ తరువాత మరింత దూకుడు పెంచాడు.

ఫొటో సోర్స్, Getty Images
పడిలేచిన కెరటం
ఇషాన్ కిషన్ మొత్తంగా 40 బంతులు ఎదుర్కొని 77 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ కూడా ఇన్నింగ్స్ కష్టంగా సాగిందని అంగీకరించాడు.
‘‘వికెట్ బ్యాటింగ్‌కు అనకూలంగా లేదు. కానీ కొన్నిసార్లు నీపై నువ్వు నమ్మకం పెట్టుకుని, నీ బలానికి తగినట్టుగా ఆడాలి. ఏకాగ్రతకు ఇదే ముఖ్యమైన విషయం’’ అన్నాడు.
రెండు నెలల కిందట టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాలో ఇషాన్ కిషాన్‌చు చోటు లభిస్తుందనే ఆలోచనే లేదు. ఐపీఎల్‌లో ఇషాన్ కిషాన్ నిలకడగా రాణిస్తున్నప్పటికీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వంటివారివల్ల అతనెప్పుడూ టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు.
బంగ్లాదేశ్‌తో 2022లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌ను ఆ తరువాత మ్యాచ్‌లోనే జట్టు నుంచి తొలగించారు. వెస్టిండీస్‌తో 2023లో జరిగిన తొలి సిరీస్‌లో చక్కని ప్రదర్శన చేసినప్పటికీ అదే ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌కు తుది జట్టు నుంచి పక్కనపెట్టారు.
ఆ తరువాత ఇషాన్ కిషన్‌కు గడ్డుకాలం మొదలైంది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వెనక్కు వచ్చేశాడు. దీనికిగల కారణాన్ని అప్పట్లో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరించాడు. “దక్షిణాఫ్రికా పర్యటనలో మానసిక అలసట కారణంగా ఇషాన్ కిషన్ విరామం కోరాడు” అని ఆయన అన్నారు.
ఇక ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలు మూసుకుపోయినట్టు అనిపించింది. 2024 ఫిబ్రవరిలో ఇషాన్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి కూడా తొలగించారు. అదే ఏడాది ముంబయి ఇండియన్స్ జట్టు నుంచి కూడా ఇషాన్ కిషన్‌ను తప్పించారు.
ఇన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ అతను ధైర్యం కోల్పోలేదు. దేశవాళీ క్రికెట్‌లో ఆడటం మొదలుపెట్టాడు.
ఫొటో సోర్స్, Getty Images
ముస్తాక్ అలీ ట్రోఫీలో దంచికొట్టి..
దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ తన బ్యాటుకు పనిచెప్పడం మొదలుపెట్టాడు. . సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను 197 స్ట్రైక్ రేట్‌తో 517 పరుగులు చేశాడు. ఫైనల్‌లో, అతను 45 బంతుల్లో సెంచరీ చేసి, ఝార్ఖండ్‌కు తొలిసారి టోర్నీని అందించాడు.
ఆ తర్వాత, తిలక్ వర్మ గాయపడడంతో టీమ్ ఇండియాలోకి తిరిగి రావడానికి ఇషాన్‌కు మార్గం సుగమమైంది. అనంతరం అతను రెండో టీ20లో 32 బంతుల్లో 76 పరుగులు చేశాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లోనూ 43 బంతుల్లో 103 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండు నెలల క్రితం వరకు టీ20 ప్రపంచ కప్ ఆటగాళ్ల జాబితాకు పరిగణనలోకి తీసుకోని ఇషాన్ కిషన్, ప్రపంచకప్ ప్రారంభానికి ముందు సంజు శామ్సన్ స్థానంలో టీం ఇండియా ఫస్ట్-ఛాయిస్ ఓపెనర్ అయ్యాడు.
ఇషాన్ కిషన్ విజయవంతమైన పునరాగమనానికి దేశవాళీ క్రికెట్ కూడా కారణమని సంజయ్ మంజ్రేకర్ అన్నారు. స్పోర్ట్స్ నెక్స్ట్ షోలో ఆయన మాట్లాడుతూ, “దేశవాళీ క్రికెట్ అతని బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడానికి సాయపడింది. రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడటంతో అతనికి స్పిన్ ఎదుర్కొనే సామర్థ్యం మెరుగుపడింది” అన్నారు.
పాకిస్తాన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, ఇషాన్ కిషన్ కూడా ‘‘ఇప్పుడు నేను ఆఫ్ సైడ్‌లో గతం కంటే బాగా ఆడగలుగుతున్నాను” అని చెప్పాడు.
ఫొటో సోర్స్, Getty Images
ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌పై పాకిస్తాన్‌లోనూ చర్చ సాగుతోంది. “ఎంత అద్భుతమైన కథ. వన్డేలలో డబుల్ సెంచరీ తరువాత కూడా ఇండియన్ టీమ్‌లోకి రావడానికి కష్టపడిన ఈ అద్భుత ప్రతిభావంతుడు పాకిస్తాన్ బ్యాటర్ అయి ఉంటే బహుశా ‘లివింగ్ లెజెండ్’ స్టేటస్ అనుభవిస్తుండేవాడు’’ అని షాజాద్ ఇక్బాల్ అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇషాన్ కిషన్ పాకిస్తాన్‌ను ఆశ్చర్యపరిచాడని అన్నారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ ఇషాన్ కిషన్ అద్భుతాలు చేశాడన్నారు.
“చాలా మంది బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడని అంగీకరించాలి. మేం ఇతర ఆటగాళ్ల గురించి, అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.. కానీ ఇషాన్ కిషన్ మ్యాచ్ హీరోగా నిలిచాడు” అని చెప్పాడు.
స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ మాట్లాడుతూ ‘‘ ఎదురుదెబ్బల తరువాత ఇషాన్ కిషన్ మెరుగైన క్రికెటర్‌గా మారాడు’ అన్నారు.
“ఇప్పుడు అతను మారిన మనిషి. ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు” అన్నారు మజుందార్.
ఫొటో సోర్స్, Getty Images
అఫ్రిదీపై విమర్శలు
చాలా మంది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేశారు.
జావేద్ అక్తర్ అనే ఎక్స్ యూజర్ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని విమర్శించాడు. “అఫ్రిదీని పాకిస్తాన్‌కు తిరిగి పంపేయాలి. అలీ రజా లేదా మరొక తెలివైన యువ ఆటగాడికి అతని స్థానంలో అవకాశం ఇవ్వాలి. కెప్టెన్ ప్రతిసారీ అదే తప్పు చేస్తున్నాడు. బాధ్యతారహితంగా చివరి ఓవర్‌ను అఫ్రిదికి అప్పగిస్తాడు” అని రాశాడు.
“అఫ్రిది, నువ్వు మన యువ బౌలర్ల కష్టాన్నంతా పాడు చేశావు” అన్నాడు.
ఫొటో సోర్స్, Social X
‘షాహీన్ అఫ్రిది ఇప్పుడు జట్టుకు భారంగా మారుతున్నాడు’ అని యాసిన్ ఖాన్ యూసఫ్‌జాయ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
“అతని బౌలింగ్‌లో స్వింగ్ లేదు, పేస్ లేదు, లైన్ లేదు, లెంగ్త్ లేదు. అతన్ని మన ‘షహీన్’ అని పిలుస్తారు, కానీ ఈ రోజు అతను క్లబ్ క్రికెటర్ లాగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఇషాన్ కిషన్ అతన్ని నెట్ బౌలర్‌గా మార్చాడు” అని విమర్శించాడు.
“పాత షాహీన్‌ను తిరిగి తీసుకురావాలి, లేదా అతన్ని తొలగించాలి. ఇదంతా చూడటం నిజంగా బాధాకరం” అని యాసిన్ ఖాన్ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



