SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ప్రభావం చైనాపై నేరుగా ఇంకా పడలేదు, కానీ పరోక్షంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
యుద్ధం కొంతకాలంపాటు సాగి ముగిసిపోయేట్లయితే, కొన్నినెలలకు సరిపడా చమురు చైనా దగ్గర ఉంది. తర్వాత అవసరమైతే రష్యా సాయం కోరవచ్చు.
కానీ, యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఏం చేయాలి? అనే విషయమై చైనా లెక్కలు వేస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో పెట్టుబడుల గురించే కాకుండా, అక్కడి తన లక్ష్యాల గురించి ఆలోచిస్తోంది.
వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు ఈ వారం బీజింగ్‌లో సమావేశమై చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చర్చించనున్నారు.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. వినియోగం తగ్గిపోవడం, దీర్ఘకాలంగా ఆస్తుల సంక్షోభం, భారీ అప్పుల వంటి సమస్యలతో చాలాకాలంగా ఇబ్బందులు పడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాకు ప్లాన్ ఏంటి?
1991 తర్వాత, మొదటిసారి చైనా ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం తగ్గించింది. హైటెక్, పునరుత్పాదక రంగాల్లో అత్యంత వేగవంతమైన అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి అంచనాలను చైనా తగ్గించింది.
ఎగుమతుల ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చన్న ఆశతో చైనా ఉండొచ్చు. కానీ, ఏడాది కాలంగా అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తోంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. చైనా ప్రధాన వాణిజ్య నౌకలు, ఇంధన సరఫరా రాకపోకలు జరిగేది ఈ ప్రాంతం మీదుగానే.
యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే, చైనాకు అంత ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి హార్ముజ్ జలసంధి మీదుగా రాకపోకలు నిలిచిపోతే.
”సంక్షోభం ఎక్కువకాలం కొనసాగడం, మిడిల్ ఈస్ట్‌లో అభ్రదత చైనాకు కీలకమైన ఇతర ప్రాంతాలను కూడా దెబ్బతీస్తాయి” అని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫిలిప్ షెల్టర్ జోన్స్ చెప్పారు.
”ఆఫ్రికా దేశాలు గల్ఫ్ దేశాల నుంచి నిరంతరం పెద్దమొత్తంలో వచ్చే పెట్టుబడుల వల్ల లాభపడుతున్నాయి. ఆ పెట్టుబడులు తగ్గిపోతే అస్థిరత ఏర్పడి చైనా విస్తృత, దీర్ఘకాల ప్రయోజనాలు దెబ్బతినొచ్చు.”
‘‘అంటే, యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే చైనాకు మిడిల్ ఈస్ట్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నపెట్టుబడులు, మార్కెట్లపై కూడా ప్రభావం పడుతుంది. ఇతర దేశాల తరహాలోనే చైనా కూడా ఈ అనిశ్చితిని జాగ్రత్తగా పరిశీలిస్తోంది’’ అని ఆయన తెలిపారు.
”అందరూ ఎలా ఆలోచిస్తున్నారో చైనా కూడా అలాగే ఆలోచిస్తోంది. గేమ్ ప్లాన్ ఏంటి? ఎలాంటి గేమ్ ప్లాన్ లేకుండా అమెరికన్లు కచ్చితంగా ఇందులోకి దిగరు” అని కింగ్స్ కాలేజ్ లండన్‌కి చెందిన ప్రొఫెసర్ కెర్రీ బ్రౌన్ చెప్పారు.
”ఒకవేళ వారు ఎలాంటి ప్లాన్ లేకుండానే ఇది మొదలుపెట్టారని కూడా భావించవచ్చు. అప్పుడు చైనా ఏమనుకుంటుందంటే ‘ఇతర సంక్షోభాల మాదిరిగానే ఈ యుద్ధానికి కూడా దూరంగా ఉండాలని అనుకోవచ్చు. అదే సమయంలో, ఏదో ఒకటి చేయాల్సిన అవసరముంది’ అని కూడా భావించవచ్చు” అని కెర్రీ బ్రౌన్ విశ్లేషించారు.
ఫొటో సోర్స్, Getty Images
‘అంత గొప్ప స్నేహబంధం కాదు’
పాశ్చాత్య దేశాల్లో చాలామంది ఇరాన్‌ను చైనా మిత్రమపక్షంగా చెప్తుంటారు.
నిజంగానే వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ చేసిన చివరి విదేశీ పర్యటన 1989లో బీజింగ్‌కు వెళ్లడమే. గ్రేట్ వాల్ దగ్గర ఆయన ఫోటో కూడా తీసుకున్నారు.
జిన్‌పింగ్ 2016లో తెహ్రాన్‌లో పర్యటించినప్పుడు ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. 2021లో రెండు దేశాలు 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకం కూడా చేశాయి.
వచ్చే 25 ఏళ్లలో 400 బిలియన్ డాలర్లు ఇరాన్‌లో పెట్టుబడులు పెడతామని అప్పట్లో చైనా హామీ ఇచ్చింది. దానికి బదులుగా ఇరాన్ చమురు సరఫరా కొనసాగిస్తుంది.
అయితే, అందులో కొంత మొత్తమే ఇరాన్ చేరిందని విశ్లేషకులు అంటున్నారు. కానీ, చమురు సరఫరా కొనసాగుతోంది.
సెంటర్ ఆన్ గ్లోబల్ ఎనర్జీ పాలసీ కింద 2025లో ఇరాన్ నుంచి చైనా రోజుకు 1.38 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంది. ఇది చైనా మొత్తం చమురు కొనుగోళ్లలో దాదాపు 12 శాతం. ఈ చమురు బ్యారెళ్లలో చాలా వాటికి అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది దాచడానికి మలేషియా లేబుల్ వేస్తారని ఆరోపణలున్నాయి.
కొలంబియా యూనివర్సిటీ రీసర్చ్ సెంటర్ విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం, ఆసియాలోని తేలియాడుతున్న నిల్వల్లో 46 మిలియన్ బ్యారెళ్లకు మించి ఇరాన్ చమురు ఉందని, అంతేకాకుండా ఇంకా కస్టమ్స్ క్లియరెన్స్ పొందని బాండెడ్ నిల్వలు మరింత చమురు నిల్వలున్నాయని, డాలియన్, ఝౌషాన్ పోర్టుల్లో నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (ఎన్ఐఓసీ) ట్యాంకులను అద్దెకు తీసుకుని నిల్వ చేస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
చైనా, ఇరాన్ మధ్య ఆయుధాల అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలను చైనా తిరస్కరిస్తోంది. తెహ్రాన్‌కు యాంటీ-షిప్ క్రూయిజ్ మిసైళ్లను అమ్మడం, ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడం, కావాల్సిన విడిభాగాలు అందించడం ద్వారా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి బీజింగ్ సాయం చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఆరోపిస్తోంది.
చైనా అందించిన ఫేషియల్ రికగ్నిషన్, నిఘా టెక్ ద్వారానే ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులు, విమర్శకులను కఠినంగా అణచివేస్తోందని హక్కుల గ్రూపులు ఆరోపణలు చేశాయి.
ఇది గమనిస్తే రెండు దేశాలూ మంచి స్నేహితులని అనిపిస్తుంది.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉత్తర కొరియా, రష్యాతో పాటు చైనా, ఇరాన్‌ను కలిపి టాబ్లాయిడ్‌లు కూడా ”తిరుగుబాటు పక్షం” (యాక్సిస్ ఆఫ్ అప్‌హెవల్) అని హెడ్‌లైన్లు పెడుతుంటాయి. అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమాన్ని నాలుగూ సవాల్ చేయాలనుకుంటాయి. కానీ, అసలు నిజం గమనిస్తే వాటి సంబంధాలు అవసరాల కోసం చేసే లావాదేవీలే.
చైనా, ఇరాన్ మధ్య సంబంధాల్లో నిజంగా సిద్ధాంతపరమైన, సాంస్కృతిక కారణాలు లేవని ప్రొఫెసర్ బ్రౌన్ చెప్పారు.
”అమెరికాకు దాదాపు నిత్యం చికాకు కలిగించే దేశంలా ఇరాన్ ఉండడం వల్ల చైనా (విభజించు, పాలించు)వ్యూహం కొన్నిసార్లు బాగా పనిచేసింది. ఇరాన్‌తో చైనా స్నేహంగా ఉండానికి పాజిటివ్ కారణాల కన్నా నెగటివ్ కారణాలే చాలా ఎక్కువ.
ఈ సంబంధాలకు బలమైన పునాది ఉండదు. కొంతసమయం వరకే కొనసాగుతాయి. ఇరాన్, చైనా మధ్య బలమైన బంధం లేదు.”
పాశ్చాత్య దేశాలు మిత్రదేశాలతో ఉన్నట్టుగా చైనా వైఖరి ఉండదు. పరస్పర రక్షణ ఒప్పందాల మీద సంతకం చేయదు. మిత్రపక్షాలకు సాయం చేయడానికి వెంటనే ప్రయత్నించదు.
ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలా, ఇరాన్ విషయంలో చైనా పరిమితులపై చర్చ
ఎలాంటి సంక్షోభమైనా, దూరంగా ఉండాలని బీజింగ్ భావిస్తుంది.
అంటే, దీనర్థం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న దానితో చైనా ఇబ్బందులు పడడం లేదని కాదు.
సాధారణంగా, అందరూ ఊహించేలా ఓ ఖండన ప్రకటన ఇచ్చి కాల్పుల విరమణకు బీజింగ్ పిలుపునిచ్చింది.
”ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆమోదయోగ్యం కాదు. ఓ సార్వభౌమదేశ నాయకుడిని హత్య చేయడం, ప్రభుత్వమార్పుకు ఒత్తిడి తేవడం అస్సలు ఆమోదయోగ్యం కాదు” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు.
జనవరిలో వెనెజ్వెలాపై, ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా చర్యలు ఆయా దేశాలతో చైనాకున్న భాగస్వామ్య పరిమితులను ఎత్తిచూపాయి.
రెండు సందర్భాల్లోనూ, తన పరిధిలో చేయగలిగిన సాయం చేయకుండా ప్రేక్షకపాత్రకే పరిమితమైంది.
”అమెరికా బాధ్యతాయుతమైన ప్రత్యామ్యాయ శక్తిగా తనను తాను చూపించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అయితే, మిలిటరీ సమతుల్యత విషయానికొస్తే నిజంగా సూపర్ పవర్ అంటే ఏంటో అమెరికా చూపించుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా తన నిర్ణయాలను అమలు చేస్తోంది” అని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫిలిప్ షెట్లర్ జోన్స్ చెప్పారు.
”అదే స్థాయిలో సూపర్ పవర్‌లా బీజింగ్ కనిపించడం లేదు. ఆర్థిక బలం ఉన్నప్పటికీ, చేయాలని భావిస్తున్నప్పటికీ, ఇలాంటి సమయాల్లో తన స్నేహితులను రక్షించుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోతోంది” అని ఆయన వాదిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
వీటిని కౌంటర్ చేయడానికి, డోనల్డ్ ట్రంప్‌తో పోలిస్తే తనను తాను స్థిరమైన నాయకునిగా చూపించుకునేందుకు జిన్‌పింగ్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
”ఉదారవాద అంతర్జాతీయ క్రమంపై పాశ్చాత్య దేశాల మాటలు, పాశ్చాత్య దేశాల కపటత్వానికి డోనల్డ్ ట్రంప్ వైఖరి అద్దం పడుతోందని చైనా వాదించే అవకాశం ఉంది” అని ఎస్‌ఓఏఎస్ చైనా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీవ్ సాంగ్ అన్నారు.
”ఈ సంక్షోభం వల్ల చమురు సరఫరాలో, విమాన ప్రయాణాల్లో కలుగుతున్న అంతరాయాలు పాశ్చాత్య దేశాల కన్నా గ్లోబల్ సౌత్‌పై ఆర్థికపరంగా ఎక్కువ ప్రభావం చూపుతాయి.”
”కొన్ని దేశాల్లో రానున్న నెలల్లో ఆహార కొరత ఏర్పడబోతోంది. అవి గ్లోబల్ సౌత్ దేశాలే. ఇప్పటికే పాశ్చాత్య దేశాల కూటమిలో విభేదాలొచ్చాయి. యూకే, స్పెయిన్ దాడికి దూరంగా ఉన్నాయి” అని ఆయన విశ్లేషించారు.
ఇతర దేశాలతో కలిసి చర్చల్లో మధ్యవర్తిత్వం చేసే అవకాశం కోసం కూడా బీజింగ్ ఎదురుచూస్తోంది. ఒమన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో దీనిపై ఇప్పటికే మాట్లాడామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. మిడిల్ ఈస్ట్‌కు ప్రత్యేక ప్రతినిధిని చైనా ప్రకటించింది.
ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్‌తో భేటీపై ఉత్కంఠ
చైనా జాగ్రత్తగా వ్యవహరించడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి అనూహ్య నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఈ నెల చివర్లో జరగబోయే సమావేశం.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల విషయంలో ట్రంప్‌ను ఉద్దేశించి నేరుగా చైనా ఎలాంటి విమర్శలూ చేయలేదు. దీనివల్ల ఇద్దరు నాయకులు కలిసినప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులుండవు.
ఈ సమావేశం జరుగుతుందా? లేదా? అనేదానిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తోంటే, జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పర్యటన గురించి చర్చించేందుకు రెండువైపులా అధికారులు సమావేశం కావాల్సి ఉందని రాయిటర్స్ తెలిపింది.
‘‘ తైవాన్‌తో పాటు ఇతర అంశాల్లో ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో గమనించేందుకు ఈ సమావేశాన్ని చైనా ఓ అవకాశంగా చూస్తోంది” అని షెల్టర్ జోన్స్ చెప్పారు.
అమెరికాను యుద్ధపిపాసిగా చూపించేందుకు ఓ అవకాశంగా ఈ సంక్షోభాన్ని చైనాలో కొందరు చూస్తున్నారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీ సోషల్ మీడియాలో ఇదే వ్యాపింపజేస్తోంది.
ఊహించలేని, అస్థిరమైన అమెరికా ప్రవర్తన చైనాకు అసౌకర్యవంతంగా ఉందని ప్రొఫెసర్ బ్రౌన్ చెప్పారు.
”అమెరికా ఆధిపత్యం ఉండే ప్రపంచం కావాలని చైనా కోరుకుంటుందని నేననుకోను. అదే సమయంలో అమెరికా చాలా అస్థిరంగా ప్రవర్తించే ప్రపంచం ఉండాలని కూడా చైనా నిజంగా కోరుకోదు” అని ఆయనన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



