Home జాతీయ national telgu ఇరాన్ యుద్ధం: ఏ దేశాలకు లాభం, ఏ దేశాలకు నష్టం?

ఇరాన్ యుద్ధం: ఏ దేశాలకు లాభం, ఏ దేశాలకు నష్టం?

7
0

SOURCE :- BBC NEWS

రష్యా, చైనా

యుద్ధాల్లో స్పష్టమైన విజేతలు ఉండటం చాలా అరుదు. సామాన్య ప్రజలే తరచూ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా గొలుసులు అస్తవ్యస్థంగా మారడంతో, కొన్ని దేశాలు తీవ్ర ఆర్థిక పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

అయితే ఇంతటి అనిశ్చితిలోనూ కొన్ని దేశాలు సరికొత్త వ్యూహాత్మక అవకాశాల కోసం చూస్తున్నాయి.

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రతికూల పరిణామాలను కలిగిస్తోంది.

గల్ఫ్ దేశాలను అస్థిరపరిచింది. మధ్య ప్రాచ్యంలోని వేలాది మంది ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఇళ్లను విడిచి బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

చమురు ధరల పెరుగుదల, గల్ఫ్‌లో హార్ముజ్ జలసంధి వద్ద సముద్ర రవాణాకు కలుగుతున్న అంతరాయం వ్యాపారులకు, వినియోగదారులకు మరింత ఖర్చును పెంచుతోంది.

అయితే, ఈ యుద్ధం వల్ల లాభపడేదెవరు, నష్టపోయేదెవరు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రష్యా

ఇరాన్ రష్యాకు కీలకమైన మిత్రదేశం. అత్యంత ముఖ్యమైన సైనిక భాగస్వామి. సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం, వెనెజ్వెలాలో నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత.. మాస్కోకు దౌత్యపరంగా ఎదురైన మరో ఎదురుదెబ్బ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం.

అయితే, మధ్య ప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం యుక్రెయిన్‌తో రష్యా తలపడుతోన్న యుద్ధానికి ప్రయోజనకరంగా మారవచ్చు. ఎందుకంటే, అమెరికా తన సైనిక బలగాలను మధ్య ప్రాచ్య సంక్షోభం వైపు మళ్లించవచ్చు.

” పేట్రియాట్ క్షిపణులు, ఇంటర్‌సెప్టార్లు తగ్గిపోవడం రష్యాకు ప్రయోజనకరంగా మారుతుంది. దీనివల్ల యుక్రెయిన్‌కు అందే ఆయుధాల సంఖ్య తగ్గిపోతుంది” అని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన పారిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ నికోల్ గ్రాజేవ్‌స్కీ బీబీసీ న్యూస్ పర్షియన్‌కు చెప్పారు.

తెహ్రాన్‌కు షాహెద్‌ డ్రోన్ల అవసరం పెరిగినందువల్ల యుక్రెయిన్‌లో మాస్కో సామర్థ్యాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

”యుక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పుడు ఒక నిర్దిష్ట కాలం పాటు రక్షణ సహకారాల్లో భాగంగా రష్యా ఇరాన్‌పై ఆధారపడింది. అప్పుడు ఇరాన్ షాహెద్ డ్రోన్లను అందించింది. ముఖ్యంగా 2022-23ల్లో వీటి ప్రొడక్షన్ టెక్నాలజీని, ఈ డ్రోన్ల లైసెన్స్‌లను రష్యాకు అందించింది” అని అమెరికాలోని సెంటర్ ఫర్ నాన్-ప్రొలిఫరేషన్ స్టడీస్‌కు చెందిన యురేసియా డైరెక్టర్ హన్నా నోట్ తెలిపారు.

”ఇప్పుడు యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగించడానికి రష్యాకు ఇరాన్ మద్దతు అవసరం లేని దశలో ఉంది. రష్యా సొంతంగా షాహెద్ డ్రోన్లను ఉత్పత్తి చేసుకోగలదు” అని తెలిపారు.

రష్యా, ఇరాన్

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఇదే సమయంలో చమురు, గ్యాస్ సరఫరాలకు అత్యంత కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు ధరలు పెరిగాయి. ఇది యుక్రెయిన్ యుద్ధంతో తీవ్ర ఒత్తిడికి గురైన రష్యాకు కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది.

రష్యా బడ్జెట్ ఎక్కువగా ఆ దేశ చమురు ఎగుమతులపైనే ఆధారపడింది. అప్పట్లో బ్యారల్ చమురు ధర 59 డాలర్లు ఉండేది. ప్రస్తుతం ముడి చమురు ధర గణనీయంగా పెరిగింది. ఒకానొక సమయంలో బ్యారల్ సుమారు 120 డాలర్లకు ఎగిసింది.

గల్ఫ్‌లోని ప్రముఖ చమురు ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించడంతో.. ప్రస్తుతం చైనా, భారత్ వంటి ముఖ్యమైన మార్కెట్లకు రష్యా మరింత ఎక్కువగా ఎగుమతి చేసే అవకాశం ఉంది.

”గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అమెరికా భారత్‌ను అడ్డుకుంది. కానీ, ప్రస్తుతం సంక్షోభంతో భారత్‌కు కాస్త ఉపశమనాన్ని కల్పిస్తూ.. మళ్లీ రష్యా చమురు కొనుగోలుకు అనుమతిచ్చింది. కనీసం వచ్చే నెల వరకు ఈ కొనుగోళ్లు కొనసాగవచ్చు ‘ అని గ్లోబల్ ఎనర్జీ, కమోడిటీ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆర్గస్ చీఫ్ ఎకనామిస్ట్ డేవిడ్ ఫైఫె చెప్పారు.

ఈ సమస్యల నుంచి కొంత బయటపడేందుకు రష్యా చమురుపై ఆంక్షలను సడలించాలని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.

హార్ముజ్ జలసంధిని చూపించే మ్యాప్

చైనా

ఇరాన్ యుద్ధం వల్ల చైనాపై పడే ప్రభావం ఏ మేర ఉంటుందో ఇంకా చూడాల్సి ఉంది.

చైనా ముడిచమురు దిగుమతుల్లో కేవలం 12 శాతం మాత్రమే ఇరాన్ నుంచి వస్తుందని సెంటర్ ఆన్ గ్లోబల్ ఎనర్జీ పాలసీ తెలిపింది.

పైగా, చైనాలో కొన్ని నెలలకు సరిపడా చమురు సరఫరాలున్నాయి. ఆ తర్వాత తేలికగా రష్యా సాయాన్ని కూడా చైనా కోరుతుండొచ్చు.

అయితే యుద్ధం వల్ల, చైనా ”ఎగుమతుల ఆధారిత పరిశ్రమల రంగం” ప్రభావితం చెందవచ్చని ఫైఫె తెలిపారు.

ప్రాపర్టీ ధరలు పడిపోవడం, దేశీయ వ్యయం తగ్గిపోవడంతో సతమతమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా పనిచేసేది, ఆ దేశ జీడీపీలో 20శాతం వాటా ఉన్న ఎగుమతులే.

హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణాకు నెలకొన్న అంతరాయం చైనాకు అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, చైనా ఉత్పత్తులు పశ్చిమానికి వెళ్లేందుకు అట్లాంటిక్ చేరుకోవడం క్లిష్టంగా మారవచ్చు.

మరోవైపు, ఆసియా, యూరప్, ఆఫ్రికాలను కలిపే అరేబియన్ ద్వీపకల్పంలోని బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిలో కూడా ఇరాన్ అండదండలున్న హౌతీలు దాడులు చేస్తున్నారు.

” ఎర్ర సముద్రం ట్రాఫిక్ మళ్లీ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆసియా నుంచి అట్లాంటిక్ బేసిన్‌లోకి వెళ్లే కార్గో నౌకలు సదరన్ ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా దారి మళ్లించవచ్చు” అని ఫైఫే బీబీసీ న్యూస్‌కి తెలిపారు.

‘‘దీనికి అత్యధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది” అని లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్ మిడిల్ ఈస్ట్ నిపుణులు నీల్ క్విలియం చెప్పారు.

” ప్రయాణ సమయం అంచనావేసిన దానికంటే 10 నుంచి 14 రోజులు ఎక్కువ పట్టనుంది. ఏ నౌకలో, ఏ ఉత్పత్తులను రవాణా చేస్తున్నారన్న దానిబట్టి అదనంగా 2 మిలియన్ డాలర్లు భరించాల్సి ఉంటుంది” అని తెలిపారు.

” ఇరాన్‌పై యుద్ధంలో చైనాకు దౌత్య అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అమెరికాకు సమతూకంగా తనను తాను నిలబెట్టుకునేందుకు ఇది ప్రయత్నిస్తుంది” అని యూకే రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫిలిప్ షెట్లర్ జోన్స్ చెప్పారు.

మోటార్ సైకిల్ రైడర్లు

ఫొటో సోర్స్, Reuters

అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితేంటి?

మధ్య ప్రాచ్యంలోని చమురు, గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడ్డ ఆగ్నేయాసియా దేశాలు ఈ యుద్ధంతో ఎక్కువగా ప్రభావితమవుతాయి.

కొన్ని ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. వీలైనంత త్వరగా ఆర్థిక ప్రభావాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి.

వియత్నాంలో ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డీజిల్ ధర 60 శాతం పెరిగింది. వీలైతే ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది.

మధ్య ప్రాచ్యం నుంచి ముడిచమురు దిగుమతులపైనే 95 శాతం ఆధారపడ్డ ఫిలిప్పీన్స్‌లో ఎమర్జెన్సీ సేవల్లో పనిచేసే వారు మినహాయించి ప్రభుత్వ రంగ ఉద్యోగులు ప్రస్తుతం వారానికి నాలుగు రోజులే పనిచేస్తున్నారు.

పాకిస్తాన్‌లో కూడా ఇదే రకమైన ఆంక్షలను ప్రవేశపెట్టారు. వీలైనప్పుడల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలను జారీ చేస్తున్నారు. యూనివర్సిటీ తరగతులన్నీ ఆన్‌లైన్‌లోకి మారాయి.

యుద్ధభయంతో భారీ కొనుగోళ్ల కారణంగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో, కార్లకు రోజుకు 10 లీటర్లు, మోటార్‌సైకిళ్లకు కేవలం రెండు లీటర్లు మాత్రమే ఇచ్చేలా పలు నిర్ణయాలను ప్రకటించింది.

కానీ, యుద్ధం పర్యవసనాలు ఇంధన కొరతలకు మించి ఉండనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా రైతులు తమ పంటల కోసం ఎరువులపై ఆధారపడ్డారు. ఈ ఎరువుల రవాణాలో అంతరాయాలు ఏర్పడితే, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ప్రమాదం వాటిల్లనుంది.

” ప్రపంచ యూరియాలో 30 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే వస్తుంది. పెట్రో కెమికల్స్ నుంచి యూరియా వస్తుంది. ముడి చమురును శుద్ధి చేయడం ద్వారా పెట్రోకెమికల్స్‌ తయారవుతుంది. ప్రపంచ మార్కెట్ల నుంచి 30 శాతం యూరియాను తీసివేస్తే, ప్రపంచ ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపనుంది” థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్ మిడిల్ ఈస్ట్ నిపుణులు నీల్ క్విలియం తెలిపారు.

ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారుల్లో ఒకటైన, ఎరువుల కోసం యూరియాను ఉత్పత్తి చేసే ప్రధాన సంస్థల్లో ఒకటి ఖతార్ ఇంధన స్థావరాలపై దాడులు జరిగాయి. ఈ దాడులతో కంపెనీలు తమ ఉత్పత్తి, డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసేలా అత్యవసర చర్యలను ప్రకటించాల్సి వచ్చింది.

”ఆహార భద్రత , ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని మీరు చూడొచ్చు” అని క్విలియం తెలిపారు.

”ఈ ప్రభావం ఏ మేర ఉంటుందో ఇంకా లెక్కించలేదు. కానీ, పంటలకు ఇబ్బందులు ఎదురైతే, ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడితే మనం దీర్ఘకాలిక ప్రభావాన్ని చూడాల్సి రావచ్చు” అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)