SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.
సంజూ శాంసన్ మరపురాని ఇన్నింగ్స్‌తో భారత్ సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు క్రీజులో నిలిచాడు శాంసన్. సంజూ ఇన్నింగ్స్ లాగే ఈ మ్యాచ్‌పై కీలక ప్రభావాన్ని చూపిన ఇతర క్షణాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
1. అక్షర్ పవర్ ప్లే బౌలింగ్
ఈ మైదానంలో బౌలర్లను మంచు కొద్దిగా ఇబ్బంది పెట్టింది. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. విండీస్ బౌలింగ్ సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. అందుకే, భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో, వెస్టిండీస్ బ్రాండన్ కింగ్‌ను కాదని రోస్టన్ చేజ్‌ను ఓపెనర్‌గా పంపడం వారికి కలిసొచ్చింది. షై హోప్‌తో కలిసి అతను మొదటి వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. మరోవైపు, హోప్ నెమ్మదిగా ఆడాడు. ఒకానొక సమయంలో, అతను 33 బంతుల్లో 32 పరుగులు మాత్రమే చేశాడు.
దీనికి భారత కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రధాన కారణం. అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ బాగా బౌలింగ్ చేశారు. కానీ, అక్షర్ పటేల్ కొత్త బంతితో వేసిన రెండు ఓవర్ల స్పెల్ కీలకం. ఆ రెండు ఓవర్లలో అతను కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ (ఎకానమీ 8.75) చేశాడు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడం ఒక సవాలు కానీ, విండీస్ బ్యాటర్లను కట్టడి చేశాడు.
ఫొటో సోర్స్, Getty Images
2. బుమ్రా ఓవర్
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన ఒక ఓవర్ ప్రత్యేకంగా నిలుస్తుంది- అది 12వ ఓవర్.
ఒక వైపు, రోస్టన్ చేజ్ నిలకడగా, 160 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేశాడు. మరోవైపు, షిమ్రాన్ హెట్మైర్ 225 స్ట్రైక్ రేట్‌తో 27 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ కుడి, ఎడమచేతి వాటం కలయిక భారత బౌలర్లకు సవాలు విసిరింది. కానీ, బుమ్రా ఒకే ఓవర్‌లో ఇద్దరినీ పెవిలియన్ పంపాడు.
వెస్టిండీస్ రన్‌రేట్ పెరుగుతున్న క్షణం అది. ఈ టోర్నీలో విండీస్ ఆటను పరిశీలిస్తే, ఇదొక ‘టెంప్లేట్’ లాగా కనిపిస్తుంది. వారు ప్రారంభంలో ఓవర్‌కు 8 రన్ రేట్‌తో ప్రారంభిస్తారు. తర్వాత మిడిల్ ఓవర్లలో రన్ రేట్ కొంచెం పెరిగి 10కి చేరుకుంటుంది. చివర్లో భారీ హిట్టింగ్‌కు దిగుతారు.
భారత్‌పై కూడా ఇలానే ఆడబోయారు. కానీ, వారు రన్‌రేట్ పెంచుతున్నపుడు, బుమ్రా బ్రేకులు వేశాడు. తన వైవిధ్యంతో 2 వికెట్లు తీశాడు. దీంతో, విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
3. అర్ష్‌దీప్ ఓవర్
సూర్యకుమార్ 16వ ఓవర్ వేయడానికి ముందుగా బంతిని వరుణ్ చక్రవర్తికి అప్పగించాడు. అప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్ వాషింగ్టన్ సుందర్‌తో సందేశం పంపాడు. దీంతో, ఆ బంతి అర్ష్‌దీప్ సింగ్ చేతికి వెళ్లింది. కానీ, అర్ష్‌దీప్ వేసిన ఆ ఓవర్‌లో రామన్ పావెల్, జాసన్ హోల్డర్ ఏకంగా 24 పరుగులు సాధించారు. పావెల్, హోల్డర్ చక్కని బ్యాటింగ్ చేశారు. ఇరువురూ 35 బంతుల్లోనే 76 పరుగులు చేశారు.
ముఖ్యంగా జాసన్ హోల్డర్!
గత మ్యాచ్‌లో జట్టు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా, చివరి వరకూ నిలిచి భారీ స్కోరు అందించాడు. ఈ మ్యాచ్‌లో అతను మళ్ళీ అలాగే చేశాడు. దీంతో, వెస్టిండీస్ 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
4. సంజూ: టేక్ ఏ బౌ
భారత్ ముందు 190కి పైగా టార్గెట్ ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ భారీ స్కోరు సాధించడటంలో విఫలమయ్యారు. అయితే, ఓపెనర్ సంజూ శాంసన్ దృఢంగా నిలిచి, రాణించాడు. తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు.
ఒక సమయంలో అతనికి జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైంది. కానీ, అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి వరకు నిలబడి 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సహా 97 పరుగులు (నాటౌట్) చేశాడు.
భారత జట్టును సెమీస్ చేర్చాడు.
సంజూ సాధారణంగా సిక్స్‌లు కొట్టడానికి ఇష్టపడతాడు. వీలైనన్ని ఎక్కువ సిక్స్‌లు కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ, ఈ మ్యాచ్‌లో అతను అలా ఆడలేదు, పరిణితి చూపించాడు. సంజూ ఇన్నింగ్స్ గురించి చాలాకాలం పాటు మాట్లాడుకుంటారు.
ఫొటో సోర్స్, Getty Images
5. తిలక్ వర్మ ఇన్నింగ్స్
కెప్టెన్ సూర్యకుమార్ ఔట్ అయినప్పుడు, భారత స్కోరు 99/3. చేయాల్సిన స్కోరు భారీగా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతను కేవలం 15 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు.
తిలక్ మొదట్లో క్రీజులో నిలవడానికి సమయం తీసుకున్నాడు. మొదటి 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, సరైన సమయంలో బౌండరీలు కొట్టడం ప్రారంభించాడు. అది శాంసన్‌పై ఒత్తిడిని తగ్గించింది. అంతేకాదు, రన్ రేట్ కూడా నియంత్రణలోకి రావడం ప్రారంభించింది.
షమర్ జోసెఫ్ ఓవర్‌లో హ్యాట్రిక్ బౌండరీలు కొట్టడం భారత జట్టుకు ఉత్సాహాన్నిచ్చింది. రోస్టన్ చేజ్ ఓవర్‌లో తిలక్ సిక్స్ బాది వెస్టిండీస్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ ఇన్నింగ్స్ భారత విజయంలో కీలకంగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



